కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గ్లాకోమా చూపును హరించే వ్యాధి

గ్లాకోమా చూపును హరించే వ్యాధి

గ్లాకోమా చూపును హరించే వ్యాధి

ఈ వాక్యంలోని చివరి పదం మీద కొద్దిసేపు మీ చూపును కేంద్రీకరించండి. చూపు మరల్చకుండానే మీరు ఈ పత్రిక నలువైపులా కొంత భాగాన్ని చూడగలుగుతున్నారా? బహుశా మీరు చూడగలుగుతుండవచ్చు, పరిధీయ దృష్టే (ముందుకు సూటిగా చూస్తూనే పక్కల్లోని వస్తువులను చూడగలిగే సామర్థ్యమే) దానికి కారణం. ఈ సామర్థ్యం వల్ల మీరు పక్కనుండి మీ వైపుగా వస్తున్న అనుమానాస్పద వ్యక్తిని చూడగలుగుతారు. మీరు నేలమీదున్న వస్తువులపై కాలువేయకుండా వాటిని దాటి నడిచేందుకూ, నడుస్తున్నప్పుడు గోడలను గుద్దుకోకుండా ఉండడానికీ అది దోహదపడుతుంది. మీరు కారు నడిపిస్తున్నట్లయితే, ఒక పాదచారి ఫుట్‌పాత్‌ దిగి రోడ్డు మీదికి వస్తున్నాడని పరిధీయ దృష్టి మిమ్మల్ని అప్రమత్తులను చేస్తుంది.

అయితే మీరు ఈ పేజీ చదువుతున్నప్పుడు కూడా, మీకు ఏ మాత్రం తెలియకుండానే, మీ పరిధీయ దృష్టి నెమ్మదిగా క్షీణించిపోతుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 6.6 కోట్లమంది గ్లాకోమా (నీటికాసులు) అనే పేరుతో గుర్తించబడే కొన్ని రకాల కంటి వ్యాధులకు గురవుతున్నారని అంచనా వేయబడింది. వారిలో 50 లక్షలకన్నా ఎక్కువమంది పూర్తిగా అంధులయ్యారు. దానితో శాశ్వత అంధత్వం కలుగజేసే వ్యాధుల్లో గ్లాకోమా మూడవ స్థానంలోకి వచ్చింది. “గ్లాకోమా గురించి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించబడుతున్న అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా, గ్లాకోమా ఉన్నవారిలో సగం మంది తమకు ఆ వ్యాధి ఉందని తెలుసుకోకుండానే ఉండిపోతున్నారు” అని ద లాన్సెట్‌ అనే వైద్య పత్రిక వ్యాఖ్యానిస్తోంది.

గ్లాకోమా వచ్చే అవకాశం ఎవరికి ఉంది? దాన్నెలా కనుక్కోవచ్చు, దానికి చికిత్స ఎలా చేయవచ్చు?

గ్లాకోమా అంటే ఏమిటి?

మొదటిగా మన కళ్ళ గురించి మనం కొంత తెలుసుకోవాలి. గ్లాకోమా ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా వారు రూపొందించిన ఒక బ్రోషుర్‌ ఈ విధంగా వివరిస్తోంది: “కంటిలో ఉండే ఒత్తిడి మూలంగా కనుగుడ్డుకు ఆకృతి ఏర్పడుతుంది, కంటిలోని సున్నితమైన కణజాలాలు కారు టైరులాగ లేదా గాలి బుడగలాగ ‘ఉబ్బి’ ఉంటాయి.” కంటి లోపల ఉండే సీలియరీ బాడీ అని పిలువబడే ఒక పంపు ఏక్వియస్‌ హ్యూమర్‌ (నేత్రోదకం) అనే ద్రవపదార్థాన్ని రక్త నాళాల్లో నుండి కంటిలోకి పంపిస్తుంది. “ఆ ద్రవపదార్థం కంటిలోపల ప్రసరించి కంటి సజీవ భాగాలకు పోషణనిస్తూ, ట్రబెక్యులర్‌ మెష్‌వర్క్‌ అని పిలువబడే జల్లెడలాంటి భాగం గుండా తిరిగి రక్త ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది.”

ఈ మెష్‌వర్క్‌కు ఏదైనా అడ్డుపడితే లేదా అది ముడుచుకుపోతే కంటి లోపలి ఒత్తిడి పెరిగిపోతుంది, దానివల్ల కంటి వెనక భాగంలో ఉండే సున్నితమైన నాడీ తంతువులు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. దీనిని ఓపెన్‌ యాంగిల్‌ గ్లాకోమా అంటారు, దాదాపు 90 శాతం మంది ఈ రకం గ్లాకోమాతోనే బాధపడుతుంటారు.

మీ కంటి లోపలి ఒత్తిడిని ఇంట్రా ఆక్యులార్‌ ఒత్తిడి అంటారు, ఇది గంటగంటకూ మారుతూ ఉంటుంది. మీ హృదయ స్పందన, మీరు త్రాగే ద్రవ పదార్థాలు, మీ శరీర భంగిమ వంటి అనేక కారణాలను బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. సహజంగా కలిగే ఈ తేడాల మూలంగా మీ కంటికి ఎలాంటి హానీ జరగదు. కంటి లోపలి ఒత్తిడి అధికంగా ఉన్నంత మాత్రాన గ్లాకోమా ఉందని చెప్పలేము, ఎందుకంటే “సాధారణ” కంటి ఒత్తిడి ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఒత్తిడి అధికంగా ఉండడం కూడా గ్లాకోమా ఉందని సూచించే లక్షణాల్లో ఒకటి.

మరో రకమైన గ్లాకోమా, అక్యూట్‌ లేదా యాంగిల్‌ క్లోజర్‌ గ్లాకోమా అని పిలువబడుతుంది, ఇది అరుదుగా వస్తుంది. ఓపెన్‌ యాంగిల్‌ గ్లాకోమా వచ్చినవారిలో జరిగేలా కాక ఈ రకం గ్లాకోమా వచ్చినవారికి కంటి లోపలి ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనివల్ల కంటిలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది, అంతేగాక చూపు అస్పష్టంగా మారి, వాంతులు కూడా అవుతాయి. ఈ లక్షణాలు కనబడిన కొద్ది గంటలలోగా చికిత్స చేయకపోతే, అంధత్వం కలుగుతుంది. సెకండరీ గ్లాకోమా అనేది ఇంకో రకమైన గ్లాకోమా. ఆంగ్లంలో దీని పేరు సూచిస్తున్నట్లే ఇది కంటిలో ఏర్పడే కంతులు, శుక్లాలు, కంటి గాయాలు వంటి ఇతర కారణాలవల్ల వస్తుంది. నాలుగవ రకమైన గ్లాకోమాను కాంజెనిటల్‌ గ్లాకోమా అంటారు, ఇది చాలా తక్కువమందికి వస్తుంది. ఇది పుట్టుకతోనే ఉంటుంది లేదా పుట్టిన తర్వాత వస్తుంది. శిశువు కనుగుడ్లు పెద్దగా ఉండడం, వెలుగును సరిగ్గా చూడలేకపోవడం వంటివి ఆ శిశువుకు సెకండరీ గ్లాకోమా ఉందని సూచిస్తాయి.

ఇది చూపును హరించే విధానం

గ్లాకోమా మూలంగా, మీకు తెలియకుండానే, మీ కళ్ళల్లో ఒకదాని కంటిచూపు దాదాపు 90 శాతం కోల్పోయే అవకాశం ఉంది. అదెలా సాధ్యం? మనందరికీ రెండు కళ్ళలోనూ కంటి వెనక భాగంలో సహజంగానే ఒక గుడ్డి చుక్క ఉంటుంది. రెటీనా (నేత్ర పటలం) మీద ఉండే ఈ గుడ్డి చుక్క, మీ నాడీ తంతువులు దృష్టి నాడిగా ఏర్పడేచోట ఉంటుంది. దానిలో వెలుగును గ్రహించే కణాలు ఉండవు. అయితే మన కంటిలో ఈ గుడ్డి చుక్క ఉందని మనకు తెలియదు, ఎందుకంటే మనం చూస్తున్న ఒక దృశ్యంలో కనిపించని భాగాలను “పూరించే” సామర్థ్యం మన మెదడుకు ఉంటుంది. నిజానికి మన మెదడుకున్న ఆ సామర్థ్యం వల్లనే గ్లాకోమా అంత త్వరగా బయటపడదు.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత కంటి వైద్యుడు డా. ఐవన్‌ గోల్డ్‌బర్గ్‌ తేజరిల్లు!తో ఇలా అన్నారు: “గ్లాకోమా మన చూపును రహస్యంగా హరించివేస్తుందని చెప్పవచ్చు, ఎందుకంటే దాని రోగలక్షణాలేవీ బయటకు కనబడవు. చాలా సాధారణంగా వచ్చే గ్లాకోమా నెమ్మదిగా, క్రమంగా వృద్ధి చెందుతూ ఏవిధమైన హెచ్చరిక లేకుండానే, మీ కంటిని మెదడును సంధానం చేసే నాడీ నిర్మాణానికి హాని కలుగజేస్తుంది. మీ కళ్ళ నుండి నీరు కారినా కారకపోయినా, కళ్ళు పొడిగా ఉన్నా లేకున్నా, చదివేటప్పుడు రాసేటప్పుడు స్పష్టంగా కనిపించినా కనిపించకపోయినా గ్లాకోమా ఉందనో లేదనో తేల్చి చెప్పడం సాధ్యం కాదు. మీ కళ్ళకు ఏ సమస్యా లేనట్టు అనిపించినా మీరు తీవ్రమైన గ్లాకోమాతో బాధపడుతుండవచ్చు.”

గ్లాకోమాను కనిపెట్టడం

విచారకరమైన విషయం ఏమిటంటే గ్లాకోమాను ఒకే పరీక్షతో గుర్తించడం వీలుకాదు. ఒక కంటి వైద్యుడు టోనోమీటర్‌ అనే పరికరాన్ని ఉపయోగించి మీ కళ్లలోని ద్రవపదార్థపు ఒత్తిడిని పరీక్షించవచ్చు. ఆ పరికరంతో మీ కంటి ముందు భాగాన్ని అంటే కార్నియాను (శుక్లపటలాన్ని) సున్నితంగా నొక్కిచూస్తాడు. ఇలా చేయడానికి అవసరమైన శక్తిని కొలిచి, దాని ఆధారంగా మీ కంటి లోపలి ఒత్తిడిని నిర్ధారిస్తారు. కంటిని మెదడును సంధానం చేసే నాడీ నిర్మాణంలో దెబ్బ తిన్న తంతువులను గుర్తించే పరికరాలను ఉపయోగించడం ద్వారా కూడా కంటి వైద్యుడు గ్లాకోమా సూచనలేమైనా ఉన్నాయేమోనని చూడవచ్చు. డా. గోల్డ్‌బర్గ్‌ ఇలా అంటున్నారు: “మేము కంటి వెనక భాగంలోని నాడీ తంతువులు లేదా రక్త నాళాలు అసాధారణమైన ఆకృతిలో ఉన్నాయా అని చూస్తాం, ఎందుకంటే అలా ఉన్నట్లయితే నాడులు దెబ్బ తిన్నాయని అర్థం.”

విజువల్‌ ఫీల్డ్‌ టెస్టింగ్‌ అనే పరీక్ష ద్వారా కూడా గ్లాకోమాను కనిపెట్టవచ్చు. డా. గోల్డ్‌బర్గ్‌ ఇలా వివరిస్తున్నారు: “ఒక వ్యక్తిని తెల్లని వెలుగుతో నిండివున్న ఒక పుటాకారపు గిన్నెలోకి చూడమని చెప్పి ఆ తర్వాత ఆ గిన్నెలోకి మరింత ప్రకాశవంతమైన తెల్లని వెలుగును ఒక చిన్నచుక్కలా ప్రసరింపజేస్తారు. ఆ వ్యక్తికి ఆ ప్రకాశవంతమైన తెల్లని చుక్క కనిపిస్తే అతడు ఒక మీటను నొక్కుతాడు.” ఈ వ్యక్తి దృష్టి పరిధి వెలుపలి అంచుపై ఆ తెల్ల చుక్క వేయబడినప్పుడు దాన్ని అతడు చూడలేకపోతే అతడికి గ్లాకోమా ఉండవచ్చు. విసుగు పుట్టించే ఈ ప్రక్రియను సులభతరం చేయగల కొత్త పరికరాలను వృద్ధి చేస్తున్నారు.

గ్లాకోమా ఎవరికి రావచ్చు?

పాల్‌ 40వ పడిలోవున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తి. ఆయన ఇలా చెప్పాడు: “నేను కొత్త కళ్ళద్దాల కోసం కంటి పరీక్ష చేయించుకోవడానికి వైద్యుని దగ్గరికి వెళ్ళాను, ఆయన మా కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉందేమో చెప్పమన్నాడు. నేను ఆ విషయం గురించి కాస్త విచారించే సరికి మా పెద్దమ్మకూ మా మేనమామకూ ఉందని తెలిసింది. అప్పుడు నన్ను కంటి నిపుణుడి దగ్గరకు పంపించారు, ఆయన నాకు గ్లాకోమా ఉందని నిర్ధారించాడు.” డా. గోల్డ్‌బర్గ్‌ ఇలా వివరిస్తున్నారు: “మీ అమ్మకు లేక నాన్నకు గ్లాకోమా ఉంటే, మీకు కూడా గ్లాకోమా వచ్చే అవకాశం మూడు నుండి అయిదు శాతం పెరుగుతుంది. అదే మీ అన్నకో అక్కకో ఉన్నట్లయితే మీకు గ్లాకోమా వచ్చే అవకాశం అయిదు నుండి ఏడు శాతానికి పెరుగుతుంది.”

అమెరికాలోని గ్లాకోమా ఫౌండేషన్‌కు చెందిన డా. కెవిన్‌ గ్రీనిడ్జ్‌, గ్లాకోమా రావడానికిగల ఇతర కారణాల గురించి చెబుతూ ఇలా అంటున్నారు: “మీకు 45 ఏండ్ల పైనే ఉండి మీరు ఆఫ్రికన్‌ సంతానమైతే లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉంటే, మీకు హ్రస్వదృష్టిగానీ మధుమేహంగానీ ఉంటే, గతంలో మీ కంటికి దెబ్బ తగిలివుంటే లేక మీరు కార్టిసోన్‌/స్టెరాయిడ్‌ ఉత్పత్తులను క్రమంగా ఉపయోగిస్తుంటే ప్రతి సంవత్సరం కళ్ళ పరీక్ష చేయించుకోండి.” మీకు పైన పేర్కొన్నవేవీ లేకపోయినా, మీరు 45 ఏండ్ల లోపువారైతే నాలుగేండ్లకు ఒకసారి, 45 ఏండ్లు దాటినవారైతే రెండేండ్లకు ఒకసారి గ్లాకోమా పరీక్ష చేయించుకోవాలని ఫౌండేషన్‌ వారు సిఫార్సు చేస్తున్నారు.

చికిత్స చేయించుకొని గ్లాకోమాను తగ్గించుకోండి

గ్లాకోమా తగ్గించుకోవడానికి పాల్‌ ప్రత్యేకమైన చుక్కల మందు రోజుకు ఒకసారి కళ్ళలో వేసుకోవాలి. ఆయనిలా అంటున్నాడు: “నేను ఉపయోగించే చుక్కల మందు కనుగుడ్డులోని ఏక్వియస్‌ ద్రవపదార్థపు ఉత్పత్తిని నిరోధిస్తుంది.” పాల్‌ మరో చికిత్స కూడా చేయించుకున్నాడు, అందులో లేజర్‌ బీమ్‌ను ఉపయోగించి ఆయన కళ్ళ ముందరి భాగంలో సహజంగా ఉండే డ్రెయిన్‌ హోల్స్‌ స్థలంలో దాదాపు పది సూక్ష్మ రంధ్రాలు చేశారు. ఆ చికిత్స గురించి చెబుతూ ఆయనిలా అన్నాడు: “నా మొదటి కన్నుకు లేజర్‌ చికిత్స చేయించుకున్నప్పుడు, నేను భయంతో బిగుసుకుపోయాను, దానితో నాకు మరింత కష్టమైంది. అయితే కొన్ని రోజుల తర్వాత నా రెండవ కన్నుకు చికిత్స చేయించుకుంటున్నప్పుడు, అదెలా ఉంటుందో నాకు ముందే తెలుసు కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను గ్రహించేలోపే వైద్యుడు శస్త్రచికిత్సను దాదాపు పూర్తి చేశాడు.” ఆ చికిత్స పాల్‌ కంటి లోపలి ఒత్తిడి నిలకడగా ఉండడానికి సహాయం చేసింది.

అప్పటినుండి పాల్‌కు ఆశావహ దృక్పథం ఏర్పడింది. ఆయనిలా అంటున్నాడు: “గ్లాకోమావల్ల నా నేత్రపటలాలు స్వల్పంగా మాత్రమే దెబ్బతిన్నాయి, సంతోషకరంగా నా పరిధీయ దృష్టి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. నేను మరచిపోకుండా ప్రతీరోజు కళ్ళలో చుక్కల మందు వేసుకుంటే, నా పరిధీయ దృష్టి ఎప్పటికీ అలాగే ఉంటుంది.”

గ్లాకోమా రహస్యంగా మీ చూపును హరించివేస్తోందా? మీరు ఇప్పటి వరకు గ్లాకోమా పరీక్ష చేయించుకోకపోతే, ప్రత్యేకంగా మీరు గ్లాకోమా వచ్చే అవకాశంగల వారిలో ఒకరైతే, మీరు మీ డాక్టరును గ్లాకోమా పరీక్ష చేయమని అడగడం మంచిది. డా. గోల్డ్‌బర్గ్‌ చెబుతున్నట్లు “పరిస్థితి విషమించక ముందే తగిన చికిత్స చేయించుకోవడం ద్వారా గ్లాకోమావల్ల కలిగే హానిని చాలా వరకు నివారించవచ్చు.” అవును, గ్లాకోమాకు చికిత్స చేయించుకొని దాన్ని తగ్గించుకోవడం సాధ్యమే! (g04 10/8)

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీకు గ్లాకోమా వచ్చే అవకాశం ఎప్పుడు ఎక్కువవుతుందంటే . . .

● మీరు ఆఫ్రికన్‌ సంతానమైతే

● మీ కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉంటే

● మీకు మధుమేహం ఉంటే

● మీకు హ్రస్వదృష్టి ఉంటే

● కొన్నిరకాలైన క్రీములలోనూ ఆస్తమా స్ప్రేలలోనూ ఉపయోగించబడే కార్టిసోన్‌/స్టెరాయిడ్‌లను మీరు క్రమంగా, దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్నట్లయితే

● గతంలో మీ కంటికి దెబ్బ తగిలినట్లయితే

● మీ వయసు 45 దాటితే

[చిత్రం]

క్రమంగా పరీక్ష చేయించుకోవడం ద్వారా తీవ్రమైన దృష్టిలోపం ఏర్పడకుండా నివారించుకోవచ్చు

[27వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఓపెన్‌ యాంగిల్‌ గ్లాకోమా

శుక్లపటలం

పరితారక

కటకం

నేత్రపటలం

నేత్ర చక్రిక లేదా గుడ్డి చుక్క, ఇక్కడే నాడీ తంతువులు దృష్టి నాడిగా ఏర్పడతాయి

దృష్టి నాడి దృష్టి ప్రచోదనాలను మెదడుకు చేరవేస్తుంది

సీలియరీ బాడీ, ఇక్కడే ద్రవం తయారవుతుంది

1 ఏక్వియస్‌ హ్యూమర్‌ అనేది కటకానికి, పరితారకకు, శుక్లపటలం లోపలి భాగానికి పోషణనిచ్చే పారదర్శకమైన ద్రవం. ఇది కంటి వెలుపలి భాగాన్ని శుభ్రపరిచే కన్నీరు కాదు

2 ట్రబెక్యులర్‌ మెష్‌వర్క్‌ నుండి ద్రవం బయటికి ప్రవహిస్తుంది

3 ఆ మెష్‌వర్క్‌కు ఏదైనా అడ్డుపడితే లేదా అది ముడుచుకుపోతే కంటి లోపలి ఒత్తిడి పెరిగిపోతుంది

4 కంటి లోపలి ఒత్తిడి పెరిగిపోతే, కంటి వెనక భాగంలో ఉండే సున్నితమైన నాడీ తంతువులు దెబ్బ తింటాయి, దానితో గ్లాకోమా లేదా దృష్టిలోపం కలుగుతుంది

[27వ పేజీలోని చిత్రాలు]

నేత్ర చక్రిక

మీకు కనిపించేది

మామూలు దృష్టి

గ్లాకోమా తొలిదశ

గ్లాకోమా ముదిరినదశ

[చిత్రసౌజన్యం]

నేత్ర చక్రికల ఫోటోలు: Courtesy Atlas of Ophthalmology