కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి ప్రేమించడం చిన్నప్పటి నుండి బోధించబడింది

దేవుణ్ణి ప్రేమించడం చిన్నప్పటి నుండి బోధించబడింది

దేవుణ్ణి ప్రేమించడం చిన్నప్పటి నుండి బోధించబడింది

అనాటోలీ మెల్‌నిక్‌ చెప్పినది

చాలామంది నన్ను తాతయ్యా అని ఆప్యాయంగా పిలుస్తారు. ఆ పిలుపు నా హృదయతంత్రులను మీటుతుంది, ఎందుకంటే అది నేను ఎంతో గాఢంగా ప్రేమించిన, నేను ఎంతో ఋణపడి ఉన్న మా తాతయ్యను గుర్తుచేస్తుంది. ఆయన గురించీ, ఆయనా మా అమ్మమ్మా తమ కుటుంబ సభ్యుల జీవితాలనూ ఇతర అనేకుల జీవితాలనూ ప్రగాఢంగా ప్రభావితం చేసిన విధానం గురించీ నన్ను చెప్పనివ్వండి.

ఇప్పుడు మాల్డోవా అని పిలువబడుతున్న దేశానికి ఉత్తరాన ఉన్న హ్లీనా అనే గ్రామంలో నేను పుట్టాను. * అప్పట్లో పిల్‌గ్రిమ్స్‌ అని పిలువబడిన ప్రయాణ పరిచారకులు, 1920లలో రుమేనియా సరిహద్దులను దాటి అందమైన మా కొండ ప్రాంతానికి వచ్చారు. బైబిలు నుండి ప్రకటించబడిన సువార్తను విన్న మా అమ్మ తల్లిదండ్రులు వెంటనే స్పందించారు. 1927లో వారు బైబిలు విద్యార్థులయ్యారు, యెహోవాసాక్షులు అప్పుడు అలాగే పిలువబడేవారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి మా చిన్న గ్రామంలో అప్పటికే యెహోవాసాక్షుల సంఘం ఒకటి ఉంది.

1936లో నేను పుట్టే సమయానికి, మా నాన్నగారు తప్ప మా బంధువులందరూ యెహోవాసాక్షులే. మా నాన్నగారు ఆర్థడాక్స్‌ చర్చికి వెళుతుండేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన జీవిత సంకల్పం గురించి ఆలోచించడం ప్రారంభించారు, కొన్నాళ్ళకు మన సృష్టికర్త అయిన యెహోవా దేవునికి సమర్పించుకొని దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. మా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మా తాతయ్య చాలా సహాయపడ్డారు. ఆయనకు బైబిలు అంటే ప్రగాఢమైన ప్రేమ, వందల కొలది లేఖనాలు కంఠస్థంగా చెప్పేవారు. ఆయన ఎటువంటి సంభాషణనైనా బైబిలు వైపుకు తిప్పేవారు.

నేను తాతయ్య ఒడిలో కూర్చొని ఆయన చెప్పే బైబిలు కథలు వినేవాడిని. ఆయన నాలో దేవునిపట్ల ప్రేమను పాదుకొల్పాడు. దానికి నేను ఆయనకు ఎంతో కృతజ్ఞుడ్ని. నా ఎనిమిదవ ఏట తాతయ్యతో కలిసి మొట్ట మొదటిసారి ప్రకటనా పనికి వెళ్ళాను. బైబిలు ఉపయోగిస్తూ యెహోవా ఎవరో, ఆయనకు ఎలా సన్నిహితం కావచ్చో మేము మా తోటి గ్రామస్థులకు చూపించాం.

కమ్యూనిస్టులచేత అణచివేయబడ్డాం

1947లో కమ్యూనిస్టు పాలసీ, ఆర్థడాక్స్‌ చర్చి ప్రోద్బలంతో అధికారులు మాల్డోవాలోని యెహోవాసాక్షులను హింసించడం ప్రారంభించారు. కెజిబి అని తర్వాత పిలువబడిన దానికి చెందిన ఏజెంట్లూ, స్థానిక పోలీసులూ మా ఇంటికి వచ్చి మా ప్రకటనా పనిలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారో, సాహిత్యాలు ఎక్కడ నుండి వస్తున్నాయో, ఆరాధన కోసం ఎక్కడ కలుసుకుంటారో చెప్పమని మమ్మల్ని అడిగేవారు. యెహోవాసాక్షులు “దేశంలో కమ్యూనిజం అభివృద్ధికి ఆటంకం” అనీ అందుకే వారి కార్యకలాపాలను నిలిపేయబోతున్నాం అనీ వాళ్ళు అనేవారు.

ఆ సమయానికి, విద్యాధికుడైన మా నాన్నగారు కూడా బైబిలు సత్యం పట్ల ప్రగాఢమైన ప్రేమను పెంచుకున్నారు. ఎవరైనా విచారణ కోసం వచ్చినప్పుడు, మన క్రైస్తవ సహోదర సహోదరీలకు ద్రోహం జరగకుండా వారికి సమాధానం ఎలా ఇవ్వాలో నాన్నకి, తాతయ్యకి ఇద్దరికీ తెలుసు. ధైర్యవంతులూ, ప్రేమామయులూ అయిన వారిద్దరూ తమ తోటి విశ్వాసుల సంక్షేమం కోసం కృషి చేశారు. అమ్మ వారిలాగే ఎప్పుడూ నిర్మలంగా, శాంతంగా ఉండేది.

1948లో మా నాన్నగారిని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఆయన మీద మోపిన ఆరోపణలు ఏమిటో మాకు చెప్పలేదు. ఆయనకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రెండు సంవత్సరాల బహిష్కరణ విధించారు. చివరకు ఆయనను మా ఇంటికి 4,000 కంటే ఎక్కువ మైళ్ళ దూరంలో, రష్యాకు ఈశాన్యాన ఉన్న మగదాన్‌ అనే ప్రాంతానికి పంపించారు. మేము ఒకరినొకరం తొమ్మిది సంవత్సరాలపాటు చూసుకోలేదు. తండ్రి లేకుండా జీవించడం చాలా కష్టం, కానీ తాతయ్య నాకు గొప్ప మద్దతుగా ఉన్నారు.

దేశ బహిష్కరణ

1949 జూన్‌ 6వ తేదీన ఇద్దరు సైనికులు, ఒక ఆఫీసరు మా ఇంటి మీద దాడి చేశారు. రెండు గంటల్లో ఇల్లు ఖాళీ చేసి తమ వాహనంలో వచ్చి కూర్చొమ్మని చెప్పారు. అంతకు మించి వివరాలు చెప్పలేదు. మమ్మల్ని బహిష్కరిస్తున్నారనీ మేము ఎన్నటికీ తిరిగిరామనీ మాత్రం చెప్పారు. ఆ విధంగా నేను, మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కొంతమంది తోటి విశ్వాసులతోపాటు సైబీరియాకు తరలించబడ్డాం. అప్పుడు నాకు కేవలం 13 ఏండ్లు. కొన్ని వారాల తర్వాత మేము టైగా అనే చిత్తడి ప్రాంతానికి చేరుకున్నాం, దాని చుట్టూ ఎత్తైన చెట్లతో దట్టమైన అడవులున్నాయి. నాకు ఎంతో ఇష్టమైన మా స్వగ్రామపు పరిసరాలకూ దీనికీ ఎంత తేడా! కొన్నిసార్లు మేము ఏడ్చేవాళ్ళం. అయినా యెహోవా మమ్మల్ని వదిలేయడనే నమ్మకంతో ఉన్నాం.

మమ్మల్ని తీసుకుపోయిన చిన్న గ్రామంలో కట్టెలతో వేసిన పది గుడిసెలు మాత్రమే ఉన్నాయి. ఇతర సాక్షులను టైగాలో ఉన్న వివిధ గ్రామాలకు పంపించారు. స్థానిక ప్రజలను భయపెట్టడానికే కాక వారికి మా పట్ల దురభిప్రాయం కలిగించాలన్న ఉద్దేశంతో, సాక్షులు నరభక్షకులు అని అధికారులు వారితో చెప్పారు. అయితే అది అబద్ధమనీ మాకు భయపడాల్సిన అవసరం లేదనీ ప్రజలు త్వరలోనే గ్రహించారు.

మేము అక్కడికి చేరుకున్నాక మొదటి రెండు నెలలు ఒక పాత గుడిసెలో ఉన్నాం. కానీ ఎముకలు కొరికేలా ఉండే చలికాలం రాకముందే ఇంకాస్త అనువైనది కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమ్మా నేనూ తలదాచుకోవడానికి సరిపోయే ఒక చిన్న గుడిసె అంటే సగ భాగం నేలకు పైన మరో సగం నేలలోపల ఉండే గుడిసె వేసుకోవడానికి అమ్మమ్మ, తాతయ్య మాకు సహాయం చేశారు. మేము అందులో మూడు సంవత్సరాలు ఉన్నాం. అనుమతి లేకుండా గ్రామం బయటకు వెళ్ళవద్దని మాకు ఆజ్ఞాపించారు, అనుమతి ఎన్నడూ ఇవ్వలేదు.

కొంతకాలం తర్వాత, పాఠశాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించారు. నా మత దృక్పథాలు అక్కడుండే ఇతరుల దృక్పథాలకు భిన్నంగా ఉండడం వల్ల, ఉపాధ్యాయులూ తోటి విద్యార్థులూ తరచూ ప్రశ్నలు అడిగేవారు. నేను మన నమ్మకాల గురించి వారికి ఎలా వివరించగలిగానో ఇంటికి వచ్చాక తాతయ్యకు చెబుతున్నప్పుడు ఆయన కళ్ళు ఆనందంతో మెరిసేవి.

ఇంకాస్త స్వేచ్ఛ

నియంత అయిన స్టాలిన్‌ 1953లో మరణించిన తర్వాత మా జీవితం కాస్త మెరుగుపడింది. మమ్మల్ని గ్రామం బయటకు వెళ్ళడానికి అనుమతించారు. దాంతో ఇతర బహిష్కరించబడిన సాక్షులున్న గ్రామాల్లో తోటి విశ్వాసులతో సహవాసం చేయడానికీ కూటాలకు హాజరవడానికీ మాకు అవకాశం లభించింది. ప్రజల దృష్టిలో పడకూడదని మేము చిన్న చిన్న గుంపులుగా సమకూడేవాళ్ళం. అక్కడికి వెళ్ళడానికి 30 కిలోమీటర్లు నడిచేవాళ్ళం, కొన్నిసార్లు మోకాళ్ళ లోతుండే మంచులో -40 డిగ్రీల శీతోష్ణస్థితిలో వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాతి రోజు మేము ఇంటికి తిరిగి రావడానికి సుదీర్ఘ పాదయాత్ర చేసేవాళ్ళం. వెనిగర్‌లో నానబెట్టిన చిన్న దోసకాయలు, కొన్ని చక్కెర ఉండలు మేము దారిలో తినేవాళ్ళం. అయినా మేము ప్రాచీన దావీదులాగే సంతోషంగా ఉండేవాళ్ళం!​—కీర్తన 122:1.

నేను యెహోవాకు సమర్పించుకుని దానికి సూచనగా 1955లో బాప్తిస్మం తీసుకున్నాను. దానికి కొంతకాలం ముందు, మా పక్కనున్న గ్రామంలో జరిగిన ఒక సంఘ కూటంలో నల్లని శిరోజాలున్న, నెమ్మదస్థురాలైన లిడియా అనే ఒక అమ్మాయి తారసపడింది. మాలాగే ఆమె కుటుంబ సభ్యులుకూడా మాల్డోవా నుండి బహిష్కరించబడిన యెహోవాసాక్షులే. ఆమె కంఠం మధురమైనదే కాక, అప్పట్లో మేము ఉపయోగించే పాటల పుస్తకంలోని దాదాపు మొత్తం 337 పాటలు చూడకుండా పాడేది. అది నన్నెంతో ముగ్ధుడ్ని చేసింది, ఎందుకంటే నాకు కూడా మన సంగీతం, పాటలు అంటే చాలా ఇష్టం. 1956లో మేము పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

మా నాన్నగారు మగదాన్‌కు తరలించబడ్డారని తెలిసి, ఆయనకు మా పెళ్ళి విషయం వ్రాసి ఆయన ఆమోదం కోసం ఆగాలని మా పెళ్ళి వాయిదా వేసుకున్నాం. ఆ తర్వాత కొద్దికాలానికే నాన్నగారు విడుదల చేయబడి, దేశాంతరవాసులుగా ఉంటున్న మమ్మల్ని కలుసుకొని మాతోనే ఉండిపోయారు. ఆయనా తోటి క్రైస్తవులూ లేబర్‌ క్యాంపుల్లోని దుర్భర పరిస్థితుల్లో దేవుని సహాయంతో ఎలా కొనసాగారో మాకు చెప్పారు. ఆ వృత్తాంతాలు మా విశ్వాసాన్ని బలపరిచాయి.

నాన్నగారు తిరిగి వచ్చిన కొంత కాలానికి, అమ్మ ఒక తైలం తయారు చేస్తున్నప్పుడు ఘోరమైన ప్రమాదం జరిగింది, మేము ఆ తైలాన్ని రంగుల్లో, వార్నిష్‌లలో ఉపయోగించేవాళ్ళం. ఉడుకుతున్న తైలంతో ఉన్న పెద్ద కుండ ఎలా దొర్లిందో తెలియదు కానీ, అదంతా అమ్మ మీద పడింది. ఆమె హాస్పిటల్‌లో మరణించింది. మేము దుఃఖంతో కృంగిపోయాం. నాన్నగారు నెమ్మదిగా దుఃఖం నుండి కోలుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకు పక్క గ్రామంలోని టాట్యాన అనే సాక్షిని పెళ్ళి చేసుకున్నారు.

మన పరిచర్యను విస్తరింపజేయడం

1958లో లిడియా, నేనూ ఉంటున్న కీజక్‌ గ్రామం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న అంతకంటే పెద్ద గ్రామమైన లెబియాయికి వెళ్ళాం. ఇతర ప్రాంతాల్లోని క్రైస్తవులు ఇంటింటికి వెళ్ళి ప్రకటిస్తున్నారని మేము చదివాం. కాబట్టి మేము చేరుకున్న ఆ కొత్త ప్రాంతంలో అలాగే ప్రకటించడానికి ప్రయత్నించాం. కావలికోట, తేజరిల్లు! పత్రికలను నిషేధించినా మాకు వేరే ప్రాంతాల నుండి రహస్యంగా వచ్చేవి. అయితే ఇప్పుడు మాకు రష్యన్‌ భాషలోనే అందుతాయని సమాచారం అందింది. అప్పటి వరకు మాకు మాల్దేవియన్‌ భాషలో కూడా అందేవి. దాంతో మేము రష్యన్‌ భాష బాగా తెలుసుకోవడానికి తీవ్రంగా అధ్యయనం చేశాం. ఇప్పటికీ నాకు ఆనాటి ఆర్టికల్‌ శీర్షికలే కాదు వాటిలోని కొన్ని అంశాలు కూడా గుర్తున్నాయి.

మా జీవనోపాధి కోసం లిడియా ఒక గోదాములో పని చేసేది, నేను బండ్లలో నుండి కట్టెలు దించేవాడిని. పనేమో చాలా అలసట కలిగించేదిగా ఉండేది, వేతనమేమో చాలా తక్కువగా ఉండేది. సాక్షులు కష్టపడి పనిచేసేవారిగా పరిగణించబడినా, మాకు పెన్షన్లు కానీ పారితోషికాలు కానీ ఇచ్చేవారు కాదు. అధికారులు సూటిగా ఇలా అన్నారు: “యెహోవాసాక్షులకు కమ్యూనిస్టు సమాజంలో స్థానం లేదు.” అయినా, “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని యేసు తన అనుచరుల గురించి అన్న మాటలు మా విషయంలో నిజమైనందుకు సంతోషించాం.​—యోహాను 17:16.

కొత్త సవాళ్ళు

మాకు 1959లో వాలెంటీనా జన్మించింది. ఆ తర్వాత కొద్దికాలానికే, ఒక కొత్త హింసాకాండ చెలరేగింది. దాని గురించి ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “1959-64లో ప్రధాన మంత్రి నికిట ఖ్రుష్కేవ్‌ మతానికి విరుద్ధంగా ఒక కొత్త ఉద్యమాన్ని ఆరంభించారు.” మతాలన్నిటినీ, ప్రత్యేకించి యెహోవాసాక్షులను నిర్మూలం చేయాలన్నదే సోవియట్‌ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రక్షణ శాఖ సభ్యులు మాతో చెప్పారు.

వాలెంటీనాకు సంవత్సరం నిండుతుందనగా, నాకు ఆర్మీ నుండి పిలుపు వచ్చింది. నేను వెళ్ళకుండా తటస్థంగా ఉన్నందుకు, నాకు అయిదేళ్ళ కారాగార శిక్ష విధించారు. ఒకసారి లిడియా నన్ను చూడడానికి వచ్చినప్పుడు, కెజిబి కర్నల్‌ ఒకాయన ఆమెతో ఇలా అన్నాడు: “మాకు క్రెమ్లిన్‌ (రష్యా ప్రభుత్వం) నుండి సమాచారం అందింది, రెండు సంవత్సరాల్లో సోవియట్‌ యూనియన్‌లో యెహోవాసాక్షుల్లో ఒక్కరు కూడా మిగలరు.” అలా అన్న తర్వాత అతను ఇలా హెచ్చరించాడు: “నువ్వు నీ విశ్వాసాన్ని వదిలిపెట్టు, లేకపోతే జైల్లో ఉంటావు.” ఆడవాళ్ళని “అబలలు” అని భావించే అతను, ఆ బెదిరింపులు వాళ్ళ నోరు మూయిస్తాయి అనుకున్నాడు.

ఆ తర్వాత కొద్ది కాలానికే సాక్షుల్లోని చాలామంది మగవాళ్ళు జైళ్ళలోను, లేబర్‌ క్యాంపుల్లోను నిండిపోయారు. అయినప్పటికీ ధైర్యవంతులైన క్రైస్తవ స్త్రీలు ప్రకటనా పనిలో కొనసాగారు. వాళ్ళు మరింత సాహసించి జైళ్ళలో, లేబర్‌ క్యాంపుల్లో ఉన్నవారికి సాహిత్యాలను రహస్యంగా అందజేశారు. అలాంటి పరీక్షలనే కాక, నేను లేని పరిస్థితిని అలుసుగా తీసుకొని లబ్ది పొందాలన్న దురుద్దేశంతో మగవాళ్ళు చూపించిన అవాంఛనీయమైన ఆసక్తిని కూడా లిడియా ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాక నేను ఎన్నటికీ విడుదల కాను అని వాళ్ళు ఆమెతో చెప్పారు. కానీ నేను విడుదలయ్యాను!

విడుదలై కజక్‌స్థాన్‌కు మారడం

1963లో నా కేసును మళ్ళీ పరిశీలించి, మూడు సంవత్సరాలు జైల్లో గడిపిన తర్వాత, నన్ను విడుదల చేశారు. అయితే మేము నివసించడానికి ఎక్కడా అనుమతి లభించక పోవడంతో, నాకు పని దొరకడం కష్టమైంది. ప్రభుత్వం ఒక నియమాన్ని జారీ చేసింది: “శాశ్వత నివాసం లేనివారికి పని లేదు.” మేము సహాయం కోసం యెహోవాను తీవ్రంగా వేడుకున్నాం. ఆ తర్వాత మేము కజక్‌స్థాన్‌కు ఉత్తరాన ఉన్న పిట్‌రెపల్‌కి మారాలని నిర్ణయించుకున్నాం. అయితే స్థానిక అధికారులకు అప్పటికే మా గురించి సమాచారం అందడంతో వారు, మమ్మల్ని అక్కడ ఉండడానికి కానీ పని చేయడానికి కానీ అనుమతించలేదు. ఆ నగరంలో ఉన్న దాదాపు 50 మంది సాక్షులు అలాంటి వేధింపులకే గురయ్యారు.

మేము మరొక సాక్షుల జంటతో కలిసి దక్షిణం వైపుకు మరింత దూరాన ఉన్న స్కూషింఖ్‌ అనే చిన్న పట్టణానికి మారాం. అక్కడ సాక్షులు ఎవరూ లేరు, అధికారులకు మన ప్రకటనా పని గురించి కూడా ఏమీ తెలియదు. భర్తలమిద్దరం అంటే నేనూ, నాతో వచ్చిన సహోదరుడు ఐవన్‌, మా భార్యలను రైల్వే స్టేషన్‌లో వదిలి పని కోసం వారం రోజులు గాలించాం, అప్పుడు మేము రాత్రుళ్ళు స్టేషన్లోనే పడుకున్నాం. చివరకు ఒక గ్లాసు ఫ్యాక్టరీలో మాకు పని దొరికింది. మేము ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాం, అందులో రెండు మంచాలు వేస్తే కాస్తంత ఖాళీ స్థలం ఉండేది, అయినా మేము తృప్తిగా ఉన్నాం.

ఐవన్‌, నేను నిజాయితీగా పనిచేశాం, దానికి మా యజమానులు చాలా సంతోషించారు. మిలటరీలో పని చేయడానికి నాకు మళ్ళీ పిలుపు వచ్చే సమయానికి, మా ఫ్యాక్టరీ మేనేజరు, నా బైబిలు శిక్షిత మనస్సాక్షి నేను మిలటరీలో శిక్షణ పొందడానికి అనుమతించదని తెలుసుకున్నాడు. ఆశ్చర్యకరంగా, ఆయన మిలటరీ పైఅధికారిని కలుసుకొని ఐవన్‌, నేనూ నైపుణ్యతగల పనివాళ్ళమనీ మేము లేకుండా ఫ్యాక్టరీ నడపడం అసాధ్యమనీ విన్నవించుకున్నాడు. దాంతో మేము అక్కడే ఉండేందుకు అనుమతి లభించింది.

పిల్లలను పెంచడం, ఇతరులకు సేవ చేయడం

1966లో మా రెండవ అమ్మాయి లీల్యా పుట్టింది. ఆ తర్వాత సంవత్సరానికి మేము కజక్‌స్థాన్‌కు దక్షిణాన, ఉజ్‌బెకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న బీలియెవొడికి మారాం, అక్కడ సాక్షుల చిన్న గుంపు ఒకటి ఉంది. త్వరలోనే ఒక సంఘం ఏర్పడింది, నేను పైవిచారణకర్తగా నియమించబడ్డాను. 1969లో మాకు ఒల్యెక్‌ పుట్టాడు, ఆ తర్వాత రెండు సంవత్సరాలకు అందరికంటే చిన్నమ్మాయి నటాషా పుట్టింది. పిల్లలు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం అనే విషయం లిడియా, నేనూ ఎన్నడూ మరవలేదు. (కీర్తన 127:3) పిల్లలు యెహోవాను ప్రేమించే విధంగా పెంచడానికి ఏమి చేయాలో మేమిద్దరం చర్చించుకున్నాం.

1970లలో కూడా సాక్షుల్లో చాలామంది మగవాళ్ళు ఇంకా లేబర్‌ క్యాంపుల్లోనే ఉన్నారు. అనేక సంఘాల్లో పరిణతిగల పర్యవేక్షణ, మార్గదర్శకం అవసరముంది. అందుకే లిడియా పిల్లల్ని పెంచడంలో అప్పుడప్పుడు తల్లీ తండ్రీ తానే అవుతూ పెద్ద పాత్ర పోషిస్తుండగా, నేను ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేశాను. నేను కజక్‌స్థాన్‌లోని సంఘాలతోపాటు, పొరుగునున్న సోవియట్‌ రిపబ్లిక్‌లైన తజకిస్థాన్‌, టర్క్‌మేనిస్థాన్‌, ఉజ్‌బెకిస్థాన్‌లలోని సంఘాలను కూడా సందర్శించాను. అదే సమయంలో నేను నా కుటుంబాన్ని పోషించడానికి పని కూడా చేశాను. లిడియా, పిల్లలు ఇష్టపూర్వకంగా నాకు సహకరించారు.

నేను కొన్నిసార్లు వారాల తరబడి ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ, పిల్లలకు అవసరమైన తండ్రి ప్రేమను చూపించడానికీ వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడానికీ ప్రయత్నించాను. లిడియా, నేను కలిసి మా పిల్లలకు సహాయం చేయమని యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాం. మనుష్య భయాన్ని అధిగమించి దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలో వారితో చర్చించాం. నా ప్రియమైన భార్య ఇచ్చిన నిస్వార్థ మద్దతు లేకపోతే నేను ప్రయాణ పైవిచారణకర్తగా నా విధులను నిర్వహించగలిగేవాడినే కాదు. ఆ ఆర్మీ ఆఫీసరు అన్నట్లు లిడియా, మన ఇతర సహోదరీలు “అబలలు” ఎంత మాత్రం కాదు. వారు బలవంతులు, నిజానికి ఆధ్యాత్మికంగా మహాశక్తిసంపన్నులు!​—ఫిలిప్పీయులు 4:13.

నేను 1988లో క్రమ ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాను, అప్పటికి మా పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. నా సర్క్యూట్‌లో మధ్య ఆసియాలోని అనేక దేశాలు ఉన్నాయి. 1991లో పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో యెహోవాసాక్షుల ప్రకటనా పని చట్టబద్ధంగా రిజిష్టర్‌ అయిన తర్వాత, సమర్థులూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వారూ అయిన ఇతర సహోదరులు పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోని ఆసియన్‌ రిపబ్లిక్‌లలో సేవ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ దేశాల్లో 14 మంది ప్రయాణ పైవిచారణకర్తలుగా సేవ చేస్తున్నారు. గత సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 50,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు!

ఊహించని ఆహ్వానం

1998 ఆరంభంలో, రష్యాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి ఊహించని రీతిలో నాకొక ఫోన్‌ కాల్‌ వచ్చింది. “అనాటోలీ, మీరూ లిడియా ఎప్పుడైనా పూర్తికాల సేవ గురించి ఆలోచించారా?” అని నన్ను అడిగారు. మేము అలాంటి మహత్తర అవకాశం మా పిల్లలకు దొరకాలని ఆలోచించిన మాట నిజమే. వాస్తవానికి మా అబ్బాయి ఒల్యెక్‌, రష్యా బ్రాంచి కార్యాలయంలో అప్పటికి అయిదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు.

మాకు వచ్చిన ఆహ్వానం గురించి నేను లిడియాతో చెప్పినప్పుడు, ఆమె ఇలా అడిగింది: “మన ఇల్లూ, మన తోటా, మన వస్తువులూ ఎలా?” మేము ప్రార్థనాపూర్వకంగా చర్చించుకున్న తర్వాత, వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కొంతకాలం తర్వాత ఆల్మ-ఆట అనే పెద్ద పట్టణానికి దగ్గరగా, కజక్‌స్థాన్‌లో ఉన్న ఇసక్‌లోని యెహోవాసాక్షుల మత కేంద్రం (రెలిజియస్‌ సెంటర్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌)లో సేవ చేయడానికి ఆహ్వానం అందింది. అక్కడ ఆ ప్రాంతమంతా మాట్లాడే స్థానిక భాషల్లో మన బైబిలు సాహిత్యాల అనువాదం జరుగుతుంది.

నేడు మా కుటుంబం

మా పిల్లలకు బైబిలు సత్యాన్ని నేర్పించడానికి అవసరమైన సహాయాన్ని అనుగ్రహించినందుకు మేము యెహోవాకు ఎంతో కృతజ్ఞులం! మా పెద్దమ్మాయి వాలెంటీనా పెళ్ళి చేసుకొని 1993లో తన భర్తతో జర్మనీలోని ఇంగెల్‌హీమ్‌కు వెళ్ళింది. వారికి ముగ్గురు పిల్లలు, అందరూ బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షులే.

మా రెండో అమ్మాయి లీల్యాకు కూడా వివాహమైంది. ఆమె, బీలియెవొడి సంఘంలో ఒక పెద్ద అయిన ఆమె భర్తా, తమ ఇద్దరు పిల్లలను దేవుణ్ణి ప్రేమించేలా పెంచుతున్నారు. ఒల్యెక్‌, మాస్కోకు చెందిన ఒక క్రైస్తవ సహోదరి నటాషాను పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న రష్యా బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నారు. 1995లో మా చిన్నమ్మాయి నటాషా పెళ్ళి చేసుకుంది. ఆమె, ఆమె భర్త జర్మనీలోని ఒక రష్యన్‌ సంఘంలో సేవ చేస్తున్నారు.

మా కుటుంబం అంతా అప్పుడప్పుడు కలుసుకుంటుంది. మా పిల్లలు వాళ్ళ పిల్లలతో, తమ “అమ్మా,” “నాన్నా” యెహోవా మాటలు ఎలా పాటించారో, సత్య దేవుడైన యెహోవాను ప్రేమించేలా సేవ చేసేలా తమ పిల్లలను ఎలా పెంచారో చెబుతుంటారు. ఆ చర్చలు మా మనుమలు, మనుమరాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడుతుండడాన్ని నేను చూస్తున్నాను. అందరికన్నా చిన్న మనమడు నేను ఆ వయసులో ఎలా ఉండేవాడినో అచ్చం అలాగే ఉంటాడు. కొన్నిసార్లు నా ఒడిలో కూర్చొని బైబిలు కథ చెప్పమని నన్ను అడుగుతుంటాడు. అప్పుడు, నేను మా తాతయ్య ఒడిలో తరచూ ఎలా కూర్చునేవాడినో, ఆయన నాకు మన మహా సృష్టికర్తను ప్రేమించడానికీ సేవించడానికీ ఎలా సహాయం చేశాడో ఎంతో ప్రియంగా స్మృతిలో మెదిలి నా కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతాయి. (g04 10/22)

[అధస్సూచి]

^ ఈ ఆర్టికల్‌లో ఈ దేశానికి గతంలో ఉన్న మాల్దేవియా లేక సోవియట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్దేవియా అనే పేర్లు కాక ప్రస్తుతం పిలువబడుతున్న మాల్డోవా అన్న పేరే ఉపయోగించబడింది.

[11వ పేజీలోని చిత్రం]

మా తల్లిదండ్రులతో మా ఇంటి బయట, మా నాన్నగారు చెరసాలకు వెళ్ళడానికి కాస్త ముందు

[12వ పేజీలోని చిత్రం]

లిడియాతో 1959లో, అప్పటికి ఇంకా బహిష్కరణలోనే ఉన్నాం

[13వ పేజీలోని చిత్రం]

మా అమ్మాయి  లెంటీనాతో లిడియా, నేను జైల్లో ఉన్నప్పుడు

[15వ పేజీలోని చిత్రం]

లిడియాతో ఇప్పుడు

[15వ పేజీలోని చిత్రం]

మా పిల్లలూ మనుమలూ మనుమరాళ్ళతో, అందరూ యెహోవాను సేవిస్తున్నారు!