కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గృహవసతి అందరికీ అవసరం

గృహవసతి అందరికీ అవసరం

గృహవసతి అందరికీ అవసరం

“ప్రతి ఒక్కరికీ, తమ ఆరోగ్యానికి, సంక్షేమానికే కాక, తమ కుటుంబ ఆరోగ్యానికి, సంక్షేమానికి కావల్సిన కనీస అవసరాలు పొందే హక్కు ఉంది, ఆ హక్కుల్లో . . . గృహవసతి కూడా ఉంది.”​—యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌, 25వ ఆర్టికల్‌.

పెద్ద సంఖ్యలో వలస వచ్చిన వ్యవసాయ కూలీలు ఒక ప్రాంతంలో క్రమంగా స్థిరపడ్డారు, వారు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తమ ఇల్లు అని పిలుస్తున్నారు. పట్టణ శివార్లలో, తక్కువ అద్దెకు దొరికే పార్కేడోర్స్‌ అని పిలవబడే ట్రేయిలర్‌ క్యాంపుల్లో వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ మురుగునీటి పారుదల, మంచి నీటి సరఫరా, చెత్తాచెదారం తొలగించడం వంటి ప్రాథమిక సేవలు అంతగా అందుబాటులో లేవు, లేదా అసలు లేనే లేవు. ఒక విలేఖరి, ఆ బస్తీని “బీదల [వ్యవసాయ కూలీల] స్తోమతకు తగిన ప్రాంతం” అని వర్ణించాడు.

మూడు సంవత్సరాల క్రితం అధికారులు కొన్ని బస్తీలను మూసివేయడం ప్రారంభించినప్పుడు కొన్ని కుటుంబాలు తమ ట్రేయిలర్లను అమ్మేసి పట్టణం మధ్యలో అప్పటికే క్రిక్కిరిసి ఉన్న ఇండ్లలోకి, అపార్ట్‌మెంట్లలోకి, గ్యారేజీల్లోకి తమ నివాసాలు మార్చుకున్నారు. ఇతరులు తమ మూటాముల్లె సర్దుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళారు, వారు ప్రతీ పంటకోత తర్వాత తిరిగి వెనక్కి వచ్చేందుకు వీలుగా ఉండే స్థలం, వారు ఇల్లు అని పిలువగల ఏదో ఒక స్థలం వెతుక్కుంటూ బయలుదేరారు.

ఈ వివరణ చదివిన తర్వాత అది ఏదో ఒక పేద దేశంలోని ప్రాంతం అని అనుకున్నారా? మీరు తప్పుగా ఊహించారు. మీరు ఈ ట్రెయిలర్‌ క్యాంపును అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న మెక్కా పట్టణం సమీపంలో చూడవచ్చు, అది సంపన్న నగరమైన పామ్‌ స్ప్రింగ్స్‌కు తూర్పున ఉంది, ఆ నగరం నుండి ఏదైనా వాహనంలో అక్కడికి చేరుకోవడానికి ఒక గంట కూడా పట్టదు. ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఇప్పుడు అమెరికాలోని చాలామందికి సొంత ఇల్లు ఉన్నట్లు చెప్పబడుతున్నా, 2002లో సగటు కుటుంబ ఆదాయం దాదాపు 18,90,000 రూపాయలకు చేరుకున్నా, అమెరికాలో 50 లక్షలకన్నా ఎక్కువ కుటుంబాలు చాలీచాలని గృహాల్లోనే నివసిస్తున్నాయి.

వర్ధమాన దేశాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో అమలులో ఉన్నా, భూగోళవ్యాప్త గృహవసతి సమస్య ఎల్లప్పుడూ తీవ్రంగానే ఉంటోంది.

భూగోళవ్యాప్త సమస్య

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకన్నా ఎక్కువమంది మురికివాడల్లో నివసిస్తున్నారు అని అంచనావేయబడింది. పట్టణీకరణకు సంబంధించిన బ్రెజీలియన్‌ నిపుణులు, ఆ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఫావెల్లాస్‌లు లేక మురికివాడలు, కొంతకాలానికి “అవి ఏ పట్టణాల్లో అయితే మొదట స్థాపించబడ్డాయో వాటికన్నా పెద్దవిగా, అధిక జనసాంద్రతగల స్థలాలుగా మారతాయి” అని ఆందోళన చెందుతున్నారు. నైజీరియాలోని పట్టణాల్లో 80 శాతంకన్నా ఎక్కువ జనాభా మురికివాడల్లో, ఆక్రమిత స్థలాల్లో ఏర్పరచుకున్న బస్తీల్లో నివసిస్తున్నారు. “కఠిన చర్య తీసుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా మురికివాడల్లో నివసించేవారి సంఖ్య వచ్చే 30 సంవత్సరాల్లో 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది” అని 2003లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ చెప్పారు.

అయితే భావావేశాలకు తావులేని ఇలాంటి గణాంకాలు, నాసిరకం జీవన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీదల మీద చూపించే హానికరమైన ప్రభావాలను నిజంగా వెల్లడి చేయవు. ఐక్యరాజ్య సమితి ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం కంటే ఎక్కువ మందికి పారిశుద్ధ్యతకు సంబంధించిన కనీస సదుపాయాలు లేవు, 33 శాతం మందికి పరిశుభ్రమైన నీటి సౌకర్యం లేదు, 25 శాతం మందికి తగిన గృహవసతి లేదు, 20 శాతం మందికి ఆధునిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామంది, తమ పెంపుడు జంతువులను కూడా అలాంటి పరిస్థితుల్లో జీవించనివ్వరు.

ఒక సార్వత్రిక హక్కు

తగిన గృహవసతి మానవుని కనీస అవసరతగా సర్వసాధారణంగా గుర్తించబడుతోంది. ఐక్యరాజ్య సమితి, 1948లో ఆమోదించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, ప్రతీ ఒక్కరికి తగిన కనీస అవసరాలు పొందే హక్కుతోపాటు చాలినంత గృహవసతి పొందే హక్కు కూడా ఉందని వెల్లడి చేసింది. నిజంగా, ప్రతీ ఒక్కరికి సముచితమైన గృహం అవసరం.

ఇటీవలే, 1996లో అనేక దేశాలు ఒక అధికార పత్రాన్ని ఆమోదించాయి, కొంతకాలం తర్వాత అది ఐక్యరాజ్య సమితికి చెందిన హాబిటాట్‌ అజెండాగా పిలువబడింది. ఆ పత్రం, అందరికీ తగిన గృహవసతి సమకూర్చే విషయంలో నిర్దిష్టమైన ఒప్పందాల గురించి వివరిస్తోంది. ఆ తర్వాత 2002 జనవరి 1న, ఆ అజెండాను పూర్తి హంగులు ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యక్రమంగా రూపొందించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆ ఒప్పందాన్ని బలపరిచింది.

కొన్ని సంపన్న దేశాల్లో అధిక సంఖ్యలో పేద పౌరులు, కనీసం భూమ్మీద నివసించడానికి కూడా సముచితమైన స్థలాన్ని పొందలేని స్థితిలోవుంటే, అవే దేశాలు చంద్రుని మీద కాలనీలు నిర్మించాలనే, అంగారక గ్రహాన్ని అన్వేషించాలనే అభ్యర్థనలు మళ్ళీ ప్రారంభించడం చాలా హాస్యాస్పదమైన విషయం. గృహవసతి సమస్య మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒకరోజు అందరికీ తమ సొంత సౌకర్యవంతమైన గృహం ఉంటుందనే వాస్తవమైన నిరీక్షణ ఏదైనా ఉందా? (g05 9/22)

[4వ పేజీలోని బ్లర్బ్‌]

కొన్ని దేశాలు చంద్రుని మీద నివాసం ఏర్పరచుకోవడం గురించి అధ్యయనం చేస్తుంటే ఆ దేశంలోని చాలామంది పౌరులకు భూమ్మీద నివసించడానికే సముచితమైన స్థలం లేదు

[2, 3వ పేజీలోని చిత్రం]

ఆసియాకు చెందిన ఒక శరణార్థి కుటుంబం.

ఒక నగరంలో 3,500 కుటుంబాలు తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్నాయి, వారికి నీళ్ళు, పారిశుద్ధ్య సౌకర్యాల అవసరం అధికంగా ఉంది

[చిత్రసౌజన్యం]

© Tim Dirven/Panos Pictures

[4వ పేజీలోని చిత్రం]

ఉత్తర అమెరికా