నేను ఒళ్లొంచి ఎందుకు పని చేయాలి?
యువత ఇలా అడుగుతోంది . .
నేను ఒళ్లొంచి ఎందుకు పని చేయాలి?
“నేను ఒళ్లొంచి పని చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. నా కంప్యూటర్‌తో ఆడుకోవడమే నాకు ఎంతో ఇష్టంగా అనిపించేది.”—నేథన్.
“మాలో ఒళ్లొంచి పని చేసేవాళ్ళని కొందరు పిల్లలు చులకనగా చూసేవారు, మేము మరే పని చేయడానికి పనికిరాని వారమన్నట్లు ప్రవర్తించేవారు.”—శారా.
ఒళ్లొంచి పనిచేయడం—చాలామంది దానిని చికాకు కలిగించేదిగా, మురికి పనిగా, కోరుకోదగనిదిగా దృష్టిస్తారు. ఒళ్లొంచి పని చేయాల్సిన ఉద్యోగాల గురించి ఒక అర్థశాస్త్ర ప్రొఫెసర్ ఇలా వ్యాఖ్యానించాడు: “అంతస్తు హోదాల కోసం ప్రాకులాడే ఈ లోకంలో అలాంటి పనులకు విలువే లేదు.” కాబట్టి చాలామంది యౌవనస్థులు ఒళ్లొంచి పని చేయడంపట్ల నిరసన భావం ప్రదర్శించడం ఆశ్చర్యకరమైన విషయం కాదు.
అయితే కష్టపడి పని చేయడానికి సంబంధించి బైబిలు దానికి పూర్తి విరుద్ధమైన దృక్కోణాన్ని ప్రోత్సహిస్తోంది. సొలొమోను రాజు ఇలా చెప్పాడు: “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసంగి 2:24) బైబిలు కాలాల్లో ఇశ్రాయేలు వ్యవసాయదారుల సమాజంగా ఉండేది. పొలం దున్నడం, కోత కోయడం, ధాన్యాన్ని నూర్చడం వంటి పనులు చేయడానికి ఒళ్లొంచి పని చేయవలసి వచ్చేది. అయితే అలా కష్టపడి పనిచేయడం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుందని సొలొమోను చెప్పాడు.
ఎన్నో శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:27) పౌలు స్వయంగా కూడా కష్టపడి పని చేసేవాడు. ఆయన ఎంతో విద్యావంతుడైనా, డేరాలు కుట్టడం ద్వారా తన జీవనాధారం సంపాదించుకునేవాడు.—అపొస్తలుల కార్యములు 18:1-3.
ఒళ్లొంచి పని చేయడం గురించి మీ అభిప్రాయమేమిటి? మీరు గ్రహించినా గ్రహించకపోయినా, కష్టపడి పని చేయడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
జీవించడానికి ఉపయోగపడే శిక్షణ
సుత్తిని ఉపయోగించి పని చేయడం, బాగా పెరిగిపోయిన గడ్డిని కోయడం వంటి పనులు చేయడానికి ఒళ్లొంచి కష్టపడితే
ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టపడి పని చేయడంవల్ల ఆరోగ్యంగా ఉండడమే కాక ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పంక్చరైన టైరును మార్చడం లేదా కారులోని ఆయిల్‌ను మార్చడం మీకు తెలుసా? విరిగిపోయిన కిటికీని లేదా మురుగు గొట్టాన్ని మీరు బాగుచేయగలరా? మీకు వంట చేయడం వచ్చా? మీరు స్నానాల గదిని అద్దంలా శుభ్రం చేయగలరా? యువతీయువకులకు ఈ పనులు తెలిసి ఉండాలి, ఏదో ఒకరోజు మీరు మీ స్వంతగా జీవించడానికి ఇలాంటివి పనికివస్తాయి.ఆసక్తికరమైన విషయమేమిటంటే, యేసుక్రీస్తు కూడా భూమిమీద ఉన్నప్పుడు ఇలాంటి నైపుణ్యాలను నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన తనను పెంచిన తండ్రియైన యోసేపు నుండి వడ్రంగం నేర్చుకున్నాడు, అందుకే ఆయన ఆ తర్వాత వడ్లవాడు అని పిలువబడ్డాడు. (మత్తయి 13:55; మార్కు 6:3) మీరు కూడా కష్టపడి పనిచేయడం ద్వారా ఎన్నో ఉపయోగకరమైన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు.
వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం
కష్టపడి పనిచేయడమనేది మిమ్మల్ని మీరు దృష్టించుకునే విధానంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అమెరికా జాతీయ మానసిక ఆరోగ్యం మరియు విద్యా కేంద్రం తరఫున వ్రాస్తూ డా. ఫ్రెడ్ ప్రావెన్జానో, ఒళ్లొంచి పనిచేయడాన్ని నేర్చుకోవడం “మీ ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని” పెంచడమే కాక మీరు “స్వయం క్రమశిక్షణను, క్రమబద్ధతను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది, అవి విజయవంతమైన వృత్తికి ఆధారాలు” అని చెప్పారు. జాన్ అనే యువకుడు ఇలా చెప్పాడు: “ఒళ్లొంచి పనిచేయడమనేది సహనాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేస్తుంది. సమస్యలతో వ్యవహరించడాన్ని కూడా నేర్చుకుంటాము.”
ముందు ప్రస్తావించబడిన శారా ఇలా వివరించింది: “ఒళ్లొంచి పని చేయడం నాకు కష్టపడి పని చేసే వ్యక్తిగా ఉండడాన్ని నేర్పించింది. నేను మానసికంగా, శారీరకంగా క్రమశిక్షణతో ఉండడం నేర్చుకున్నాను.” కష్టపడి పనిచేయడం విసుగు పుట్టించేదిగా ఉండాలా? నేథన్ ఇలా చెప్పాడు: “నేను ఆనందంగా పని చేయడం నేర్చుకున్నాను. నేను నా నైపుణ్యాలను మెరుగుపర్చుకునే కొద్దీ, నా పని నాణ్యత పెరిగిందని గమనించాను. ఇది నా ఆత్మగౌరవాన్ని పెంచింది.”
ఒళ్లొంచి పని చేయడమనేది ఏదైనా సాధించినప్పుడు కలిగే ఆనందాన్ని చవిచూడడానికి కూడా సహాయం చేస్తుంది. జేమ్స్ అనే యువకుడు ఇలా చెప్పాడు: “నాకు వడ్రంగం అంటే ఇష్టం. అది కొన్నిసార్లు శారీరక అలసటను కలగజేసినా, నేను చేసినవాటిని చూసుకొని ఏదో ఒకటి సాధించాను అని ఆనందిస్తాను. అది ఎంతో సంతృప్తికరమైనది.” బ్రాయన్ కూడా అలాంటి భావాలనే వ్యక్తం చేస్తున్నాడు. “నాకు వాహనాలు బాగు చేయడం అంటే ఇష్టం. పాడైపోయిన వస్తువును బాగుచేసి కొత్తదానిలా చేసే సామర్థ్యం నాకు ఉంది అనే భావన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి సంతృప్తినిస్తుంది” అని ఆయన చెప్పాడు.
పరిశుద్ధ సేవ
క్రైస్తవ యౌవనస్థులకు, కష్టపడి పనిచేసే లక్షణం దేవుని సేవలో సహాయకరంగా ఉంటుంది. యెహోవాకు ఒక మహత్తరమైన ఆలయం నిర్మించే నియామకం సొలొమోను రాజుకు ఇవ్వబడినప్పుడు, ఆ పనికి ఎంతో కృషి, నైపుణ్యం అవసరం అని ఆయన గ్రహించాడు. బైబిలు ఇలా చెబుతోంది: “రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.”—1 రాజులు 7:13, 14.
హీరాముకు తన నైపుణ్యాలను యెహోవా ఆరాధన కోసం ఉపయోగించే అవకాశం లభించడం ఎంతటి ఆధిక్యతో కదా! హీరాము అనుభవం సామెతలు 22:29 లోని బైబిలు మాటల నిజత్వాన్ని నొక్కి చెబుతోంది, ఆ వచనంలో ఇలా ఉంది: “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.”
నేడు నిర్మాణ నైపుణ్యాలు చాలా తక్కువ మాత్రమే ఉన్న లేదా ఏ మాత్రం లేని యౌవనస్థులకు కూడా రాజ్యమందిరాల నిర్మాణంలో పాల్గొనే ఆధిక్యత లభించింది. అలాంటి ప్రణాళికల్లో పాల్గొనడంవల్ల కొందరు విద్యుత్ పనులు, నీటి సరఫరాల పనులు, తాపీపని, వడ్రంగం వంటి ఉపయోగకరమైన వృత్తులను నేర్చుకున్నారు. మీరు కూడా రాజ్యమందిర నిర్మాణ పనిలో పాల్గొనే అవకాశం గురించి బహుశా మీ స్థానిక పెద్దలతో చర్చించవచ్చు.
ఎన్నో రాజ్యమందిరాల కోసం పని చేసిన జేమ్స్ ఇలా
చెప్పాడు: “సంఘాల్లోని చాలామందికి ఈ పనిలో సహాయం చేయడానికి కావలసిన సమయం, సామర్థ్యాలు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు సహాయం చేయడానికి ముందుకు రావడం ద్వారా నిజానికి సంఘం మొత్తానికి సహాయం చేస్తున్నారు.” కాంక్రీటు పనులు చేయడం నేర్చుకున్న నేథన్, తనకున్న నైపుణ్యం దేవునికి మరో విధంగా సేవ చేయడానికి మార్గం తెరిచిందని గ్రహించాడు. ఆయన ఇలా గుర్తు చేసుకున్నాడు: “నేను యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయపు నిర్మాణంలో సహాయం చేయడానికి నా నైపుణ్యాలను ఉపయోగించేందుకు జింబాబ్వేకు వెళ్ళగలిగాను. నేను అక్కడ మూడు నెలలపాటు పని చేశాను, అది నా జీవితంలో ఒక మధురమైన అనుభవం.” కష్టపడి పనిచేయాలనే కోరికగల ఇతర యౌవనస్థులు, యెహోవాసాక్షుల స్థానిక బ్రాంచి కార్యాలయంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు దరఖాస్తు పెట్టుకోవడానికి పురికొల్పబడ్డారు.ఒళ్లొంచి పని చేయగలిగినప్పుడు మీకు కొంత ఆర్థిక స్వాతంత్ర్యం కూడా లభిస్తుంది. యెహోవాసాక్షుల్లోని యౌవనస్థులు చాలామంది పయినీర్లుగా అంటే పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తున్నారు. ఒక వృత్తిని నేర్చుకోవడం ద్వారా కొందరు లౌకిక విద్యను అభ్యసించడానికి ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేయకుండానే తమను తాము ఆర్థికంగా పోషించుకోగలుగుతున్నారు.
ఎలా నేర్చుకోవాలి?
మీరు ఒక వృత్తి చేపట్టి జీవనాధారం సంపాదించుకోవాలనుకున్నా లేదా ఇంట్లో పనులు చేయడానికి సహాయం చేయాలకున్నా సరే ఒళ్లొంచి పనిచేయడం నేర్చుకోవడంవల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. మీ స్థానిక స్కూల్లో వృత్తివిద్యా కోర్సులు ఉండవచ్చు. లేదా మీరు మీ ఇంటివద్దే కొంత శిక్షణను పొందే అవకాశం కూడా ఉంది. ఎలా? ఇంటి పనులు చేయడం నేర్చుకోవడం ద్వారానే. ముందు ప్రస్తావించబడిన డా. ప్రావెన్జానో ఇలా వ్రాశారు: “ప్రత్యేకించి యౌవనస్థులు ఇంటిపనులు చేయడం ప్రాముఖ్యం, ఎందుకంటే అవి వారికి ప్రాథమిక గృహసంబంధ ‘జీవన నైపుణ్యాలను’ నేర్పిస్తాయి. వారు తల్లిదండ్రుల నుండి వేరుగా ఉండవలసిన సమయం వచ్చినప్పుడు విజయవంతంగా సమర్థవంతంగా జీవించడానికి అవి సహాయం చేస్తాయి.” కాబట్టి ఇంట్లో చేయవలసిన పనులను గమనించడానికి చురుకుగా ఉండండి. పెరట్లో గడ్డి కోయాలా లేదా బీరువా అర బాగు చేయాలా?
ఒళ్లొంచి పనిచేయడం మీ స్థాయిని తగ్గించదు, అది మీకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఒళ్లొంచి పని చేయకుండా తప్పించుకోకండి! దానికి బదులు మీరు కష్టపడి పని చేయడంవల్ల కలిగే “సుఖమును” అనుభవించండి, ఎందుకంటే ప్రసంగి 3:13 చెబుతున్నట్లుగా అది “దేవుడిచ్చు బహుమానమే.” (g05 3/22)
[21వ పేజీలోని బ్లర్బ్]
ఒక వృత్తిని నేర్చుకోవడం ద్వారా చాలామంది యౌవనస్థులు తాము దేవునికి చేసే సేవను అధికం చేసుకోగలిగారు
[22వ పేజీలోని చిత్రాలు]
మీ తల్లిదండ్రులే మీకు ప్రాథమిక నైపుణ్యాలను నేర్పించవచ్చు