మీ పిల్లలను పెంచడంలో ఉన్న ప్రాధాన్యత
మీ పిల్లలను పెంచడంలో ఉన్న ప్రాధాన్యత
ఒక వ్యక్తి తన బాల్యంలో నేర్చుకున్నది లేక నేర్చుకోనిది అతని భావి సామర్థ్యాలను ప్రభావితం చేయగలదు. అలాంటప్పుడు పిల్లలు సమతుల్యతగల, విజయవంతమైన వ్యక్తులుగా ఎదగడానికి వారి తల్లిదండ్రుల నుండి వారికి ఏమి అవసరం? ఇటీవలి దశాబ్దాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిశీలించండి.
నాడీ కేంద్రకాల పాత్ర
సజీవ మానవ మెదడు చేస్తున్న పనులను యథాతథంగా తెలుసుకునే సాంకేతిక విజ్ఞానంలో (బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీలో) జరిగిన అభివృద్ధి, మెదడు ఎదుగుదలను ఇంతకుముందు కంటే మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు శాస్త్రజ్ఞులకు సహాయపడుతోంది. సమాచారాన్ని గ్రహించడానికీ, భావోద్వేగాలను సహజంగా వ్యక్తం చేయడానికీ, భాషలో ప్రావీణ్యత సాధించడానికీ అవసరమైన మెదడు విధుల వికాసానికి బాల్యదశ చాలా ముఖ్యమైన సమయమని అలాంటి అధ్యయనాలు సూచిస్తున్నాయి. “మెదడులోని నాడీ కేంద్రకాల మధ్య ఏర్పడే సంధానాలు బాల్యదశలో చాలా వేగంగా ఏర్పడతాయి, అనువంశిక సమాచారం ద్వారా, పరిసరాలవల్ల కలిగే ప్రేరణల ద్వారా అనుక్షణం జరిగే చర్యల మూలంగా మెదడు రూప నిర్మాణం జరుగుతుంది” అని నేషన్ అనే పత్రిక నివేదిస్తోంది.
నాడీ కేంద్రకాలు (ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి నాడీ ప్రచోదనాలు పంపబడే స్థలాలు) అని పిలువబడే ఈ సంధానాలు చాలామట్టుకు పసిప్రాయంలోనే ఏర్పడతాయని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఈ సమయంలోనే “శిశువు భవిష్యత్తులో వృద్ధిచెందే మేధస్సు, స్వయం అవగాహన, నమ్మకం, నేర్చుకోవడానికి ప్రేరణ వంటి వాటిని ప్రభావితం చేసే నాడీకణాల కేంద్రకాలు ఏర్పడతాయి” అని పిల్లల వికాస రంగంలో నిపుణుడైన డాక్టర్ టి. బెర్రీ బ్రెజెల్టన్ అంటున్నారు.
ఒక శిశువు మెదడు పరిమాణం, నిర్మాణం, విధులు పసిప్రాయంలో చాలా వేగంగా పెరుగుతాయి. ప్రేరణ, నేర్చుకునే అవకాశాలు సమృద్ధిగా ఉండే పరిసరాల్లో నాడీ కేంద్రకాలు అధికమవుతాయి, దానితో మెదడులో నాడీకణాల మధ్య సంధానాలు విస్తృతంగా ఏర్పడతాయి. ఈ సంధానాలు ఆలోచించడం, నేర్చుకోవడం, తర్కించడం వంటివి సాధ్యమయ్యేలా చేస్తాయి.
ఒక శిశువు మెదడు ఎంత ఎక్కువగా ప్రేరణ పొందుతుందో అంత ఎక్కువగా నాడీకణాలు క్రియాత్మకమై, వాటి మధ్య సంధానాలు కూడా అంత ఎక్కువగా ఏర్పడతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రేరణ కేవలం మేధా సంబంధమైనది కాదు అంటే శిశువుకు ఎదురయ్యే ఘటనలు, రూపాలు, భాషల వల్ల కలిగేది కాదు. దానికి భావోద్వేగపరమైన ప్రేరణ కూడా అవసరమని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కౌగిలించుకోని, దగ్గరకు తీసుకోని, ఎవ్వరితోను ఆడుకోనీయని, భావోద్వేగ ప్రేరణ పొందని శిశువుల్లో నాడీకణాల మధ్య సంధానాలు చాలా తక్కువగా ఏర్పడతాయని పరిశోధన వెల్లడిస్తోంది.
పెంపకం, సామర్థ్యం
పిల్లలు పెరుగుతుండగా శరీరంలో అనావశ్యకమైన వాటి తొలగింపు వంటిది జరుగుతుంది. దేహం నాడీకణాల మధ్య ఏర్పడిన అనవసరమైన సంధానాలను తొలగిస్తుంది. ఇది పిల్లవాడి సామర్థ్యంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. “ఒక పిల్లవాడు సరైన వయసులో సరైన ప్రేరణ పొందనట్లయితే, అతనిలోని నాడీకణాల కేంద్రకాలు సరిగా అభివృద్ధి చెందవు” అని మెదడు పరిశోధకుడైన మాక్స్ కనడర్ అంటున్నారు. డాక్టర్ జె. ఫ్రేసర్ మస్టర్డ్ ప్రకారం, తత్ఫలితంగా బుద్ధి మాంద్యత, మాటలకు లెక్కలకు సంబంధించిన సామర్థ్య లోపం, ఎదిగిన తర్వాత ఆరోగ్య సమస్యల వంటివే కాక ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా ఏర్పడే అవకాశముంది.
దీన్నిబట్టి చూస్తే ఒక వ్యక్తికి పసితనంలో ఎదురైన అనుభవాలు, అతను యుక్తవయస్కుడై గడిపే జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపించగలవని తెలుస్తోంది. ఒక వ్యక్తి పసితనంలోని అనుభవాలు, అతడు దృఢ మనస్కుడవుతాడా లేక సున్నిత మనస్కుడవుతాడా, అతను సిద్ధాంతపరంగా ఆలోచించడం నేర్చుకుంటాడా లేక అతనిలో ఆ సామర్థ్యం లోపిస్తుందా, అతను సానుభూతి గలవాడవుతాడా, లేనివాడవుతాడా అనే దాన్ని ప్రభావితం చేయగలవు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనది. “ఈ తొలి అనుభవాల్లో చాలా ముఖ్యమైన స్థానం ఎవరిదంటే, పిల్లవాని సున్నితమైన భావోద్వేగాలను కూడా గ్రహించే తల్లి లేక తండ్రిదే” అని బాల్యదశ వ్యాధుల నిపుణుడు ఒకాయన అంటున్నాడు.
ఇది చాలా సాధారణమైన విషయం అనిపించవచ్చు. మీ పిల్లలను శ్రద్ధగా పెంచి పెద్దచేయండి, వారు వర్ధిల్లుతారు. విషాదకరంగా, పిల్లలను బాగా చూసుకోవడం ఎలాగో అర్థం చేసుకోవడం అన్నివేళలా అంత సులభం కాదని తల్లిదండ్రులకు తెలుసు. సమర్థమైన పెంపకం అన్ని సందర్భాల్లో వెంటనే తెలిసే విషయం కాదు.
ఒక అధ్యయనం ప్రకారం, తమ పిల్లల కోసం తాము చేసినది వారి తెలివినీ, ధైర్యాన్నీ, నేర్చుకోవాలనే ఆసక్తినీ అధికం చేయగలదా లేక ప్రతిబంధకం కాగలదా అని చేసిన సర్వేలో 25 శాతం మంది తల్లిదండ్రులు తమకు తెలియదని అన్నారు. ఇది కొన్ని ప్రశ్నలను లేవదీస్తుంది, మీ పిల్లవాని సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి చక్కని మార్గం ఏమిటి? దానికి మీరు సరైన వాతావరణాన్ని ఎలా కలిగించవచ్చు? వీటిని మనం పరిశీలిద్దాం. (g04 10/22)
[6వ పేజీలోని చిత్రం]
ప్రేరణ లేకుండా వదిలేయబడిన పిల్లలు ఇతర పిల్లలు ఎదిగినట్లు ఎదగరు