మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?
మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?
ఇండియాలోని తేజరిల్లు! రచయిత
మీరు ఎప్పుడైనా మొసలిని చూసి చిరునవ్వు చిందించాలనుకుంటారా? “మొసలిని చూసి చిరునవ్వు చిందించవద్దు సుమా!” అని పీటర్ ప్యాన్ అనే పిల్లల కథకు సంబంధించిన సంగీత రూపకంలో క్యాప్టన్ హుక్ అనే పాత్ర అంటాడు. ఆ తర్వాత తాను అలా అనడానికి కారణం చెబుతూ మొసలి “నువ్వు తన కడుపులో పడతావో లేదో ఆలోచిస్తుంటుంది” అని చెబుతాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల మొసళ్ళలో కొన్ని మానవులపై దాడి చేస్తాయనేది నిజమే అయినా “అది ఎంత అరుదుగా జరుగుతుందంటే . . . మొసళ్ళను మనం నరభక్షకులుగా పరిగణించలేము.” (ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా) మొసళ్ళను కొందరు వికారమైన భయపెట్టే జంతువులుగా దృష్టిస్తే మరికొందరు వాటిని ఆసక్తికరమైన ప్రాణులుగా దృష్టిస్తారు. మనం ఇండియాకు చెందిన మూడు జాతుల మొసళ్ళను అంటే ఉప్పునీటి మొసలి, మగ్గర్, గెవియల్ అనే వాటిని పరిశీలిద్దాం.
పెద్ద ఉప్పునీటి మొసలి
ఉప్పునీటి లేదా నదీముఖజలాల మొసళ్ళు భూమిపై ఉన్న సరీసృపాలలోకెల్లా పెద్దవి, అవి 7 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరిగి, 1,000 కిలోల బరువు తూగుతాయి. అవి కేవలం ఉప్పునీటిలో మాత్రమే జీవిస్తాయి కాబట్టి ఇండియానుండి ఉత్తర ఆస్ట్రేలియా వరకూ సముద్ర తీరాల వెంబడి ఉండే మ్యాన్‌గ్రోవ్ చిత్తడి నేలల్లోనూ, నదీముఖజలాల్లోనూ, సముద్రాల్లోనూ కనిపిస్తాయి. అవి మాంసభక్షక ప్రాణులు కాబట్టి ఎలుకలను, కప్పలను, చేపలను, పాములను, పీతలను, తాబేళ్ళను, జింకలను తక్కువ పరిమాణాల్లో తింటాయి; పెద్ద పెద్ద మగ మొసళ్ళు రోజుకు సగటున కేవలం 500 నుండి 700 గ్రాముల ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఎండలో పడుకొని ఉండడం లేదా నీటిలో తేలడం మాత్రమే చేసే ప్రశాంతమైన జీవిత విధానంవల్లా, సమర్థవంతమైన జీర్ణకోశ వ్యవస్థవల్లా వాటికి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. పెద్ద మొసలి మాత్రం అప్పుడప్పుడూ అజాగ్రత్తగా ఉన్న మానవులపై దాడి చేస్తుంది. ఈ ఉప్పునీటి మొసళ్ళు తమ తోకను ఒక పక్కనుండి ఇంకో పక్కకు కదిలిస్తూ ఈదుతాయి, తమ ముక్కుపుటలు కళ్ళు తప్ప మిగతా శరీరాన్నంతా నీటిలోనే ఉంచుతాయి, అవి వాటి పొట్టి కాళ్ళతో నడుస్తాయి. అవి ఆహారాన్ని అందుకోవడానికి గెంతగలవు కూడా, కొన్నిసార్లు తమ ఆహారాన్ని వేటాడుతూ అవి వేగంగా పరుగెత్తగలవు. మిగతా అన్ని మొసళ్ళలాగే ఉప్పునీటి మొసళ్ళకు కూడా వాసన చూసే శక్తి, కంటి చూపు, వినికిడి శక్తి చాలా బాగుంటాయి. మగ మొసలి జతకట్టే సమయంలో సమీప ప్రాంతాల్లోకి ఎవ్వరిని రానివ్వకుండా జాగ్రత్తపడుతుంది, ఆడ మొసలి కూడా తన గుడ్లకు కాపలా కాసేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉంటుంది.
శ్రద్ధగల తల్లులు
ఆడ మొసలి నీటి దగ్గర గూడు కడుతుంది, అది సాధారణంగా కుళ్ళిపోతున్న ఆకులు, మొక్కలు కలిపి మట్టితో కట్టిన దిబ్బ మాత్రమే. ఆ తర్వాత అది దాదాపు 100 గట్టి పెంకుగల గుడ్లను పెట్టి, వాటిని కప్పి, ఇతర జంతువులనుండి వాటిని కాపాడుతుంది. తర్వాత అది ఆ దిబ్బపైకి నీళ్ళు చల్లుతుంది, దానితో గుడ్లను కప్పివుంచిన ఆకులు, మొక్కలు మరింత కుళ్ళిపోవడం
ప్రారంభించి గుడ్లు పొదగడానికి అవసరమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి.ఆ తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. ప్రతీ గుడ్డు పొదగబడిన ఉష్ణోగ్రతనుబట్టి, పుట్టబోయే మొసలి ఆడదో, మగదో నిర్ణయించబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి! ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ నుండి 31 డిగ్రీలు ఉంటే, దాదాపు 100 రోజుల తర్వాత గుడ్లనుండి ఆడ మొసళ్ళు బయటకువస్తాయి; అలా కాకుండా ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్ ఉంటే, 64 రోజుల్లోపు మగ మొసళ్ళు బయటకు వస్తాయి. 32.5 డిగ్రీల సెల్సియస్ నుండి 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పొదగబడిన గుడ్లనుండి ఆడ మొసళ్ళు లేదా మగ మొసళ్ళు కూడా బయటకు రావచ్చు. మొసలి తన గూడును ఒకవైపు నీటి ఒడ్డు ఉండేటట్లు మరోవైపు సూర్యుని ఎండ తగిలేటట్లు కడితే, వేడిగా ఉన్న వైపునుండి మగ మొసళ్ళు, చల్లగా ఉన్నవైపు నుండి ఆడ మొసళ్ళు బయటకు వస్తాయి.
తల్లి మొసలికి గుడ్లనుండి బయటకు వస్తున్న తన పిల్లల చప్పుడు వినిపిస్తే అది గూడుపై కప్పివుంచిన ఆకులను, మొక్కలను తీసివేస్తుంది, పిల్ల మొసళ్ళు పెంకు పగలగొట్టడానికి తమకు ప్రత్యేకంగా ఉన్న పళ్ళతో గుడ్లను పగలగొట్టుకుని అప్పటికే బయటకు వచ్చివుంటాయి, ఒకవేళ అవి అలా బయటకు రాకపోతే తల్లి మొసలి గూడుపై కప్పివుంచినవాటిని తీసేటప్పుడు మిగతా గుడ్లను పగలగొట్టి పిల్లలు బయటకు రావడానికి సహాయం చేస్తుంది. అది తన దవడలతో వాటిని జాగ్రత్తగా పైకెత్తి, తన నాలుక క్రింద ఉన్న సంచిలో పెట్టుకుని నీటి దగ్గరకు తీసుకెళుతుంది. మొసళ్ళు పుట్టిన వెంటనే స్వతంత్రంగా జీవించడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి వెంటనే అవి పురుగులు, కప్పలు, చిన్న చేపల కోసం వెదకడం ప్రారంభిస్తాయి. అయితే జాగ్రత్తగల కొన్ని తల్లి మొసళ్ళు మాత్రం ఎన్నో నెలల వరకూ తమ పిల్లల దగ్గరే ఉంటాయి, తండ్రి మొసలి పిల్లల దగ్గర ఉండి వాటిని రక్షించడానికి వీలుగా అవి పిల్లలను చూసుకోవడానికి చిత్తడినేలల్లో ప్రత్యేక ప్రాంతాలను కేటాయిస్తాయి.
మగ్గర్, పొడుగు ముక్కు గెవియల్
మగ్గర్ లేదా చిత్తడినేల మొసలి, గెవియల్ ప్రత్యేకంగా ఇండియా ఉపఖండానికి చెందినవి. దాదాపు నాలుగు మీటర్ల పొడవుండే మగ్గర్, ఇండియా అంతటా మంచినీటి చిత్తడి నేలల్లోనూ చెరువుల్లోనూ నదుల్లోనూ కనిపిస్తుంది, అది ఉప్పునీటి మొసలితో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. అది తన శక్తిమంతమైన దవడలతో చిన్న జంతువులను పట్టుకొని, వాటిని నీటిలో ముంచి, వాటి మాంసాన్ని చీల్చడానికి వాటిని అటూ ఇటూ ఊపుతుంది.
మగ్గర్‌లు ఎలా జతకడతాయి? మగ మగ్గర్ జత కోసం వెతికేటప్పుడు తన దవడలను నీటిపై కొట్టి గుర్రుమని శబ్దం చేస్తుంది. ఆ తర్వాత అది గూడును కాపాడడంలో, గుడ్లనుండి పిల్లలు బయటికి రావడానికి సహాయపడడంలో, వాటితోపాటు కొంతకాలంపాటు ఉండడంలో ఆడ మగ్గర్‌కు సహాయం చేస్తుంది.
అరుదైన గెవియల్ నిజానికి మొసలి జాతికి చెందినది కాదు, దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పొడుగ్గా సన్నగా ఉండే దవడలవల్ల దానిని గుర్తించడం చాలా తేలిక, దాని దవడలు దాని ముఖ్య ఆహారమైన చేపలను పట్టుకోవడానికి చక్కగా పనికివస్తాయి. ఇది ఉప్పునీటి మొసలి అంత పొడుగు ఉన్నా, మానవులపై దాడి చేయదు. దాని నునుపైన సన్నని శరీరంవల్ల అది ఉత్తర ఇండియాలో వేగంగా ప్రవహించే లోతైన నదుల్లో వేగంగా ఈదగలదు. గెవియల్‌లు సంతానోత్పత్తి చేసే సమయంలో మగ గెవియల్‌కు మూతి చివరన గుండ్రని గడ్డ పెరుగుతుంది. దానివల్ల అది మామూలుగా చేసే గుర్రుమనే శబ్దంకన్నా పెద్ద శబ్దం చేయగలుగుతుంది, ఆ శబ్దంతో అది ఆడ గెవియల్‌లను ఆకర్షిస్తుంది.
పర్యావరణంలో వాటి పాత్ర
మొసళ్ళు మన పర్యావరణానికి ఎంత ప్రాముఖ్యమైనవి? అవి
నదులనుండి, చెరువులనుండి చనిపోయిన చేపలనే కాక దగ్గర్లోని స్థలాలనుండి చనిపోయిన జంతువులను కూడా తొలగించి శుభ్రం చేస్తాయి. దానివల్ల నీరు శుభ్రంగా ఉంటుంది. ఇతర జంతువులను తినే ప్రాణులుగా అవి బలహీనమైన, గాయపడిన, జబ్బుపడిన జంతువులపై దాడి చేస్తాయి. మానవులు తినడానికి అనువైన కార్ప్ చేపలను, టిలాప్యా చేపలను తినే క్యాట్‌ఫిష్ వంటి చేపలను అవి తింటాయి.బ్రతికి ఉండడానికి చేస్తున్న పోరాటం—మొసలి కన్నీళ్ళు కాదు
ఒక వ్యక్తి మొసలి కన్నీళ్ళు కారుస్తున్నాడని ఎవరైనా అనడం మీరు విన్నారా? అంటే ఆ వ్యక్తి కన్నీళ్ళు, దుఃఖం యథార్థమైనవి కావని దానర్థం. నిజానికి మొసలి తన శరీరంలోని అధిక లవణాలను బయటకు పంపడానికి కన్నీళ్ళు కారుస్తుంది. అయితే 1970ల ఆరంభంలో బహుశా మొసళ్ళ కోసం యథార్థమైన కన్నీళ్ళే కార్చబడి ఉండవచ్చు. అప్పటికి ఇండియాలో కేవలం కొన్ని వేల మొసళ్ళు మాత్రమే మిగిలాయి, అంటే అంతకుముందు ఉన్న సంఖ్యలో కేవలం 10 శాతం మొసళ్ళు మాత్రమే మిగిలాయి. ఎందుకలా జరిగింది? మానవులు వాటి నివాస స్థలాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పుడు, మొసళ్ళు చిన్న జంతువులకూ బలహీన జంతువులకూ ప్రమాదకరంగా దృష్టించబడ్డాయి కాబట్టి ప్రజలు వాటిని చంపేశారు. చాలామందికి మొసలి గుడ్లు, వాటి మాంసం రుచికరంగా అనిపించాయి. మొసళ్ళ రసగ్రంధులు పరిమళాలను తయారుచేయడానికి ఉపయోగించబడేవి. అంతేకాకుండా ఆనకట్టలను నిర్మించడం, నీటి కాలుష్యం వంటివి మొసళ్ళ సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యాయి. అయితే అవి దాదాపు అంతరించిపోయే పరిస్థితికి రావడానికి కారణం వాటి చర్మానికున్న గిరాకీయే. మొసలి చర్మంతో చేసిన బూట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, సూట్‌కేసులు, బెల్టులు, ఇతర వస్తువులు అందంగా ఉంటాయి, ఎంతో కాలం మన్నుతాయి, అందరికీ ఇష్టమైనవి. మొసళ్ళకు ఈ ప్రమాదం ఇప్పటికీ ఉన్నా, వాటిని సంరక్షించడానికి తీసుకోబడిన చర్యలు ఎంతో విజయవంతమయ్యాయి—క్రింద ఉన్న బాక్సును చూడండి.
చిరునవ్వు చిందించడం మరచిపోకండి!
ఇప్పుడు మొసలి కుటుంబానికి చెందిన కొన్ని జాతుల గురించి మీకు తెలుసు కాబట్టి, వాటి గురించి మీ అభిప్రాయమేమిటి? మీకు ఇప్పటివరకున్న ప్రతికూల దృక్పథం పోయి, వాటిపట్ల మీకు ఆసక్తి పెరిగిందని మేము ఆశిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు చాలామంది పెద్ద ఉప్పునీటి మొసలిని చూసి భయపడవలసిన అవసరం ఉండని కాలం కోసం ఎదురు చూస్తున్నారు. సరీసృపాల సృష్టికర్త ఈ భూమిని కొత్తగా మార్చినప్పుడు, మనం మొసళ్ళను చూసి చిరునవ్వు చిందించగలుగుతాము.—యెషయా 11:8, 9. (g05 3/8)
[25వ పేజీలోని బాక్సు/చిత్రం]
మెడ్రాస్ క్రోకడైల్ బ్యాంక్
ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, అడవుల్లో ఇంకా కొన్ని మొసళ్ళు మాత్రమే మిగిలివున్నాయని ఒక సర్వేలో తేలిన తర్వాత, 1972లో మెడ్రాస్ స్నేక్ పార్క్‌లో మొసళ్ళ సంరక్షణ ప్రారంభమైంది. ఇండియాలోవున్న 30 కంటే ఎక్కువ సరీసృప కేంద్రాల్లో మెడ్రాస్ క్రోకడైల్ బ్యాంక్ అత్యంత పురాతనమైనది, పెద్దది కూడా. దానిని 1976లో సరీసృప శాస్త్రజ్ఞుడు రామ్యులస్ విటెకెర్ స్థాపించారు. కోరమండల్ తీరప్రాంతంలో ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఆ బ్యాంక్‌లో 150 జాతుల చెట్లు ఉన్నాయి, అవి అందమైన పక్షులను, కీటకాలను ఆకర్షిస్తాయి.
అక్కడ మొసళ్ళు, గెవియల్‌లు నిర్బంధంలో పెంచబడిన తర్వాత చిత్తడినేలల్లోనూ, నదుల్లోనూ విడిచిపెట్టబడతాయి లేదా ఇతర పోషణా కేంద్రాలకు, పరిశోధనా కేంద్రాలకు పంపించబడతాయి. క్రోకడైల్ బ్యాంక్‌లో ఒక నర్సరీ ఉంది, అక్కడ ఒక్కోసారి 2,500 కంటే ఎక్కువ సంఖ్యలో పిల్ల మొసళ్ళు చెరువుల్లో పెంచబడతాయి, రోజూ స్థానిక జాలరులు ఇచ్చే చేపలను ముక్కలుగా కోసి వాటికి వేస్తారు. పెద్ద పక్షులు దాడిచేసి చేపలను లేదా బలహీనమైన పిల్ల మొసళ్ళను ఎత్తుకెళ్లకుండా కాపాడేందుకు ఆ చెరువులకు పైగా వలలు ఉంటాయి. ఆ పిల్ల మొసళ్ళు పెరుగుతున్న కొద్దీ వాటిని పెద్ద చెరువులకు మారుస్తారు, దాదాపు మూడు సంవత్సరాలు వచ్చి 1.25 నుండి 1.5 మీటర్ల పొడవు పెరిగే వరకూ వాటిని అక్కడే ఉంచి వాటికి చేపలను ఆహారంగా వేస్తారు. ఆ తర్వాత వాటికి, మాంసాన్ని ప్యాక్ చేసే ఒక పెద్ద కంపెనీ పంపించే వ్యర్థమైన మాంసాన్ని ఆహారంగా వేస్తారు. ఆ బ్యాంక్ మొదట్లో ఇండియాకు చెందిన 3 రకాల మొసళ్ళను మాత్రమే పెంచేది, కానీ ఇప్పుడు అక్కడ మరో 7 జాతులు కూడా ఉన్నాయి, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అన్ని జాతుల మొసళ్ళను అక్కడ పెంచడానికి ప్రణాళికలు వేయబడుతున్నాయి. మొసళ్ళ చర్మాన్ని, మాంసాన్ని అమ్మి వాణిజ్య సంబంధమైన లాభాలు సంపాదించేందుకు వాటిని పెంచాలా వద్దా అనే విషయంపై కూడా చర్చలు జరిగాయి. మొసళ్ళ మాంసం రుచిగా ఉండడమే కాకుండా తక్కువ కొలస్ట్రాల్‌తో ఉంటుందని విటెకెర్ తేజరిల్లు!కు చెప్పారు. సమర్థవంతమైన సంరక్షణవల్ల ఈ పెద్ద ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం నుండి బయటపడి, అధికంగా వర్ధిల్లే స్థాయికి చేరుకున్నాయి. సందర్శకులను ఆకర్షించే మెడ్రాస్ క్రోకడైల్ బ్యాంక్, మొసళ్ళ గురించిన తప్పుడు అభిప్రాయాలను తొలగించి ప్రజలకు వాటిపట్ల ఉన్న అభిప్రాయాన్ని మెరుగుపర్చాలనే లక్ష్యంతో కూడా పనిచేస్తోంది.
[చిత్రసౌజన్యం]
రామ్యులస్ విటెకెర్, మెడ్రాస్ క్రోకడైల్ బ్యాంక్
[23వ పేజీలోని చిత్రం]
పెద్ద ఉప్పునీటి మొసలి
[24వ పేజీలోని చిత్రం]
ఆడ ఉప్పునీటి మొసలి తన పసికూనను దవడలలో మోసుకొని వెళ్ళడం
[చిత్రసౌజన్యం]
© Adam Britton, http://crocodilian.com
[24వ పేజీలోని చిత్రం]
మగ్గర్
[చిత్రసౌజన్యం]
© E. Hanumantha Rao/Photo Researchers, Inc.
[24వ పేజీలోని చిత్రం]
పొడుగు ముక్కు గెవియల్