కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బొల్లి అంటే ఏమిటి?

బొల్లి అంటే ఏమిటి?

బొల్లి అంటే ఏమిటి?

దక్షిణ ఆఫ్రికాలోని తేజరిల్లు! రచయిత

◼ సిబొంగీల్‌ కొన్నిసార్లు తన చర్మ స్థితి గురించి తమాషాగా మాట్లాడుతుంది. “నేను నీగ్రో జాతీయురాలిని, తర్వాత తెల్లగా అయ్యాను, ఇప్పుడు నేను ఏ జాతీయురాలినో నాకే అర్థం కావడం లేదు” అని ఆమె నవ్వుకుంటూ చెబుతుంది. ఆమెకు బొల్లి ఉంది.

తెల్లమచ్చలు అని కూడా పిలువబడే బొల్లి, చర్మానికి రంగునిచ్చే పదార్థాన్ని ఉత్పత్తి చేసే కణాలు నశించిపోవడం మూలంగా వస్తుంది. తత్ఫలితంగా చర్మం మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. కొందరు రోగుల్లో ఒకే ఒక మచ్చ వచ్చి, అంతటితో ఆ జబ్బు నిలిచిపోతుంది. కానీ మరి కొందరిలో అది త్వరగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఇంకా కొందరిలో అది సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా వ్యాపిస్తుంది. బొల్లి శారీరకంగా బాధ కలిగించేదీ కాదు, అంటువ్యాధీ కాదు.

సిబొంగీల్‌లో కనబడినట్లు బొల్లి ఉన్న అందరిలోనూ అది స్పష్టంగా కనబడకపోవచ్చు, ఎందుకంటే చర్మం నల్లగా ఉన్నవారిలో అది ప్రస్ఫుటంగా కనబడుతుంది. కానీ దానికి కాస్తో కూస్తో గురైనవారు చాలామంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఒకటి నుండి రెండు శాతం వరకు దాని ప్రభావానికి గురయ్యారని గణాంకాలు తెలుపుతున్నాయి. బొల్లికి జాతీయ హద్దులంటూ ఏమీ లేవు, ఇది స్త్రీలకూ పురుషులకూ అందరికీ వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో ఇంతవరకు తెలియదు.

బొల్లికి ఖచ్చితమైన చికిత్స అంటూ ఏమీ లేకున్నా, దానితో వ్యవహరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, చర్మం లేతవర్ణంలో ఉన్న రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న చర్మం ఎండకు గోధుమ రంగులోకి మారినప్పుడు పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎండ ఎక్కువ తగలకుండా చూసుకుంటే పరిస్థితి అంతగా కనబడేలా ఉండదు. చర్మం ముదురు వర్ణంలో ఉన్నవారికి, తమ చర్మంలోని వర్ణభేదాన్ని కనబడకుండా చేయడానికి అలంకరణ ద్రవ్యాలు సహాయపడవచ్చు. కొందరు రోగులు రీపిగ్మెంటేషన్‌ అనే ప్రక్రియకు సానుకూలంగా స్పందించారు. ఈ చికిత్సలో అనేక నెలలపాటు మందులు తీసుకోవడమేకాక, అతినీలలోహిత కిరణాల ప్రత్యేక ఉపకరణాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా కొందరిలో బొల్లికి గురైన భాగంలోని చర్మం తిరిగి మామూలు వర్ణంలోకి వచ్చింది. మరికొందరు రోగులు డీపిగ్మెంటేషన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ చికిత్స లక్ష్యం ఏమిటంటే మందుల ద్వారా శరీరంలోని రంగునిచ్చే కణాలను నశింపజేయడం ద్వారా చర్మ వర్ణాన్ని సమతుల్యం చేసుకోవడం.

బొల్లి సోకినవారు ప్రత్యేకించి ముఖం మీద సోకినవారు మానసిక కృంగుదలకు గురవుతారు. సిబొంగీల్‌ ఇలా వివరిస్తోంది: “ఇటీవలే, ఇద్దరు పిల్లలు నన్ను చూసి కెవ్వున అరచుకుంటూ పారిపోయారు. కొందరు నాకున్నది అంటువ్యాధి కావచ్చని లేదా నేను శాపగ్రస్తురాలనని భావించి నాతో మాట్లాడడానికి సంకోచిస్తారు. అలాంటి వారికి నేను చెప్పదలచుకున్న ఒకే విషయం ఏమిటంటే, వారు బొల్లి ఉన్నవారికి భయపడాల్సిన అవసరం లేదు. బొల్లి ముట్టుకోవడం ద్వారా గానీ గాలి ద్వారా గానీ సోకే వ్యాధి కాదు.”

సిబొంగీల్‌ తన పరిస్థితి, ఒక యెహోవాసాక్షిగా తాను ఎంతో ఇష్టపడే పనికి, అంటే బైబిలు బోధించే పనికి ఆటంకం కలిగించడానికి ఎంతమాత్రం అనుమతించదు. అలా బైబిలు బోధించడానికి ఆమె ప్రజలను వారి ఇండ్లలో కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడవలసి ఉంటుంది. ఆమె ఇలా అంటోంది: “నేను నా రూపం విషయంలో సర్దుకుపోవడం నేర్చుకున్నాను. నేను ఇప్పుడిక నా రూపాన్ని చూసుకుని చింతించడం లేదు, యెహోవా దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసులో నేను పూర్తిగా కోలుకొని మళ్ళీ నా మొదటి రంగుకు వచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నాను.” ​—ప్రకటన 21:3-5. (g04 9/22)

[22వ పేజీలోని చిత్రం]

బొల్లి సోకకముందు, 1967లో