కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గౌరవనీయమైన తల్లి పాత్ర

గౌరవనీయమైన తల్లి పాత్ర

గౌరవనీయమైన తల్లి పాత్ర

తల్లి పోషించే పాత్ర తరచూ తక్కువగా అంచనా వేయబడుతోంది, చివరకు నిరాదరణకు గురవుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం, పిల్లలను పెంచే పనిని కొంతమంది చిన్నచూపు చూడడం ప్రారంభించారు. దానికి ఒక ఉద్యోగానికి లేదా వృత్తికి ఉన్నంత ప్రాముఖ్యత లేదనీ, అది ఒక విధమైన అణచివేత వంటిదనీ వారు భావించారు. అలాంటి దృక్పథం విపరీతమైనదని చాలామంది అనుకున్నా, గృహిణిగా ఉంటూ పిల్లలను పెంచడం తక్కువ స్థాయి ఉద్యోగం వంటిదని తల్లులు భావించేందుకు బలవంత పెట్టబడుతున్నారు. ఒక స్త్రీ తన పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఆమె ఇంటి వెలుపల ఏదైనా ఉద్యోగం చేపట్టాలని కూడా కొందరు భావిస్తారు.

అయినప్పటికీ చాలామంది భర్తలు, అలాగే పిల్లలు, కుటుంబంలో తల్లి పోషించే పాత్రకు ఉన్న విలువను గ్రహిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్న కార్లో ఇలా వివరిస్తున్నాడు: “ఈ రోజు నేనిక్కడున్నాను అంటే దానికి కారణం మా అమ్మ ఇచ్చిన శిక్షణే. మా నాన్నగారు చాలా కఠినంగా క్రమశిక్షణలో పెట్టేవారు, వెంటనే శిక్షించేవారు, కానీ అమ్మ మాకు వివరించడం ద్వారా, మాతో తర్కించడం ద్వారా విషయం మాకు అర్థమయ్యేలా చేసేది. ఆమె బోధనా విధానాన్ని నేను నిజంగా ఎంతో విలువైనదిగా ఎంచుతాను.”

దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న పీటర్‌, అంతగా చదువుకోని ఒక తల్లి పెంచిన ఆరుగురు పిల్లల్లో ఒకరు. వాళ్ళ నాన్న వాళ్ళను వదిలేశాడు. పీటర్‌ ఇలా గుర్తుతెచ్చుకుంటున్నాడు: “అమ్మ ఇళ్ళల్లో పని చేసేది కాబట్టి సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. మాకందరికీ స్కూలు ఫీజులు కట్టడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. తరచూ మేము ఆకలితోనే నిద్రపోయేవాళ్ళం. ఇంటి అద్దె కట్టడమే ఆమెకు ఒక పెద్ద సవాలుగా ఉండేది. అన్ని కష్టాలుపడ్డా అమ్మ ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. మమ్మల్ని మేము ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదని అమ్మ మాకు నేర్పించింది. ఆమె గనుక అంత ధైర్యంగా ముందుకు సాగకపోయి ఉంటే, మేము కష్టాలతో పోరాడుతూ ఇలా విజయవంతంగా జీవించేవాళ్ళమే కాదు.”

నైజీరియాకు చెందిన అహ్మద్‌ అనే ఒక భర్త, తమ పిల్లలను పెంచడంలో తన భార్య అందజేసిన సహాయం గురించి తానెలా భావిస్తున్నాడో ఇలా వ్యక్తం చేశాడు: “నా భార్య వహించిన పాత్రను నేను విలువైనదిగా పరిగణిస్తున్నాను. నేను ఇంట్లో లేనప్పుడు, ఆమె పిల్లల గురించి చక్కగా శ్రద్ధ తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. నా భార్య నాతో పోటీ పడుతోందని భావించే బదులు, నేను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తాను, నన్ను గౌరవించినట్లే ఆమెనూ గౌరవించాలని పిల్లలకు చెబుతాను.”

పాలస్తీనాకు చెందిన ఒక వ్యక్తి తల్లిగా తన భార్య సాధించిన విజయాన్ని ఇలా ప్రస్తుతిస్తున్నాడు: “మా అమ్మాయి పెంపకం విషయంలో లీనా ఎంతో తోడ్పడింది, మా కుటుంబ ఆధ్యాత్మికతను పెంపొందింపజేయడంలో ఆమె ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆమెకున్న మత నమ్మకాలే ఆమె విజయానికి దోహదపడుతున్నాయని నా అభిప్రాయం.” లీనా యెహోవాసాక్షి, ఆమె తన కుమార్తెకు విద్య నేర్పించడంలో బైబిలు సూత్రాలను అనుసరిస్తుంది.

ఆ సూత్రాల్లో కొన్ని ఏవి? తల్లుల విషయంలో బైబిలు దృక్కోణం ఏమిటి? ప్రాచీన కాలాల్లో, తమ పిల్లలకు విద్య నేర్పించే వారిగా తల్లులకు ఉన్నతస్థానం, గౌరవం ఎలా ఇచ్చేవారు?

తల్లుల గురించిన సమతుల్య దృక్కోణం

స్త్రీ సృష్టించబడినప్పుడు, ఆమెకు కుటుంబ ఏర్పాటులో గౌరవనీయమైన పాత్ర ఇవ్వబడింది. బైబిలులోని మొదటి పుస్తకం ఇలా చెబుతోంది: “దేవుడైన యెహోవా​—నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.” (ఆదికాండము 2:18) ఆ విధంగా దేవుడు మొదటి స్త్రీ అయిన హవ్వను ఆదాముకు కార్య పరిపూర్ణతకు దోహదపడే వ్యక్తిగా లేదా ఒక భాగస్వామిగా ఇచ్చాడు. ఆయనకు సాటియైన సహాయకురాలిగా ఉండడానికి సరిగ్గా సరిపోయే విధంగా ఆమెను సృష్టించాడు. ఆమె పిల్లలను కని, వారిని పెంచుతూ భూమి గురించి దానిలోని జంతువుల గురించి శ్రద్ధ తీసుకోవాలనే దేవుని సంకల్పంలో ఒక భాగంగా ఉండేందుకు సృష్టించబడింది. ఆమె ఒక నిజమైన భాగస్వామి ఇచ్చే మేధాపరమైన ప్రేరణను, మద్దతును ఇస్తుంది. సృష్టికర్త నుండి ఈ అందమైన బహుమానాన్ని అందుకున్న ఆదాము ఎంతగా సంతోషించి ఉంటాడో కదా!​—ఆదికాండము 1:26-28; 2:23.

ఆ తర్వాత, స్త్రీలను ఎలా చూసుకోవాలో సూచిస్తూ దేవుడు మార్గదర్శక సూత్రాలను ఇచ్చాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు తమ తల్లులను గౌరవించాలి, వారిని చిన్నచూపు చూడకూడదు. ఒక కుమారుడు ‘తన తండ్రినైనా, తల్లినైనా దూషిస్తే’ అతడికి మరణశిక్ష విధించేవారు. ‘తల్లిదండ్రులకు విధేయులై ఉండమని’ క్రైస్తవ యౌవనస్థులకు ఉద్బోధించబడింది.​—లేవీయకాండము 19:3; 20:9; ఎఫెసీయులు 6:1; ద్వితీయోపదేశకాండము 5:16; 27:16; సామెతలు 30:17.

భర్త మార్గదర్శకంలో భార్య తన కుమారులకు కుమార్తెలకు విద్య నేర్పించాలి. “నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము” అని కుమారునికి ఆజ్ఞాపించబడింది. (సామెతలు 6:20) అంతేగాక, ‘[రాజైన లెమూయేలుకు] అతని తల్లి ఉపదేశించిన దేవోక్తి’ సామెతలు 31వ అధ్యాయంలో కనబడుతుంది. మత్తుపానీయాల దుర్వినియోగాన్ని నివారించమని ఆమె జ్ఞానయుక్తంగా తన కుమారునికి నిర్దేశిస్తూ ఇలా అన్నది: “ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు.”​—సామెతలు 31:1, 4, 5.

అంతేగాక, పెళ్ళి చేసుకోవాలని ఆలోచిస్తున్న ప్రతి యౌవనస్థుడు, “గుణవతియైన భార్య” గురించి రాజైన లెమూయేలు తల్లి ఇచ్చిన వర్ణనను పరిశీలించడం జ్ఞానయుక్తం. ఆమె ఇలా చెప్పింది: “అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.” అలాంటి భార్య కుటుంబానికి చేసే ముఖ్యమైన మేలు గురించి వర్ణించిన తర్వాత ఆ రాజు తల్లి ఇలా అన్నది: “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.” (సామెతలు 31:10-31) కుటుంబంలో స్త్రీ గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందేలా మన సృష్టికర్త ఆమెను సృష్టించాడని వీటినిబట్టి స్పష్టమవుతోంది.

క్రైస్తవ సంఘంలో కూడా భార్యలకు, తల్లులకు తగిన గౌరవం, విలువ ఉంది. “పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి” అని ఎఫెసీయులు 5:25 చెబుతోంది. “పరిశుద్ధలేఖనములను” గౌరవించేలా తల్లి, అవ్వల పెంపకంలో పెరిగి పెద్దవాడైన తిమోతికి ఈ ప్రేరేపిత ఉపదేశం ఇవ్వబడింది: ‘వృద్ధ స్త్రీలను తల్లులని భావించుము.’ (2 తిమోతి 3:14; 1 తిమోతి 5:1, 2) కాబట్టి, ఒక పురుషుడు వృద్ధ స్త్రీని తన తల్లిగా గౌరవించాలి. దేవుడు స్త్రీలను విలువైనవారిగా పరిగణిస్తూ వారికి గౌరవపూర్వకమైన స్థానం ఇస్తున్నాడు.

మీ ప్రశంసను వ్యక్తం చేయండి

స్త్రీలను తక్కువవారిగా దృష్టించే సాంప్రదాయంలో పెరిగిన ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “పురుషునికి ఆధిపత్యమిచ్చే విద్యను నేను పొందాను, స్త్రీల విషయంలో దుర్వ్యవహారాన్ని, అగౌరవాన్ని నేను చూశాను. కాబట్టి స్త్రీలను సృష్టికర్త దృష్టించినట్లు దృష్టించడానికి అంటే ఇంట్లో నాకు జతగా లేదా సహాయకురాలిగా, పిల్లలకు విద్య నేర్పించే విషయంలో నా భాగస్వామిగా దృష్టించడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. నా భార్యను మెచ్చుకోవడం నాకు కష్టంగా అనిపించినా, నా పిల్లలు అలవరచుకున్న మంచి లక్షణాలకు కారణం ఆమె చేసిన కృషే అని నేను అంగీకరిస్తున్నాను.”

విద్య నేర్పించేవారిగా తమ బాధ్యతను చేపట్టే తల్లులు తాము నిర్వహిస్తున్న పాత్రను బట్టి గర్వించవచ్చు. అది ఎంతో అమూల్యమైన పని. ప్రశంసను, హృదయపూర్వక అభినందనలను పొందడానికి వారు సంపూర్ణంగా అర్హులు. మనం తల్లుల నుండి ఎన్నో విషయాలను నేర్చుకుంటాం​—జీవితమంతా మనకు ఉపయోగకరంగా ఉండే అలవాట్లు, మంచి సంబంధాలకు ఎంతో ఆవశ్యకమైన మంచి మర్యాద, యౌవనస్థులను సరైన మార్గంలో నడిపించే నైతిక, ఆధ్యాత్మిక పెంపకం. మీ అమ్మ మీకోసం చేసినదానికి మీరు ఈ మధ్య ఎప్పుడైనా ఆమెకు కృతజ్ఞతలు చెప్పారా? (g05 2/22)

[9వ పేజీలోని చిత్రం]

ఆశ వదులుకోకూడదని పీటర్‌ తల్లి ఆయనకు నేర్పించింది

[10వ పేజీలోని చిత్రం]

అహ్మద్‌ తమ పిల్లలను పెంచడంలో తన భార్య ఇచ్చిన సహాయాన్ని ఎంతో విలువైనదిగా పరిగణిస్తున్నాడు

[10వ పేజీలోని చిత్రం]

లీనా భర్త, తన కుమార్తె మంచి ప్రవర్తనకు కారణం తన భార్య మత నమ్మకాలేనని అంగీకరిస్తున్నాడు