కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చివరకు అందరికీ మంచి గృహవసతి!

చివరకు అందరికీ మంచి గృహవసతి!

చివరకు అందరికీ మంచి గృహవసతి!

కెన్యాలోని నైరోబీకి కొంచెం వెలుపల ఐక్యరాజ్య సమితికి చెందిన అందమైన 140 ఎకరాల గిగిరి కాంపౌండ్‌ ఉంది, ఆ కాంపౌండ్‌లో యు.ఎన్‌. హాబిటాట్‌ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఇది, భూగోళవ్యాప్త గృహవసతి సంక్షోభాన్ని పరిష్కరించాలనే అంతర్జాతీయ అంకితభావానికి చిహ్నంగా ఉంది. ఆ గిగిరి నేచర్‌ ట్రయల్‌ గుండా అలా నడిచి వెళ్తే సమిష్టి కృషివల్ల, సరిపోయేంత నిధులవల్ల ఏమి సాధించవచ్చనే దానికి అసాధారణ రుజువును చూడవచ్చు. ఇంతకుముందు శిథిలాలతో, చెత్తాచెదారంతో నిండిన ఆ ప్రాంతం, ఇప్పుడు అక్కడి సిబ్బందికి, సందర్శకులకు ఎంతో ప్రయోజనకరమైన, ఉల్లాసాన్నిచ్చే అందమైన ప్రాంతంగా మారింది.

అయితే, దానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక మురికివాడ ఉంది, అది ఈ మధ్యనే వెలసింది, అయినా కూడా అది క్రమంగా విస్తరిస్తోంది. గృహవసతికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సంక్షోభం ఎంత నిరుత్సాహం కలిగించే విధంగా ఉందో అది బాధాకరంగా గుర్తు చేస్తోంది. మట్టితో, కట్టెలతో, తగరపు రేకులతో నిర్మించబడిన ఆ గుడిసెలు కనీసం నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆ ఇళ్ళ మధ్య ఉన్న మార్గంలో మురుగునీటి దుర్గంధం వస్తుంది. అక్కడి నివాసులు నీళ్ళ కోసం అమెరికాలోని సగటు పౌరుడు చెల్లించే డబ్బుకన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ డబ్బును చెల్లిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 40,000 మందిలో చాలామంది 20వ పడిలో, 30వ పడిలో ఉన్నారు. వారు సోమరులుగా గానీ నిర్లిప్తంగా గానీ లేరు. వారు దగ్గర్లో ఉన్న నైరోబీలో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చారు.

ఆ పరిస్థితులకు పూర్తి భిన్నంగా, ప్రపంచ నాయకులు పరిశుభ్రమైన, అనువైన, ఆకర్షణీయమైన పరిసరాల్లో, గిగిరి కాంపౌండ్‌కు ప్రక్కన నివసిస్తున్న నిరుపేద స్త్రీపురుషుల, పిల్లల భవిష్యత్తు గురించి చర్చించడానికి సమావేశమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ప్రకారం, ఆశాభంగం కలిగించే సత్యమేమిటంటే, మురికివాడల్లో నివసిస్తున్నవారి జీవితాలను గమనార్హమైన విధంగా మెరుగుపరచడానికి “ప్రపంచానికి వనరులు, సామర్థ్యం, శక్తి” ఉన్నాయి. అయితే ఏమి చేయాల్సిన అవసరం ఉంది? “ప్రగతికి అవరోధంగా నిలిచిన నిర్లిప్తతను, రాజకీయ నాయకుల దృఢసంకల్ప లేమిని, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నవారు అందరూ అధిగమించ[గలరు] . . . అనేది నా నమ్మకం” అని అన్నన్‌ ముగించాడు.

అయితే, ఆ నమ్మకం ఎంత వాస్తవికంగా ఉంది? అంతర్జాతీయ, ప్రాంతీయ, స్థానిక రాజకీయ నాయకులందరూ తమ స్వప్రయోజనాలను ప్రక్కనపెట్టి అందరికీ ప్రయోజనం కలిగించే పరిష్కారం కనుగొనాలంటే ఏమి అవసరం? ప్రస్తుత సంక్షోభాన్ని అంతమొందించడానికి కావల్సిన వనరులు, సామర్థ్యం, శక్తి ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నారు. మరింత ప్రాముఖ్యంగా, ఆయనకు జాలి, త్వరలోనే చర్య తీసుకోవాలన్న దృఢసంకల్పం కూడా ఉన్నాయి. వాస్తవానికి, ఆయన ప్రభుత్వం, భూగోళవ్యాప్త గృహవసతి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వివరణాత్మకమైన కార్యక్రమాన్ని ఇప్పటికే వర్ణించింది.

క్రొత్త గృహవసతి కార్యక్రమం

మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు తాను ఏమి చేయాలని సంకల్పించాడో బైబిల్లో వివరించాడు. ఆయన ఇలా వాగ్దానం చేశాడు: “నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను.” (యెషయా 65:17) అది నాటకీయ మార్పుకు దారితీస్తుంది. క్రొత్త ప్రభుత్వపు “ఆకాశము,” ప్రస్తుత మానవ ప్రభుత్వాలు సాధించలేని విషయాలను సాధిస్తుంది. దేవుని రాజ్యం లేక ప్రభుత్వం, నూతన భూసంబంధ మానవ సమాజంలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఆరోగ్యం, భద్రత, ఆత్మగౌరవం గురించిన హామీ ఇస్తుంది. ఆ నూతన భూసంబంధ సమాజ భావి సభ్యులు “అంత్యదినములలో” సమకూర్చబడతారని గతంలో యెషయాకు చెప్పబడింది. (యెషయా 2:1-4) అంటే ఆ మార్పులు త్వరలోనే జరగనున్నాయని దాని భావం.​—మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5.

యెషయా 65వ అధ్యాయంలోని ఇతర వచనాల్లో నమోదైన వాక్యంలో, ఆ సమయంలో ప్రతీ ఒక్కరికి శాశ్వత గృహాన్ని ఇస్తానని దేవుడు నిర్దిష్టంగా చెప్పడం గమనార్హం. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు . . . వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు” అని ఆయన చెబుతున్నాడు. (యెషయా 65:21, 22) చివరకు మీరు తలదాచుకోవడానికి తగిన గృహవసతి ఉండడం, అద్భుతమైన పరదైసులోని పరిశుభ్రమైన పరిసరాల్లో, సురక్షితమైన పరిస్థితుల్లో జీవించడాన్ని ఊహించుకోండి! అలాంటి పరిస్థితులను ఎవరు మాత్రం ఇష్టపడరు? దేవుని వాగ్దానం మీద మనం ఎలా నమ్మకం ఉంచవచ్చు?

మీరు నమ్మకం ఉంచగల ఒక వాగ్దానం

దేవుడు ప్రారంభంలో ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆయన వారిని బంజరు భూమిలో విడిచిపెట్టలేదు. ఆయన వారిని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం సమృద్ధిగా ఉన్న అందమైన ఏదెను తోటలో ఉంచాడు. (ఆదికాండము 2:8-15) ఆయన ‘భూమిని నిండించమని’ ఆదాముకు చెప్పాడే గానీ దాన్ని క్రిక్కిరిసిపోయేలా చేయమని చెప్పలేదు. (ఆదికాండము 1:28) భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరు శాంతి సామరస్యాలను, సమృద్ధిగా ఉన్న మంచి విషయాలను అనుభవించాలన్నదే ప్రారంభం నుండి దేవుని సంకల్పం.

తర్వాత, నోవహు దినాల్లో మానవ సమాజం హింస, అనైతికతతో నిండిపోయింది కాబట్టి, “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను.” (ఆదికాండము 6:11, 12) దేవుడు ఆ పరిస్థితిని కేవలం చూసీ చూడనట్లు ఊరుకున్నాడా? లేదు. ఆయన వెంటనే చర్య తీసుకున్నాడు. ఆయన తన నామం కోసం, నీతిమంతుడైన నోవహు, అతని సంతానం కోసం భూవ్యాప్త జలప్రళయం ద్వారా భూమిని శుభ్రం చేశాడు. కాబట్టి, నోవహు ఓడలో నుండి తన నూతన గృహానికి వచ్చినప్పుడు, “అభివృద్ధి పొంది భూమిని నింపి” దానిలో మళ్ళీ విస్తరించమని నోవహుకు చెప్పబడింది.​—ఆదికాండము 9:1.

ఇంకా కొంతకాలం తర్వాత, దేవుడు ఇశ్రాయేలీయులకు వారి పితరుడైన అబ్రాహాముకు వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశం “విశాలమైన మంచి దేశము, . . . పాలు తేనెలు ప్రవహించు దేశము” అని వర్ణించబడింది. (నిర్గమకాండము 3:8) ఇశ్రాయేలీయులు తమ అవిధేయత కారణంగా 40 సంవత్సరాలు శాశ్వత గృహం లేకుండా ఎడారిలో తిరిగారు. అయినా తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దేవుడు చివరకు వారు స్థిరపడడానికి దేశాన్ని ఇచ్చాడు. ప్రేరేపిత వృత్తాంతం ఇలా నివేదిస్తోంది: “[యెహోవా] వారికి విశ్రాంతి కలుగజేసెను . . . యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.”​—యెహోషువ 21:43-45.

చివరకు అందరికీ గృహం!

కాబట్టి, యెషయా 65వ అధ్యాయంలోని యెహోవా మాటలు అర్థరహితమైన వాగ్దానాలు కావనేది స్పష్టం. భూమిని శుభ్రం చేసి, దానిపట్ల తనకున్న ఆది సంకల్పాన్ని నెరవేర్చడానికి చేయాల్సిందల్లా చేయగల శక్తి, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తగా ఆయనకు ఉంది. (యెషయా 40:26, 28; 55:10, 11) అంతేకాక, ఆయన వాటిని చేయాలనుకుంటున్నాడని కూడా బైబిలు హామీ ఇస్తోంది. (కీర్తన 72:12, 13) నీతిగల మానవులకు తగిన గృహవసతిని ఇచ్చేందుకు గతంలో ఆయన చర్య తీసుకున్నాడు, త్వరలో ఆయన మళ్ళీ చర్య తీసుకుంటాడు.

వాస్తవానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు భూమ్మీదకు వచ్చినప్పుడు ‘దేవుని చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద కూడా నెరవేరాలి’ అని ప్రార్థించమని తన అనుచరులకు నిర్దిష్టంగా బోధించాడు. (మత్తయి 6:9) భూమి పరదైసుగా మారుతుందని ఆయన సూచించాడు. (లూకా 23:43) దాని భావమేమిటో ఒకసారి ఆలోచించండి. మురికివాడలు, ఆక్రమిత బస్తీలు, ప్రజలు వీధుల్లో నిద్రించడం లేక ప్రజలు తమ గృహాల నుండి వెళ్ళగొట్టబడడం వంటివి ఉండవు. అది ఎంత సంతోషకరమైన సమయంగా ఉంటుందో కదా! దేవుని రాజ్య పరిపాలనలో చివరకు అందరూ శాశ్వత గృహాన్ని పొందుతారు! (g05 9/22)

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలులో గృహవసతి

అందుబాటులో ఉన్న రుజువుల ప్రకారం, ఇశ్రాయేలీయులు తమకు ముందున్న కనానీయులలాగే రాళ్ళతో నిర్మించిన ఇళ్ళను ఇష్టపడ్డారు, ఎందుకంటే ఆ భవనాలు ఇతర నిర్మాణాలకన్నా ఎక్కువ దృఢంగా ఉండడమే కాక, చొరబాటుదారుల బారి నుండి కూడా ఎక్కువ రక్షణను ఇచ్చేవి. (యెషయా 9:10; ఆమోసు 5:12) అయితే పల్లపు భూముల్లో మట్టి ఇటుకలను లేదా బట్టీలో కాల్చిన మట్టి ఇటుకలను నివాసాల గోడల కోసం ఉపయోగించేవారు. పైకప్పులు చాలావరకు బల్లపరుపుగా ఉండేవి, కొన్నిసార్లు దాని మీద మరోగదిని నిర్మించేవారు. సాధారణంగా గృహ ఆవరణలోనే పొయ్యి ఉండేది, ఎక్కడో కొన్ని ఇళ్ళల్లో బావి లేక నీటిని నిలువచేసే కట్టడం ఉండేది.​—2 సమూయేలు 17:18.

మోషే ధర్మశాస్త్రంలో గృహవసతికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రమాదాలను నిరోధించడానికి బల్లపరుపు పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. పదవ ఆజ్ఞ తమ పొరుగువారి ఇంటిని ఆశించకూడదని ఇశ్రాయేలీయులను హెచ్చరించింది. ఎవరైనా తమ గృహాన్ని అమ్మాల్సివస్తే, దానిని వారు మళ్ళీ కొనుక్కొని విడిపించుకొనే హక్కు, కనీసం కొంతకాలంపాటైనా వారికి ఉండేది.​—నిర్గమకాండము 20:17; లేవీయకాండము 25:29-33; ద్వితీయోపదేశకాండము 22:8.

ఇశ్రాయేలులోని గృహం ఆధ్యాత్మిక ఉపదేశానికి ప్రాముఖ్యమైన స్థలంగా కూడా పనిచేసేది. తమ పిల్లలకు దేవుని నియమాలను ఇంట్లో కూర్చున్నప్పుడు బోధించాలని, విగ్రహారాధనకు సంబంధమున్న ఎలాంటి వస్తువులూ ఇంట్లో ఉండకూడదని తండ్రులు ప్రత్యేకంగా నిర్దేశించబడ్డారు.​—ద్వితీయోపదేశకాండము 6:6, 7; 7:26.

[చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలులో ఇళ్ళు పర్ణశాలల పండుగ ఆచరణ వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఉపయోగించబడేవి

[12వ పేజీలోని బాక్సు/చిత్రం]

అతి ప్రాచీన గృహాలు

మొదటి మానవుడైన ఆదాము గృహంలో నివసించడం గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు. అయితే కయీను “ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను” అని ఆదికాండము 4:17 చెబుతోంది. ప్రస్తుత ప్రమాణాల ప్రకారం బహుశా ఆ ఊరు కేవలం ఒక ప్రాకారమున్న పల్లెటూరే అయి ఉండవచ్చు. అప్పుడు ఎలాంటి గృహాలను ఉపయోగించేవారో ఆ వృత్తాంతంలో వివరించబడలేదు. బహుశా ఆ ఊరంతటిలో కయీను కుటుంబ సభ్యులే నివసించి ఉండవచ్చు.

ప్రాచీన కాలంలో గుడారాలు సాధారణంగా నివాసాలుగా ఉపయోగించబడేవి. కయీను వారసుల్లో యాబాలు అనే మరో వ్యక్తి “పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు” అని పిలువబడ్డాడు. (ఆదికాండము 4:20) గుడారాలను వెయ్యడం, వాటిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళడం చాలా సులభంగా ఉండేదని స్పష్టమవుతోంది.

కొంతకాలానికి, అనేక నాగరికతలు సువిశాలమైన గృహాలతో నిండిన నగరాలను అభివృద్ధి చేశాయి. ఉదాహరణకు, ఒకప్పుడు పితరుడైన అబ్రాము (అబ్రాహాము) నివసించిన ఊరు నగరంలో కొందరు నివాసులు 13 లేక 14 గదులున్న, ప్లాస్టరింగ్‌ చేసి, సున్నం వేసిన గృహాల సౌకర్యాలను అనుభవించారని శిథిలాలు సూచిస్తున్నాయి. ఆ గృహాలు ఇతరులు తమకూ కావాలని ఆశించే విధంగా ఉండి ఉండవచ్చు.

[8, 9వ పేజీలోని చిత్రం]

దేవుడు నీతిమంతులకు సురక్షితమైన గృహవసతిని వాగ్దానం చేస్తున్నాడు