దేవుని క్రమశిక్షణలో పిల్లలను పెంచడం
బైబిలు ఉద్దేశం
దేవుని క్రమశిక్షణలో పిల్లలను పెంచడం
“మీ పిల్లలు అతిక్రమించకూడని నియమాలు ఏర్పరిచే విధానం”
“మీ బిడ్డకు ఐదేండ్లు వచ్చేసరికి నేర్పించాల్సిన ఐదు సూత్రాలు”
“ప్రతి పిల్లవానిలో ఉండాల్సిన ఐదు మానసిక నైపుణ్యతలు”
“మీరు అతిగారాబం చేస్తున్నారని తెలిపే ఐదు సంకేతాలు”
“నిమిషంలో క్రమశిక్షణ మంత్రం”
పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడం సులభమే అయితే పైన పేర్కొన్నటువంటి, పత్రికల్లోని వ్యాసాల మీద అంత ఆసక్తి కలుగదు. పిల్లల పెంపకంపై వ్రాయబడిన పుస్తకాల వెల్లువ ఆగిపోతుంది. అయితే పిల్లల పెంపకం ఎన్నడూ సులభంగాలేదు. వేల సంవత్సరాల క్రితం కూడా “బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును” అని చెప్పబడింది.—సామెతలు 17:25.
నేడు ఈ విషయంపై విస్తృతమైన సమాచారం ఉన్నప్పటికీ, అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలో సరిగ్గా తెలియని స్థితిలో ఉన్నారు. దీనికి బైబిలు ఎలాంటి సహాయం అందిస్తోంది?
క్రమశిక్షణకు అసలైన భావం
క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రుల పాత్ర గురించి బైబిలు స్పష్టంగా తెలుపుతోంది. ఉదాహరణకు ఎఫెసీయులు 6:4 ఇలా చెబుతోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” ఈ లేఖనం, పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడంలో ప్రత్యేకంగా ముందుండాల్సిన వ్యక్తి తండ్రి అని తెలియజేస్తోంది. తల్లి కూడా తన భర్తతో సహకరిస్తుంది.
ఈ విషయంపై ది ఇంటర్‌ప్రెటర్స్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “బైబిలులో, క్రమశిక్షణకు ఒక వైపు శిక్షణ, బోధన, పరిజ్ఞానాలతోను మరో వైపున మందలింపు, దిద్దుబాటు, శిక్షలతోను సన్నిహిత సంబంధం ఉంది. సాధారణంగా అది పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి అన్వయించబడుతుంది.” కాబట్టి, క్రమశిక్షణ అంటే చీవాట్లు పెట్టడం మాత్రమే కాదు; పిల్లలు అభివృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణంతా అందులో ఉంది. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపకుండా ఎలా ఉండవచ్చు?
తదనుభూతి గలవారిగా ఉండండి
పిల్లలకు కోపం రేపేది ఏమిటి? ఈ పరిస్థితి గురించి ఆలోచించండి. మీతో పనిచేసే ఒక వ్యక్తికి ఉద్రేకం ఎక్కువ, సహనం తక్కువ. మీరు ఏమి చేసినా అది అతనికి సంతోషం కలిగించదు. అతను మీరు చేసే పనిలో, అనే మాటలో ప్రతి దాంట్లో తప్పు పట్టుకోవాలని చూస్తున్నట్లు ఉంటాడు. తరచూ మీ పనికి వంకలు పెడుతూ మీరు తృణీకరించబడినవారని భావించేలా చేస్తుంటాడు. అలాంటి పరిస్థితి మీకు కోపం రేపి మీ మనసును కృంగదీయదా?
తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ తిట్టినా కోపంతో సరిదిద్దినా అలాగే జరిగే అవకాశముంది. పిల్లలను అప్పుడప్పుడు సరిదిద్దాల్సిన అవసరముంది, బైబిలు ఆ అధికారం తల్లిదండ్రులకు ఇస్తోందన్నది నిజమే. అయితే కఠినంగా, ప్రేమరహితంగా వ్యవహరించడం ద్వారా పిల్లలకు కోపం రేపితే అది వారికి మానసికంగా, ఆధ్యాత్మికంగానే కాక శారీరకంగా కూడా హాని కలిగించవచ్చు.
మీ పిల్లలు మీ శ్రద్ధకు అర్హులు
తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడపాలి. దేవుని నియమాల గురించి ద్వితీయోపదేశకాండము 6:7 తండ్రులకు ఇలా చెబుతోంది: “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” తమ తల్లిదండ్రులు తమను చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారని పిల్లలకు తెలియాలి, ఆ అవసరత వారికి పుట్టుకతోనే ఉంటుంది. మీ పిల్లలతో ప్రతి రోజూ ప్రశాంతంగా సంభాషించడం వారి భావాలను అర్థం చేసుకోవడానికి మీకు దోహదపడుతుంది. ఇది, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచు”కునేలా వారిని పురికొల్పుతూ బైబిలు ఆధారిత సూత్రాలతో వారి హృదయాలను చేరడాన్ని సులభం చేస్తుంది. (ప్రసంగి 12:13) ఇది దైవిక క్రమశిక్షణలో భాగం.
పిల్లల పెంపకాన్ని ఒక ఇంటిని కట్టడంతో పోల్చినట్లయితే, క్రమశిక్షణ ఆ ఇంటి నిర్మాణ పరికరాల్లో ఒకటిగా ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు, తమ పిల్లల్లో అభిలషణీయమైన లక్షణాలను వృద్ధి చేయడమేకాక, జీవిత పరీక్షలను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయగలుగుతారు. దాని ఫలితాన్ని సామెతలు 23:24, 25 ఇలా వర్ణిస్తోంది: “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.” (g04 11/8)
[21వ పేజీలోని బాక్సు/చిత్రం]
‘యెహోవా బోధ’
ఎఫెసీయులు 6:4 “ప్రభువు బోధ” అంటే ‘యెహోవా బోధ’ గురించి చెబుతోంది. ఇక్కడ “బోధ” అని అనువదించబడిన గ్రీకు మూలపదం కొన్ని బైబిళ్ళలో “ఆలోచన కలిగివుండడం,” “హితవు,” “ఉద్బోధ” అని అనువదించబడింది. కుటుంబాలు బైబిలును కేవలం చదవడం లేదా బైబిలు అధ్యయానికి సహాయపడే ఒక పుస్తకంలోని సమాచారాన్ని లాంఛనప్రాయంగా చదివేయడం మాత్రమే సరిపోదని ఆ మాటలన్నీ సూచిస్తున్నాయి. తమ పిల్లలు దేవుని వాక్య భావాన్నీ, విధేయత ప్రాముఖ్యతనూ, యెహోవాకు వారిపట్ల ఉన్న ప్రేమనూ, వారి కోసం ఆయన అందించే రక్షణనూ అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలి.
దీన్ని ఎలా సాధించవచ్చు? జూడీ అనే ముగ్గురు పిల్లల తల్లి, తన పిల్లలకు దేవుని సూత్రాలను నిరంతరం జ్ఞాపకం చేయడం మాత్రమే సరిపోదని గ్రహించింది. “నేను వారికి చెప్పిన విషయాలనే ఒకే పద్ధతిలో పదే పదే చెప్పడాన్ని వారు ఇష్టపడడం లేదని గమనించాను. నేను వారికి బోధించడం కోసం వివిధ మార్గాలను వెదకడం ప్రారంభించాను. ఒక మార్గం ఏమిటంటే నా పిల్లలకు అవసరమైన అంశాలను కొత్త కోణంలో అందజేసిన తేజరిల్లు! పత్రికలోని ఆర్టికల్‌లను చూడడం. ఆ విధంగా నేను పిల్లలకు అవసరమైన విషయాలను వారికి కోపం రేపకుండా ఎలా గుర్తుచేయాలో నేర్చుకున్నాను.”
ఏంజెలో అనే వ్యక్తి కుటుంబం చాలా కష్టాలకు గురైంది, ఆయన తన కూతుర్లకు దేవుని వాక్యం ధ్యానించడాన్ని ఏ విధంగా బోధించాడో ఇలా చెబుతున్నాడు: “మేము బైబిలు వచనాలు కలిసి చదువుతాం, తర్వాత నేను అందులోని కొన్ని పదబంధాలను తీసుకొని అవి నా కూతుర్లున్న పరిస్థితులకు ఎలా వర్తిస్తాయో వివరిస్తాను. కొన్నాళ్ళకు, వారు స్వయంగా బైబిలు చదివేటప్పుడు అందులోని విషయాలు తమకు ఎలాంటి భావం ఇస్తున్నాయో ధ్యానిస్తూ దీర్ఘంగా ఆలోచించడాన్ని గమనించాను.”