కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లులు ఎదుర్కొనే సవాళ్ళు

తల్లులు ఎదుర్కొనే సవాళ్ళు

తల్లులు ఎదుర్కొనే సవాళ్ళు

కుటుంబానికి సంబంధించిన విధులే మానవాళికున్న ప్రాథమిక విధులు. . . . తల్లి ఒకవేళ తన విధి నిర్వహించకపోతే, ఆ తర్వాతి తరమేదీ ఉండదు లేదా ఒకవేళ ఉన్నా అది ఎందుకూ పనికిరానిదిగా ఉంటుంది.”​థియోడర్‌ రూజ్వెల్ట్‌, అమెరికా 26వ అధ్యక్షుడు.

అమ్మ లేకుంటే మానవులకు మనుగడే లేదు, అయితే ఆమె పాత్ర కేవలం పిల్లలను కనడం మాత్రమే కాదు. నేటి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని తల్లుల పాత్ర గురించి ఒక రచయిత ఇలా పేర్కొన్నాడు: “ఆమె, ప్రతీ బిడ్డ ఆరోగ్య, విద్యా, మేధా, వ్యక్తిత్వ, గుణ, మానసిక స్థిరత్వాల ప్రధాన పరిరక్షకురాలు.”

తల్లి పోషించే అనేక పాత్రల్లో తన పిల్లలకు విద్య నేర్పించడం కూడా ఒకటి. పిల్లలు సాధారణంగా తన తల్లి నుండే తొలి పలుకులను, సంభాషణా రీతిని నేర్చుకుంటారు. అందుకే ఒక వ్యక్తి ప్రథమ భాషను అతని మాతృభాష అని అంటారు. సాధారణంగా తల్లి తన పిల్లలతో తన భర్తకన్నా ఎక్కువ సమయం గడుపుతుంది కాబట్టి, ఆమే వారికి ప్రధాన ఉపాధ్యాయురాలు, ముఖ్య శిక్షకురాలు. అందుకే “ఉగ్గుపాలతో విద్య” అనే మెక్సికన్‌ సామెత, తల్లులు పోషించే ప్రాముఖ్యమైన పాత్రను ఘనపరుస్తోంది.

మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు కూడా తల్లులను ఘనపరుస్తున్నాడు. నిజానికి, రాతిపలకల మీద “దేవుని వ్రేలితో” వ్రాయబడిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అని పిల్లలను ఆదేశిస్తోంది. (నిర్గమకాండము 20:12; 31:18; ద్వితీయోపదేశకాండము 9:10) అంతేగాక, ఒక బైబిలు సామెత “తల్లి చెప్పు బోధ”ను సూచిస్తోంది. (సామెతలు 1:8) పిల్లలకు జీవితంలోని మొదటి మూడు సంవత్సరాల్లో అంటే చాలామంది పిల్లలు ఎక్కువగా తల్లి సంరక్షణలో ఉండే సమయంలో, వారికి బోధించాల్సిన ప్రాముఖ్యతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు.

కొన్ని సవాళ్ళేమిటి?

చాలామంది తల్లులకు కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించడానికి తప్పనిసరిగా ఉద్యోగం చేయాలనే ఒత్తిడి కారణంగా, తమ పిల్లలు ఎదిగే కీలకమైన దశలో వారికి బోధించడం ఒక సవాలుగా పరిణమిస్తోంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో, మూడు సంవత్సరాలకన్నా తక్కువ వయస్సున్న పిల్లల తల్లుల్లో సగం కన్నా ఎక్కువమంది ఉద్యోగాలు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి సేకరించిన గణాంకాలు చూపిస్తున్నాయి.

అంతేగాక, భర్తలు మరో నగరంలో లేదా మరో దేశంలో ఉద్యోగం వెతుక్కోవడానికి ఇల్లు వదిలి వెళ్ళిన కారణంగా, ఒంటరిగా పిల్లలను పెంచవలసిన భారాన్ని తల్లులే మోస్తుంటారు. ఉదాహరణకు, అర్మేనియాలోని కొన్ని ప్రాంతాల్లోని పురుషుల్లో దాదాపు మూడువంతులమంది ఉద్యోగం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళారని ఒక నివేదిక చెబుతోంది. ఇతర తల్లులు, భర్తలు వదిలేసినందుకో లేదా మరణించినందుకో ఒంటరిగా పిల్లలను పెంచే బాధ్యతను మోస్తున్నారు.

కొన్ని దేశాల్లో చాలామంది తల్లులకు ఎదురయ్యే మరో సవాలు ఏమిటంటే, వారికే విద్య లేకపోవడం. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక మండలి అంచనా ప్రకారం, ప్రపంచంలోని 87.6 కోట్ల నిరక్షరాస్యుల్లో మూడింట రెండొంతులమంది స్త్రీలే. వాస్తవానికి, యునెస్కో అంచనా ప్రకారం ఆఫ్రికాలో, అరబ్‌ దేశాల్లో, తూర్పు మరియు దక్షిణ ఆసియాలో 60 శాతంకన్నా ఎక్కువమంది స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంతేగాక, స్త్రీలకు విద్యాభ్యాసం అనవసరమనీ అది వారిని, పిల్లల్ని కనవలసిన తమ పాత్రకు అనర్హులను చేస్తుందనీ చాలామంది పురుషులు నమ్ముతున్నారు.

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఒక జిల్లాలో అమ్మాయిలు సాధారణంగా 15 ఏళ్ళకే తల్లులవుతారు, అక్కడ విద్యావంతురాలైన వధువు కోసం ఎవరూ అడగరని ఔట్‌లుక్‌ అనే పత్రిక చెబుతోంది. దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో, అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో మద్దతు ఇవ్వగలిగేలా మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వీలుగా వారిని పెంచుతారు. మరో వైపున, ఉమెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ అనే పుస్తకం ప్రకారం, “తల్లిదండ్రులు తమ కుమార్తెల కోసం డబ్బు వెచ్చించరు, ఎందుకంటే ఆడపిల్లలు కుటుంబానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలని వారు ఆశించరు.”

ఇక స్థానిక ఆచారాలతో వ్యవహరించడం మరో సవాలు. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో కన్యకలైన తమ కుమార్తెలను వివాహంలో అమ్మేయడం, ఆడపిల్లలకు సున్నతి చేయించడం వంటి ఆచారాలకు తల్లులు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. తల్లులు తమ కుమారులకు బోధించడం, వారిని క్రమశిక్షణలో పెట్టడం నిషిద్ధం అనే తలంపు కూడా ఉంది. ఒక తల్లి అలాంటి ఆచారాన్ని అనుసరిస్తూ, తన కుమారులకు బోధించే బాధ్యతను ఇతరులకు విడిచిపెట్టాలా?

తర్వాతి ఆర్టికల్స్‌లో, అలాంటి సవాళ్ళను కొంతమంది తల్లులు ఎలా ఎదుర్కొంటున్నారో మనం చూద్దాం. తల్లులపట్ల, మాతృత్వంపట్ల ఎంతో ప్రశంసను పెంపొందింపజేసుకుని, తల్లి తన పిల్లలకు విద్య నేర్పించడంలో పోషించే పాత్ర విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని ఏర్పరచుకోవడానికి కూడా మనం ప్రయత్నిద్దాం. (g05 2/22)

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

“పిల్లల మేధను, జిజ్ఞాసను చైతన్యవంతం చేయడంతోపాటు, వారి సృజనాత్మకతను వృద్ధి చేయడంలో కూడా తల్లి పోషించే పాత్ర కీలకమైనది.”​—రీజనల్‌ సమిట్‌ ఆన్‌ చిల్డ్రన్స్‌ రైట్స్‌, బుర్కినా ఫాసో, 1997.

[3వ పేజీలోని చిత్రాలు]

ప్రతి బిడ్డ ఆరోగ్యం, విద్య, వ్యక్తిత్వం, భావోద్వేగ స్థిరత్వం వంటివాటిలో తల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంది