కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లులు సవాళ్ళను అధిగమించడం

తల్లులు సవాళ్ళను అధిగమించడం

తల్లులు సవాళ్ళను అధిగమించడం

నేడు చాలామంది తల్లులకు, కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేయడం ఒక పెద్ద సవాలుగా ఉంది. అంతేగాక, అనేక కారణాలను బట్టి కొంతమంది తమ పిల్లలను మరొకరి సహాయం లేకుండా ఒంటరిగానే పెంచవలసి రావచ్చు.

మెక్సికోలో నివసిస్తున్న మార్గరీటా అనే స్త్రీకి ఇద్దరు పిల్లలు, ఆమె ఒంటరిగానే వాళ్ళను పెంచుతోంది. ఆమె ఇలా చెబుతోంది: “వారికి నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో శిక్షణ ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. యౌవనస్థుడైన నా కుమారుడు ఒకరోజు పార్టీలో తాగి సగం మత్తులో ఇంటికి వచ్చాడు. మరోసారి ఇలా జరిగితే ఇంట్లోకి రానివ్వనని హెచ్చరించాను. అయితే, మరోసారి వాడు తాగి వచ్చినప్పుడు, నాకెంతో బాధ అనిపించినా, వాడ్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ తర్వాత వాడు మళ్ళీ ఎప్పుడూ అలా తాగి రాలేదు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.”

ఆ తర్వాత కొంతకాలానికి మార్గరీటా బైబిలు అధ్యయనం ప్రారంభించింది, అది ఆమె తన పిల్లల్లో నైతిక విలువలను నాటడానికి సహాయపడింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ యెహోవాసాక్షులుగా పూర్తికాల సేవలో ఉన్నారు.

భర్తలు విదేశాలకు వెళ్ళినప్పుడు

అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో చాలామంది భర్తలు పిల్లలను పెంచే బాధ్యతను తమ భార్యలకు విడిచిపెట్టి ఉద్యోగం కోసం మరింత సంపన్న దేశాలకు వెళ్తున్నారు. నేపాల్‌లో నివసిస్తున్న లక్ష్మి అనే తల్లి ఇలా చెబుతోంది: “మా వారు ఏడు సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నారు. పిల్లలు వాళ్ళ నాన్న మాట విన్నంతగా నా మాట వినరు. పిల్లలకు మార్గనిర్దేశం ఇవ్వడానికి ఆయన ఇక్కడే ఉంటే ఎంతో బాగుండేది.”

లక్ష్మికి కష్టాలు ఉన్నప్పటికీ, ఆమె తన ఎదుట ఉన్న సవాలును అధిగమిస్తోంది. ఆమె ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి, పిల్లలకు చదువులో సహాయం చేయడానికి ఆమె ట్యూషన్‌ ఏర్పాటు చేసింది. అయితే, ఆమె తన పిల్లలతో వారం వారం బైబిలు అధ్యయనం నిర్వహించడం ద్వారా వారి ఆధ్యాత్మిక విద్య మీద తగిన శ్రద్ధ చూపిస్తోంది. ఆమె వారితో ప్రతీరోజు ఒక బైబిలు లేఖనాన్ని చర్చించి, వారిని క్రమంగా క్రైస్తవ కూటాలకు తీసుకువెళ్తుంది.

ఎక్కువగా చదువుకోని తల్లులు

కొన్ని దేశాల్లో ఎదురయ్యే మరో సవాలు ఏమిటంటే, స్త్రీలలో ఎక్కువమంది నిరక్షరాస్యులుగా ఉండడమే. మెక్సికోలో నివసిస్తున్న, ఆరుగురు పిల్లల తల్లి ఆర్లియా, చదువురాని తల్లికి ఎదురయ్యే కష్టాల గురించి ఇలా వివరిస్తోంది: “స్త్రీలు చదువుకోకూడదని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అందుకే నేను చదువుకోలేదు, ఆ కారణంగా నేను నా పిల్లలకు హోమ్‌వర్క్‌ చేసుకోవడానికి సహాయం చేయలేకపోతున్నాను. అది నాకెంతో బాధ కలిగిస్తుంది. కానీ నా పిల్లలు నాలాగే బాధపడకూడదని వాళ్ళకు చదువు నేర్పించడానికి నేనెంతో కష్టపడ్డాను.”

తల్లి కాస్తో కూస్తో చదువుకున్నా, పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. “స్త్రీలకు విద్య నేర్పితే, పురుషులకు బోధించేవారికి విద్య నేర్పినట్లే” అనే సామెత అక్షరాల నిజం. నేపాల్‌లో నివసిస్తున్న బిష్ణు అనే, ముగ్గురు కుమారుల తల్లి ఒకప్పుడు చదువుకోలేదు, కానీ బైబిలు సత్యాలు తెలుసుకొని వాటిని తన పిల్లలకు బోధించాలన్న ఆమె కోరిక, చదవడం వ్రాయడం నేర్చుకోవడానికి చాలా కృషిచేసేలా ఆమెను పురికొల్పింది. ఆమె తన పిల్లలు హోమ్‌వర్క్‌ చేసేలా చూసేది, వాళ్ళ చదువుల గురించి వాళ్ళ టీచర్లతో మాట్లాడడానికి ఆమె క్రమంగా వాళ్ళ పాఠశాలలకు వెళ్ళేది.

తమ ఆధ్యాత్మిక, నైతిక విద్య గురించి, బిష్ణు కుమారుడైన సీలాష్‌ ఇలా వివరిస్తున్నాడు: “మాకు బోధించడానికి ఆమె చేసిన ప్రయత్నాల్లో నాకు ఎక్కువగా నచ్చిన విషయమేమిటంటే, మేము పొరపాట్లు చేస్తే మమ్మల్ని సరిదిద్దడానికి ఆమె బైబిలు ఉదాహరణలు పేర్కొనేది. ఈ విధమైన బోధనా పద్ధతి నాపై ఎంతో ప్రభావం చూపించింది, ఇచ్చిన సలహాను అంగీకరించడానికి అది నాకు సహాయం చేసింది.” బిష్ణు తన ముగ్గురు కుమారులకు విద్య నేర్పించడంలో తన పాత్రను విజయవంతంగా పోషించింది, ఇప్పుడు ఆ ముగ్గురూ దైవభయంగల యౌవనస్థులుగా ఉన్నారు.

మెక్సికోలో నివసిస్తున్న ఆంటోనియో అనే, ఇద్దరు పిల్లల తల్లి ఇలా చెబుతోంది: “నేను ప్రాథమిక పాఠశాల వరకే చదువుకున్నాను. మేమొక మారుమూల గ్రామంలో నివసించేవాళ్ళం, మాధ్యమిక పాఠశాల ఎంతో దూరాన ఉండేది, అయితే మాకు మాత్రం అదే దగ్గర్లోవున్న పాఠశాల. కానీ నా పిల్లలు నాకంటే ఎక్కువ చదువుకోవాలని నేను ఆశించాను, కాబట్టి నేను వాళ్ళతో చాలా సమయం గడిపేదాన్ని. నేను వాళ్ళకు అక్షరాలు, అంకెలు నేర్పించాను. నా కుమార్తె పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించక ముందే అక్షరాలన్నీ వ్రాయగలిగేది, తన పేరు స్పెల్లింగ్‌ చెప్పగలిగేది. నా కుమారుడు నర్సరీకి వెళ్ళే సమయానికే బాగా చదవగలిగేవాడు.”

వాళ్ళకు ఆధ్యాత్మిక, నైతిక విద్య నేర్పించడానికి ఏమి చేశారని ఆంటోనియోను అడిగితే ఆమె ఇలా వివరిస్తోంది: “నేను వాళ్ళకు బైబిలు కథలు బోధించాను. నా కుమార్తె మాట్లాడడం మొదలు పెట్టక ముందే సంజ్ఞల ద్వారా బైబిలు కథలు చెప్పగలిగేది. నా కుమారుడు, క్రైస్తవ కూటాల్లో బహిరంగంగా బైబిలు చదివే నియామకాన్ని మొదటిసారి, నాలుగేళ్ళ వయస్సులో నిర్వహించాడు.” ఎక్కువగా చదువుకోని చాలామంది తల్లులు తమ పిల్లలకు విద్య నేర్పించడం అనే సవాలును అధిగమిస్తున్నారు.

హానికరమైన ఆచారాలను ఎదిరించడం

తమ కుమార్తెలకు 12, 13 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వారిని వివాహం నిమిత్తం అమ్మేయడం మెక్సికోకు చెందిన ట్సోట్సీల్‌ వారి ఆచారం. అమ్మాయిలను తరచూ వాళ్ళకన్నా ఎంతో పెద్ద వయస్సువారికి రెండవ భార్యగా లేదా మూడవ భార్యగా అమ్మేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అమ్మాయితో సంతృప్తి కలగనట్లయితే ఆయన ఆమెను వెనక్కి ఇచ్చేసి, డబ్బు తిరిగి తీసేసుకోవచ్చు. పెట్రోనా కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ ఆచారాన్ని అవలంబించవలసిన పరిస్థితి ఎదురైంది. ఆమె తల్లికి 13 ఏళ్ళు నిండేసరికే ఒక భార్యగా అమ్ముడుపోవడం, ఒక కొడుకును కనడం, భర్త విడాకులు ఇచ్చేయడం కూడా జరిగిపోయాయి. ఆ మొదటి కొడుకు చనిపోయాడు, ఆ తర్వాత పెట్రోనా వాళ్ళమ్మ మరో రెండుసార్లు కూడా అమ్ముడుపోయింది. ఆమెకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు పుట్టారు.

తనకు అలాంటి జీవితం వద్దు అని పెట్రోనా నిశ్చయించుకుంది, దాన్ని ఎలా తప్పించుకోగలిగిందో ఆమె ఇలా వివరిస్తోంది: “నేను ప్రాథమిక పాఠశాల విద్య ముగించిన తర్వాత, నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదనీ ఇంకా చదువుకుంటాననీ మా అమ్మకు చెప్పాను. దానికి అమ్మ తానేమీ చేయలేననీ దాని గురించి నాన్నతో మాట్లాడమనీ నాకు చెప్పింది.”

“నేను నీకు పెళ్ళి చేసేస్తాను. నీకు స్పానిష్‌ మాట్లాడ్డం వచ్చు, చదవడం వచ్చు. నీకింకా ఏం కావాలి? ఇంకా చదువుకోవాలనుంటే నీ ఫీజులు నువ్వే కట్టుకోవాలి” అని చెప్పాడు నాన్న.

“నేను అలాగే చేశాను. బట్టలమీద ఎంబ్రాయిడరీ కుట్టి నా ఖర్చులకు డబ్బు సంపాదించుకున్నాను” అని పెట్రోనా వివరిస్తోంది. అలా ఆమె అమ్ముడుపోకుండా తప్పించుకుంది. పెట్రోనా ఎదిగిన తర్వాత, వాళ్ళమ్మ బైబిలు అధ్యయనం ప్రారంభించింది, ఇది పెట్రోనా చెల్లెళ్లలో బైబిలు ఆధారిత విలువలను నాటడానికి ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఆమె తల్లి తన సొంత అనుభవం నుండి, పెళ్ళిలో ఆడపిల్లలను అమ్మే ఆచారం కారణంగా కలిగే దుఃఖకరమైన పర్యవసానాల గురించి వారికి బోధించగలిగింది.

చాలామంది అనుసరించే మరో ఆచారం, కుటుంబంలో మగపిల్లలను కేవలం తండ్రి మాత్రమే క్రమశిక్షణలో పెట్టాలి అనేది. పెట్రోనా ఇలా వివరిస్తోంది: “ట్సోట్సీల్‌ స్త్రీలకు వాళ్లు పురుషులకన్నా తక్కువవారని బోధిస్తారు. పురుషులు చాలా ఆధిపత్యం చెలాయిస్తారు. మగపిల్లలు తమ తండ్రులను అనుసరిస్తూ తమ తల్లులతో, ‘నేనేం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. నాన్న చెప్పకపోతే నేను వినను’ అంటారు. కాబట్టి తల్లులు తమ మగపిల్లలకు విద్య నేర్పించలేరు. కానీ ఇప్పుడు మా అమ్మ బైబిలు అధ్యయనం చేసింది కాబట్టి, నా తమ్ముళ్ళకు ఉపదేశించడంలో ఆమె విజయం సాధించింది. వాళ్ళు ‘పిల్లలారా, మీ తలిదండ్రులకు విధేయులుగా ఉండండి, మీ తండ్రిని తల్లిని సన్మానించండి’ అని చెబుతున్న ఎఫెసీయులు 6:1, 2 వచనాలను కంఠస్థం చేశారు.”

నైజీరియాలో నివసిస్తున్న మేరీ అనే ఒక తల్లి కూడా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “నేను పెరిగిన ఊర్లో, తల్లి తన మగపిల్లలకు బోధించడాన్ని, వారిని క్రమశిక్షణలో పెట్టడాన్ని సంస్కృతి అనుమతించదు. కానీ తిమోతి తల్లి అయిన యునీకే, అవ్వ అయిన లోయిల బైబిలు ఉదాహరణను అనుసరిస్తూ, నేను నా పిల్లలకు బోధించడానికి స్థానిక ఆచారాలు ఆటంకంగా ఉండకూడదని నిశ్చయించుకున్నాను.”​—2 తిమోతి 1:3.

కొన్ని దేశాల్లో సాధారణంగా ఆచరించే మరో ఆచారాన్ని “స్త్రీల సున్నతి” అని అంటారు. ఆంగ్లంలో సాధారణంగా దీన్ని ఫిమేల్‌ జెనీటల్‌ మ్యూటిలేషన్‌ (ఎఫ్‌.జి.ఎమ్‌) అంటారు. ఈ ఆపరేషన్‌ ద్వారా ఆడపిల్లల మర్మాంగాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగిస్తారు. పేరుపొందిన ఫ్యాషన్‌ మోడల్‌, ఐక్యరాజ్య సమితి జనాభా నిధికి ప్రత్యేక ప్రతినిధి అయిన వారిస్‌ డీరీ ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చి అందరికీ తెలిసేలా చేసింది. సోమాలియా స్థానిక ఆచారానికి అనుగుణంగా, ఆమె తల్లే ఆమెకు చిన్నవయస్సులో సున్నతి చేయించింది. ఒక నివేదిక ప్రకారం, మధ్య ప్రాచ్య దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో 80 లక్షల నుండి ఒక కోటిమంది స్త్రీలు, ఆడపిల్లలు ఎఫ్‌.జి.ఎమ్‌కు గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. అమెరికాలో సహితం 10,000 మంది అమ్మాయిలు ఈ ప్రమాదంలో ఉన్నట్లు అంచనా.

ఈ ఆచారం వెనక ఎలాంటి నమ్మకాలున్నాయి? స్త్రీ జననాంగాలు పాపభరితమైనవనీ, అవి ఒక అమ్మాయిని అపవిత్రం చేస్తాయనీ కాబట్టి ఆ అమ్మాయి వివాహానికి పనికిరాదనీ కొందరు భావిస్తారు. అంతేగాక, వాటిని కోసివేయడం లేదా తొలగించడం అమ్మాయి కన్యత్వానికి, నమ్మకత్వానికి హామీ వంటిదని భావిస్తారు. తల్లి ఈ ఆచారాన్ని అవలంబించకపోతే ఆమె తన భర్త ఆగ్రహానికి, స్థానిక సమాజ ఆగ్రహానికి గురవుతుంది.

అయితే ఈ బాధాకరమైన ఆచారానికి మద్దతు ఇవ్వడానికి మతపరంగా, వైద్యపరంగా, లేదా పరిశుభ్రతపరంగా సముచితమైన కారణం ఏదీ లేదని చాలామంది తల్లులు గ్రహిస్తున్నారు. చాలామంది తల్లులు తమ కుమార్తెల విషయంలో ఆ ఆచారాన్ని అవలంబించడానికి ధైర్యంగా నిరాకరించారని నైజీరియాకు చెందిన రెప్యూడియేటింగ్‌ రిపగ్నెంట్‌ కస్టమ్స్‌ అనే డాక్యుమెంటరీ వెల్లడి చేసింది.

నిజానికి, ప్రపంచవ్యాప్తంగా తల్లులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ వారు తమ పిల్లలను సంరక్షించడంలో, వారికి విద్య నేర్పించడంలో విజయం సాధిస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు నిజంగా విలువైనవిగా పరిగణించబడుతున్నాయా? (g05 2/22)

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

“స్త్రీలు ప్రముఖ పాత్ర వహించని సమర్థమైన అభివృద్ధి ప్రణాళిక అంటూ ఏదీ లేదని అనేక అధ్యయనాలు పదేపదే చూపించాయి. స్త్రీలు పూర్తిగా నిమగ్నమైనప్పుడు కలిగే ప్రయోజనాలను వెంటనే చూడవచ్చు; కుటుంబాలకు ఆరోగ్యకరమైన మంచి పోషణ లభిస్తుంది; వారి రాబడి, పొదుపు, పెట్టుబడి పెరుగుతాయి. ఒక్క కుటుంబం విషయంలోనే కాదు, సమాజాల విషయంలోనూ, చివరకు దేశాలన్నింటి విషయంలోనూ అలాగే జరుగుతుంది.”​—ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌, మార్చి 8, 2003.

[చిత్రసౌజన్యం]

UN/DPI photo by Milton Grant

[8వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఆమె మా కోసం త్యాగాలు చేసింది

బ్రెజిల్‌కు చెందిన జూలియానో అనే యౌవనస్థుడు ఇలా చెబుతున్నాడు: “నాకు ఐదేళ్ళున్నప్పుడు మా అమ్మ మంచి ఉద్యోగం చేస్తుండేది. కానీ మా చెల్లి పుట్టడంతో, మా గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఆమె ఉద్యోగం మానుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఉద్యోగ స్థలంలోని సలహాదారులు ఆమెను ఆపాలని చూశారు. పిల్లలు పెద్దవారై పెళ్ళిళ్ళు చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతే, తాను వాళ్ళ కోసం చేసినదంతా వ్యర్థమైపోతుందనీ, ఏ లాభంరాని దాని కోసం పెట్టుబడి పెడుతున్నావనీ వాళ్ళు ఆమెతో అన్నారు. కానీ వాళ్ళు చెప్పింది తప్పు అని నేను చెప్పగలను; ఆమె చూపించిన ప్రేమను నేను ఎన్నటికీ మరిచిపోను.”

[చిత్రాలు]

జూలియానో తల్లి, ఆమె పిల్లలు. ఎడమ ప్రక్క: జూలియానో ఐదేళ్ళ వయసులో

[6వ పేజీలోని చిత్రాలు]

బిష్ణు చదవడం, వ్రాయడం నేర్చుకొని, తన కుమారులు మంచి విద్య పొందడానికి సహాయం చేసింది

[7వ పేజీలోని చిత్రాలు]

ఆంటోనియో కుమారుడు క్రైస్తవ కూటాల్లో బైబిలు చదివే నియామకాన్ని నిర్వహిస్తున్నాడు

[7వ పేజీలోని చిత్రాలు]

పెట్రోనా యెహోవాసాక్షుల మెక్సికో బ్రాంచిలో స్వచ్ఛంద సేవకురాలు. ఆ తర్వాత సాక్షిగా మారిన ఆమె తల్లి, పెట్రోనా తమ్ముళ్ళకు, చెల్లికి బోధిస్తోంది

[8వ పేజీలోని చిత్రం]

వారిస్‌ డీరీ స్త్రీల సున్నతికి వ్యతిరేకంగా మాట్లాడిన పేరుపొందిన ప్రతినిధి

[చిత్రసౌజన్యం]

Photo by Sean Gallup/ Getty Images