కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఏ సినిమాలు చూస్తారు?

మీరు ఏ సినిమాలు చూస్తారు?

మీరు ఏ సినిమాలు చూస్తారు?

ఇటీవలి దశాబ్దాల్లో, చలనచిత్రాలలో లేక టీవీ కార్యక్రమాల్లో అధిక మోతాదులో చూపించబడుతున్న సెక్స్‌, హింస, అసభ్య పదజాలం విషయంలో వివిధ రకాల ప్రతిస్పందనలు వెలువడ్డాయి. కొందరు ఫలానా సెక్స్‌ దృశ్యం అశ్లీలంగా ఉందని అంటుంటే మరికొందరు అది కళాత్మకంగా ఉందని వాదిస్తారు. ఒక సినిమాలో ఉన్న హింస అనవసరమైనదని, సరైనదికాదని కొందరు నొక్కిచెబితే మరికొందరు అది సరైనదని అంటారు. కొందరు డైలాగులు అసభ్య పదజాలంతో నిండివుండడం అభ్యంతరకరంగా ఉందని అంటే మరికొందరు అది వాస్తవికంగా ఉందని వాదిస్తారు. ఒక వ్యక్తి అశ్లీలమైనదిగా దృష్టించే దానిని మరో వ్యక్తి వాక్‌స్వాతంత్ర్యం అంటాడు. ఇరు పక్షాల వాదనలను వినడం, ఇదంతా సినిమాలో ఉన్న అంశాలను ఏమని పిలవాలి అనే విషయం మీద జరుగుతున్న అల్పమైన వాదంగా అనిపించవచ్చు.

సినిమాలో ఉన్న అంశాలు కేవలం ఒక అల్ప వివాదానికి సంబంధించిన విషయం కాదు. అది తల్లిదండ్రులే కాక నైతిక ప్రమాణాలను గౌరవించే వారు కూడా నిజంగా చింతించాల్సిన విషయం. “సినిమా చూడకూడదు అనే నా మంచి నిర్ణయానికి వ్యతిరేకంగా సాహసం చేసి నేను ఎప్పుడైనా సినిమా థియేటర్‌కు వెళ్తే అక్కడ నుండి బయటికి వస్తున్నప్పుడు నేను ఒక చెడ్డ వ్యక్తిని అనే భావన నాలో కలుగుతుంది. ఈ చెత్తను తయారుచేసిన వారినిబట్టి నేను సిగ్గుపడతాను, నేనంటే నాకే సిగ్గనిపిస్తుంది. నేను ఇప్పుడిప్పుడే చూసినవి నా స్వభావాన్నే పాడుచేసేసినట్లు అనిపిస్తుంది” అని ఒక యౌవన స్త్రీ విలపించింది.

ప్రమాణాలను ఏర్పరచడం

సినిమాలో ఉన్న అంశాల గురించిన చింత కొత్తేమీ కాదు. సినిమా నిర్మాణపు తొలి రోజుల్లో వెండి తెరపై కనిపించే లైంగిక మూలాంశాలు, నేరస్థుల విషయంలో అలజడి చెలరేగింది. చివరకు 1930లలో, సినిమాలో చూపించే వాటిని తీవ్రంగా నియంత్రించే ఒక నియమావళి అమెరికాలో అమలులోకి వచ్చింది.

ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం సినిమాల కోసం చేసిన ఈ క్రొత్త నియమావళి “చాలా కఠినంగా ఉంటూ సగటు వయోజనుల అనుభవాలకు సంబంధించిన దాదాపు అన్నిటినీ తెరపై చిత్రీకరించడాన్ని నిషేధించింది. అది ‘కామవాంఛకు సంబంధించిన దృశ్యాలను’ చూపించడాన్ని నిషేధించింది, వ్యభిచారం, అక్రమ లైంగిక సంబంధం, పాపకార్యానికి ప్రేరేపించడం, మానభంగం వంటివి ఇతివృత్తానికి తప్పకుండా అవసరమై, అలాంటి పనులు చేసినవారు సినిమా ముగింపులో తీవ్రంగా శిక్షించబడితే తప్ప, పరోక్షంగా కూడా వాటిని పేర్కొనడానికి వీల్లేదు.”

హింస విషయమైతే, సినిమాల్లో “ఇతివృత్తానికి ప్రధానమైతే తప్ప సాధారణ ఉపయోగంలో ఉన్న ఆయుధాలను ప్రదర్శించడం లేక వాటి గురించి చర్చించడం, నేరానికి సంబంధించిన వివరాలను చూపించడం, నియమాలను అమలుపరిచే అధికారులు నేరస్థుల చేతుల్లో చనిపోవడాన్ని చూపించడం, కసాయితనాన్ని లేక హత్యాకాండను ప్రోత్సహించడం, కథకు ఎంతో అవసరమైతే తప్ప హత్యను లేక ఆత్మహత్యను ఉపయోగించడం వంటివి నిషేధించబడ్డాయి . . . ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నేరాన్నైనా సరైనదిగా చిత్రీకరించకూడదు.” సంక్షిప్తంగా చెప్పాలంటే “సినిమాను చూసే వారి నైతిక ప్రమాణాలను దిగజార్చే ఏ సినిమానూ నిర్మించకూడదు” అని నియమావళి ప్రకటించింది.

ఆంక్షల నియమావళి స్థానంలో రేటింగ్‌ విధానం

1950ల కల్లా, చాలామంది హాలీవుడ్‌ నిర్మాతలు నియమావళిలోని నియమాలకు కాలం చెల్లిందని భావిస్తూ వాటిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. అందుకే 1968లో నియమావళిని తీసివేసి దాని స్థానంలో రేటింగ్‌ విధానాన్ని ఏర్పాటు చేశారు. * రేటింగ్‌ విధానం ప్రకారం ఒక సినిమాలో దేన్నైనా బాహాటంగా చూపించవచ్చు, అయితే దానిలో ఉన్న “పెద్దలకు” సంబంధించిన అంశాల స్థాయి గురించి ప్రజలను ముందుగా హెచ్చరిస్తూ దానిని ఒక చిహ్నంతో వర్గీకరిస్తారు. అమెరికాకు చెందిన చలనచిత్ర అసోషియేషన్‌ అధ్యక్షునిగా దాదాపు నాలుగు దశాబ్దాలు పనిచేసిన జాక్‌ వలెంటీ ప్రకారం రేటింగ్‌ విధాన లక్ష్యం, “తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు అనే విషయాల గురించి సొంత నిర్ణయాలు తీసుకొనేలా వారిని ముందుగా అప్రమత్తం చేయడానికి హెచ్చరికలు ఇవ్వడమే.”

రేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అడ్డు తొలగిపోయింది. దానితో సెక్స్‌, హింస, అసభ్య పదజాలం ప్రధాన హాలీవుడ్‌ సినిమా స్క్రిప్టులోకి ప్రవాహంలా వచ్చాయి. సినిమాలకు లభించిన ఆ క్రొత్త స్వేచ్ఛవల్ల పరిస్థితి నియంత్రించలేని విధంగా తయారైంది. అయినా రేటింగ్‌ ద్వారా ప్రజలు ముందుగా హెచ్చరించబడతారు. అయితే రేటింగ్‌ మీరు తెలుసుకోవాల్సిన వాటన్నిటినీ మీకు తెలియజేస్తుందా?

రేటింగ్‌ మీకు వెల్లడి చేయలేని అంశాలు

సమయం గడుస్తున్న కొద్ది రేటింగ్‌ విధానం మెతకగా తయారయిందని కొందరు అనుమానిస్తున్నారు. హార్వార్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చేసిన ఒక అధ్యయనం అలాంటి అనుమానాన్ని బలపరుస్తోంది, యౌవనస్థులకు ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడే సినిమాల్లో, కేవలం ఒక దశాబ్దం కన్నా ముందు వచ్చిన సినిమాల కంటే ఇప్పటి సినిమాల్లో హింస, లైంగికత స్పష్టంగా ఉన్న అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం వెల్లడి చేస్తోంది. అది “ఒకే రేటింగ్‌ ఉన్న సినిమాల్లోనే, అభ్యంతరకరమైన అంశాల పరిణామం, లక్షణాల విషయంలో గమనార్హమైన భిన్నత్వం కనబడవచ్చు, కాబట్టి కేవలం వయస్సు ఆధారంగా తయారుచేసిన రేటింగ్‌లే హింస, సెక్స్‌, అసభ్య పదజాలం, తదితర అంశాల చిత్రీకరణ గురించి సరిపోయేంత సమాచారం ఇవ్వలేవు” అనే ముగింపుకు వచ్చింది. *

తమ పిల్లలు థియేటరుకు ఒంటరిగా వెళ్ళేందుకు నిర్లక్ష్యంగా అనుమతించే తల్లిదండ్రులకు, నేడు ఎలాంటి సినిమాలు చూడడానికి తగినవిగా పరిగణించబడుతున్నాయో తెలియకపోవచ్చు. ఉదాహరణకు ఒక సినిమా విమర్శకుడు, యౌవనస్థులకు తగిన సినిమాగా అమెరికాలో రేటింగ్‌ పొందిన ఒక చిత్రంలోని ముఖ్య పాత్రను “ప్రతీరోజు త్రాగుబోతునం, చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలను ఉపయోగించడం, పార్టీల్లో విశృంఖలంగా సెక్స్‌లో పాల్గొనడం, తాను అప్పుడే కలిసిన అబ్బాయితో విపరీతమైన సెక్స్‌లో పాల్గొనడం వంటి క్రియల్లో నిస్సంకోచంగా పాల్గొనే విచ్చలవిడిగా తిరిగే ఒక 17 సంవత్సరాల అమ్మాయి” అని వర్ణించాడు. సినిమాలో ఈ రకమైన అంశాలు అసాధారణమేమీ కాదు. యౌవనస్థులకు తగిన సినిమాగా రేటింగ్‌ పొందిన సినిమాలో ముఖరతికి సంబంధించిన దృశ్యాలు “సాధారణంగా ఆమోదించబడుతున్నట్లు” కనిపిస్తోందని ద వాషింగ్టన్‌ పోస్ట్‌ మాగజైన్‌ వ్యాఖ్యానించింది. రేటింగ్‌ ద్వారా మాత్రమే సినిమాలోని అంశాలను అంచనా వేయకూడదు అనేది స్పష్టమవుతుంది. అయితే ఈ విషయంలో మనకు ఒక మంచి మార్గనిర్దేశం ఉందా?

“చెడుతనమును అసహ్యించుకొనుడి”

బైబిలు శిక్షిత మనస్సాక్షికి రేటింగ్‌ విధానం ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. వినోదానికి సంబంధించిన నిర్ణయాలతో పాటు తమ నిర్ణయాలన్నిటిలో క్రైస్తవులు బైబిలులోని కీర్తన 97:10 లో ఉన్న హెచ్చరికను అన్వయించుకోవడానికి కృషి చేస్తారు: “చెడుతనమును అసహ్యించుకొనుడి.” చెడుతనాన్ని అసహ్యించుకొనే వ్యక్తి దేవుడు అసహ్యించుకొనే వాటి నుండి వినోదం పొందడం సరైనదికాదని భావిస్తాడు.

ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఎటువంటి సినిమాలను చూడడానికి అనుమతిస్తున్నారనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేటింగ్‌ను వేగంగా ఓచూపు చూసి ఒక నిర్ణయానికి రావడం అమాయకత్వమే అవుతుంది. మీ పిల్లల వయస్సున్న వారికి తగినదిగా రేటింగ్‌ పొందిన సినిమా, తల్లిదండ్రులుగా మీరు ఆమోదించని ప్రమాణాలను ప్రోత్సహించేదిగా ఉండే అవకాశం ఉంది. ఇది క్రైస్తవులకు ఆశ్చర్యమేమీ కలిగించదు, ఎందుకంటే లోకం దేవుని ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉన్న ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ఆనందంగా ఆమోదిస్తుంది. *​—ఎఫెసీయులు 4:17, 18; 1 యోహాను 2:15-17.

అయితే సినిమాలన్నీ చెడ్డవని దీనర్థం కాదు. అయితే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విషయంలో జూన్‌ 8, 1997 తేజరిల్లు! ఇలా వ్యాఖ్యానించింది: “ప్రతివ్యక్తీ విషయాల్ని జాగ్రత్తగా తూచిచూసుకుని దేవుని ఎదుటా, మనుష్యుల ఎదుటా తన మనస్సాక్షిని స్వచ్ఛంగా ఉంచే నిర్ణయాల్ని తీసుకోవాలి.”​—1 కొరింథీయులు 10:31-33.

సరైన వినోదాన్ని కనుగొనే విధానం

తల్లిదండ్రులు తమ కుటుంబం ఏ సినిమాలను చూడాలో ఎంపిక చేసుకొనే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు చేసిన క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. మీ కుటుంబానికి మంచి వినోదం అందించాలనే మీ ప్రయత్నంలో మీకు ఆ వ్యాఖ్యానాలు సహాయం చేయవచ్చు.​—14వ పేజీలో ఉన్న “ఇతర రకాల ఉల్లాస కార్యకలాపాలు” అనే బాక్సును కూడా చూడండి.

స్పెయిన్‌కు చెందిన క్వాన్‌ ఇలా చెబుతున్నాడు: “మా పిల్లల చిన్నప్పుడు నేను గానీ నా భార్య గానీ వారితోపాటు సినిమాకు ఎల్లప్పుడూ వెళ్ళేవాళ్ళం. వారెప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు లేక ఇతర యౌవనులతో కలిసి వెళ్ళలేదు. వారిప్పుడు యౌవనస్థులైనప్పటికీ సినిమా విడుదలైన వెంటనే మొదటి ఆట చూడడానికి వెళ్ళరు; అయితే మేము సమీక్షలను చదివేంత వరకు లేక మేము నమ్మేవారి నుండి సినిమా గురించిన వ్యాఖ్యానాలు వినేంతవరకు వారు వేచివుండాలని మేము కోరుకుంటాం. ఆ విషయం గురించి కుటుంబంగా చర్చించుకున్న తర్వాత మేము ఆ సినిమా చూడాలో లేదో నిర్ణయించుకుంటాం.”

దక్షిణ ఆఫ్రికాకు చెందిన మార్క్‌, థియేటర్లో ఆడుతున్న సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయమని యౌవనస్థుడైన కుమారుణ్ణి ప్రోత్సహిస్తాడు. మార్క్‌ ఇలా అంటున్నాడు: “సినిమా గురించి వాడి అభిప్రాయాన్ని అడగడం ద్వారా నేను నా భార్య చర్చను ప్రారంభిస్తాం. అలా అడగడం వాడి అభిప్రాయాలను విని వాడితో తర్కించడానికి మాకు అవకాశాన్ని ఇస్తుంది. తత్ఫలితంగా, మేమందరం కలిసి ఆనందించగల సినిమాలను ఎంపిక చేసుకోగలుగుతున్నట్లు మేము గ్రహించాం.”

బ్రెజిల్‌కు చెందిన రొజార్యో కూడా తన పిల్లలు చూడాలనుకుంటున్న సినిమాలను వారితో కలిసి విశ్లేషిస్తాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను వారితో కలిసి విమర్శకుల వ్యాఖ్యానాన్ని చదువుతాను. ఒక సినిమా సరైనది కాకపోవచ్చు అని తెలిపే సూచనల కోసం వీడియో క్యాసెట్టు కవరును ఎలా చూడాలనేది వారికి నేర్పించేందుకు వారితో కలిసి వీడియో దుకాణానికి నేను వెళ్తాను.”

బ్రిటన్‌కు చెందిన మాథ్యూ తన పిల్లలు చూడాలనుకుంటున్న సినిమా గురించి వారితో మాట్లాడడం ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించాడు. ఆయనిలా అంటున్నాడు: “కుటుంబమంతా ఇష్టపడిన సినిమాలలోని అంశాల గురించిన చర్చల్లో చిన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా పాల్గొనేవారు. ఒక సినిమాను చూడకూడదని మేము నిర్ణయిస్తే, ఆ సినిమా చూడకూడదని కేవలం వారి మీద నిషేధం విధించే బదులు దానిని చూడకూడదని చెప్పడానికిగల కారణాలను నేను, నా భార్య వివరిస్తాం.”

దానితో పాటు, ఇంటర్నెట్‌లో సినిమాల గురించి పరిశోధించడం సహాయకరంగా ఉంటుందని కొందరు తల్లిదండ్రులు గ్రహించారు. సినిమాల్లోని అంశాల గురించి వివరణాత్మకంగా నివేదికలు ఇచ్చే వెబ్‌సైట్‌లు ఎన్నో ఉన్నాయి. ఏదైనా ఒక సినిమా ప్రోత్సహిస్తున్న ప్రమాణాల గురించి స్పష్టమైన అవగాహన సంపాదించుకోవడానికి వాటిని ఉపయోగించవచ్చు.

శిక్షిత మనస్సాక్షివల్ల ప్రయోజనాలు

బైబిలు “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగిన వారి గురించి మాట్లాడుతోంది. (హెబ్రీయులు 5:14) వినోదాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ పిల్లలకు ఉన్నప్పుడు వారు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకొనేందుకు సహాయం చేసే విలువలను వారిలో నాటాలన్నదే తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలి.

ఈ విషయంలో, యెహోవాసాక్షుల్లోని ఎంతోమంది యౌవనులు తమ తల్లిదండ్రుల నుండి శ్రేష్ఠమైన శిక్షణను పొందారు. ఉదాహరణకు అమెరికాకు చెందిన బిల్‌, చెరీలు టీనేజర్లయిన తమ ఇద్దరు కుమారులతో కలిసి సినిమాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. “మేము థియేటర్‌ నుండి బయటికి వచ్చిన తర్వాత సాధారణంగా సినిమా గురించి కుటుంబంగా కలిసి చర్చిస్తాం, అది ఎలాంటి విలువలను బోధించింది, మేము ఆ విలువలతో ఏకీభవిస్తున్నామా లేదా అనేవి చర్చిస్తాం” అని బిల్‌ చెబుతున్నాడు. అయితే బిల్‌, చెరీలు తాము సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. “మేము సినిమా గురించి ముందుగా చదువుతాం, మేము ఊహించని అభ్యంతరకరమైన అంశాలు సినిమాలో ఉంటే మేము థియేటర్‌ నుండి బయటికి రావడానికి సిగ్గుపడం” అని బిల్‌ చెబుతున్నాడు. వారు తమ పిల్లలను బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్థులను చేయడం ద్వారా మంచి చెడులను గుర్తించడంలో వృద్ధి చెందేందుకు తమ పిల్లలు సహాయం పొందుతున్నారని బిల్‌ చెరీలు భావిస్తున్నారు. “తాము చూడాలనుకుంటున్న సినిమాలను ఎంపికచేసుకొనే విషయంలో వారు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని బిల్‌ చెబుతున్నాడు.

బిల్‌ చెరీలు చేసినట్లే చాలామంది తల్లిదండ్రులు వినోదం విషయంలో తమ జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకునేందుకు తమ పిల్లలకు సహాయం చేశారు. నిజమే, సినిమా పరిశ్రమ నిర్మించే చిత్రాలు చాలావరకు సరైనవి కావు. మరోవైపు, బైబిలు సూత్రాలు క్రైస్తవులను నిర్దేశించినప్పుడు వారు ఆరోగ్యకరమైన, సేదదీర్చే మంచి వినోదాన్ని ఆనందించవచ్చు. (g05 5/8)

[అధస్సూచీలు]

^ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అలాంటి విధానాన్నే అనుసరిస్తున్నాయి, ఆ విధానంలో ఒక రేటింగ్‌ చిహ్నం, ఒక సినిమా ఏ వయసు వారికి సరైనదనేది సూచిస్తుంది.

^ దానితోపాటు, ఒక చలనచిత్రానికి రేటింగ్‌ ఇవ్వడానికి ఉపయోగించే ప్రమాణాలు ప్రతీ దేశానికి వేరువేరుగా ఉండవచ్చు. యౌవనస్థులకు సరైనది కాదు అని ఒక దేశంలో ఎంచబడిన ఒక చిత్రానికి మరో దేశంలో ఎంతో ఉదారమైన రేటింగ్‌ లభించవచ్చు.

^ పిల్లలకు, యౌవనస్థులకు ఉద్దేశించిన సినిమాల్లో మంత్రవిద్య, అభిచారం, ఇతర రకాల దయ్యాల సంబంధమైన అంశాలు ఉండవచ్చని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి.​—1 కొరింథీయులు 10:21.

[12వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

“మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం”

“నా చిన్నప్పుడు మేము మా కుటుంబమంతా కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. నేను ఇప్పుడు పెద్దదాన్నయ్యాను కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళేందుకు మా తల్లిదండ్రులు నన్ను అనుమతిస్తారు. అయితే సినిమాకు వెళ్ళేందుకు నన్ను అనుమతించే ముందు సినిమా పేరు, కథాంశాన్ని తెలుసుకోవాలని ఇష్టపడతారు. వారికి ఆ సినిమా గురించి ఏమీ తెలియకపోతే వారు సినిమా సమీక్షలను చదువుతారు లేదా టీవీలో ఆ సినిమా ట్రేలర్‌ను చూస్తారు. వారు ఇంటర్నెట్‌లో కూడా సినిమాకు సంబంధించిన సమాచారం కోసం చూస్తారు. ఆ సినిమా మంచిది కాదు అని వారు భావిస్తే, వారలా భావించడానికిగల కారణాన్ని వివరిస్తారు. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా వారు అనుమతిస్తారు. మేము అరమరికలు లేకుండా మాట్లాడుకుంటాం, మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం.”​—హెలోయిస్‌, 19, ఫ్రాన్స్‌.

[13వ పేజీలోని బాక్సు/చిత్రం]

విషయాన్ని చర్చించండి!

“తల్లిదండ్రులు వివిధ వినోదాల మీద ఆంక్షలు విధించి వాటి స్థానంలో వేరే వినోదాన్ని అందించలేకపోతే పిల్లలు తమ కోరికలను చాటుగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలు అనుచితమైన ఏదో ఒక వినోదాన్ని చూడడానికి ఇష్టపడితే కొందరు తల్లిదండ్రులు వాటిని చూడకూడదని వెంటనే ఆంక్షలు విధించరు లేక వాటిని చూడడానికి అనుమతి ఇవ్వరు. అయితే వారు ఇరువర్గాలవారు చల్లబడడానికి సమయం గడిచేందుకు అనుమతిస్తారు. ఆ విషయంపై కోపం తెచ్చుకోకుండా వారు కొన్ని రోజులు దాని గురించి చర్చిస్తారు, వాళ్ళు అలాంటి వినోదాన్ని ఆమోదకరమైనదిగా ఎందుకు భావిస్తున్నారో ఆ యౌవనున్ని లేక యౌవనురాలిని అడుగుతారు. ఆ విషయాన్ని చర్చిస్తే సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏకీభవిస్తారు, వారికి కృతజ్ఞత కూడా తెలుపుతారు. వారు ఆ తర్వాత తల్లిదండ్రుల నాయకత్వంలో కలిసికట్టుగా ఆనందించగల వేరే వినోదాన్ని ఎన్నుకుంటారు.”​—మసాకి, జపాన్‌లో ఒక ప్రయాణకాపరి.

[14వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఇతర రకాల ఉల్లాస కార్యకలాపాలు

◼“చిన్న పిల్లలకు తమ వయస్సువారితో సహవసించాలనే సహజ కోరిక ఉంటుంది కాబట్టి మేము మా అమ్మాయిని ఎల్లప్పుడూ మా పర్యవేక్షణలో ఇతర మంచి సహవాసులతో సహవసించేలా ఏర్పాట్లు చేశాం. మా సంఘంలో ఎందరో ఆదర్శవంతులైన యౌవనులు ఉన్నారు కాబట్టి వారితో స్నేహాన్ని పెంచుకోమని మేము మా అమ్మాయిని ప్రోత్సహించాం.”​—ఎలీసా, ఇటలీ.

◼ “మా పిల్లల ఉల్లాస కార్యకలాపాల్లో మేము కూడా పాల్గొంటాం. వాహ్యాళికి వెళ్ళడం, బార్బెక్యూలు, పిక్నిక్కులు, అన్ని వయస్సులకు చెందిన తోటి క్రైస్తవులతో కలిసి పార్టీలు లాంటి మంచి కార్యకలాపాలను మేము వారి కోసం ఏర్పాటు చేస్తాం. ఆ కారణంగా ఉల్లాస కార్యకలాపాలు అంటే కేవలం తమ వయస్సువారితో కలిసి ఆనందంగా సమయం గడపడం మాత్రమే అని మా పిల్లలు దృష్టించరు.”​—జాన్‌, బ్రిటన్‌.

◼ “తోటి క్రైస్తవులతో సమకూడే పార్టీలు సంతృప్తినిస్తాయని మేము గ్రహించాం. మా పిల్లలకు సాకర్‌ ఆడడమంటే కూడా ఇష్టం, కాబట్టి అప్పుడప్పుడు ఇతరులతో కలిసి ఈ ఆట ఆడేందుకు మేము ఏర్పాటు చేస్తాం.”​—క్వాన్‌, స్పెయిన్‌.

◼ “మేము మా పిల్లలను సంగీత వాయిద్యాలను వాయించడంలో ఆనందించమని ప్రోత్సహిస్తాం. మేము వారితో కలిసి టెన్నిస్‌, వాలీబాల్‌, సైకిల్‌ తొక్కడం, చదవడం, స్నేహితులతో సహవసించడం వంటి ఎన్నో సరదా పనులను చేస్తాం.”​—మార్క్‌, బ్రిటన్‌.

◼ “మేము ఒక కుటుంబంగా స్నేహితులతో కలిసి క్రమంగా బౌలింగ్‌ ఆడతాం. అంతేకాక, మేము నెలకొకసారి కలిసికట్టుగా ఏదైనా ప్రత్యేకమైనది చేయడానికి పట్టిక వేయడానికి ప్రయత్నిస్తాం. తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనించడం సమస్యలను నివారించడానికి కీలకం.”​—డానిలో, ఫిలిప్పీన్స్‌.

◼ “కేవలం కుర్చీలో కూర్చొని సినిమా చూడడం కన్నా కార్యక్రమాలు జరిగే స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా కార్యక్రమాలు చూడడం సాధారణంగా ఉత్తేజం కలిగిస్తుంది. మేము కళల ప్రదర్శనల కోసం, మోటారుకారు ప్రదర్శనల కోసం, సంగీత కార్యక్రమాల కోసం కనిపెట్టుకొని ఉంటాం. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పిల్లలతో సంభాషించవచ్చు. అలాగే మేము అతిగా వినోద కార్యక్రమాల్లో హాజరవకుండా ఉండేలా కూడా జాగ్రత్త వహిస్తాం. అలా అతిగా హాజరైతే సమయం వృథా కావడమే కాక ఆ కార్యక్రమాలకు సంబంధించిన కొత్తదనం, ఉత్తేజం చచ్చిపోతాయి.”​—జూడిత్‌, దక్షిణ ఆఫ్రికా.

◼ “ఇతర పిల్లలు చేసే ప్రతీది మా పిల్లలకు తగినది కాదు, వారు దానిని గ్రహించేలా సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అదే సమయంలో నేను మావారు వారికి మంచి వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాం. ‘మనం ఎక్కడికీ వెళ్ళం, మనమేమి చేయం’ అని వారనకుండా ఉండేలా కృషి చేస్తాం. మేము ఒక కుటుంబంగా పార్కులకు వెళ్తాం, మా సంఘంలోని వారితో కలిసి మా ఇంట్లో పార్టీలను ఏర్పాటు చేస్తాం.”​—మారియా, బ్రెజిల్‌. *

[అధస్సూచి]

^ సామాజిక వినోదాలకు సంబంధించిన అదనపు సమాచారం దీని సహ పత్రిక అయిన, కావలికోట, నవంబరు 1, 1992, 24-29 పేజీలను చూడండి.

[చిత్రసౌజన్యం]

James Hall Museum of Transport, Johannesburg, South Africa

[11వ పేజీలోని చిత్రం]

మీరు నిర్ణయించుకొనే ముందు సినిమా సమీక్షలను పరిశీలించండి

[12, 13వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులారా, జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మీ పిల్లలకు నేర్పించండి