కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం

పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం

బైబిలు ఉద్దేశము

పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం

దేవుని కుమారునికి పిల్లలతో గడిపేంత సమయం ఉండేదా? సమయం లేదని ఆయన శిష్యులు కొంతమంది అనుకున్నారు. ఒక సందర్భంలో వాళ్ళు చిన్నపిల్లలను ఆయన దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకోవాలని చూశారు. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.” ఆ తర్వాత ఆయన కొంతమంది పిల్లలను ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకుని వారితో మాట్లాడాడు. (మార్కు 10:13-16) ఆ విధంగా యేసు తాను పిల్లలపై శ్రద్ధ చూపడానికి ఇష్టపడుతున్నానని చూపించాడు. తల్లిదండ్రులు నేడు ఆయన మాదిరిని ఎలా అనుసరించవచ్చు? పిల్లలకు సరైన విధంగా శిక్షణ ఇవ్వడం ద్వారా, వారితో సమయం గడపడం ద్వారా వారు యేసును అనుసరించవచ్చు.

బాధ్యతాయుతులైన తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతూ, వాళ్ళను ఏ విధంగానూ నొప్పించకుండా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల గౌరవం చూపించి వారితో దయగా ప్రవర్తించడం ‘సహజమే’ అని కూడా చెప్పవచ్చు. అయితే మన కాలంలో చాలామందికి అలాంటి ‘సహజమైన ప్రేమ’ ఉండదు అని బైబిలు హెచ్చరిస్తోంది. (2 తిమోతి 3:1-3, NW) తమ పిల్లలపట్ల ప్రేమ చూపించే తల్లిదండ్రులు కూడా తాము బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉండడానికి నేర్చుకోవలసింది ఎప్పుడూ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కాబట్టి తమ పిల్లలకు శ్రేష్ఠమైనది అందివ్వాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ క్రింద ఇవ్వబడిన బైబిలు సూత్రాలను జ్ఞాపికలుగా భావించి సంతోషంగా స్వీకరిస్తారు.

కోపం రేపకుండా శిక్షణ ఇవ్వడం

పేరుపొందిన ఉపాధ్యాయుడు, మానసిక రుగ్మతల మీద పరిశోధన చేస్తున్న వైద్యుడు అయిన డా. రాబర్ట్‌ కోల్స్‌ ఒకసారి ఇలా అన్నారు: “పిల్లల్లో అంతకంతకూ వృద్ధిచెందే నైతిక గ్రహింపు ఉంటుంది. నైతికపరమైన మార్గనిర్దేశం కోసం పిల్లల్లో ఉండే తృష్ణ దేవుడిచ్చినదేనని నా అభిప్రాయం.” మరి నైతికపరమైన మార్గనిర్దేశం కోసం పిల్లల్లో ఉండే ఈ ఆకలి దప్పికలను ఎవరు తీర్చాలి?

ఎఫెసీయులు 6:4 లోని మాటలు ఇలా ప్రోత్సహిస్తున్నాయి: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” ఈ లేఖనం, తమ పిల్లల్లో దేవునిపట్ల ప్రేమను, దైవిక ప్రమాణాలపట్ల ప్రగాఢమైన మెప్పును నాటవలసిన బాధ్యతను ప్రత్యేకంగా తండ్రికే అప్పగించడాన్ని మీరు గమనించారా? అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులు 6వ అధ్యాయం 1 వ వచనంలో, “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని పిల్లలకు చెప్పినప్పుడు తల్లిదండ్రులిద్దరి గురించి మాట్లాడాడు. *

ఒకవేళ తండ్రి లేకపోతే, తల్లి ఆ బాధ్యతను చేపట్టాలి. చాలామంది ఒంటరి తల్లులు యెహోవా దేవుని శిక్షలోనూ, బోధలోనూ పిల్లలను పెంచడంలో విజయం సాధించారు. అయితే, తల్లి వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవ భర్త నాయకత్వం వహించాలి. తల్లి తమ పిల్లలకు శిక్షణనివ్వడంలోనూ వారిని క్రమశిక్షణలో పెట్టడంలోనూ ఆయన నాయకత్వానికి ఇష్టపూర్వకంగా విధేయురాలు కావాలి.

మీరు మీ పిల్లలకు ‘కోపము రేపకుండా’ వారిని ఎలా క్రమశిక్షణలో పెడతారు లేక శిక్షణనిస్తారు? దీనికి ఏ రహస్య సూత్రాలూ లేవు, ఎందుకంటే ప్రతీ బిడ్డ భిన్నంగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలపట్ల ప్రేమా గౌరవాలు చూపిస్తూ తాము ఇచ్చే క్రమశిక్షణా విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆసక్తికరంగా, పిల్లలకు కోపం రేపకుండా ఉండడం గురించి లేఖనాల్లో మరోసారి కొలొస్సయులు 3:21 లో ప్రస్తావించబడింది. అక్కడ తండ్రులకు మళ్ళీ ఇలా ఉద్బోధించబడింది: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల మీద గట్టిగా అరుస్తుంటారు. ఇది పిల్లలకు చికాకు కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కానీ బైబిలు ఇలా ప్రోత్సహిస్తోంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి [“అరపులు,” క్యాతలిక్‌ అనువాదము] దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) అంతేకాదు ‘ప్రభువు దాసుడు జగడమాడకుండా అందరి యెడల సాధువుగా ఉండాలి’ అని కూడా బైబిలు చెబుతోంది.​—2 తిమోతి 2:26.

వారితో సమయం గడపండి

మీ పిల్లలకు అవసరమైన శ్రద్ధ చూపించడం అంటే, మీ పిల్లల సంక్షేమం కోసం మీరు మీ ఆనందాలను వ్యక్తిగత సౌకర్యాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడమని కూడా అర్థం. బైబిలు ఇలా చెబుతోంది: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”​—ద్వితీయోపదేశకాండము 6:6, 7.

నేడు, ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చే ఆర్థిక బాధ్యతల మూలంగా, రోజంతా తమ పిల్లలతో ఉండే అవకాశం చాలా తక్కువమంది తల్లిదండ్రులకు లభిస్తుంది. అయినా, తమ పిల్లలతో గడపడానికి సమయం సంపాదించుకోవాలని ద్వితీయోపదేశకాండము తల్లిదండ్రులకు నొక్కిచెబుతోంది. అలా చేయడానికి మంచి వ్యవస్థీకరణ, త్యాగం అవసరం. అయితే పిల్లలకు అలాంటి శ్రద్ధ అవసరమే.

12,000 కంటే ఎక్కువమంది యౌవనులపై నిర్వహించబడిన ఒక అధ్యయన ఫలితాలను పరిశీలించండి. ముగింపులో పరిశోధకులు ఏమి చెబుతున్నారంటే: “తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బలమైన భావోద్వేగ సంబంధం ఉండడం యౌవనులు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది, అది ప్రమాదకరమైన ప్రవర్తనకు బలమైన అడ్డంకుగా ఉంటుంది.” అవును, పిల్లలు తమ తల్లిదండ్రుల శ్రద్ధ కోసం తపించిపోతారు. ఒక తల్లి ఒకసారి తన పిల్లలను ఇలా అడిగింది: “మీకు కావలసినదేదైనా మీరు పొందే అవకాశం ఉంటే, మీరు ఎక్కువగా కోరుకునేది ఏమిటి?” నలుగురు పిల్లలూ, “అమ్మానాన్నలతో ఎక్కువ సమయం గడపడం” అని ముక్తకంఠంతో బదులిచ్చారు.

కాబట్టి బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉండడమంటే మీ పిల్లల అవసరాలు చూడడమని అర్థం, అంటే ఆధ్యాత్మిక విద్య కోసం, తమ తల్లిదండ్రులతో సన్నిహిత సంబంధం కోసం వారికి కలిగే అవసరాన్ని తీరేలా చూడడమని అర్థం. అంటే పిల్లలు తమ తోటివారితో ప్రేమగా వ్యవహరించే, తమ సృష్టికర్తకు మహిమ తీసుకువచ్చే సమర్థులుగా, గౌరవనీయులుగా, నిజాయితీపరులుగా ఎదగడానికి వారికి సహాయం చేయడమని అర్థం. (1 సమూయేలు 2:26) అవును, తల్లిదండ్రులు తమ పిల్లలకు దైవిక మార్గంలో శిక్షణ ఇచ్చినప్పుడు, వారిని క్రమశిక్షణలో పెట్టినప్పుడు వారు బాధ్యతాయుతంగా ఉన్నట్లే. (g05 2/8)

[అధస్సూచి]

^ పౌలు ఇక్కడ గోనెఫ్స్‌ నుండి వచ్చిన గోనెఫ్సిన్‌ అనే గ్రీకు పదాన్ని వాడాడు, దానికి “తల్లిదండ్రులు” అని అర్థం. కానీ 4వ వచనంలో ఆయన “తండ్రులు” అనే భావంగల పాటరస్‌ అనే గ్రీకు పదాన్ని వాడాడు.

[13వ పేజీలోని చిత్రం]

కేకలు వేయడం, అరవడం పిల్లలను కృంగదీయవచ్చు

[13వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలతో సమయం గడపండి