కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

మెదడుకు భారమా?

“ఒకేసారి అనేక పనులు చేస్తే మెదడుకు కష్టంగా ఉంటుంది” అని కొందరు పరిశోధకులు అంటున్నారని కెనడాకు చెందిన టొరంటో స్టార్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. ఒకేసారి అనేక పనులు చేయడంవల్ల నాణ్యత లోపం, పొరపాట్లు ఉండడమే కాక అది అనారోగ్యానికి కూడా కారణం అవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ఒకేసారి అనేక పనులను చేయడం “జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది, నడుము నొప్పి కలిగిస్తుంది, ఫ్లూకు, అజీర్ణానికి గురిచేయగలదు, చివరకు దంతాలకు, చిగుర్లకు కూడా హాని చేస్తుంది.” అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన అధ్యయనాలు, ప్రజలు నిర్దిష్ట పనులను చేసేటప్పుడు వారి మెదడులోని వివిధ భాగాలు పని చేస్తాయని చూపిస్తున్నాయి. అయితే వారు రెండు లేక ఎక్కువ పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నించినప్పుడు, అంటే కారు డ్రైవింగు చేస్తూ సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, “వాస్తవానికి మెదడు పని మానేయడం ప్రారంభిస్తుంది. మెదడు ఆ పనిని చేయలేకపోవడం మాత్రమే కాదు, చేయనని మొరాయిస్తుంది కూడా” అని ఎమరీ యూనివర్శిటీకి చెందిన ఒక న్యూరాలజిస్ట్‌ డా. జాన్‌ స్లాడ్కీ అంటున్నాడు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు తమ మెదడుకు చెబుతున్న పనులన్నిటినీ అది చేయలేదని అంగీకరించి తమ వేగాన్ని తగ్గించుకోవాలి. (g04 10/22)

అత్యధిక సంఖ్యలో అనువదించబడిన పుస్తకం

బైబిలు, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనువదించబడిన పుస్తకంగా కొనసాగుతోంది. ఉనికిలో ఉన్న దాదాపు 6,500 భాషల్లో, పూర్తి బైబిలు లేదా దానిలో కొంత భాగం 2,355 భాషల్లో లభ్యమవుతోంది. బైబిలు ఇప్పుడు ఆఫ్రికాలో 665 భాషల్లో, ఆసియాలో 585 భాషల్లో, ఓషియేనియాలో 414 భాషల్లో, లాటిన్‌ అమెరికా మరియు కరీబియన్‌లలో 404 భాషల్లో, యూరప్‌లో 209 భాషల్లో, ఉత్తర అమెరికాలో 75 భాషల్లో లభ్యమవుతోంది. అంతేగాక యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీలు ప్రస్తుతం దాదాపు 600 భాషల్లో బైబిలు అనువాదాల ప్రాజెక్టులకు సహాయం చేస్తున్నాయి. (g04 12/8)

టీవీ పసిపిల్లలకు హానికరమా?

“టీవీ చూసే పసిపిల్లలకు బడికి వెళ్ళే వయసు వచ్చేసరికి వారిలో ఏకాగ్రత లోపం వల్ల ఎదురయ్యే సమస్యలు అధికమయ్యే ప్రమాదముంది” అని మెక్సికో నగరానికి చెందిన ద హెరాల్డ్‌ నివేదించింది. ఆ నివేదిక, పీడియాట్రిక్స్‌ అనే వైద్య పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనాన్ని ఉటంకించింది. అది మొత్తం 1,345 మంది పిల్లలున్న రెండు వర్గాలపై జరిపిన అధ్యయనం, ఒక వర్గం ఏడాది వయసు గలవారిది, మరొకటి మూడేండ్ల వయసు గలవారిది. ఆ అధ్యయనం ప్రకారం, పిల్లలు ఒక రోజులో టీవీ ముందు గడిపే ప్రతి గంట, వారు ఏడవ ఏట ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొనే ప్రమాదాన్ని 10 శాతం పెంచింది. “టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనబడే, అవాస్తవిక రీతిలో వేగంగా కదిలే రూపాలు పసిపిల్లల మెదడు ఎదుగుదలను ప్రభావితం చేసే అవకాశముంది” అని పరిశోధకులు నమ్ముతున్నారు. “పిల్లలు టెలివిజన్‌ చూడకూడదు అనేందుకు అనేక కారణాలున్నాయన్నది నిజం” అని ఆ అధ్యయనం చేసిన డాక్టర్‌ దిమిత్రి క్రిస్టాకిస్‌ అన్నారు. “[టీవీ చూడడం] లావెక్కడానికి, వైరిభావం పెంపొందడానికి కూడా కారణమవుతుందని ఇతర అధ్యయనాలు వెల్లడి చేశాయి.” (g04 12/22)

నవ్వు మంచి మందు

“స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలోని న్యూరాలజిస్టులు, నవ్వు మనలో మంచి అనుభూతిని కలిగించడానికిగల మరో కారణాన్ని కనుగొన్నారు” అని యూసి బర్క్‌లీ వెల్‌నెస్‌ లెటర్‌ నివేదిస్తోంది. “వారు హాస్యభరిత కార్టూన్లను చదివే ప్రజల మెదడు పనిచేసే విధానాన్ని గమనించి హాస్యం, నవ్వు మెదడులోని ‘ప్రేరణ పొందే కణాలుగల కేంద్రాలను’ ఉత్తేజపరుస్తున్నాయని కనుగొన్నారు,” అవే కేంద్రాలు ఉత్ప్రేరకాలకు ప్రభావితం అవుతాయి. “నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసును శాంతింపజేస్తుంది, భావ ప్రేరణ కలిగిస్తుంది” అని వెల్‌నెస్‌ లెటర్‌ చెబుతోంది. నవ్వు మన హార్మోన్ల ఉత్పత్తినీ, గుండె వేగాన్నీ పెంచుతుంది కూడా. తద్వారా అది రక్త ప్రసరణ బాగా జరిగేలా, కండరాలు చక్కగా పని చేసేలా దోహదపడుతుంది. “నిజానికి హృదయపూర్వకంగా నవ్వే నవ్వు వ్యాయామం వంటిది అయితే అది ఎన్నో క్యాలరీలను దహించేదేమీ కాదు. మీరు నవ్వీ నవ్వీ పిచ్చివాళ్ళైపోవచ్చు గానీ నవ్వి సన్నబడడం మాత్రం సాధ్యం కాదు” అని వెల్‌నెస్‌ లెటర్‌ చెబుతోంది. (g04 12/22)