ఇంటిని శుభ్రంగా ఉంచడంలో మనందరి పాత్ర
ఇంటిని శుభ్రంగా ఉంచడంలో మనందరి పాత్ర
మెక్సికోలోని తేజరిల్లు! రచయిత
శుభ్రంగా, నిర్మలంగా ఉండే పరిసరాల్లో జీవించడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా! అయితే నగరాల్లో చెత్తాచెదారం విపరీతంగా పెరిగిపోతుండడంతో మన పరిసరాలను శుభ్రంగా, సక్రమంగా ఉంచుకోవడం మరింత కష్టమవుతుంది.
స్థానిక ప్రభుత్వాలు చెత్తను ఏరివేసే ఏర్పాట్లను చేయడం ద్వారా వీధులను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాయి, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి, చూడడానికి అసహ్యంగా, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా తయారవుతుంది. అలా పేరుకుపోయిన చెత్త ఎలుకలూ, బొద్దింకలూ, ఆరోగ్యానికి హానికారకమైన ఇతర కీటకాలూ అధికమవడానికి కారణమవుతుంది. అలాంటి పరిస్థితి గురించి మీరు ఏమైనా చేయవచ్చా? చేయవచ్చు, మీ ఇంటినీ పరిసరాలనూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోండి.
సరైన మనోవైఖరి
పేదరికానికీ మురికి వాడలకూ మురికి ఇండ్లకూ అవినాభావ సంబంధం ఉంటుందని కొంతమంది భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. సరైన వనరులు లేకపోతే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట నిజమే అయినా, ఒక స్పానిష్ సామెత చెబుతున్నట్లు, “పేదరికానికీ పరిశుభ్రతకూ వైరమేమీ లేదు.” మరోవైపు చూస్తే, ఒక వ్యక్తికి సరైన వనరులు ఉన్నంతమాత్రాన అతడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాడనేమీ లేదు.
ఇంటినీ ఇంటి పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవడం అనేది మన క్రియల రూపంలో వ్యక్తమయ్యే మన మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా మట్టుకు కుటుంబమంతటి మనోవైఖరి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా మన ఇండ్లనూ మనం ఉంటున్న పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకునేందుకు మనమందరం ఏమి చేయగలమో పరిశీలించడం మంచిది.
శుభ్రపరిచే కార్యక్రమం
ఒక తల్లి చేసే ఇంటిపని ఎప్పటికీ పూర్తి కాదనిపిస్తుంది. ఆమె వంట చేయడం, పిల్లల్ని తయారుచేసి స్కూలుకు పంపించడంతోపాటు ఇంటినీ పరిసరాలనూ శుభ్రంగా ఉంచేందుకు కూడా పని చేయాల్సి ఉంటుంది. మాసిపోయిన బట్టలనూ పిల్లలు తమ గదుల్లో అటూ ఇటూ పడేసిన వస్తువులనూ తీసేది తరచూ తల్లేనని మీరు గమనించారా? శుభ్రం చేయడంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనగలిగే కార్యక్రమాన్ని తయారుచేస్తే, తల్లి చేసే పనుల భారాన్ని తగ్గించేందుకు అది దోహదపడుతుంది.
ఇంట్లో రోజూ శ్రద్ధ తీసుకోవలసినవి, శుభ్రం చేయవలసినవి కొన్ని ఉండగా మరి కొన్నిటిని వారానికి ఒకసారి ఇంకా కొన్నిటిని నెలకు ఒకసారి శుభ్రం చేస్తే చాలని కొందరు గృహిణులు నిర్ణయిస్తారు. నిజానికి సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేస్తే సరిపోయేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆయా దేశాల్లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లోని బెతెల్ గృహాల్లో వ్యక్తిగత సామాన్లూ, బట్టలూ పెట్టుకునే
చిన్న గదిని సంవత్సరానికి ఒకసారి పూర్తిగా శుభ్రం చేస్తారు. ఉపయోగించకుండా మూలకు పడేసి ఉన్నవాటిని తీసేసి గదిని సక్రమంగా సర్దుకునే సమయం అది. క్రమబద్ధంగా గోడలను శుభ్రం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది.మంచి ఆరోగ్యం కోసం, ఇంట్లో మరుగుదొడ్డి, స్నానాల గది వంటి స్థలాలను శుభ్రంగా ఉంచడం చాలా ప్రాముఖ్యం. వాటిని రోజూ కొంతమేరకు శుభ్రం చేయడం అవసరమే అయినప్పటికీ, మరింత శుభ్రంగా బహుశా వారానికి ఒకసారైనా బాగా శుభ్రం చేస్తే బ్యాక్టీరియా వృద్ధి కాకుండా ఉంటుంది. కొందరు మరుగుదొడ్డి తొట్టిలోని మరకలు అలాగే ఉంటాయి, వాటిని పోగొట్టడం అసాధ్యం అని భావిస్తారు. అయితే మరుగుదొడ్లు పూర్తి శుభ్రంగా, తళ తళ మెరుస్తూ ఉండే ఇండ్లు కూడా మీకు కనబడతాయి. దానికి కావల్సిందల్లా క్రమంగా శుభ్రం చేయడం, శుభ్రం చేయడానికి సరైన ఉత్పత్తులను వాడడమే.
వంటగదిని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. మీరు వంటపాత్రల్నీ, స్టౌనీ, వంటచేసే స్థలాన్నీ తరచూ శుభ్రం చేస్తున్నప్పటికీ కనీసం నెలకు ఒకసారైనా బాగా శుభ్రం చేయడం మంచిది. ఏవైనా ఉపకరణాలు ఉంటే వాటికీ గోడలకూ మధ్య భాగాన్నీ, సింకు కింది భాగాన్నీ శుభ్రం చేయాలి. సరుకులు పెట్టుకునే గదిని లేదా అల్మరాను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటే బొద్దింకలూ ఇతర హానికరమైన కీటకాలూ చేరకుండా ఉంటాయి.
కుటుంబ సహకారం
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఉదయం స్కూలుకు వెళ్ళే ముందు తమ గదిలో పక్క బట్టలు చక్కగా సర్దేసి, మాసిపోయిన బట్టలను సరైన స్థలంలో పెట్టి, తమ వస్తువులను సక్రమంగా సర్దుకొని వెళ్ళాలని కొన్ని నియమాలు పెట్టి వారికి శిక్షణ ఇస్తారు. అందరికీ ఉపయోగపడే ఒక మంచి నియమం ఏమిటంటే, “ప్రతిదానికీ ఒక స్థలం ఉండాలి, ప్రతీది దాని దాని స్థలంలో ఉండాలి.”
అంతేగాక, కుటుంబంలోని కొందరు సభ్యులు ఒక్కో పనిని లేదా ఇంట్లోని ఒక భాగాన్ని శుభ్రం చేయడాన్ని తమ బాధ్యతగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, తండ్రి కనీసం సంవత్సరానికి ఒకసారి గ్యారేజీని చక్కగా సర్ది శుభ్రం చేసే బాధ్యతను చేపడతాడా? ఈ పనిలో తండ్రికి సహాయం చేయడానికి పిల్లల్లో ఒకరు ముందుకు రాగలరా? పెరట్లోని పిచ్చి మొక్కలను, గడ్డిని తీసివేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఇంటి పెరటి భాగం చూడ్డానికి మంచిగా కనబడాలంటే ఈ పనిని ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? అనవసరమైన వస్తువులను తీసేసి చక్కగా ఉంచాల్సిన అటక గానీ చిన్నగది గానీ ఉందా? ఉంటే దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? కొందరు తల్లిదండ్రులు ఇలాంటి పనులను వంతులవారీగా పిల్లలతో చేయిస్తారు.
కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు ఒక పట్టిక
తయారుచేయండి. మీరే శుభ్రం చేసుకోవాలన్నా, మీ కుటుంబంతో లేదా వేరే ఎవరితోనైనా శుభ్రం చేయించాలన్నా దానికి ఖచ్చితమైన ఒక కార్యక్రమం అవసరం. ఇంటిని చాలా శుభ్రంగా, చక్కగా ఉంచే ఒక తల్లి ఇంటిని శుభ్రంగా ఉంచడంలో తన కుటుంబమంతా ఎలా సహకరిస్తుందో చెబుతోంది: “నేనూ నా ముగ్గురు కూతుర్లూ కలిసి ఇంటి పనిని పంచుకుంటాం. నోర్మా ఆడ్రీనా హాలు, రెండు పడక గదులు, వరండా, వాకిలి శుభ్రం చేస్తుంది. ఆనా కోవాకీనా వంటగది శుభ్రం చేస్తుంది. నేనేమో బట్టలు ఉతకడంతోపాటు ఇతర పనులను చూసుకుంటాను, మారియా డెల్‌కార్‌మన్ గిన్నెలు కడుగుతుంది.”ఇంటి బయట ఆహ్లాదకరంగా ఉంచాలి
ఇంటి బయటి సంగతి ఏమిటి? మీరు ఉండేది పెద్ద భవంతి అయినా చాలా చిన్న ఇల్లైనా, మీ ఇంటి బయటి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచే కార్యక్రమం ఉండాల్సిందే. ఉదాహరణకు ఫెన్సింగుకు ఉన్న గేటు కొక్కెం ఒకటి ఊడిపోయిందే అనుకోండి. అది పడిపోయేంత వరకు రిపేరు చేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే అది చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు తెలుసు. అదేవిధంగా ఇంటి గుమ్మం దగ్గర గానీ ఇంట్లోకి వచ్చే దారిలో గానీ చెత్త పేరుకుపోయేలా వదిలేసినా అసహ్యంగానే ఉంటుంది. కొన్నిసార్లు ఇంటి బయట డబ్బాలు, పనిముట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. అవి క్రిమి కీటకాలకు ఆశ్రయంగా మారతాయి.
కొన్ని కుటుంబాలు తమ ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చే దారి ఇరుప్రక్కలను, ఇంటి ముందటి వీధిని కూడా అవసరాన్ని బట్టి రోజుకు ఒకసారి గానీ వారానికి ఒకసారి గానీ ఊడ్వాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేస్తుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మునిసిపాలిటీ వసతులే లేవు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో మనమందరం మన పాత్ర మనం పోషిస్తే అవి చక్కగా, మన ఆరోగ్యానికి మరింత దోహదపడేవిగా ఉంటాయి.
కొన్ని కుటుంబాలు పైన చెప్పిన ఇంటిపనులను చేయడమే కాదు, వాటిని ఒక కాగితం మీద వ్రాసి కుటుంబ సభ్యులందరూ దాన్ని చూసి, పాటించేందుకు అనువైనచోట పెడతారు కూడా. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శుభ్రం చేయడం గురించి మీరు తెలుసుకోవలసినవన్నీ మేము ఇందులో చేర్చలేదు. ఉదాహరణకు, మీ ప్రాంతంలో శుభ్రం చేయడానికి ఏ ఉత్పత్తులు సముచితంగా ఉంటాయో, మీ వనరులను బట్టి ఏ ఉపకరణాలను మీరు తెచ్చుకోగలరో మీరే నిర్ణయించుకోవాలి.
క్లుప్తమైన ఈ సలహాలు, మీ ఇంటినీ మీ పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులందరి దృష్టికి తెస్తాయనడంలో సందేహం లేదు. ఇంటినీ ఇంటి పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవడం అనేది మీ వనరుల మీద కాదు, మీ మనోవైఖరి మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. (g05 6/8)
[22, 23వ పేజీలోని బాక్సు]
ఇంటిని శుభ్రం చేయడానికి ఆచరణాత్మకమైన కార్యక్రమం
పట్టికలోని ఖాళీ స్థలాన్ని మీ సొంత అంశాలను చేర్చడానికి ఉపయోగించుకోండి
ముఖ్యమైన గమనిక: శుభ్రం చేయడానికి ఉపయోగించే ఉత్పత్తులను ఒకదానితో మరొకటి కలపడం ప్రత్యేకించి సోడాను అమ్మోనియాతో కలపడం చాలా ప్రమాదకరం
✔ప్రతీరోజు
❏ పడకగది: పడకలను సర్ది, గదిలోని వస్తువులన్నిటినీ సక్రమంగా పెట్టండి
❏ వంటగది: వంటపాత్రలనూ సింకునూ కడగండి. టేబులు మీద, అరుగు మీద ఏమీ చిందరవందరగా లేకుండా చక్కగా శుభ్రంగా ఉంచండి. గదంతా ఊడవండి లేదా అవసరమైతే తడిబట్టతో తుడవండి
❏ స్నానాలగది: సింకును, టాయ్‌లెట్‌ను శుభ్రం చేయండి. వస్తువులన్నిటినీ సక్రమంగా పెట్టండి
❏ హాలు, వేరే గదులు: వస్తువులను సక్రమంగా ఉంచండి. ఫర్నీచరును కొద్దిగా శుభ్రం చేయండి. గదంతా ఊడ్చి తడిబట్టతో తుడవండి, లేదా అవసరమైతే వాక్యూమ్ చేయండి
❏ ఇల్లు మొత్తం: చెత్తను ఎప్పటికప్పుడు తీసేయండి
✔వారం వారం
❏ పడకగది: పక్కమీద పరచిన దుప్పటిని మార్చండి. గదిని ఊడవండి, తడిబట్టతో తుడవండి అవసరమైతే వాక్యూమ్ చేయండి. ఫర్నీచరు మీది దుమ్ము దులిపేయండి
❏ వంటగది: స్టౌ, మిక్సీ వంటి ఉపకరణాలను, సింకు ఫిట్టింగులను శుభ్రం చేయండి. గదిని తడిబట్టతో తుడవండి
❏ స్నానాలగది: స్నానాల గదిలోని గోడలనూ, ఫిట్టింగులనూ అన్నిటినీ కడగండి. టాయ్‌లెట్‌ను, క్యాబినెట్‌ను, ఇతర ఉపరితల భాగాలను క్రిమిసంహారక పదార్థంతో శుభ్రం చేయండి. తువ్వాళ్లను మార్చండి. నేలను ఊడవండి లేదా తడిబట్టతో తుడవండి
✔ప్రతీ నెల
❏ స్నానాలగది: గోడలన్నీ చక్కగా శుభ్రం చేయండి
❏ ఇల్లు మొత్తం: గుమ్మాలను శుభ్రం చేయండి. ఫర్నీచరును బాగా శుభ్రం చేయండి లేదా వాక్యూమ్ చేయండి
❏ పెరడు, ఇంటి ముందరి భాగం, గ్యారేజి: అవసరమైతే ఊడ్చి శుభ్రం చేయండి. చెత్త గానీ అనవసరమైన వస్తువులు గానీ పోగుకాకుండా చూడండి
✔ప్రతీ ఆరు నెలలకు
❏ పడకగది: పక్క మీద అలంకరణ కోసం పరిచే దుప్పట్లను, వాటి తయారుదారీల సూచనల ప్రకారం శుభ్రం చేయండి
❏ వంటగది: ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసి బాగా శుభ్రం చేయండి
❏ స్నానాలగది: గోడల్లోని అరలను, సొరుగులను శుభ్రం చేయండి. అనవసరమైన వస్తువులను, కాలం చెల్లిన వాటిని పడేయండి
❏ ఇల్లు మొత్తం: లైట్లను, ఫ్యాన్లను, లైట్లకు సంబంధించిన ఇతర ఫిట్టింగులను శుభ్రం చేయండి. తలుపులను శుభ్రం చేయండి. కిటికీల జాలీలను, కిటికీలను, కిటికీ ఫ్రేములను కడగండి
✔ప్రతీ సంవత్సరం
❏ పడకగది: బీరువాలను, గోడల్లోని అరలను ఖాళీ చేసి బాగా శుభ్రం చేయండి. అనవసరమైన వస్తువులను తీసేయండి. బ్లాంకెట్లను ఉతికేయండి. పరుపులను వాక్యూమ్ చేయండి లేదా బాగా దులపండి. తలగడలను వాటి తయారీదారుల సూచనల ప్రకారం శుభ్రం చేయండి
❏ వంటగది: గోడల్లోని అరలను, వంట పాత్రలను పెట్టే అల్మారాలను, సొరుగులను ఖాళీ చేసి బాగా శుభ్రం చేయండి. అనవసరమైన వస్తువులను తీసేయండి. పరికరాలను పక్కకు జరిపి వాటి కింది స్థలాన్ని శుభ్రం చేయండి
❏ ఇల్లు మొత్తం: గోడలన్నిటినీ శుభ్రం చేయండి. ఫర్నీచరునూ కర్టెన్లనూ వాటి తయారీదారుల సూచనల ప్రకారం శుభ్రం చేయండి
❏ గ్యారేజీ, గిడ్డంగి వంటి స్థలాలు: శుభ్రంగా ఊడవండి. అనవసరమైన వస్తువులను సక్రమంగా సర్దిపెట్టండి లేదా తీసేయండి
[24వ పేజీలోని చిత్రాలు]
“ప్రతిదానికీ ఒక స్థలం ఉండాలి, ప్రతీది దాని దాని స్థలంలో ఉండాలి.”
[24వ పేజీలోని చిత్రాలు]
మీరు ఇక ఉపయోగించని వస్తువులను వేరేవాళ్ళకు ఇచ్చేయడం మంచిది