కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ఏనుగుల్లాంటి మేఘాలు

ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది? ఒక కారుమేఘంలో దాదాపు 550 టన్నుల నీరు ఉంటుందని ఎ.బి.సి. న్యూస్‌ నివేదించింది. “లేదా దాన్ని మరింత అర్థవంతంగా ఉండేలా చెప్పాలంటే . . . ఏనుగుల లెక్కన ఆలోచించండి” అని వాతావరణ శాస్త్రజ్ఞుడైన పెగ్గి లెమోన్‌ చెబుతున్నారు. ఒక ఏనుగు ఆరు టన్నుల బరువుంటుందని మనం అనుకుంటే, కేవలం ఒక్క మేఘం 100 ఏనుగుల బరువు ఉంటుంది. ఆ నీరంతా చాలా చిన్న బిందువుల రూపంలో, భూమినుండి పైకి వెళ్ళే వెచ్చని గాలిపై తేలుతూ ఉంటాయి. దూదిపింజలా కనిపించే మేఘానికి భిన్నంగా తుఫానుకు ముందు కమ్ముకొనే మేఘంలో 2,00,000 ఏనుగుల బరువుకు సమానమైన నీరు నిండివుంటుంది. మరి ప్రచండమైన ఉప్పెనకు ముందు కమ్ముకొనే మేఘాల బరువు ఎంత ఉంటుంది? ఉప్పెనకు ముందు కమ్ముకొనే మేఘంలోని ఒక ఘనపు మీటరు నీటి బరువును లెమోన్‌ అంచనా వేసి, దానిని ఆ ఉప్పెన మొత్తం పరిమాణంతో హెచ్చించాడు. దాని ఫలితం? అది నాలుగు కోట్ల ఏనుగుల బరువు ఉంటుంది. “అంటే ఉప్పెనకు ముందు కమ్ముకొనే మేఘంలో ఉండే నీటి బరువు భూమిపై ఉన్న ఏనుగులన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది, బహుశా ఇప్పటివరకూ జీవించిన ఏనుగులన్నింటి బరువుకంటే ఎక్కువే ఉంటుంది” అని ఆ నివేదిక చెబుతోంది. (g04 7/22)

పళ్ళు ఎప్పుడు తోముకోవాలి

ఆమ్ల లక్షణాలతో కూడిన పానీయాలను లేదా ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే పళ్ళు తోముకుంటే పళ్ళపై ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది అని మెక్సికో నగరానికి చెందిన మిలెన్యో వార్తా పత్రిక చెబుతోంది. గాట్టింగెన్‌లోని జర్మన్‌ విశ్వవిద్యాలయం వద్ద నిర్వహించబడిన అధ్యయనంపై నివేదిస్తూ, ఆమ్ల లక్షణాలతో కూడిన ఆహార పదార్థాలు “తాత్కాలికంగా పళ్ళ ఎనామిల్‌ను బలహీనపరుస్తాయి” అని ఆ వార్తాపత్రిక హెచ్చరిస్తోంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పళ్ళు తోముకోవడం హానికరం. దానికి బదులు “పళ్ళు తమ బలాన్ని తిరిగి పొందే వరకు కొన్ని నిమిషాలు ఆగడం మంచిది.” (g04 7/22)

యౌవనుల జూదం

మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ యూత్‌ గ్యాంబ్లింగ్‌ ప్రకారం, “కెనడాలో 12 నుండి 17 సంవత్సరాల వయసున్న యౌవనుల్లో సగం కంటే ఎక్కువమంది సరదా కోసం జూదం ఆడతారు, అందువల్ల వారిలో 10 నుండి 15 శాతం మంది గంభీరమైన సమస్యను పెంపొందించుకునే ప్రమాదం ఉంది, వారిలో 4 నుండి 6 శాతం మంది ‘తప్పనిసరి జూదగాళ్ళు’గా పరిగణించబడుతున్నారు” అని టొరంటోకు చెందిన నేషనల్‌ పోస్ట్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. బాల్యంలో కొంతమంది పిల్లలకు లాటరీ టికెట్లు బహుమానంగా లభించినప్పుడు లేదా జూదమాడడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించినప్పుడు ఆ ప్రలోభం మొదలవుతుంది. తత్ఫలితంగా కెనడాలోని యౌవనస్థుల్లో చాలామంది పొగత్రాగడం లేదా మాదకద్రవ్యాలను ఉపయోగించడం వంటి ఇతర వ్యసనాలకంటే ఎక్కువగా జూదమాడుతున్నారు అని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి “పెద్దవాళ్ళకంటే 18 నుండి 24 సంవత్సరాల్లోపు యౌవనస్థులే జూదమాడడాన్ని అలవరచుకునే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి” అని పోస్ట్‌ చెబుతోంది. యౌవనస్థులు జూదమాడకుండా ఆపుచేయడానికి కెనడాలోని ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించబడిన కార్యక్రమాలు ఆ సమస్యను అరికట్టడంలో సఫలమవుతాయని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. (g04 7/8)

క్యాథలిక్‌ ప్రీస్టులు, బైబిలు జ్ఞానం

“ప్రీస్టులకు బైబిలు గురించి ఎంత తెలుసు?” ట్యూరిన్‌ డయోసెసాన్‌ ఆఫీస్‌ ఫర్‌ క్యాచిసమ్‌కు సంచాలకుడు మరియు స్వయంగా ఒక ప్రీస్టు అయిన ఆండ్రియా ఫాన్టానా ఆ ప్రశ్న అడిగారు. ఇటాలియన్‌ క్యాథలిక్‌ వార్తాపత్రిక ఆవెనీయర్‌లో ఫాన్టానా వ్రాస్తూ “బిషప్‌ అధికార క్షేత్రంలోని చర్చీల్లో ఏవైనా బైబిలు అధ్యయన కోర్సులున్నాయా అని అడగడానికి ఒక సామాన్యుడు [తనను] సమీపించినప్పుడు” ఆ ప్రశ్న తన మదిలోకి వచ్చింది అని అన్నారు. ఆ సామాన్యుడున్న చర్చీలో “పరిశుద్ధ లేఖనాల ప్రస్తావనే ఉండేది కాదు.” ఆ ప్రశ్నకు సమాధానంగా ఫాన్టానా ఇలా వ్రాశారు: “నిజానికి, [ప్రీస్టులు] మతధర్మ బోధనా కోర్సులు చేసిన తర్వాత, వాళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే బైబిలును అధ్యయనం చేయడంలో కొనసాగుతారు. . . . నమ్మకంగా చర్చీలకు వెళ్ళే చాలామందికి బైబిలు లేఖనాల గురించి విని బైబిలుకు సన్నిహితమవ్వడానికి దొరికే ఒకే ఒక్క అవకాశం ఆదివారం ప్రసంగాలను వినడం మాత్రమే.” అయితే ఆ సామాన్యుడు ఇలా చెప్పాడు: “ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి నేను యెహోవాసాక్షులతో సహవసిస్తున్నాను.” (g04 7/8)

“మృత సముద్రం అంతరించిపోతోంది”

“మృత సముద్రం అంతరించిపోతోంది, నిర్మాణ నిపుణులు ఎంతో కృషి చేస్తేనే తప్ప దానిని కాపాడలేము” అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రచురించిన ఆర్టికల్‌ చెప్పింది. ఆ సముద్రంలో ఉప్పు పరిమాణం ఎంతో ఎక్కువగా ఉండడంవల్ల నీటి ప్రాణులు జీవించడం అసాధ్యం కాబట్టి అది మృత సముద్రం అని పిలువబడుతోంది. అది భూమికి అత్యంత దిగువున అంటే, సముద్ర మట్టానికి 400 మీటర్ల దిగువున ఉన్న నీటి ప్రాంతం. “వేలాది సంవత్సరాలుగా, మృత సముద్రానికి నీటిని అందించే ఏకైక మూలాధారమైన యొర్దాను నది [వేగంగా ఆవిరయ్యే నీటికి, కొత్తనీరు చేరుస్తూ] దానిలో సమతుల్యం కాపాడుతూ వచ్చింది” అని ఆ ఆర్టికల్‌ చెప్పింది. “అయితే ఇటీవలి దశాబ్దాల్లో ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ దేశాలు, వాటిని వేరుచేస్తున్న ఆ సన్నని నది పొడవునా విస్తృతమైన వ్యవసాయ భూములకు నీరు అందించడానికి యొర్దాను నదిలో నీటిని వాడుకుంటున్నాయి, కాబట్టి మృత సముద్రం నుండి ఆవిరయ్యే నీటి స్థానంలో దానికి కొత్త నీరు అందడంలేదు.” దాని గురించి ఏమీ చేయకపోతే మృత సముద్రంలోని నీటి మట్టం సంవత్సరానికి ఒక మీటరు చొప్పున తగ్గిపోతుంది. దానివల్ల దాని చుట్టుప్రక్కల ప్రాంతానికి, జంతువులకు, వృక్షాలకు వినాశకర పర్యవసానాలు తప్పవు. ఐదు సంవత్సరాల వర్షాభావం ఇప్పటికే మృత సముద్రపు పరిస్థితిని మరింత ప్రమాదకరం చేస్తోంది అని ఇజ్రాయిల్‌ దేశంలో నిర్వహించబడిన ఒక అధ్యయనం చెబుతోంది. (g04 7/8)

మీ కట్టింగ్‌ బోర్డ్‌ను శుభ్రంగా ఉంచుకోండి!

చెక్క కట్టింగ్‌ బోర్డ్‌ (కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు కోయడానికి ఉపయోగించేది) సురక్షితమా లేదా ప్లాస్టిక్‌ కట్టింగ్‌ బోర్డ్‌ సురక్షితమా? “మీరు వాటిని శుభ్రంగా ఉంచినంత వరకూ ఏ బోర్డ్‌ అయినా ఫరవాలేదు” అని యు.సి. బెర్కర్లీ వెల్నెస్‌ లెటర్‌ చెబుతోంది. “పచ్చి మాంసాన్ని కోయడానికి మీరు చెక్క బోర్డ్‌ లేదా ప్లాస్టిక్‌ బోర్డ్‌లలో దేనిని ఉపయోగించినా, పని ముగిసిన తర్వాత వేడిగా ఉండే సబ్బు నీటితో బోర్డ్‌ను బాగా తోమండి.” బోర్డ్‌పై కత్తి గాట్లు లోతుగా ఉంటే లేదా దానికి కొవ్వు అంటుకొని ఉంటే, దానిని పూర్తిగా శుభ్రం చేయడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోండి. “పల్చని బ్లీచ్‌ ద్రావణం (1 [లీటరు] నీటిలో 1 చెంచా బ్లీచ్‌)తో బోర్డ్‌ను శుభ్రం చేయడం ద్వారా కూడా దానిపై రోగక్రిములు లేకుండా చేయవచ్చు” అని వెల్నెస్‌ లెటర్‌ చెబుతోంది. చేతులను, కత్తులను కూడా శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి. (g04 7/22)

ప్రపంచంలో మురికి వాడలు పెరిగిపోతున్నాయి

ప్రస్తుతమున్న వేగం కొనసాగితే “30 సంవత్సరాల్లోగా ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మురికివాడల్లో నివసిస్తారు” అని ఒక యు.ఎన్‌. నివేదికను ఉదాహరణగా పేర్కొంటూ లండన్‌కు చెందిన ద గార్డియన్‌ చెబుతోంది. విచారకరంగా “ప్రపంచ జనాభాలో 94 కోట్లమంది అంటే దాదాపు ఆరవ వంతు ప్రజలు, ఇప్పటికే మురికిగా ఉండే, అనారోగ్యకరమైన ప్రాంతాల్లో, నీళ్ళు లేకుండా, సరైన పారిశుద్ధ సౌకర్యాలు లేకుండా, ప్రజా సేవలు లేకుండా, చట్టబద్ధమైన భద్రత లేకుండా జీవిస్తున్నారు.” కెన్యాలోని నైరోబీలోవున్న కిబెరా జిల్లాలో దాదాపు 6,00,000 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. యు.ఎన్‌. హ్యూమన్‌ సెటిల్‌మెంట్స్‌ ప్రోగ్రామ్‌ యు.ఎన్‌. హాబిటాట్‌ సంచాలకురాలు ఆనా తిబైయూకా ఇలా చెప్పారు: “విపరీతమైన అసమానత్వం, నిరుద్యోగంవల్ల ప్రజలు తిరుగుబాటు ధోరణితో ప్రవర్తిస్తారు. మురికివాడలు అన్ని రకాల చెడుతనానికి కేంద్రంగా ఉంటాయి, అక్కడ శాంతి భద్రతలు ఉండవు, వాటినుండి యౌవనస్థులను రక్షించలేము.” (g04 9/8)

నేర్చుకోవడానికి వయసు అడ్డమా?

“[కెన్యాలోని రిఫ్ట్‌ వ్యాలీ మండలానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో] ఆరు సంవత్సరాల పిల్లలు పాఠాలు నేర్చుకుంటుండగా, ఒక విద్యార్థి మిగతావారికంటే పొడుగ్గా, పెద్దగా కనిపించాడు” అని నైరోబీ వార్తాపత్రిక డెయిలీ నేషన్‌ నివేదించింది. ఆయన “బైబిలును చదవడం నేర్చుకోవడానికి” ఒకటవ తరగతిలో ఇటీవలే చేరిన 84 సంవత్సరాల వృద్ధుడు. ఆయన మనవలు, మనవరాళ్ళు ఆయనకంటే ఎన్నో తరగతులు ముందున్నా ఆయన తన తరగతికి క్రమంగా హాజరవుతాడు. “ప్రజలు నాకు బైబిల్లోని విషయాలు చెబుతున్నారు, అవి నిజమో కాదో నాకు తెలియదు, కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నేనే స్వయంగా చదివి తెలుసుకోవాలి అనుకుంటున్నాను” అని ఆ వృద్ధుడు నేషన్‌కు చెప్పాడు. యూనిఫారమ్‌ వేసుకొని, చదువుకోవడానికి కావలసిన ఇతర వస్తువులన్నీ పట్టుకొని వచ్చే ఆయన పాఠశాల నియమాలకు కట్టుబడి ఉండడానికి శాయిశక్తులా ప్రయత్నిస్తాడు. అయితే కొన్నిసార్లు కొన్ని పనులను వేరే పద్ధతిలో చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఇతర విద్యార్థులు వ్యాయామం చేస్తూ ఆటలు ఆడుకుంటున్నప్పుడు ఆయన “తేలికపాటి వ్యాయామం చేసుకోవడానికి అనుమతి పొందాడు.” (g04 9/22)