కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్క్రిప్టును సినిమాగా మలిచే విధానం

స్క్రిప్టును సినిమాగా మలిచే విధానం

స్క్రిప్టును సినిమాగా మలిచే విధానం

గత కొన్ని దశాబ్దాల్లో హాలీవుడ్‌ ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించింది. అమెరికాలో సినిమా విడుదలైన కొద్ది వారాలకే లేక కొన్ని సందర్భాల్లో కొద్ది రోజుల తర్వాత, ఆ సినిమాలు విదేశాల్లో కూడా విడుదలవుతాయి కాబట్టి ఆ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. కొన్ని సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజున కూడా విడుదలయ్యాయి. “అంతర్జాతీయ మార్కెట్‌ అంతకంతకూ విస్తరిస్తున్న ఎంతో ఉత్తేజకరమైన మార్కెట్‌, కాబట్టి మేము సినిమాలు నిర్మిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాభాలు గడించేందుకు మాకు దొరికిన అవకాశంగా భావిస్తాం” అని వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ డొమెస్టిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధ్యక్షుడు డాన్‌ ఫెల్‌మాన్‌ అన్నాడు. హాలీవుడ్‌లో జరిగేవి ప్రపంచవ్యాప్త వినోద పరిశ్రమ మీద ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. *

సినిమా నిర్మించడం ద్వారా లాభాలు గడించడం అనుకున్నంత సులభమేమీ కాదు. చాలా సినిమాలు నిర్మాణానికి, మార్కెటింగ్‌కు అయిన ఖర్చులను రాబట్టాలంటేనే 450 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టవలసి ఉంటుంది. అవి విజయం సాధిస్తాయా లేదా అనేది ఎప్పుడూ మారుతూ ఉండే ప్రజల అభీష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. “ప్రజలు ఏ క్షణాన దేనిని ఉత్తేజకరమైనదిగా లేక సంచలనాత్మకంగా ఆకట్టుకొనేదిగా కనుగొంటారో మీరు అంచనా వేయలేరు” అని ఎమోరి విశ్వవిద్యాలయంలో సినిమా అధ్యయనానికి సంబంధించిన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ కుక్‌ అంటున్నాడు. అయితే సినీనిర్మాతలు తమ విజయావకాశాలను ఎలా పెంచుకుంటారు? దానికి జవాబు పొందాలంటే ముందు మనం సినిమా నిర్మించే విధానం గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలను అర్థం చేసుకోవాలి. *

నిర్మాణానికి ముందు జరిగే పని—⁠సినిమాను చిత్రీకరించడానికి సిద్ధపడడం

నిర్మాణానికి ముందు జరిగే పని సాధారణంగా సినిమా నిర్మించే ప్రక్రియలో సుదీర్ఘమైన దశే కాక అతి ప్రాముఖ్యమైన దశ కూడా. ఇతర పెద్ద ప్రాజెక్టులకు అవసరమైనట్లే ఇక్కడ కూడా సిద్ధపడడం కీలకం. నిర్మాణానికి ముందు జరిగే పనుల్లో అయ్యే ఖర్చంతా సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు అయ్యే ఖర్చును చాలా రెట్లు తగ్గిస్తుందని నమ్ముతారు.

సినిమాను నిర్మించడం కథాంశంతో ప్రారంభమౌతుంది, కథాంశం కల్పితమైనదైనా అయివుండవచ్చు లేక వాస్తవ జీవిత సంఘటనల మీద ఆధారపడి ఉండవచ్చు. ఒక రచయిత కథను స్క్రిప్టు రూపంలో మలుస్తాడు. షూటింగ్‌లో ఉపయోగించే చివరి స్క్రిప్టును తయారు చేయడానికి ముందు, స్క్రీన్‌ ప్లే అని కూడా పిలువబడే స్క్రిప్టుకు చాలాసార్లు సవరణలు చేయవలసి ఉంటుంది. షూటింగ్‌లో ఉపయోగించే స్క్రిప్టులో సినిమా డైలాగులే కాక నటనకు సంబంధించిన క్లుప్త వివరణ కూడా ఉంటుంది. అది కెమేరా దిశ, సన్నివేశాలలో మార్పులు మొదలైన సాంకేతిక వివరాల విషయంలో కూడా మార్గనిర్దేశాన్ని ఇస్తుంది.

అయితే, సినిమా నిర్మాణ ప్రాథమిక దశలోనే స్క్రీన్‌ ప్లే అమ్మకం గురించి నిర్మాతకు ప్రతిపాదించబడుతుంది. * ఒక నిర్మాత ఎలాంటి స్క్రీన్‌ ప్లేను ఇష్టపడవచ్చు? సాధారణంగా వేసవిలో విడుదలయ్యే సినిమాలు ఒక సినిమా విమర్శకుడు పిలిచినట్లు “పాప్‌కార్న్‌ జనం,” అంటే టీనేజర్లను, యౌవనస్థులను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తారు. కాబట్టి ఒక నిర్మాత యువతను ఆకర్షించే కథను ఇష్టపడవచ్చు.

నిర్మాత అన్ని వయస్సుల వారిని ఆకర్షించే స్క్రిప్టును ఇంకా ఎక్కువ ఇష్టపడతాడు. ఉదాహరణకు కార్టూన్‌ పుస్తకంలోని సూపర్‌ హీరో గురించిన సినిమా, ఆ పాత్రతో పరిచయం ఉన్న చిన్న పిల్లలను తప్పక ఆకర్షిస్తుంది. వారి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వారితోపాటూ వస్తారు. అయితే సినిమా నిర్మాతలు టీనేజర్లను, యౌవనులను ఎలా ఆకర్షిస్తారు? “ఆసక్తి రేకెత్తించే విషయాలు” దానికి కీలకం అని లిసా మండి, ద వాషింగ్టన్‌ పోస్ట్‌ మ్యాగజైన్‌లో వ్రాసింది. సినిమాలో అశ్లీల భాషను, తీవ్రమైన హింసాయుత సన్నివేశాలను, అధిక మోతాదులో సెక్స్‌ను చేర్చడం, “ఏ వయస్సు వారినీ నిర్లక్ష్యం చేయకుండా అన్ని వయస్సుల వారినీ ఆకర్షించి అధిక లాభాలు గడించడానికి” ఒక మార్గం.

ఒక నిర్మాత స్క్రీన్‌ ప్లేకు సత్తా ఉందని భావిస్తే ఆయన దానిని కొని, ఒక పేరున్న దర్శకునితో, ప్రఖ్యాతి గాంచిన నటునితో గానీ నటితో గానీ ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తాడు. ఒక ప్రఖ్యాతి చెందిన దర్శకుడు, అగ్ర తార ఉంటే సినిమా విడుదలైనప్పుడు అది జనాన్ని ఆకర్షిస్తుంది. అయితే ఈ ప్రాథమిక దశలో కూడా పెద్ద పేర్లు, సినిమాకు అవసరమైన ధనాన్ని సమకూర్చే పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు.

నిర్మాణం ముందు జరిగే పనులకు సంబంధించిన మరో అంశం, కామిక్‌ పుస్తకాల్లో ఉండే బొమ్మల తరహాలో ఒక సినిమాను బొమ్మల రూపంలో ఊహా చిత్రాన్ని రూపొందించడం. దానిలో సినిమాలోని వివిధ ఘట్టాలను చూపించే బొమ్మలు, ప్రత్యేకంగా నటనకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. అలాంటి ఊహా చిత్రాలు సినిమాటోగ్రాఫర్‌కు బ్లూ ప్రింట్‌గా పనిచేస్తూ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయి. దర్శకుడూ, రచయితా అయిన ఫ్రాంక్‌ డార్బాంట్‌ ఇలా అన్నాడు, “మీరు సినిమా షూటింగ్‌ చేయాలనుకున్న రోజు సెట్‌ దగ్గర నిలబడి కెమేరాను ఎక్కడ అమర్చాలి అనేది నిర్ణయించడానికి సమయాన్ని వృథా చేయడం కన్నా ఘోరమైనది మరొకటి ఉండదు.”

సినిమా నిర్మించే ముందు ప్రాముఖ్యమైన అనేక ఇతర విషయాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సినిమా తీయడానికి ఏ లొకేషన్స్‌ ఉపయోగించాలి? ప్రయాణం చేయాల్సివస్తుందా? భవనం లోపలి భాగాలను చిత్రించే సెట్లను ఎలా నిర్మించాలి, ఎలా రూపొందించాలి? కాస్ట్యూమ్స్‌ అవసరమవుతాయా? లైటింగ్‌, మేకప్‌, కేశాలంకరణలను ఎవరు పర్యవేక్షిస్తారు? ఆడియో, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, స్టంట్‌ల విషయమేమిటి? సినిమా షూటింగ్‌ ప్రారంభమవడానికి ముందు సినిమా నిర్మాణానికి సంబంధించి పరిశీలించాల్సిన అనేక అంశాల్లో ఇవి కొన్ని మాత్రమే. భారీ బడ్జెట్‌ సినిమాల చివర్లో వచ్చే పేర్లను ఒకసారి గమనించండి, ఒక సినిమా తయారవ్వాలంటే వందలాది మంది పనిచేస్తారని మీరు గ్రహిస్తారు! “ఒక చలనచిత్రాన్ని నిర్మించడానికి చాలామంది సహకారం అవసరమవుతుంది” అని చాలా సినిమా సెట్లలో పనిచేసిన ఒక టెక్నీషియన్‌ అన్నాడు.

నిర్మాణం, సినిమాను చిత్రీకరించడం

సినిమా షూటింగ్‌కు ఎంతో సమయం పట్టవచ్చు, అలసట కలగవచ్చు, చాలా డబ్బు ఖర్చు కావచ్చు. నిజానికి ఒక్క నిమిషం వృథా అయితే ఒక్కోసారి లక్షల్లో ఖర్చు కావచ్చు. కొన్నిసార్లు నటులను, సినిమాలో పనిచేస్తున్న బృందాన్ని, పనిముట్లను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళాల్సి రావచ్చు. అయితే షూటింగ్‌ ఎక్కడ జరిగినా, ప్రతీరోజు సినిమా చిత్రీకరించడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.

లైటింగుకు సంబంధించిన పనివారు, హెయిర్‌ డ్రెస్సర్లు, మేకప్‌ ఆర్టిస్టులు సినిమా సెట్‌కు ముందుగా వస్తారు. సినిమా చిత్రీకరించే ప్రతీరోజు తారలు కెమేరా ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడానికి ఎన్నో గంటలు వెచ్చించాల్సి రావచ్చు. అప్పుడు సినిమాను చిత్రీకరించే సుదీర్ఘమైన రోజు ప్రారంభమవుతుంది.

దర్శకుడు ప్రతీ సన్నివేశం చిత్రీకరించడాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తాడు. సాధారణంగా కనిపించే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కూడా రోజంతా పట్టవచ్చు. ఒక సినిమాలో చాలావరకు సన్నివేశాలు ఒకే కెమేరాతో చిత్రీకరిస్తారు, ఆ కారణంగా ఒక్కొక్క కోణంలో నుండి సన్నివేశాన్ని చాలాసార్లు తీస్తారు. అంతేకాక మంచి నటనను రాబట్టేందుకు గానీ ఒక సాంకేతికపరమైన సమస్య సరిచేయడానికి గానీ ప్రతీ షాట్‌ను చాలాసార్లు తీయాల్సి రావచ్చు. చిత్రీకరిస్తున్నప్పుడు ఇలా చేసే ఒక్కో ప్రయత్నాన్ని ఒక టేక్‌ అంటారు. పెద్ద సన్నివేశాలకు 50 లేక అంతకన్నా ఎక్కువ టేక్స్‌ అవసరం కావచ్చు! సాధారణంగా దర్శకుడు ప్రతీరోజు షూటింగ్‌ ముగిసిన తర్వాత అన్ని టేక్‌లను చూసి వాటిలో దేనిని ఉంచాలో నిర్ణయిస్తాడు. మొత్తానికి, సినిమా చిత్రీకరించడానికి వారాలు లేక నెలలు కూడా పట్టవచ్చు.

నిర్మాణానంతర పనులు​—⁠ముక్కలను ఒక దగ్గర చేర్చడం

చిత్ర నిర్మాణంలోని ఈ ఘట్టంలో వివిధ టేక్‌లను ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న చలనచిత్రంగా తయారు చేయడానికి ఎడిట్‌ చేస్తారు. మొదటగా, ఆడియో రికార్డింగ్‌ను వీడియో రికార్డింగ్‌తో సమన్వయపరుస్తారు. అప్పుడు ఎడిటర్‌, ఎడిట్‌ చేయని చిత్రాన్ని, ఆడియో టేప్‌ను దగ్గర చేర్చి రఫ్‌ కట్‌ అని పిలువబడే పరిచయాత్మకమైన సినిమా వర్షన్‌గా మారుస్తాడు.

ఈ దశలో సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను చేరుస్తారు. సినిమా చిత్రీకరణలో అతి సంక్లిష్ట అంశమైన స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాటోగ్రఫీని కొన్నిసార్లు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ సహాయంతో పూర్తి చేస్తారు. దాని ఫలితాలు అద్భుతంగా, ఎంతో వాస్తవమైనవిగా ఉండవచ్చు.

సినిమా కోసం కూర్చిన సంగీతాన్ని కూడా నిర్మాణానంతర పనుల్లో చేరుస్తారు, నేటి సినిమాల్లో ఈ అంశం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. “సినీ పరిశ్రమ ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా సినిమా కోసమే ప్రత్యేకంగా రూపొందించిన సంగీతాన్ని కోరుతోంది. ఇప్పుడు అది కేవలం ఇరవై నిమిషాల సంగీతాన్నో ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలకు సూచనగా పనిచేసే కొంత విరామ సంగీతాన్నో కోరడం లేదు, అయితే గంటకన్నా ఎక్కువ ఉండే సంగీతం కోసం కోరుతోంది” అని ఫిల్మ్‌ స్కోర్‌ మంత్లీలో ఎడ్విన్‌ బ్లాక్‌ వ్రాస్తున్నాడు.

కొన్నిసార్లు కొత్తగా ఎడిట్‌ చేసిన సినిమాను ఎంపిక చేసుకున్న ప్రేక్షకులకు చూపిస్తారు, బహుశా ఆ ప్రేక్షకులు సినిమా నిర్మాణంలో ప్రమేయంలేని దర్శకుని స్నేహితులో తోటి పనివారో అయి ఉండవచ్చు. వారి ప్రతిస్పందన ఆధారంగా దర్శకుడు సన్నివేశాలను తిరిగి చిత్రీకరిస్తాడు లేక వాటిని తొలగిస్తాడు. ఎంపిక చేసుకున్న ప్రేక్షకుల నుండి కొత్తగా ఎడిట్‌ చేసిన సినిమా విషయంలో మంచి ప్రతిస్పందన లేని కారణంగా సినిమా ముగింపును పూర్తిగా మార్చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి.

చివరకు, పూర్తయిన సినిమా థియేటర్లో విడుదల అవుతుంది. ఈ సమయంలోనే ఒక సినిమా బ్లాక్‌బస్టరో లేదా ఫ్లాపో లేదా కేవలం యావరేజో స్పష్టమవుతుంది. కేవలం డబ్బు నష్టపోవడం కన్నా ఎక్కువే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపయితే, ఒక నటునికి పని దొరికే అవకాశం తగ్గిపోగలదు, ఒక దర్శకుని పేరు పాడైపోగలదు. “వరుస ఫ్లాప్‌ల కారణంగా నా సమకాలీనులలో చాలామంది వ్యాపారం మానుకోవడాన్ని నేను చూశాను. సినిమా వ్యాపారం గురించిన పచ్చి నిజం ఏమిటంటే మీ యజమానులకు మీరు డబ్బు సంపాదించిపెట్టలేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతారు” అని సినిమా చిత్రీకరణలో తన తొలి సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ దర్శకుడు జాన్‌ బోర్‌మన్‌ అన్నాడు.

అయితే సాధారణ ప్రజానీకం సినిమా థియేటరు ముందుండే పోస్టర్‌ ముందు నిలబడినప్పుడు సినీ నిర్మాతలకు ఎదురయ్యే ఉద్యోగ సమస్యల గురించి ఆలోచించరు. సాధారణంగా వారి ఆలోచనలు ఇలా ఉంటాయి: ‘నేను సినిమాను చూసి ఆనందిస్తానా? టిక్కెట్టుకు చెల్లించిన డబ్బుకు తగినట్లుగా సినిమా ఉంటుందా? సినిమా మరీ ఘోరంగా లేక అభ్యంతరకరంగా ఉంటుందా? నా పిల్లలు చూడతగినదేనా?’ మీరు చూడాల్సిన సినిమాను నిర్ణయించుకొనేటప్పుడు మీరు అలాంటి ప్రశ్నలకు ఎలా జవాబివ్వవచ్చు? (g05 5/8)

[అధస్సూచీలు]

^ హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనితా ఎల్బర్స్‌ ప్రకారం, “విదేశీ బాక్సాఫీసు అమ్మకాలు స్వదేశంలో జరిగే అమ్మకాల కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నా, ఒక సినిమా అమెరికాలో ఎంత బాగా అమ్ముడు పోతుందనే దానిపైనే విదేశాల్లో ఎంత బాగా అమ్ముడు పోతుందనేది ఆధారపడి ఉంటుంది.”

^ ప్రతీ సినిమాకు సంబంధించిన వివరాలు వేరువేరుగా ఉన్నా ఇక్కడ మాత్రం సినిమా నిర్మించడానికి సాధ్యమయ్యే ఒక పద్ధతి గురించిన వివరణ ఇవ్వబడింది.

^ కొన్ని సందర్భాలలో స్క్రీన్‌ ప్లే బదులు నిర్మాతకు సంక్షిప్తంగా ఉన్న కథ ప్రతిపాదించబడుతుంది. ఆయన కథను ఇష్టపడితే, ఆయన ఆ కథకు సంబంధించిన హక్కులు కొని, దానిని స్క్రీన్‌ ప్లేగా తయారుచేసుకోవచ్చు.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“ప్రజలు ఏ క్షణాన దేనిని ఉత్తేజకరమైనదిగా లేక సంచలనాత్మకంగా ఆకట్టుకొనేదిగా కనుగొంటారో మీరు అంచనా వేయలేరు.” —డేవిడ్‌ కుక్‌, సినిమా అధ్యయనానికి సంబంధించిన ప్రొఫెసర్‌

[6, 7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

బ్లాక్‌బస్టర్‌ను అమ్మడం

సినిమా పూర్తయింది. కోట్లాదిమంది చూసేందుకు అది సిద్ధంగా ఉంది. అయితే అది విజయం సాధిస్తుందా? సినీ నిర్మాతలు తమ ఉత్పత్తిని అమ్ముకొని దానిని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి ప్రయత్నించే కొన్ని పద్ధతులను పరిశీలించండి.

సినిమా పుకార్లు: ఒక సినిమా విషయంలో కుతూహలాన్ని పెంచడానికి ఉపయోగించే అనేక ప్రభావవంతమైన మార్గాల్లో నోటిమాటను ఉపయోగించడం ఒకటి, లేక దానిని సినీపరిశ్రమలో పిలుస్తున్నట్లు పుకార్లు అనవచ్చు. కొన్నిసార్లు సినిమా విడుదలవడానికి కొన్ని నెలల ముందే పుకార్లు మొదలవుతాయి. బహుశా ఈ సినిమా ఇంతకుముందు హిట్‌ అయిన సినిమాకు సంబంధించిన తరువాయి భాగం అని ప్రకటించబడివుండవచ్చు. ఇంతకుముందు సినిమాలో నటించిన తారలే ఈ సినిమాలో కూడా నటిస్తారా? ఈ సినిమా కూడా మొదటి సినిమా అంత మంచిగా (లేక అంత చెడ్డగా) ఉంటుందా? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆతురపడతారు.

కొన్ని సందర్భాల్లో సినిమాలోని వివాదాస్పద అంశం మీద పుకార్లు సృష్టిస్తారు, ఒకవేళ సాధారణ ప్రజానీకానికి సంబంధించిన చలనచిత్రాల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో సెక్స్‌ దృశ్యాలు ఉంటే వాటి మీద పుకార్లు పుట్టిస్తారు. ఆ దృశ్యం నిజంగా అంత అశ్లీలంగా ఉంటుందా? సినిమా ఆమోదకరమైన పరిమితులను దాటిందా? అలాంటి అంశాలపై పరస్పర వ్యతిరేకంగా జరిగే బహిరంగ చర్చలు సినీనిర్మాతలకు ఉచిత ప్రచారంగా పనికొస్తాయి. కొన్నిసార్లు, చెలరేగిన వివాదం సాధారణంగా మొదటి ఆటకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చేలా చేస్తుంది.

మీడియా: సినిమా పోస్టర్లు, వార్తాపత్రికల్లో ప్రకటనలు, టీవీ ప్రకటనలు, థియేటర్లలో ఒక సినిమా ప్రారంభమయ్యే ముందు సినిమా ట్రేలర్లు చూపించడం, తారలు తమ తాజా చిత్రం గురించి ప్రచారం చేసుకొనేందుకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి సినిమా గురించి ప్రచారం చేసుకోవడానికి అతి సామాన్యంగా ఉపయోగించబడే పద్ధతులు. ఇప్పుడు ఇంటర్నెట్‌ ఒక ప్రధాన సినిమా ప్రచార సాధనంగా అందుబాటులో ఉంది.

వ్యాపార వస్తువులు: ప్రచారం కోసం అమ్మే వస్తువులు ఒక సినిమా విడుదలపట్ల ఆసక్తిని పెంచగలవు. ఉదాహరణకు, ఒక కామిక్‌ పుస్తకంలోని హీరో ఆధారంగా విడుదలైన ఒక సినిమాతోపాటు సినిమా శీర్షికకు సంబంధం ఉన్న టిఫిన్‌ బాక్సులు, మగ్గులు, ఆభరణాలు, బట్టలు, కీ చైన్‌లు, గడియారాలు, దీపాలు, బోర్డుపై ఆడే ఆటలు వంటివి ఎన్నో అమ్మారు, ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. “సాధారణంగా, సినిమాకు సంబంధం ఉన్న వ్యాపార వస్తువుల్లో 40 శాతం సినిమా విడుదలవడానికి ముందే అమ్మబడతాయి” అని అమెరికన్‌ బార్‌ అసోసియేషన్‌కు సంబంధించిన ఒక వినోద సంచికలో జో సిస్టో వ్రాశాడు.

వీడియోలు: బాక్సాఫీసు వద్ద లాభాలు గడించని ఒక సినిమా, జరిగిన నష్టాలను వీడియోల ద్వారా పూరించుకోగలుగుతుంది. “వీడియో మార్కెట్ల ద్వారా 40 నుండి 50 శాతం వరకు లాభాలు వస్తాయని” చలనచిత్రాల ద్వారా వచ్చే లాభాలను ఖచ్చితంగా నమోదు చేసే బ్రూస్‌ న్యాష్‌ అన్నాడు.

రేటింగ్స్‌: సినీ నిర్మాతలు రేటింగ్స్‌ను స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. ఉదాహరణకు, ఒక సినిమాకు చాలా తీవ్రమైన రేటింగ్‌ వచ్చేలా, పెద్దల చిత్రంగా ఎక్కువగా కనిపించేలా కావాలనే ఒక అంశాన్ని చిత్రంలో చేర్చవచ్చు. మరోప్రక్క, ఒక సినిమాలో సరిగ్గా సరిపోయేన్ని భాగాలు తీసివేస్తే అడల్ట్స్‌ రేటింగ్‌ రాకుండా చేసి యౌవనస్థుల నుండి లాభాలు సంపాదించే సినిమాగా నిర్మించవచ్చు. యౌవనస్థుల సినిమా అనే రేటింగ్‌ “ప్రచారంగా మారింది, సినిమా స్టూడియోలు ఆ రేటింగ్‌ను ఉపయోగించి యౌవనస్థులకూ, యౌవనస్థులుగా మారాలని బలంగా కోరుకొనే చిన్న పిల్లలకూ ఆ సినిమా తమకు ఆనందాన్నిస్తుందనే సందేశాన్నిస్తాయి” అని లిసా మండి ద వాషింగ్టన్‌ పోస్ట్‌ మ్యాగజైన్‌లో వ్రాసింది. ఆ రేటింగ్‌ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉద్రిక్తత నెలకొల్పుతుంది, “అది తల్లిదండ్రులను హెచ్చరిస్తూనే పిల్లలను తప్పుదోవ పట్టిస్తుంది” అని మండి వ్రాసింది.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

సినిమాలను నిర్మించే విధానం

స్క్రిప్టు

ఊహా చిత్రాలు

కాస్ట్యూమ్‌

మేకప్‌

లొకేషన్లో చిత్రీకరించడం

స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను చిత్రీకరించడం

సంగీతం రికార్డింగ్‌

సౌండ్‌ మిక్సింగ్‌

కంప్యూటర్‌ సహాయంతో యానిమేషన్‌

ఎడిటింగ్‌