కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తోటపని మీకు ప్రయోజనకరమైనది

తోటపని మీకు ప్రయోజనకరమైనది

తోటపని మీకు ప్రయోజనకరమైనది

మీకు తోటపని చేయడమంటే ఇష్టమేనా? మీరు మీ అభిరుచి ద్వారా ఆహ్లాదం కన్నా ఎక్కువే పొందుతుండవచ్చు. “తోటపని మీ ఆరోగ్యానికి మంచిది, మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, మీ దీర్ఘాయుష్షుకు కూడా దోహదపడుతుంది” అని పరిశోధకులు రుజువులను కనుగొన్నారని లండన్‌లోని ఇండిపెండెంట్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది.

“దినమంతా పనులతో తలమునకలవుతూ ఒత్తిడితో గడిపిన తర్వాత ఇంటికి వచ్చి మీ తోటలో ప్రశాంతంగా సమయం గడపడం ఎంతో ఉపశమనాన్నిస్తుంది” అని గే సర్చ్‌ అనే రచయిత్రి అంటోంది. తోటపని ప్రయోజనకరంగా, ఆసక్తికరంగా ఉండడమే కాక వ్యాయామశాలలో చేసే వ్యాయామం కన్నా మంచి వ్యాయామం కూడా దానివల్ల లభిస్తుంది. అదెలా సాధ్యం? సర్చ్‌ అభిప్రాయం ప్రకారం, “తవ్వడం, ఆకులు ఊడ్చడం, నేలను చదును చేయడం మంచి వ్యాయామం, దానివల్ల సైక్లింగ్‌లో ఖర్చయ్యే క్యాలరీల కన్నా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.”

తోటపని ప్రత్యేకించి వయసు మళ్ళిన వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తగా మొలిచే రెమ్మ కోసమో మొలక కోసమో ఎదురుచూడడం భవిష్యత్తు విషయంలో సానుకూలంగా ఉండేందుకు వారికి తోడ్పడుతుంది. దాంతోపాటు వృద్ధాప్యంలో కలిగే “బాధకూ, వ్యాకులతకూ తోటపని ఉపశమనంగా పనిచేస్తుంది” అని రాయల్‌ హార్టికల్చరల్‌ సొసైటీకి చెందిన డాక్టర్‌ బ్రిజిడ్‌ బోర్డ్‌మాన్‌ చెబుతోంది. వయసు మళ్ళినవారు తాము ఇతరుల మీద ఆధారపడడం అధికమవుతున్నకొద్దీ తరచూ నిరుత్సాహపడతారు. అయితే, “మనం నాటినవి మన ఆధీనంలో ఉంటాయి కాబట్టి, తోట ఎలా ఉండాలి దాన్ని ఎలా చూసుకోవాలి అనే విషయాలను మనమే స్వయంగా నిర్ణయించుకోవచ్చు కాబట్టి మన ఆధీనంలో ఏదైనా ఉండాలనే కోరిక తీరుతుంది. ఇతరుల గురించి శ్రద్ధ తీసుకోవాలనే కోరిక మళ్ళీ నెరవేరుతుంది” అని డాక్టర్‌ బోర్డ్‌మాన్‌ పేర్కొంటోంది.

మానసిక సమస్యలు ఉన్నవారు అందమైన, ప్రశాంతమైన పరిసరాల్లో పని చేసినప్పుడు తరచూ ఉపశమనం పొందుతారు. అంతేకాదు ఇతరుల కోసం పూలను, కాయగూరలను పెంచడం వారు ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందేందుకు దోహదపడుతుంది.

అయితే తోటలోని పచ్చదనం ద్వారా కేవలం తోటపని చేసేవారు మాత్రమే ప్రయోజనం పొందరు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ రాజర్‌ అల్‌రిక్‌, ఒత్తిడిని అధికం చేసి పరీక్షించి చూసేందుకు ఎంపిక చేయబడిన కొంతమందిని పరిశీలించి చూశారు. పచ్చని చెట్ల పరిసరాల్లోకి తీసుకెళ్లినవారి గుండె స్పందన, రక్తపోటు పరిశీలించి చూసినప్పుడు వారు ప్రకృతికి దూరంగా ఉంచినవారి కన్నా త్వరగా కోలుకుంటున్నట్లు ఆయన కనుగొన్నారు. ఆపరేషన్‌ అయిన తర్వాత ఆసుపత్రిలో ఉండి కోలుకుంటున్న రోగులు, తమ గదుల్లో నుండి చెట్లను చూడగలిగేలాంటి గదుల్లో ఉండడం ద్వారా ప్రయోజనం పొందారని అలాంటి పరీక్షే తెలియజేసింది. ఇతర రోగులతో పోల్చిచూస్తే, అలాంటి గదుల్లో ఉన్న రోగులు “వేగంగా కోలుకొని ఇంటికి వెళ్ళారు. వారికి నొప్పి నుండి ఉపశమనం కలిగించే మందులు ఎక్కువ అవసరం కాలేదు, వారు సమస్యల గురించి ఫిర్యాదులు కూడా చాలా తక్కువగా చేశారు.” (g05 4/22)