కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గృహవసతి సంక్షోభానికి కారణాలు ఏమిటి?

గృహవసతి సంక్షోభానికి కారణాలు ఏమిటి?

గృహవసతి సంక్షోభానికి కారణాలు ఏమిటి?

ఆఫ్రికాలోని ఒక పెద్ద నగరపు పొలిమేరల్లో 36 ఏండ్ల జోసిఫిన్‌, 6 నుండి 11 ఏండ్ల మధ్య వయసుగల తన ముగ్గురు అబ్బాయిలతో నివసిస్తోంది. ఆమె జీవనోపాధి కోసం ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలను సేకరించి దగ్గర్లోని రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు అమ్ముతుంది. ఆమె అలా నడుం విరిగేలా పనిచేస్తే వచ్చేది రోజుకు 90 రూపాయల కన్నా తక్కువే. ఆ నగరంలో తన కుటుంబాన్ని పోషించడానికి గానీ తన పిల్లల స్కూలు ఖర్చులకు గానీ ఆ డబ్బు ఎంతమాత్రం సరిపోదు.

సాయంకాలానికి ఆమె తన కుటుంబ అవసరాలకు ఏ మాత్రం సరిపోని తన ఇల్లు అనే స్థలానికి తిరిగి చేరుకుంటుంది. కాల్చిన మట్టి ఇటుకలు, మట్టిని దగ్గరగా పట్టుకొని ఉంచే సన్నని రెమ్మలతో ఆ ఇంటి గోడలు నిర్మించబడ్డాయి. గట్టిగా బిగించని తుప్పుపట్టిన ఇనుప రేకులతో పాటు తగరపు పూతగల రేకులు, ప్లాస్టిక్‌ రేకులు ఇంటి పైకప్పుగా ఉన్నాయి. బలమైన గాలికి పైకప్పు చెల్లాచెదురు కాకుండా దానిమీద రాళ్ళు, చెక్క ముక్కలు, పాత రేకు ముక్కలు పెట్టారు. చినిగిపోయిన గోనెసంచులతో చేసిన ఆ ఇంటి “తలుపులు,” “కిటికీలు” దొంగల బారి నుండి రక్షించే విషయం అటుంచితే అననుకూలమైన వాతావరణం నుండి కూడా ఎలాంటి రక్షణా ఇవ్వవు.

అయితే, దీనావస్థలో ఉన్న ఆ ఇల్లు కూడా నిజానికి ఆమెది కాదు. ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టబడతామనే భయం జోసిఫిన్‌నూ, ఆమె పిల్లలనూ ఎప్పుడూ వెంటాడుతుంటుంది. చాలీచాలని వారి ఇల్లున్న స్థలాన్ని, దగ్గర్లోని రోడ్డు వెడల్పు చేయడానికి ఉపయోగించనున్నారు. విచారకరంగా అలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి.

విషపూరితమైన గృహం

“నాసిరకం ఇండ్లలో, పిల్లలు తమ ఇంటి పరిస్థితినిబట్టి సిగ్గుపడతారు, . . . కుటుంబం ఎప్పుడూ అనారోగ్యానికి గురౌతుంది, . . . [తమ ఇంటిని] ప్రభుత్వ అధికారో భూస్వామో వచ్చి ఎప్పుడు కూలుస్తారో వారికి తెలియదు” అని అంతర్జాతీయ గృహ సహకార కార్యక్రమానికి సీనియర్‌ అధికారిగా పని చేస్తున్న రాబిన్‌ షెల్‌ చెబుతున్నారు.

అలాంటి పరిస్థితుల్లో జీవించడం, తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య క్షేమాల గురించి ఎల్లప్పుడూ చింతించేలా చేస్తుంది. తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేసే బదులు, వారు సాధారణంగా ఆహారం, విశ్రాంతి, ఆశ్రయం వంటి తమ పిల్లల కనీస అవసరాలు తీర్చడానికే తమ సమయాన్నీ శక్తినీ చాలావరకు వెచ్చిస్తారు.

ఆ పరిస్థితులతో వ్యక్తిగతంగా పరిచయం లేకుండా కేవలం పైనుండి చూసే వ్యక్తి, బీదవారు బాగా కష్టపడి పని చేస్తే తమ పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చనే అభిప్రాయానికి రావడం సులభమే. కానీ బాగా కృషి చేయడం ద్వారా జీవన పరిస్థితిని మెరుగుపరచుకోమని ప్రజలకు చెప్పడం మాత్రమే పరిష్కారం కాదు. గృహవసతి సంక్షోభానికి ఏ ఒక్క వ్యక్తి అదుపులోనూ లేని బలమైన కారణాలు ఉన్నాయి. జనాభా పెరుగుదల, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ సంక్షోభం, దీర్ఘకాలికంగా ఉన్న బీదరికం వంటివి దానికి ముఖ్య కారకాలని పరిశోధకులు పేర్కొంటున్నారు. బిగించిన పిడికిలిలోని ఐదు వేళ్ళలాగా ఆ కారణాలు ప్రపంచంలోని బీదల జీవితాన్ని బిగించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జనాభా పెరుగుదల కారణంగా కలిగే ఒత్తిళ్ళు

సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రపంచం అదనంగా 6.8 కోట్ల నుండి 8 కోట్లమంది ప్రజలకు గృహసదుపాయం ఏర్పాటు చేయవలసి ఉంటుందని అంచనా. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రకారం, 2001లో ప్రపంచ జనాభా 610 కోట్లు దాటింది, 2050 కల్లా అది 790 నుండి 1,090 కోట్ల మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా. దానికన్నా గంభీరమైన విషయం ఏమిటంటే, వచ్చే రెండు దశాబ్దాల్లో జరిగే ఆ పెరుగుదలలో 98 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరగనుందని అంచనావేయబడింది. ఆ అంచనాలు, తగిన గృహవసతి కల్పించడానికి సంబంధించి తీవ్రమైన సవాళ్ళను చూపిస్తున్నాయి. చాలా దేశాల్లో, ఇప్పటికే క్రిక్కిరిసిన నగరాలే వేగంగా జనాభా పెరుగుతున్న ప్రాంతాలు అనే వాస్తవం ఆ సవాలును ఇంకా సంక్లిష్టం చేస్తోంది.

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ

సాధారణంగా న్యూయార్క్‌, లండన్‌, టోక్యో వంటి ప్రధాన నగరాలు, ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రాముఖ్యమైన చిహ్నాలుగా దృష్టించబడతాయి. ఆ కారణంగా ప్రతీ సంవత్సరం, వేలాదిమంది గ్రామీణులు ప్రధానంగా విద్యా ఉద్యోగాల కోసం ‘పచ్చగా కనిపించే పట్టణ ప్రాంతాలకు’ తరలివెళ్తున్నారు.

ఉదాహరణకు, చైనాలో ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ కారణంగా, రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ప్రధాన పట్టణ ప్రాంతాల్లోనే, 20 కోట్లకన్నా ఎక్కువ క్రొత్త గృహాలు అవసరమవుతాయని ఒక నివేదిక తెలుపుతోంది. అది అమెరికాలో ప్రస్తుతం ఉన్న పూర్తి గృహాల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అలాంటి అవసరాన్ని ఏ గృహ నిర్మాణ కార్యక్రమం తీర్చగలదు?

ప్రపంచ బ్యాంకు ప్రకారం, “ప్రతీ సంవత్సరం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, దాదాపు 1.2 నుండి 1.5 కోట్ల కుటుంబాలు పట్టణప్రాంతాలకు తరలి వస్తున్నారు, కాబట్టి ఆ పట్టణాల్లో అదే సంఖ్యలో గృహాలు అవసరమవుతున్నాయి.” తమ స్తోమతకు తగిన గృహ వసతులు సరిపోయేన్ని లేవు కాబట్టి పట్టణాల్లోని ఈ బీదవారు తమకు ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ, అంటే సాధారణంగా ఇతరులు నివసించడానికి ఇష్టపడని ప్రాంతాల్లో ఆశ్రయం పొందాల్సివస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అలజడులు

చాలామంది బీదరికం కారణంగా, వరదలు, కొండచరియలు విరిగి పడడం, భూకంపాలు వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను ఆక్రమించాల్సివస్తోంది. ఉదాహరణకు, వెనిజులాలోని కారాకాస్‌లో ఐదు లక్షలకన్నా ఎక్కువమంది “కొండచరియలు విరిగిపడడంవల్ల ఎప్పుడూ ప్రభావితమయ్యే ఏటవాలు ప్రాంతాల్లో ఆక్రమిత బస్తీల్లో నివసిస్తున్నారు.” 1984లో ఇండియాలోని భోపాల్‌లో జరిగిన పారిశ్రామిక దుర్ఘటన మీకు గుర్తుండవచ్చు, ఆ దుర్ఘటనలో వేలాదిమంది మరణించారు, చాలామంది క్షతగాత్రులయ్యారు. అంతమంది ప్రమాదానికి ఎందుకు గురయ్యారు? దానికిగల ప్రధాన కారణం, దగ్గర్లో ఉన్న ఒక మురికివాడ, ఫ్యాక్టరీ సరిహద్దుకు కేవలం ఐదు మీటర్ల దూరం వరకు విస్తరించడమే.

అంతర్యుద్ధాల వంటి రాజకీయ అలజడులు కూడా గృహవసతికి సంబంధించిన సమస్యలకు చాలావరకు కారణం. ఆగ్నేయ టర్కీలో 1984 నుండి 1999 మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు 15 లక్షలమంది తమ గృహాలను విడిచిపెట్టాల్సివచ్చిందని, వారిలో చాలామంది పల్లెవాసులు ఉన్నారని 2002లో ఒక మానవ హక్కుల బృందం ప్రచురించిన నివేదిక సూచించింది. అలా విడిచిపెట్టినవారిలో చాలామంది తాము ఎక్కడ ఆశ్రయం పొందగలిగితే అక్కడికి వెళ్ళాల్సివచ్చింది, సాధారణంగా వారు తమ బంధువులతో, పొరుగువారితో పాటు క్రిక్కిరిసిన తాత్కాలిక నివాసాలకు, అద్దెకు తీసుకున్న నివాసాలకు, వ్యవసాయ సంబంధమైన భవనాలకు లేక నిర్మాణ స్థలాలకు వెళ్ళాల్సివచ్చింది. కుటుంబాల ఒక గుంపు పశువులశాలలో నివసిస్తోందని, ఒక గదిలో 13 మంది లేదా అంతకంటే ఎక్కువమంది ఉంటున్నారని, వారు ఒక సార్వజనిక మరుగుదొడ్డిని, ఆవరణలో ఉన్న ఒకే ఒక కుళాయిని ఉపయోగిస్తున్నారని నివేదించబడింది. “ఇలాంటి జీవితం నుండి బయటపడాలని మేము కోరుకుంటున్నాం, పశువుల కోసం నిర్మించిన స్థలంలో మేము నివసిస్తున్నాం” అని శరణార్థులలో ఒకరు చెప్పారు.

ఆర్థిక స్తబ్ధత

గృహవసతికి, బీదవారి ఆర్థిక పరిస్థితికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇంతకుముందు పేర్కొనబడిన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 1988లోనే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 33 కోట్లమంది పట్టణ వాసులు బీదవారు, రాబోయే సంవత్సరాల్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పువస్తుందని ఆశించలేని పరిస్థితి ఉంది. ప్రజలు ఆహారం, బట్టలు వంటి కనీస అవసరాలను తీర్చుకోలేనంతగా బీదరికంలో ఉన్నప్పుడు, ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకోవడం లేదా నిర్మించుకోవడం వారికి ఎలా సాధ్యమవుతుంది?

అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కుటుంబాలు బ్యాంకు నుండి తీసుకున్న అప్పులను తీర్చలేకపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా ప్రజలు ఆర్థికంగా ప్రగతి సాధించడం కష్టమవుతోంది. కొన్ని దేశాల్లో, 20 శాతం వరకు ఉన్న నిరుద్యోగం కారణంగా కనీస అవసరాలను తీర్చుకోవడం కూడా దాదాపు అసాధ్యమవుతోంది.

ఈ కారణాలు మరితర కారణాలు, భూమ్మీద నలుమూలలా ఉన్న కోట్లాదిమంది నాసిరకం గృహవసతులతోనే సంతృప్తి చెందేలా చేస్తున్నాయి. ప్రజలు పాత బస్సుల్లో, షిప్పింగ్‌ కంటైనర్లలో, అట్టపెట్టెల్లో నివసిస్తున్నారు. వాళ్ళు మెట్ల కిందా, ప్లాస్టిక్‌ షీట్ల కిందా, పాత చెక్కముక్కల కిందా జీవిస్తున్నారు. విడిచిపెట్టబడిన పరిశ్రమల స్థలాలు కూడా కొందరికి నివాస స్థలాలయ్యాయి.

సమస్య పరిష్కారానికి ఎలాంటి కృషి జరుగుతోంది?

సంక్షోభంతో వ్యవహరించడానికి శ్రద్ధాసక్తులుగల అనేకమంది ఇప్పటికే చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నారు, అనేక సంస్థలు, ప్రభుత్వాలు కూడా అలాగే కృషి చేస్తున్నాయి. జపాన్‌లో, తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మించేందుకు సహాయం చేయడానికి అనేక ఏజన్సీలు స్థాపించబడ్డాయి. 1994లో దక్షిణాఫ్రికాలో ప్రారంభించబడిన ఒక గృహనిర్మాణ కార్యక్రమం ద్వారా నాలుగు గదులున్న పది లక్షలకన్నా ఎక్కువ ఇండ్లు నిర్మించబడ్డాయి. కెన్యాలో ఒక ఆశావహ గృహనిర్మాణ పథకపు లక్ష్యం ఏమిటంటే ప్రతీ సంవత్సరం పట్టణ ప్రాంతాల్లో 1,50,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో దానికి రెండింతల ఇండ్లు నిర్మించాలన్నదే. మడగాస్కర్‌లాంటి ఇతర దేశాలు, తక్కువ ఖర్చుతో ఇండ్లు నిర్మించేందుకు దోహదపడే నిర్మాణ పద్ధతులను కనుగొనడానికి కృషి చేస్తున్నాయి.

“అధిక పరిమాణంలో జరుగుతున్న పట్టణాభివృద్ధివల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను నిరోధించడంపట్ల, పరిస్థితులను మెరుగుపరచడంపట్ల” ప్రపంచానికి ఉన్న అంకిత భావాన్ని చూపించడానికి యు.ఎన్‌. హాబిటాట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు స్థాపించబడ్డాయి. లాభరహిత, ప్రభుత్వేతర సంస్థలు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక లాభరహిత సంస్థ, వివిధ దేశాల్లోని 1,50,000 కన్నా ఎక్కువ కుటుంబాలు, నాసిరకం గృహవసతి సమస్య నుండి పరిష్కారం పొందడానికి సహాయం చేసింది. 2005 కల్లా పది లక్షలమందికి నిరాడంబర, తక్కువ ఖర్చుతో కూడిన, చక్కని గృహవసతిని సంపాదించుకోవడానికి అది సహాయం చేయగలదని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

అలాంటి అనేక సంస్థలు, నాసిరకం గృహ వసతుల్లో నివసిస్తున్న ప్రజలు తాము ఎదుర్కొంటున్న అననుకూల పరిస్థితులతో వ్యవహరించడానికి లేక తమ పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి సహాయం చేసేందుకు, వెంటనే అందుబాటులో ఉండే అనుసరించదగ్గ సమాచారాన్ని తయారు చేశాయి. మీకు సహాయం అవసరమైతే ఆ ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. మీకు మీరు సహాయం చేసుకోవడానికి మీరు చేయగల ప్రాథమిక విషయాలు కూడా చాలా ఉన్నాయి.​—⁠7వ పేజీలో ఉన్న “మీ గృహం, మీ ఆరోగ్యం” అనే బాక్సును చూడండి.

మీరు మీ వ్యక్తిగత పరిస్థితిని మెరుగుపరచుకోగలిగినా మెరుగుపరచుకోలేకపోయినా, ఈ సంక్షోభానికి కారణాలైన ప్రపంచవ్యాప్త శక్తుల పిడికిలి బిగింపును ఒక వ్యక్తి లేదా ఒక మానవ సంస్థ సడలించగలదని నమ్మలేం. ఆర్థికాభివృద్ధి, మానవతా సహాయం కోసం పెరుగుతున్న అవసరాన్ని తీర్చడంలో అంతర్జాతీయ సమాజం ఎంతో వెనుకబడిపోయింది. అంతకంతకూ దిగజారిపోతున్న ఈ బీదరికంలోకి ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది పిల్లలు జన్మిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఏదైనా నిజమైన నిరీక్షణ ఉందా? (g05 9/22)

[7వ పేజీలోని బాక్సు]

మీ గృహం, మీ ఆరోగ్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మంచి ఆరోగ్యానికి దోహదపడడానికి, సాధారణంగా ఒక గృహంలో కనీసం ఈ క్రింది వసతులు ఉండాలి:

◼వర్షం నుండి రక్షణ కోసం మంచి పైకప్పు ఉండాలి

◼ చెడు వాతావరణం నుండి, జంతువుల నుండి రక్షణ కోసం మంచి గోడలు, తలుపులు ఉండాలి

◼ కీటకాలు, ప్రత్యేకంగా దోమలు లోపలికి రాకుండా కిటికీలకు తలుపులకు వైర్లతో చేసిన తెర ఉండాలి

◼ వేడి వాతావరణంలో గోడలకు సూర్యకాంతి సూటిగా తగలకుండా కాపాడడానికి చుట్టూ సన్‌ షేడ్స్‌ ఉండాలి

[8వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఆఫ్రికాలోని సంప్రదాయ గ్రామీణ గృహాలు

ఆఫ్రికాలోని సంప్రదాయ గృహాలు, చాలా సంవత్సరాలవరకు అక్కడక్కడా కనిపించేవి. ఆ గృహాలు వివిధ పరిమాణాల్లో, ఆకారాల్లో ఉండేవి. కెన్యాకు చెందిన కికూయు, లువో వంటి సమాజాలు, గుండ్రంగా ఉండే గోడలు, గడ్డితో చేసిన శంకువు ఆకారంలో ఉండే పైకప్పును ఇష్టపడేవి. ఇతర సమాజాలు, కెన్యాకు, టాంజానియాకు చెందిన మాసాయ్‌ తెగవారు దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఇండ్లు కట్టుకునేవారు. తూర్పు ఆఫ్రికాలోని కోస్తా ప్రాంతాల్లో కొన్ని ఇండ్లకు గడ్డితో చేసిన పైకప్పు ఉండేది, ఆ పైకప్పుల అంచులు నేలను తాకేవి, ఆ ఇండ్లు చూడ్డానికి తేనెపట్టులాగా ఉండేవి.

అలాంటి నిర్మాణాలకు ఉపయోగించే నిర్మాణ వస్తువులలో అధిక భాగం సులభంగా దొరికేవే కాబట్టి, గృహవసతికి సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. కేవలం మట్టిని, నీళ్ళను కలిపి తడిమట్టిని తయారుచేసుకోవచ్చు. దగ్గర్లోనే చాలా అడవులు ఉండడంవల్ల కలప, గడ్డి, రెల్లు, వెదురు ఆకులు సులభంగా లభించేవి. కాబట్టి, ఒక కుటుంబపువారు ఎంత ధనవంతులైనా లేదా ఎంత బీదవారైనా సాధారణంగా సొంత గృహాన్ని సంపాదించుకోవడం వారికి సాధ్యమయ్యేది.

అయితే అలాంటి గృహాలకు కూడా కొన్ని అననుకూల పరిస్థితులు ఉండేవి. పైకప్పులు చాలావరకు నిప్పు అంటుకోదగిన వస్తువులతో ఉండేవి కాబట్టి వాటికి సులభంగా నిప్పంటుకొనే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒక దొంగ కేవలం మట్టి గోడకు రంధ్రం చేయడం ద్వారా ఇంట్లోకి సులభంగా చొరబడగలడు. అందుకే అనేక ప్రాంతాల్లో నేడు ఆఫ్రికాకు చెందిన సంప్రదాయ గృహాల స్థానంలో నెమ్మదిగా ఎక్కువ మన్నికగల ఇతర రకాల నిర్మాణాలు చేపడుతున్నారు.

[చిత్రసౌజన్యం]

సమాచార మూలం: ఆఫ్రికా సంప్రదాయ గృహ నిర్మాణశాస్త్రం

గుడిసెలు: Courtesy Bomas of Kenya Ltd - A Cultural, Conference, and Entertainment Center

[5వ పేజీలోని చిత్రం]

యూరప్‌

[చిత్రసౌజన్యం]

©Tim Dirven/Panos Pictures

[6వ పేజీలోని చిత్రం]

ఆఫ్రికా

[6వ పేజీలోని చిత్రం]

దక్షిణ అమెరికా

[7వ పేజీలోని చిత్రం]

దక్షిణ అమెరికా

[7వ పేజీలోని చిత్రం]

ఆసియా

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Teun Voeten/Panos Pictures; J.R. Ripper/BrazilPhotos

[7వ పేజీలోని చిత్రసౌజన్యం]

JORGE UZON/AFP/Getty Images; © Frits Meyst/Panos Pictures