కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు ఈ విషయాన్ని బట్టి గర్వించాలి’

‘మీరు ఈ విషయాన్ని బట్టి గర్వించాలి’

‘మీరు ఈ విషయాన్ని బట్టి గర్వించాలి’

నిజమైన దేవుని సేవకులు నిజాయితీగా ఉండడంలోని ప్రాముఖ్యతను గుర్తిస్తారు. అలా ఉండడానికి, వారికి తమ సృష్టికర్త మీద ఉన్న ప్రేమే వారిని పురికొల్పుతుంది. ఉదాహరణకు లాసారో విషయమే తీసుకోండి. కొంతకాలం క్రితం ఆయన మెక్సికోలోని హువాటుల్కోలోని ఒక హోటల్లో పని చేస్తున్నప్పుడు, ఒకరోజు ఆయనకు వసారాలో 70 డాలర్లు దొరికాయి. ఆయన వెంటనే ఆ డబ్బును డ్యూటీలో ఉన్న మేనేజరుకు ఇచ్చాడు. కొంతసేపటి తర్వాత ఆయనకు బాత్‌రూములో ఒక పర్సు దొరికింది. ఆయన దాన్ని రిసెప్షన్‌లో అప్పగించాడు, ఆ పర్సును పోగొట్టుకున్న వ్యక్తికి ఆనందాశ్చర్యాలు కలిగాయి.

ఈ చర్యల గురించి జనరల్‌ మేనేజర్‌కు తెలియడంతో ఆయన లాసారోను పిలిచి, దొరికిన డబ్బునూ పర్సునూ తిరిగి ఇవ్వడానికి కారణం ఏమిటని అడిగాడు. దానికి లాసారో తాను బైబిలు నుండి నేర్చుకున్న నైతిక విలువలే తనకు చెందని దాన్ని తీసుకోకుండా ఆపాయి అని జవాబిచ్చాడు. ఆ జనరల్‌ మేనేజర్‌ లాసారోకు ఇచ్చిన ప్రశంసా పత్రంలో ఇలా వ్యాఖ్యానించాడు: “నేడు ఉన్నత నైతిక విలువలను పాటించేవారు చాలా అరుదుగా కనబడతారు. మేము మీ వైఖరిని ప్రశంసిస్తున్నాం. మీరు మర్యాదస్థులుగా, మీ సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. మీరూ మీ కుటుంబమూ ఈ విషయాన్ని బట్టి గర్వించాలి.” లాసారోను ఆ నెల ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు.

కొందరు సహోద్యోగులు లాసారో డబ్బు, పర్సు తిరిగి ఇచ్చేసి పొరపాటు చేశాడు అనుకున్నారు. కానీ వారు తమ యజమాని స్పందన చూసిన తర్వాత, లాసారో నైతిక సూత్రాలను పాటిస్తున్నందుకు ఆయనను అభినందించారు.

‘అందరికీ మేలు చేయమని,’ ‘అన్ని విషయాల్లోను యోగ్యంగా ప్రవర్తించమని’ విశ్వసనీయులైన యేసు అనుచరులకు బైబిలు ఉద్బోధిస్తోంది. (గలతీయులు 6:10; హెబ్రీయులు 13:18) క్రైస్తవులుగా నిజాయితీగా ఉండడం “నీతిపరుడు యథార్థవంతుడు” అయిన బైబిలు దేవుడైన యెహోవాను ఖచ్చితంగా మహిమపరుస్తుంది.​—ద్వితీయోపదేశకాండము 32:4. (g05 6/8)