వివక్ష అంతం కావడం
వివక్ష అంతం కావడం
మనం వివక్ష చూపించడానికి మొగ్గు చూపుతున్నామేమో గుర్తించగలమా? ఉదాహరణకు, మనకు ఒక వ్యక్తి తెలియకపోయినా అతని శరీర ఛాయ, జాతీయత, జాతి లేదా తెగను బట్టి అతని గుణగణాల గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నామా? లేదా మనం ప్రతీ వ్యక్తిని అతని లేదా ఆమె ఉన్నత లక్షణాలనుబట్టి విలువైనవారిగా ఎంచగలమా?
యేసు జీవించిన కాలంలో యూదయ, గలిలయ ప్రాంతాలకు చెందిన ప్రజలు సాధారణంగా “సమరయులతో సాంగత్యము” చేసేవారు కాదు. (యోహాను 4:9) “నా కళ్లు ఒక సమరయుణ్ణి ఎప్పటికీ చూడకుండు గాక” అని యూదుల ధర్మశాస్త్రమైన టాల్ముడ్‌లో వ్రాయబడిన మాటలు అనేకమంది యూదుల భావాలను వ్యక్తం చేశాయనడంలో సందేహం లేదు.
యేసు శిష్యులు సహితం సమరయులపై కొంత వివక్షను అలవర్చుకొని ఉండవచ్చు. ఒక సందర్భంలో సమరయ గ్రామస్థులు వారిని చేర్చుకోలేదు. దానితో యోహాను యాకోబులు స్పందనలేని ఆ ప్రజలపైకి అగ్ని కురిపించాలా అని అడిగారు. యేసు వారిని గద్దించడం ద్వారా అలాంటి స్వభావం సరైనది కాదని చూపించాడు.—లూకా 9:52-56.
ఆ తర్వాత, యేసు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల బారినపడిన వ్యక్తి గురించిన ఉపమానం చెప్పాడు. ఆ దారిలో వెళ్ళిన ఇద్దరు యూదులు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి మొగ్గు చూపలేదు. అయితే ఒక సమరయుడు ఆగి అతని గాయాలకు కట్లుకట్టాడు. ఆ తర్వాత అతని లూకా 10:29-37) యేసు శ్రోతలు, వివక్షవల్ల తాము ఇతరుల్లోని మంచి లక్షణాలను చూడలేకపోతున్నామని గ్రహించేందుకు ఆ ఉపమానం సహాయం చేసివుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, యోహాను సమరయకు తిరిగివచ్చి, అనేక గ్రామాల్లో ప్రకటించాడు, బహుశా ఒకప్పుడు తాను నాశనం చేయాలనుకున్న గ్రామంలో కూడా ప్రకటించేవుంటాడు.—అపొస్తలుల కార్యములు 8:14-17, 25.
గాయాలు నయమయ్యేవరకూ అతనిని చూసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ సమరయుడు తనను తాను నిజమైన పొరుగువానిగా నిరూపించుకున్నాడు. (రోమా శతాధిపతియైన కొర్నేలీకి యేసు గురించి ప్రకటించమని దేవదూత చెప్పినప్పుడు అపొస్తలుడైన పేతురు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి వచ్చింది. పేతురుకు యూదేతరులతో వ్యవహరించడం అలవాటు లేదు, పైగా యూదుల్లో చాలామంది రోమా సైనికులను ఇష్టపడేవారు కాదు. (అపొస్తలుల కార్యములు 10:28) అయితే పేతురు ఈ విషయంలో దేవుని నిర్దేశాన్ని చూసినప్పుడు ఆయనిలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
వివక్షను అధిగమించడానికి కృషిచేసేందుకు ప్రేరణ
యేసు బోధించిన ఈ ప్రధాన సూత్రాన్ని వివక్ష ఉల్లంఘిస్తుంది: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) కేవలం తన జన్మస్థలం, శరీర ఛాయ, లేదా నేపథ్యాన్ని బట్టి తిరస్కరించబడాలని ఎవరు కోరుకుంటారు? వివక్ష నిష్పక్షపాతానికి సంబంధించిన దేవుని ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తుంది. యెహోవా ‘యావద్భూమిపై కాపురముండుటకు యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు’ అని బైబిలు బోధిస్తోంది. (అపొస్తలుల కార్యములు 17:26) కాబట్టి మనుష్యులందరూ సహోదరులే.
అంతేకాక, దేవుడు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా తీర్పు తీరుస్తాడు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేదా పూర్వికులు చేసిన పనులను బట్టి అతణ్ణి లేదా ఆమెను దేవుడు ఖండించడు. (యెహెజ్కేలు 18:20; రోమీయులు 2:6) ఒక దేశం ఇతరులను అణచివేసినప్పుడు కూడా ఆ దేశానికి చెందిన వ్యక్తిని ద్వేషించడం సరైనది కాదు, ఎందుకంటే జరిగిన అన్యాయానికి ఆ వ్యక్తి బాధ్యుడై ఉండకపోవచ్చు. ‘శత్రువులను ప్రేమించాలని, హింసించేవారి కోసం ప్రార్థించాలని’ యేసు తన అనుచరులకు బోధించాడు.—మత్తయి 5:44, 45.
అలాంటి బోధలవల్లే మొదటి శతాబ్దపు క్రైస్తవులు వివక్షను అధిగమించి, ఒక విశిష్టమైన అంతర్జాతీయ సహోదరత్వాన్ని సాధించగలిగారు. వాళ్ళంతా ఎన్నో విభిన్న సంస్కృతుల నుండి వచ్చినా ఒకరినొకరు సహోదర సహోదరీలుగా భావించి ఒకరినొకరు అలాగే పిలుచుకున్నారు. (కొలొస్సయులు 3:9-11; యాకోబు 2:5; 4:11) ఆ మార్పును పురికొల్పిన సూత్రాలు నేడు కూడా అలాంటి ప్రయోజనాలనే తీసుకురాగలవు.
నేడు వివక్షను అధిగమించడం
నిజానికి మనందరికి ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉంటాయి, అయితే అవి వివక్షకు దారి తీయవలసిన అవసరం లేదు. “కొత్త విషయాలు తెలిశాక కూడా ముందు ఊహించుకున్నవాటినే పట్టుకొని వేలాడితేనే వివక్ష పుడుతుంది” అని ద నేచర్ ఆఫ్ ప్రిజుడీస్ అనే పుస్తకం చెబుతోంది. ప్రజలు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నప్పుడు తరచూ వివక్షను అధిగమించవచ్చు. అయితే “ప్రజలు కలిసి పని చేయడానికి నడిపించే సంబంధాలు మాత్రమే దృక్పథాల్లో మార్పు తీసుకురాగలవు” అని అదే పుస్తకం చెబుతోంది.
నైజీరియాలోని ఇబో తెగకు చెందిన జాన్, హౌసె తెగపట్ల తనకున్న వివక్షను అలాగే అధిగమించాడు. “విశ్వవిద్యాలయంలో నేను కొంతమంది హౌసె విద్యార్థులను కలిశాను, వాళ్ళు నా స్నేహితులయ్యారు, వాళ్ళకు చక్కని సూత్రాలు ఉన్నాయని నేను కనుగొన్నాను. ఒక సమిష్టి ప్రాజెక్టులో నేను ఒక హౌసె విద్యార్థితోపాటు పని చేశాను, మేము ఇద్దరం చక్కగా కలిసి పని చేయగలిగాము; అంతకుముందు ప్రాజెక్టులో నేను ఒక ఇబో విద్యార్థితో పని చేశాను, కానీ అతను తన వంతు పని చేయలేదు.”
వివక్షను అధిగమించడానికి సహాయం చేసే ఉపకరణం
యునెస్కో ఎగెయిన్స్‌ట్ రేసిజమ్ నివేదిక ప్రకారం “జాతి విభేదాలు, పక్షపాతం, బహిష్కరణ వంటివాటికి సంబంధించిన కొత్త రూపాలతో చేసే పోరాటంలో విద్య ఒక అమూల్యమైన సాధనంగా ఉపయోగపడగలదు.” ఈ విషయంలో బైబిలు విద్య అత్యంత శ్రేష్ఠమైనదని యెహోవాసాక్షులు నమ్ముతారు. (యెషయా 48:17, 18) ప్రజలు దాని ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు, అనుమానం స్థానంలో గౌరవం, ద్వేషం స్థానంలో ప్రేమ చోటుచేసుకుంటాయి.
తమలోని వివక్షను అధిగమించడానికి తమకు బైబిలు సహాయం చేస్తున్నట్లు యెహోవాసాక్షులు తెలుసుకున్నారు. నిజానికి ఇతర సంస్కృతులకు మరియు వేర్వేరు తెగలకు చెందినవారితో కలిసి పనిచేయడానికి కావలసిన పురికొల్పును, అవకాశాన్ని బైబిలు వారికిస్తోంది. ఈ శీర్షికల్లోని మొదటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన క్రిస్టీనా ఒక యెహోవాసాక్షి. “రాజ్య మందిరంలోని మా కూటాలు నా ఆత్మ విశాసాన్ని బలపరుస్తాయి. నేను అక్కడ భద్రతతో ఉన్నట్లు భావిస్తాను ఎందుకంటే అక్కడ ఎవ్వరికీ నా పట్ల వివక్ష ఉన్నట్లు అనిపించదు” అని ఆమె చెప్పింది.
జాస్మిన్ కూడా ఒక సాక్షి, 9 సంవత్సరాల వయస్సులో ఆమె జాత్యహంకారానికి గురైనట్లు ఆమెకు గుర్తుంది. ఆమె ఇలా చెప్పింది: “వారమంతటిలో గురువారం ఎల్లప్పుడు నాకు ఉల్లాసకరమైన రోజుగా ఉండేది, ఎందుకంటే నేను ఆ రోజు సాయంకాలం రాజ్యమందిరానికి వెళ్ళేదాన్ని. అక్కడ అందరూ నా పట్ల ప్రేమగా ప్రవర్తించేవారు. వాళ్ళు నేను తృణీకరించబడిన దానిగా కాక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించేలా చేసేవారు.”
యెహోవాసాక్షులు చేపట్టే స్వచ్ఛంద కార్యకలాపాలు కూడా వివిధ నేపథ్యాల ప్రజలను ఒక చోటికి చేరుస్తాయి. సైమన్ కుటుంబం కరీబియన్ వాసులైనప్పటికీ అతను బ్రిటన్‌లో జన్మించాడు. లౌకిక నిర్మాణ సంస్థల్లో తాపీ మేస్త్రిగా పని చేస్తున్నప్పుడు ఆయనెంతో వివక్షను ఎదుర్కొన్నాడు. అయితే ఆయన విశ్వాస సంబంధమైన తన సహోదరులతో స్వచ్ఛందసేవా ప్రాజెక్టులలో పని చేసిన సంవత్సరాల్లో అలాంటిదేదీ జరగలేదు. “అనేక దేశాలనుండి వచ్చిన తోటి సాక్షులతో నేను పని చేశాను, మేము కలిసి పని చేయడం నేర్చుకున్నాం. నా సన్నిహిత స్నేహితుల్లో కొందరు ఇతర దేశాలనుండి, ఇతర నేపథ్యాలనుండి వచ్చినవారే” అని ఆయన వివరించాడు.
అయితే యెహోవాసాక్షులు కూడా అపరిపూర్ణులే. కాబట్టి వాళ్ళు వివక్షా భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాల్సి రావచ్చు. అయితే దేవుడు పక్షపాతికాడని తెలుసుకోవడం వారు కూడా అలాగే ప్రవర్తించేందుకు శక్తిమంతమైన పురికొల్పునిస్తోంది.—ఎఫెసీయులు 5:1, 2.
వివక్షకు వ్యతిరేకంగా పోరాడడంవల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇతర నేపథ్యాల ప్రజలతో మమేకమైనప్పుడు మన జీవితాలు మరింత అర్థవంతమవుతాయి. అంతేకాక, త్వరలోనే దేవుడు తన రాజ్యం ద్వారా, నీతి నివసించే మానవ సమాజాన్ని స్థాపిస్తాడు. (2 పేతురు 3:13) అప్పుడు వివక్ష శాశ్వతంగా అధిగమించబడుతుంది. (g04 9/8)
[11వ పేజీలోని బాక్సు]
నాలో వివక్ష భావాలు ఉన్నాయా?
మీకు తెలియకుండానే మీలో కొన్ని వివక్ష భావాలు ఉన్నాయేమో విశ్లేషించుకోవడానికి మిమ్మల్ని మీరు ఈ క్రింది విధంగా ప్రశ్నించుకోండి:
1. ఫలాని నేపథ్యం, మతం లేదా దేశానికి చెందిన ప్రజల్లో మూర్ఖత్వం, సోమరితనం, పిసినారితనం వంటి అవాంఛిత లక్షణాలు ఉంటాయని నేను భావిస్తున్నానా? (అనేక హాస్యోక్తులు ఈ విధమైన వివక్షకు కారణమవుతాయి.)
2. నా ఆర్థిక లేదా సామాజిక సమస్యలకు వలసవచ్చిన వారిని లేదా వేరే జాతికి చెందిన ప్రజలను నిందించడానికి నేను మొగ్గు చూపుతున్నానా?
3. నేనున్న దేశానికి మరో దేశానికి మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా నాకు ఆ దేశనివాసుల పట్ల విరోధ భావాలు ఉన్నాయా?
4. నేను కలిసే వ్యక్తి శరీర ఛాయ, సంస్కృతి, లేదా జాతి నేపథ్యం ఏదైనా సరే ఆ వ్యక్తిని ఒక వ్యక్తిగా దృష్టించే సామర్థ్యం నాలో ఉందా?
5. నా సంస్కృతికి కాకుండా విభిన్న సంస్కృతికి చెందిన ప్రజలను తెలుసుకునే అవకాశాన్ని నేను ఇష్టపడతానా? అలా చేయడానికి నేను ప్రయత్నిస్తానా?
[8వ పేజీలోని చిత్రం]
మంచి సమరయుని గురించిన ఉపమానంలో యేసు వివక్షను ఎలా అధిగమించాలో మనకు బోధించాడు
[8వ పేజీలోని చిత్రం]
కొర్నేలీ ఇంటిలో పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను”
[9వ పేజీలోని చిత్రం]
బైబిలు బోధ వివిధ నేపథ్యాల ప్రజలను ఐక్యపరుస్తుంది
[9వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు తాము నేర్చుకున్న దానిని ఆచరిస్తారు
[10వ పేజీలోని చిత్రం]
క్రిస్టీనా_‘రాజ్య మందిరంలోని కూటాలు నా ఆత్మ విశాసాన్ని బలపరుస్తాయి’
[10వ పేజీలోని చిత్రం]
జాస్మిన్_“అందరూ నా పట్ల ప్రేమగా ప్రవర్తించేవారు. వాళ్ళు నేను తృణీకరించబడిన దానిగా కాక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించేలా చేసేవారు”
[10వ పేజీలోని చిత్రాలు]
సైమన్, నిర్మాణ పని స్వచ్ఛంద సేవకుడు_“మేము కలిసి పని చేయడం నేర్చుకున్నాం”