కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పురాతన విశ్వవిద్యాలయం?

పోలాండ్‌, ఈజిప్టులకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం ఒకటి, ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన ఒక పురాతన విశ్వవిద్యాలయ స్థలాన్ని వెలికి తీసింది. లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ పత్రిక ప్రకారం, మొత్తం 5,000 మంది విద్యార్థులు కూర్చోగల, ఒకే వైశాల్యం ఉన్న, 13 లెక్చర్‌ హాళ్ళను ఆ బృందం కనుగొంది. ఆ హాళ్లలోని “గదుల్లో మూడు గోడలకు ఆనుకొని మెట్లలాగా నిర్మించబడిన బెంచీల వరుసలు ఉన్నాయి, కొన్నిచోట్ల అవి ఆంగ్ల అక్షరం ‘U’ ఆకారంలో ఒకచోట కలిశాయి.” వాటి మధ్య ఎత్తుగా ఉన్న ఒక ఆసనం ఉంది, బహుశా అది లెక్చరర్‌ కోసమై ఉండవచ్చు. “మధ్యధరా ప్రాంతమంతటిలో ఉన్న గ్రీకు రోమన్ల సంస్కృతి మేళవించిన స్థలాల్లో అలాంటి లెక్చర్‌ హాళ్ళ సముదాయం మొదటిసారి కనుగొనబడింది” అని ఈజిప్టుకు చెందిన సుప్రీమ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాన్టిక్విటీస్‌కు అధ్యక్షుడైన జహి హవేస్‌ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు అంటున్నాడు. అది, “బహుశా ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన విశ్వవిద్యాలయం అయ్యుండవచ్చు” అని హవేస్‌ చెబుతున్నాడు. (g05 6/8)

వెల్లుల్లి ఐస్‌క్రీమ్‌?

వెల్లుల్లి చాలాకాలం నుండి దానికున్న ఔషధ గుణాల కారణంగా కొనియాడబడుతోంది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని మార్వానో మార్కోస్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయం “ఆరోగ్యకరమైన” కారణాలనుబట్టి ఇప్పుడు వెల్లుల్లి ఐస్‌క్రీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఫిలిప్పీన్‌ స్టార్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తోంది. వెల్లుల్లి తగ్గిస్తుందని చెప్పే రుగ్మతలతో బాధపడుతున్నవారు ఈ క్రొత్త ఉత్పత్తివల్ల ప్రయోజనం పొందవచ్చని ఆశించబడుతోంది. ఆ రుగ్మతల్లో జలుబు, జ్వరాలు, అధిక రక్తపోటు, శ్వాస సంబంధ సమస్యలు, కీళ్ళవాతము, పాము కాటు, పంటి నొప్పి, క్షయవ్యాధి, కోరింత దగ్గు, గాయాలు, బట్టతల కూడా ఉన్నాయి. మరి, మీకెవరికైనా వెల్లుల్లి ఐస్‌క్రీమ్‌ కావాలా? (g05 6/8)

తెల్ల మొసళ్ళను కనుగొన్నారు

“ఒరిస్సాలోని బిటార్కానికా జాతీయ పార్క్‌కు చెందిన అటవీ అధికారులు మొసళ్లకు సంబంధించిన వార్షిక లెక్కల సేకరణలో . . . అరుదైన 15 తెల్ల మొసళ్ళను కనుగొన్నారు” అని ద హిందు చెబుతోంది. తెల్ల మొసళ్ళు చాలా అరుదుగా కనిపిస్తాయి, “ప్రపంచంలో మరెక్కడా కనుగొనలేం.” చట్టవిరుద్ధమైన వేట కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న ఉప్పునీటి మొసళ్ళు 1970లలో దాదాపు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి కార్యక్రమాల సహకారంతో పార్కులోనే మొసళ్ళను పెంచే ప్రాజెక్టును ప్రారంభించింది. సమృద్ధిగా ఉన్న మాన్‌గ్రోవ్‌ చెట్లు, కలుషితం కాని నీళ్ళు, సమృద్ధిగా ఆహార సరఫరా, మానవుని జోక్యం తక్కువగా ఉండడం పెంపకానికి సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. ద హిందు ప్రకారం ఇప్పుడు అక్కడ ఆ అరుదైన తెల్ల మొసళ్ళతోపాటు, సాధారణ రంగుల్లో ఉన్న మొసళ్ళు దాదాపు 1,500 ఉన్నాయి. (g05 4/8)

పొగాకు, బీదరికం, అనారోగ్యం

“పొగత్రాగడం, బీదరికం ఒక విషవలయంగా తయారైన పేద దేశాల్లోనే దాదాపు 84 శాతం మంది పొగత్రాగేవారు జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది” అని డ్యార్యో మెడికో అనే స్పానిష్‌ వార్తాపత్రిక చెబుతోంది. అంతేకాకుండా ప్రతి దేశంలో “ఎక్కువగా పొగత్రాగేవారు, పొగాకు ఉపయోగించడంవల్ల వచ్చే అనేక సమస్యలను అనుభవించేవారు జనాభాలోని అతి దయనీయ స్థితిలో ఉన్నవారే.” అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పొగాకు ఉపయోగం తగ్గినా ప్రపంచవ్యాప్తంగా అది “అనారోగ్యం కలిగించడంలో నాలుగవ పెద్ద ప్రమాద కారణంగా” తయారయ్యింది అని ఆ పత్రిక నివేదిస్తోంది. పొగాకు కారణంగా మరణించేవారి సంఖ్య సంవత్సరానికి 60,000కు చేరిన స్పెయిన్‌లో పొగత్రాగడం “అనారోగ్యానికీ, అంగవైకల్యతకూ, నివారించగల మరణానికీ ప్రధాన కారణంగా” తయారయ్యింది. (g05 4/8)

శరీరాకృతి గురించిన సమస్య

“యౌవనులు, ప్రత్యేకంగా ఆడపిల్లలు అతి చిన్న వయసులోనే తమ శరీరాకృతి గురించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్య తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయగలదు” అని కెనెడాకు చెందిన గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రిక చెబుతోంది. ఒక సర్వేలో 10 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలను తమ ఆహార అలవాట్ల గురించి అడిగారు, దానికి 2,200 కన్నా ఎక్కువమంది ప్రతిస్పందించారు. గ్లోబ్‌ ఇలా నివేదిస్తోంది: “7 శాతం కన్నా తక్కువమంది ఆడపిల్లలు అధికబరువుతో ఉన్నారు, కానీ 31 శాతం కన్నా ఎక్కువమంది తాము ‘చాలా లావుగా’ ఉన్నామని చెప్పుకున్నారు, 29 శాతంమంది ప్రస్తుతం తాము డైటింగ్‌ చేస్తున్నామని చెప్పారు.” ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లలు బరువు తగ్గాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ పత్రిక ప్రకారం, దానికి రోల్‌మాడల్స్‌గా ఉన్న వయోజనులనే ఎక్కువగా నిందించాలి, ఎందుకంటే వారే ఎల్లప్పుడూ డైటింగ్‌ చేస్తూ, బరువు ఎక్కువగా ఉన్నవారిని హేళన చేస్తారు. “ప్రసార మాధ్యమాలు సన్నగా ఉండే రోల్‌మాడల్స్‌ను ఎక్కువగా చూపించడం ద్వారా అవి కూడా టీనేజర్ల ప్రవర్తనపై ప్రభావం చూపించడంలో పెద్ద పాత్రను పోషిస్తున్నాయి” అని గ్లోబ్‌ పత్రిక చెబుతోంది. “బరువు పెరగడం సాధారణమని, కౌమారదశకు ఎదుగుతున్న పిల్లలు అలా బరువు పెరగాలని” పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ గుర్తించాలని అనారోగ్య పిల్లలకు సంబంధించిన టొరొంటో ఆసుపత్రిలో పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ గేల్‌ మాక్వే చెబుతోంది. (g05 4/8)

యుద్ధంలో బలైన చిన్నారులు

రువాండాలో జరిగిన జాతి ఘర్షణల్లో సంహరించబడిన 8,00,000 మందిలో 3,00,000 మంది చిన్నారులు ఉన్నారని ఐక్యరాజ్య సమితి బాలల నిధి అంచనా వేసింది అని జర్మన్‌ వార్తాపత్రిక లీప్టసీగర్‌ పోల్కస్టసిటూన్‌ నివేదిస్తోంది. రువాండాలో 1,00,000 కన్నా ఎక్కువమంది పిల్లలు వయోజనుల పర్యవేక్షణ లేని కుటుంబంలో జీవిస్తున్నారని అంచనా వేయబడింది. “తీవ్ర బీదరికం వారి అనుదిన జీవితాన్ని పీడిస్తోంది” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. (g05 4/22)

రెండు భాషలు మాట్లాడే పిల్లలను పెంచడం

“పిల్లలను సహనంతో, నేర్పుతో పెంచినప్పుడు, చాలా భాషల్లో మాట్లాడడం వారికి, వారి కుటుంబాలకు, సమాజానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు” అని మెక్సికో పట్టణానికి చెందిన మీలెన్యో వార్తాపత్రిక చెబుతోంది. “రెండు భాషలు మాట్లాడే పిల్లలు కేవలం ఒక భాష మాత్రమే మాట్లాడే పిల్లల కన్నా మెరుగ్గా రాణిస్తారనే ముగింపుకు” అధ్యయనాలు వచ్చాయి. పిల్లలు ఒక వాక్యంలో రెండు భాషలకు చెందిన పదాలను కలిపి మాట్లాడినప్పుడు లేక ఒక భాష నియమాలను మరో భాషకు అన్వయించే తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు కొన్నిసార్లు ఆందోళన చెందుతారు. “ఈ వ్యాకరణ ‘తప్పులు’ సాధారణమైనవి, వాటిని పిల్లలు త్వరగా అధిగమిస్తారు” అని పిల్లల భాషా వికాసంలో నిపుణుడైన టోనీ క్లైన్‌ అనే మనస్తత్వ శాస్త్రజ్ఞుడు చెబుతున్నాడు. పిల్లలకు పుట్టినప్పటినుండి తల్లిదండ్రులిద్దరి భాష నేర్పిస్తే, ఆ రెండు భాషలను సహజంగా ఆకళింపు చేసుకుంటారు, కొంతకాలానికి వారు ఆ రెండు భాషల్లోనూ మాట్లాడతారు. (g05 5/8)

హఠాత్తుగా వచ్చే భయంకరమైన అలలు

ప్రతీవారం భూగోళంలో ఏదో ఒక భాగంలో సగటున రెండు పెద్ద నౌకలు మునుగుతున్నాయని చెప్పబడుతోంది. 200 మీటర్ల కన్నా పొడవైన పెద్ద ట్యాంకర్లు, షిప్పింగ్‌ కంటైనర్లను మోసే నౌకలు కూడా సముద్రంలో మునిగాయి. ఇలాంటి అనేక విపత్తులకు భయంకరమైన అలలే కారణమని నమ్ముతున్నారు. పెద్ద నౌకలను ముంచేయగల ఎగిసిపడే సముద్రపు అలల గురించిన నివేదికలను కేవలం నావికుల కట్టుకథలని చాలాకాలం క్రితమే కొట్టిపారేయడం జరిగింది. అయితే ఒక యూరోపియన్‌ యూనియన్‌ పరిశోధనా ప్రాజెక్టు, అలాంటి కథలను నమ్మేందుకు ఆధారాన్నిచ్చింది. అతిపెద్ద అలల కోసం సముద్రానికి సంబంధించిన ఉపగ్రహపు రాడార్‌ చిత్రాలు పరిశోధించబడ్డాయి. స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ ప్రకారం, ప్రాజెక్టు నాయకుడు ఉల్ఫ్‌గాంగ్‌ రొసెన్తెల్‌ ఇలా అంటున్నాడు: “భయంకరమైన అలలు అందరూ అనుకునే దానికన్నా చాలా సాధారణమైనవని మేము నిరూపించాం.” మూడు వారాల సమయంలో ఆయన బృందం దాదాపు పది భయంకరమైన అలలను గుర్తించింది. అలాంటి అలలు దాదాపు లంబంగా ఉండి 40 మీటర్ల వరకు ఎత్తు ఉండవచ్చు, అవి నౌక మీద విరుచుకుపడి దానిని తీవ్రంగా పాడుచేస్తాయి లేక దానిని ముంచేస్తాయి. వాటిని తట్టుకునే సామర్థ్యం కొన్ని నౌకలకే ఉంది. “ఆ అలలను ముందుగానే కనిపెట్టవచ్చో లేదో మనం ఇప్పుడు విశ్లేషించాలి” అని రొసెన్తెల్‌ అంటున్నాడు. (g05 6/8)