మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
బాధలు “యువత ఇలా అడుగుతోంది . . . మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?” (జూలై-సెప్టెంబరు, 2004) అనే ఆర్టికల్ ప్రచురించినందుకు కృతజ్ఞతలు. నాకు 14 సంవత్సరాలు, నాకు ఎంతో సన్నిహితులైన మా తాతగారు, మా అత్తయ్య ఈ మధ్యనే మరణించారు. వాళ్ళ మరణానికి కారణం దేవుడు కాదని నాకు తెలుసు. దానికి సాతానే బాధ్యుడు, అతనికి ఇంకా కొద్ది సమయమే మిగిలివుంది. ఈ ఆర్టికల్ నన్ను ఎంతో ఓదార్చింది. దయచేసి ఇలాంటి ఆర్టికల్‌లను ప్రచురిస్తూ ఉండండి. మీకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
బి. బి., అమెరికా
నేను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఈ మధ్యనే కారు ప్రమాదంలో చనిపోయింది. అది నాకు, సంఘానికి, ప్రత్యేకించి ఆమె తల్లిదండ్రులకు తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చింది. ఆ దుఃఖం నుండి బయటపడేందుకు నాకు సహాయం చేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడిని. “మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?” అనే ఆర్టికల్ ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. అది సరైన సమయానికి నాకు అందింది.
ఐ. డి., జర్మనీ
మొదట నేను ఈ ఆర్టికల్ చదవడానికి అస్సలు ఇష్టపడలేదు. దానిలోని విషయాలు నాకు బాధ కలిగిస్తాయని నేను అనుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం మా అన్నయ్య అనారోగ్యంతో మరణించాడు, ఆ విషాదంనుండి నేను భావోద్వేగపరంగా ఇంకా కోలుకోలేదు. అయితే యెహోవా మనకు మంచి బహుమానాలు ఇచ్చే దేవుడు అని ఈ ఆర్టికల్ నాకు గుర్తు చేసింది. నా మానసిక గాయాలు వెంటనే నయమవడం ప్రారంభించినట్లు నేను గ్రహించాను, ఈ అస్థిరమైన లోకంలో నా జీవితాన్ని కొనసాగించడానికి నేను ధైర్యాన్ని కూడగట్టుకున్నాను.
ఎస్. హెచ్., జపాన్ (g05 1/8)
విరూపియైన అమ్మాయి మైలీన్ అనుభవం చదివి నేనెంతో చలించిపోయాను. (“మైలీన్‌కు ఒక కొత్త ముఖం,” జూలై-సెప్టెంబరు, 2004) ఈ 11 సంవత్సరాల అమ్మాయి ఘోరమైన వ్యాధితో పోరాడుతూనే తన బైబిలు ఆధారిత నిరీక్షణ గురించి ఇతరులతో మాట్లాడే విధానం గురించి చదవడం నన్నెంతో ప్రోత్సహించింది.
ఎమ్. బి., ఇటలీ
మైలీన్, ఆమె కుటుంబ సభ్యులు కనబరచిన అనుకూల దృక్పథం నన్నెంతో ప్రోత్సహించింది. నేటి లోకంలో ప్రచార మాధ్యమాలు వ్యక్తిగత రూపానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాయి. అది నిరుత్సాహపరిచేదిగా ఉండవచ్చు. నేను తన నిజమైన సౌందర్యాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను అని మైలీన్‌కు చెప్పాలనుకుంటున్నాను. యెహోవా తన నూతనలోకంలో ఆమెకు ఒక కొత్త ముఖాన్ని ఇచ్చినప్పుడు ఆమెతోపాటు సంతోషించడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆమె విశ్వాసం నన్ను బలపరిచింది.
ఎమ్. ఎస్., అమెరికా
నేను త్వరలోనే నా వక్షాల్లో ఒకదానిని తీసివేయించుకోడానికి ఆపరేషన్ చేయించుకోబోతున్నాను. అనారోగ్యం కారణంగా మన రూపం పాడైనప్పుడు, మానసికంగా కృంగిపోకుండా ఉండడానికి ఎంతో బలం అవసరం. మైలీన్ ధైర్యం, ఆమె అనుకూల దృక్పథం నన్ను బలపరిచాయి. మైలీన్‌కు నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను: నీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. నా దృష్టిలో నువ్వు ఎంతో అందమైనదానివి!
జి. ఆర్., ఫ్రాన్స్
నేను తొర్రి పెదవిగల శారీరక లోపంతో పుట్టాను. స్కూల్లోని పిల్లలు నన్ను వింతగా చూసేవారు. కొంతమంది నాపై ఉమ్మివేసేవారు కూడా. అలాంటి సమయాల్లో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి నాకు సహాయం చేసింది మా అమ్మ నాకు బైబిలునుండి బోధించిన విషయాలేనని నేను నమ్ముతున్నాను. నాకు ఇప్పుడు 31 సంవత్సరాలు, ఇప్పటికి కూడా నేను నా రూపం గురించి బాధపడుతుంటాను. నన్ను మైలీన్ అనుభవం ఎంతో కదిలించింది. యెహోవా సహాయంతో మనం మనకు ఎదురవబోయే ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చని నేను అర్థం చేసుకున్నాను.
టి. ఎస్., జపాన్
సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేది బాహ్య రూపం కాదని మైలీన్ నన్ను ఒప్పించింది. అలాంటి సంతోషమూ సంతృప్తీ మనం మన దేవునికి సేవ చేస్తూ ఆయనను ప్రేమిస్తేనే వస్తాయి. మైలీన్ ఉదాహరణ నాకు ఒక స్ఫూర్తిగా ఉంది.
ఏ. టి., ఫిలిప్పీన్స్ (g05 3/8)