కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రజలు ఈ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుందో!”

“ప్రజలు ఈ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుందో!”

“ప్రజలు ఈ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుందో!”

ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన తర్వాత చాలామంది యౌవనస్థులు భౌతిక లక్ష్యాలపై దృష్టి నిలుపుతారు, కానీ డేవిడ్‌ మరోవిధంగా ఆలోచించాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయనను ప్రేమగా డేవీ అని పిలుస్తారు. సెప్టెంబరు 2003లో ఆయన తన స్నేహితునితో కలిసి అమెరికాలోని ఇల్లినియస్‌ నుండి డొమినికన్‌ రిపబ్లిక్‌కు వెళ్ళాడు. * ఆయన స్పానిష్‌ నేర్చుకొని నవాస్‌లోని యెహోవాసాక్షుల సంఘంతో కలిసి బైబిలు బోధనా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సంఘం ఆయనను సాదరంగా ఆహ్వానించింది. “డేవీకి ఏ పని చెప్పినా చేసేవాడు. ఆయన ఎప్పుడూ ఇతరుల కోసం పనులు చేయడానికి సిద్ధంగా ఉండేవాడు, సహోదరులు ఆయనను ఎంతో ఇష్టపడేవారు” అని ఆ సంఘంలో ఉన్న ఒక్కగానొక్క పెద్ద అయిన క్వాన్‌ చెబుతున్నాడు.

డేవీ తన నియామకాన్ని ఎంతో ఇష్టపడేవాడు. “నేను ఇక్కడ నా జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. పరిచర్య ఎంతో ఉత్తేజపరిచేదిగా ఉంది! మేము ప్రతి ఇంటి దగ్గర దాదాపు 20 నిమిషాలు మాట్లాడుతున్నాము, ఎందుకంటే ఇక్కడి ప్రజలు మనం చెప్పాలనుకున్నదంతా వినడానికి ఇష్టపడుతున్నారు. నేను ఇప్పటికే ఆరు బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నాను, అయితే ఇక్కడ ఇంకా సహాయం అవసరం. 30 మంది రాజ్య ప్రచారకులు ఉన్న మా సంఘపు కూటానికి ఒకసారి 103 మంది హాజరయ్యారు!” అని డేవీ అమెరికాలోవున్న తన స్నేహితునికి వ్రాశాడు.

దుఃఖకరమైన విషయమేమిటంటే, 2004 ఏప్రిల్‌ 24వ తేదీన డేవీ, ఆయన సంఘానికి చెందిన మరో యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. డేవీ చనిపోయేంతవరకూ తాను చేస్తున్న పనిని అత్యంతాసక్తితో చేశాడు, తనతోపాటు సేవ చేయమని ఆయన అమెరికాలోని ఇతర యౌవనస్థులను ప్రోత్సహించాడు. “నువ్వు ఇక్కడకు వచ్చి సేవ చేస్తే నీ దృక్కోణాలే మారిపోతాయి” అని యౌవనస్థురాలైన ఒక సాక్షికి ఆయన చెప్పాడు.

స్వయంగా డేవీ దృక్కోణాల్లో వచ్చిన మార్పుల్లో ఒకటి, భౌతిక విషయాలకు సంబంధించినది. ఆయన తండ్రి ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “డేవీ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు, మంచుపై ఆడే ఒకానొక వినోద క్రీడకు రమ్మని ఆహ్వానించబడ్డాడు. దానికి ఎంత ఖర్చవుతుంది అని డేవీ అడిగాడు. ఎంతవుతుందో చెప్పినప్పుడు, అదే మొత్తానికి తాను డొమినికిన్‌ రిపబ్లిక్‌లో ఎన్నో నెలలు జీవించగలిగినప్పుడు కేవలం వినోద క్రీడ కోసం అంత ఖర్చు పెట్టడం తనకు అస్సలు ఇష్టం లేదని డేవీ చెప్పాడు!”

డేవీ ఆసక్తి ఇతరులను ప్రభావితం చేసింది. “డేవీ చేస్తున్న పని గురించి, ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడనే విషయం గురించి విన్నప్పుడు, నేను కూడా అలాంటివాటినే సాధించవచ్చు అని గ్రహించాను. డేవీ మరణం, నేను చనిపోయినప్పుడు ప్రజలు నా గురించి ఏమి మాట్లాడుకుంటారు, నేను కూడా వారి జీవితాలపై ఇంతటి అనుకూలమైన ప్రభావాన్ని చూపించగలనా అనే విషయాల గురించి నన్ను ఆలోచింపజేసింది” అని అమెరికాలోని ఒక యువతి చెప్పింది.

యెహోవాసాక్షులైన డేవీ తల్లిదండ్రులు, ఆయన అక్కా, అన్నలకు రాబోయే నీతియుక్తమైన నూతనలోకంలో దేవుడు డేవీని తప్పకుండా పునరుత్థానం చేస్తాడని దృఢమైన నమ్మకం ఉంది. (యోహాను 5:28, 29; ప్రకటన 21:1-4) అంతవరకూ, డేవీ తన జీవితాన్ని అత్యుత్తమైన విధంగా అంటే తన సృష్టికర్తకు సేవ చేయడానికి ఉపయోగించాడనే విషయం నుండి వారు ఓదార్పు పొందుతున్నారు. (ప్రసంగి 12:1) అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవ చేయాలని తాను తీసుకున్న నిర్ణయం గురించి వ్యాఖ్యానిస్తూ డేవీ ఒకసారి ఇలా అన్నాడు: “ప్రతి యౌవనస్థుడు/యౌవనస్థురాలు ఇలాంటి పనినే చేసి నేను అనుభవిస్తున్న సంతోషాన్నీ సంతృప్తినీ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. మనకున్నదంతా ఉపయోగించి యెహోవాకు సేవ చేయడంకంటే ఉత్తమమైనది ఏదీ లేదు. ప్రజలు ఈ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుందో!” (g05 1/8)

[అధస్సూచి]

^ డేవిడ్‌లాగే చాలామంది యెహోవాసాక్షులు రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, దేవుని వాక్య సత్యాలను ఇతరులకు బోధించడానికి కొందరు ఒక కొత్త భాష నేర్చుకోవడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి 400 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు ప్రస్తుతం డొమినికన్‌ రిపబ్లిక్‌లో సేవ చేస్తున్నారు.