కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టమాటా ఎంతో వైవిధ్యమైన “కూరగాయ”

టమాటా ఎంతో వైవిధ్యమైన “కూరగాయ”

టమాటా ఎంతో వైవిధ్యమైన “కూరగాయ”

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

“టమాటాలు లేకుండా వంట చేయడం నావల్ల కాదు!” అని ఇటాలియన్‌ గృహిణి తేల్చి చెప్పేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది వంటవాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నిజమే, ఎన్నో సంస్కృతులకు చెందిన వంటకాల్లో టమాటా తప్పకుండా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు పెంచుకునేవాళ్ళు ఇతర కూరగాయల మొక్కలకంటే టమాటా మొక్కలనే ఎక్కువగా పెంచుతారు. అయితే అది పండా లేక కూరగాయా?

వృక్షశాస్త్రం ప్రకారమైతే టమాటా ఒక పండే, ఎందుకంటే అది విత్తనాల చుట్టూ గుజ్జు ఉన్న పండు. అయితే చాలామంది దానిని కూరగాయగానే పరిగణిస్తారు, ఎందుకంటే దానిని సాధారణంగా భోజనంతోపాటే తింటారు. ఈ రుచికరమైన కూరగాయకు ఆసక్తికరమైన చరిత్రే ఉంది.

ఆసక్తికరమైన చరిత్ర

మెక్సికోలోని అజ్టెక్‌లు టమాటాను ఆహారంగా వాడడానికి సాగు చేసేవారు. 16వ శతాబ్దపు తొలికాలంలో, స్పానిష్‌ విజేతలు స్పెయిన్‌కు తిరిగి వెళ్ళేటప్పుడు దానిని తమతోపాటు తీసుకెళ్ళి, నాహుటల్‌ పదమైన టొమాటిల్‌ ఆధారంగా దానికి టొమాటీ అని పేరు పెట్టారు. కొంతకాలానికే ఇటలీ, దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోని స్పానిష్‌ ప్రజలు ఆ క్రొత్త రుచికరమైన కూరగాయను ఆస్వాదించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఆ శతాబ్దంలోనే టమాటా ఉత్తర యూరప్‌కు చేరుకుంది. అక్కడి ప్రజలు అది ఒక విషపుమొక్క అనుకొని మొదట్లో దానిని కేవలం తోటలో అందంగా కనిపించడానికి మాత్రమే పెంచుకున్నారు. నైట్‌షేడ్‌ జాతికి చెందిన ఆ మొక్కకు గాఢమైన వాసనగల ఆకులు, విషపూరితమైన కాడలు ఉన్నా దాని పండు మాత్రం ఏ మాత్రం హానికరమైనది కాదని నిరూపించబడింది.

యూరప్‌కు తీసుకురాబడిన మొదటి టమాటాలు బహుశా పసుపు రంగులో ఉండి ఉంటాయి, ఎందుకంటే ఇటాలియన్లు దానిని పొమొడొరొ (బంగారు పండు) అని పిలిచారు. ఇంగ్లీషువారు దానిని మొదట టొమాటీ అని ఆ తర్వాత టొమాటో అని పిలవడం ప్రారంభించారు, అయితే “లవ్‌ యాపిల్‌” అనే పేరు కూడా ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత టమాటా యూరప్‌నుండి అట్లాంటిక్‌ మీదుగా సుదూర ప్రయాణం చేసి ఉత్తర అమెరికాకు చేరుకుంది, చివరకు అక్కడ 19వ శతాబ్దంలో అది ఒక ప్రాముఖ్యమైన కూరగాయగా తయారయ్యింది.

విశిష్టమైన వైవిధ్యం, ప్రజాదరణ

టమాటాలు ఏ రంగులో ఉంటాయని అడిగితే, చాలామంది “ఎరుపు” రంగులో ఉంటాయని సమాధానం చెబుతారు. అయితే టమాటాలు పసుపు, నారింజ, గులాబీ, నీలం, గోధుమ, తెలుపు, పచ్చ రంగుల్లోనే కాక చారలు ఉన్న టమాటాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? అన్ని టమాటాలు గుండ్రంగా ఉండవు. కొన్ని సమంగా ఉంటాయి, కొన్ని గుడ్డు ఆకారంలో ఉంటాయి, లేదా జీడిమామిడి పండు ఆకారంలో ఉంటాయి. అవి బఠాణీ అంత పరిమాణం నుండి మనిషి పిడికిలంత పరిమాణం వరకు ఉంటాయి.

ఈ ప్రజాదరణగల కూరగాయ ఉత్తరాన ఐస్‌లాండ్‌నుండి దక్షిణాన న్యూజీలాండ్‌ వరకూ సాగు చేయబడుతుంది. దాని ముఖ్య ఉత్పత్తిదారులు మాత్రం అమెరికా, దక్షిణ యూరపు దేశాలు. చల్లని వాతావరణంగల ప్రాంతాలు హరిత గృహాలను ఉపయోగించి వాటిని పండిస్తే, ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మట్టి అవసరం లేకుండానే రసాయన పదార్థాలు కలిపిన నీటిలో మొక్కలను పెంచే పద్ధతి ఉపయోగించి వాటిని పెంచుతారు.

మొక్కలు పెంచడం ఇష్టపడేవారికి టమాటా మొక్క ఎంతో ప్రియమైనది. ఎందుకంటే దానిని పెంచడం సులభం, కొన్ని మొక్కలు పెంచితే చాలు ఒక చిన్న కుటుంబానికి సరిపడా టమాటాలు కాస్తాయి. మీకు స్థలం తక్కువగా ఉంటే, మండువాల్లోనూ కిటికీలో మొక్కలు పెంచే సౌలభ్యంగల పెట్టెల్లోనూ పెంచడానికి అనువైన రకాల కోసం చూడండి.

సలహాలు, ఆరోగ్య సూచనలు

చల్లని ఉష్ణోగ్రత టమాటాల రుచిని పాడు చేస్తుంది, కాబట్టి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. టమాటాలు త్వరగా పండాలంటే వాటిని కిటికీలోంచి ఎండ పడే చోట ఉంచండి లేదా గది ఉష్ణోగ్రతలోనే ఒక గిన్నెలో ఉంచి వాటితోపాటు ఒక పండిన టమాటా గాని అరటిపండు గాని ఉంచండి, లేదా ముతక కాగితపు సంచిలో కొన్ని రోజులపాటు మూసిపెట్టి ఉంచండి.

టమాటాలు మీ ఆరోగ్యానికి మంచివి. వాటిలో ఏ, సి, ఇ విటమినులేకాక పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఇతర ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. టమాటాల్లో లైకోపీన్‌ అనే శక్తిమంతమైన జీవక్రియ రక్షకాలు (యాంటి ఆక్సిడెంట్లు) సమృద్ధిగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు, అవి క్యాన్సర్‌ మరియు హృద్రోగం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించబడుతోంది. టమాటాల్లో 93 నుండి 95 శాతం నీరే ఉంటుంది, వాటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలని కోరుకునేవారికి అది సంతోషకరమైన వార్తే.

రుచిలోనూ వైవిధ్యమైనది

మీరు టమాటాలు కొనేటప్పుడు ఏ రకం ఎంపిక చేసుకుంటారు? మనందరికీ తెలిసిన చక్కని ఎర్రని టమాటాలు సలాడ్‌లు, సూప్‌లు, సాస్‌ల కోసం బాగుంటాయి. ఎరుపు, నారింజ లేదా పసుపు రంగుల్లో ఉండి చాలా తియ్యగా ఉండే చిన్న చెర్రీ టమాటాలు పచ్చివే తింటే బాగుంటాయి, ఎందుకంటే వాటిలో చెక్కర శాతం ఎక్కువ ఉంటుంది. మీరు పిజ్జా లేదా పాస్తా చేస్తుంటే, గుడ్డు ఆకారంలోని ప్లమ్‌ టమాటాలు బాగుంటాయి ఎందుకంటే వాటి కండ గట్టిగా ఉంటుంది. పైతొక్క మందంగా ఉండే టమాటాలు, లోపల గుజ్జంతా తీసివేసి వేరే పదార్థంతో నింపి వేయించడానికి, లేదా బేక్‌ చేయడానికి బాగుంటాయి. చారలుగల పచ్చని టమాటాలు భోజనంతోపాటు తినడానికి బాగుంటాయి. నిజానికి టమాటాలు ఎన్నో రకాల రుచికరమైన కూరగాయలు, గుడ్లు, పాస్తా, మాంసము, చేపల వంటకాలకు తమ వైవిధ్యమైన రుచిని రంగును ఇస్తాయి. మీకు తాజా టమాటాలు లభించకపోతే, దగ్గర్లోని షాపులో క్యాన్‌లో భద్రపరచబడ్డ టమాటా ఉత్పత్తులు ఎన్నో తప్పకుండా లభిస్తాయి.

వంట చేసే ప్రతి వ్యక్తి తనదైన రీతిలో టమాటా వంటలు చేస్తాడు, అయితే మీరు ప్రయత్నించి చూడడానికి ఇక్కడ కొన్ని సలహాలను ఇస్తున్నాము.

1. ఆకలి పుట్టించే ఆకర్షణీయమైన అప్పిటైజర్‌ను చిటికెలో తయారు చేయాలంటే టమాటా ముక్కలు, మాజెరెల్లా చీస్‌ ముక్కలు, ఆవకాడో ముక్కలు ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళండి. ఆలివ్‌ నూనె మరియు మిరియాల పొడి కలిపి వాటిపై వేసి, ఆఖరున బేసిల్‌ ఆకులతో అలంకరించండి.

2. పెద్ద పెద్ద ముక్కలుగా కోసిన టమాటా, కీరా, ఫేటా చీస్‌తోపాటు నల్లని ఆలివ్‌ పళ్ళు, తరిగిన ఉల్లిపాయలు వేసి గ్రీక్‌ సలాడ్‌ తయారు చేయండి. ఉప్పు మిరియాల పొడి చల్లి, ఆలివ్‌ నూనె నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమంతో వడ్డించండి.

3. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీరను తరిగి అన్నింటిని కలిపి కొద్దిగా నిమ్మరసం జోడించి మెక్సికన్‌ సాల్సా తయారు చేయండి.

4. పాస్తా కోసం సరళమైన రుచికరమైన టమాటా సాస్‌ తయారు చేయడం కోసం ఒక క్యాన్‌ టమాటా ముక్కలు, చిటికెడు చెక్కర (లేదా కాట్సప్‌), కొంచెం ఆలివ్‌ నూనె, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే బేసిల్‌ ఆకులు, పలావ్‌ ఆకులు, ఆరిగానో ఆకులు, కొంచెం ఉప్పు మిరియాల పొడి కలిపి అన్నింటిని బాణాలిలో వేయండి. ఆ మిశ్రమం ఉడికించి, సాస్‌ చిక్కబడే వరకూ 20 నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉంచండి. అప్పటికే వండి నీరు వార్చిన పాస్తాపై దానిని వేయండి.

మన కోసం సృష్టించబడిన ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో వైవిధ్యమైన టమాటా కేవలం ఒకటి మాత్రమే. (g05 3/8)