కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చెడ్డవారి సహవాసానికి నేనెలా దూరంగా ఉండగలను?

చెడ్డవారి సహవాసానికి నేనెలా దూరంగా ఉండగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

చెడ్డవారి సహవాసానికి నేనెలా దూరంగా ఉండగలను?

“స్కూల్లో నేనొక అమ్మాయితో స్నేహం చేయడం మొదలుపెట్టాను. . . . ఆమె మాదకద్రవ్యాలు తీసుకోదు, పార్టీలకు వెళ్లదు లేదా ఆమె అనైతిక ప్రవర్తనగల వ్యక్తి కూడా కాదు. ఆమె దురుసుగా మాట్లాడదు, పైగా ఆమె చదువులో ముందుంటుంది. అయినా, ఆమె మంచి సహవాసి కాదు అనే చెప్పవచ్చు.”​—బెవెర్లీ. *

బెవెర్లీ అలాంటి అభిప్రాయానికి ఎందుకు చేరుకుంది? ఆ అమ్మాయి తనను హానికరమైన పనుల్లో పాల్గొనేలా ప్రభావితం చేసిందని ఇప్పుడు ఆమె గ్రహించింది. బెవెర్లీ ఇలా వివరిస్తోంది: “నేను ఆమెతో సహవాసం చేస్తున్న సమయంలో, అభిచార సంబంధమైన పుస్తకాలు చదవడమే కాక, దానికి సంబంధించిన ఒక కథ కూడా వ్రాయడం మొదలుపెట్టాను.”

మలాని అనే యౌవనురాలు కూడా చెడు ప్రవర్తనలో చిక్కుకుంది, అయితే తోటి క్రైస్తవుడనని చెప్పుకున్న వ్యక్తే ఆమెను అలాంటి ప్రవర్తనకు నడిపించాడు! అయితే ఫలాని వ్యక్తి మంచి సహవాసో కాదో మీరు ఎలా తెలుసుకోవచ్చు? అవిశ్వాసులతో సన్నిహితంగా సహవసించడం అన్ని సందర్భాల్లోనూ ప్రమాదకరంగా ఉంటుందా? అలాగని తోటి క్రైస్తవులతో ఏర్పరచుకునే స్నేహబంధాలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాయా?

మరి ముఖ్యంగా, ఆడా మగా ఒకరితో ఒకరు స్నేహం చేసే విషయమేమిటి? మీరు ఎవరినైనా వివాహ భాగస్వామిగా చేసుకోవాలని చూస్తున్నట్లయితే, మీ మధ్య మంచి అనుబంధం ఏర్పడగలదని మీరెలా తెలుసుకోవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవో చూద్దాం.

ఎలాంటి స్నేహితులు మంచివారుగా ఉంటారు?

బెవెర్లీ తోటి విద్యార్థిని సత్యదేవుని ఆరాధకురాలు కాదనే వాస్తవం, ఆమెతో స్నేహం పెంచుకోవడానికి బెవెర్లీ వెనుకాడేలా చేయవలసిందా? అవును, నిజక్రైస్తవులు ఒక వ్యక్తి తమ తోటి విశ్వాసి కానంత మాత్రాన ఆ వ్యక్తి అనుచితమైన లేదా అనైతికమైన వ్యక్తని భావించరు. అయితే సన్నిహిత స్నేహ బంధాలను ఏర్పరచుకోవాలని అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడానికి కారణం ఉంది. అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు కొరింథు సంఘంలోని వారిని హెచ్చరిస్తూ ఇలా వ్రాశాడు: “చెడు సహవాసం ఒకరి స్వభావాన్ని పాడుచేస్తుంది.” (1 కొరిం. 15:33, ద బైబిల్‌​—యాన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌) అలా అనడంలో పౌలు ఉద్దేశమేమిటి?

అలా పాడయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కొరింథులోని క్రైస్తవులలో కొంతమంది, గ్రీకు తత్త్వవేత్త అయిన ఎపిక్యూరస్‌ అనుచరులైన ఎపికూరీయులతో సహవసిస్తున్నారు. అయితే ఎపిక్యూరస్‌ తన అనుచరులకు జ్ఞానానుసారంగా, ధైర్యంతో, ఆశానిగ్రహంతో, న్యాయంగా జీవించాలని బోధించాడు. రహస్యంగా చెడ్డ పనులు చేయడాన్ని కూడా ఆయన ఖండించాడు. అయితే పౌలు ఎపికూరీయులను, అలాంటి ఆలోచన కలిగివున్న సంఘంలోనివారిని కూడా, “దుష్టసాంగత్యము” అని ఎందుకు పరిగణిస్తున్నాడు?

ఎపికూరీయులు సత్యదేవుని ఆరాధకులు కాదు. వారు మృతుల పునరుత్థానాన్ని నమ్మేవారు కాదు కాబట్టి, వారు తమ ప్రస్తుత జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంపైనే దృష్టి నిలిపేవారు. (అపొస్తలుల కార్యములు 17:18, 19, 32) అయితే అలాంటి వారితో సహవసిస్తున్నందువల్ల, కొరింథు సంఘంలోని కొంతమంది పునరుత్థానంపై తమకున్న విశ్వాసాన్ని కోల్పోవడం మొదలుపెట్టారంటే ఆశ్చర్యంలేదు. అందుకే, చెడు సహవాసం చేయకూడదని హెచ్చరిస్తూ పౌలు వ్రాసిన 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో, ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులను పునరుత్థాన నిరీక్షణ వాస్తవికత విషయంలో తిరిగి ఒప్పింపజేయాలనే ఉద్దేశంతో చేసిన వాదనలను మనం చూస్తాం.

దీనినుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దేవుని విశ్వసించని ప్రజలు కూడా ఉన్నతమైన లక్షణాలను కనబరుస్తుండవచ్చు. కానీ అలాంటివారిని మీ సన్నిహిత స్నేహితులుగా ఎన్నుకుంటే, మీ ఆలోచనా విధానం, విశ్వాసం, ప్రవర్తన ప్రభావితమవుతాయి. అందుకే, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికలో, పౌలు ఇలా చెప్పాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.”​—2 కొరింథీయులు 6:14-18.

పదహారు సంవత్సరాల ఫ్రెడ్‌, పౌలు మాటల్లోని విజ్ఞతను గ్రహించాడు. అతడు పాఠశాలేతర కార్యక్రమాల్లో పాల్గొనాలని మొదట అనుకున్నాడు, అందులో భాగంగా అయన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ప్రయాణించి అక్కడి పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. అయితే ఫ్రెడ్‌ తన తోటి విద్యార్థులతో కలిసి సిద్ధపడుతున్నప్పుడు ఆయన తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “వాళ్ళతో సహవసిస్తూ ఎంతో సమయం గడపడం నాకు ఆధ్యాత్మికంగా ఏ మాత్రం మంచి చేయదని నేను చూడగలిగాను.” దాని కారణంగా ఫ్రెడ్‌ ఆ ప్రోజెక్ట్‌ నుండి తొలగిపోవాలని, నిస్సహాయులైనవారికి వేరే విధాల్లో సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

తోటి క్రైస్తవుల మధ్య స్నేహబంధాలు

అయితే, క్రైస్తవ సంఘం లోపలి స్నేహబంధాల విషయమేమిటి? పౌలు యౌవనుడైన తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా హెచ్చరించాడు: “గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.” (2 తిమోతి 2:20, 21) కాబట్టి క్రైస్తవుల మధ్య కూడా ఘనహీనంగా ప్రవర్తించేవారు ఉండవచ్చనే వాస్తవాన్ని పౌలు కప్పిపుచ్చలేదు. అటువంటి వాళ్ళతో చేరకూడదని పౌలు తిమోతిని అంత సూటిగానే మందలించాడు.

అయితే తోటి క్రైస్తవులను మీరు సందేహించాలని దీనర్థమా? కాదు. అలాగని మీ స్నేహితులు పరిపూర్ణంగా ఉండాలని మీరు ఆశించాలని కూడా దీని భావం కాదు. (ప్రసంగి 7:16-18) అయితే, ఒక వ్యక్తి క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నంత మాత్రాన లేదా ఆయన తల్లిదండ్రులు సంఘంలో చురుకుగా ఉంటున్నంత మాత్రాన దానర్థం ఆ వ్యక్తి సన్నిహిత స్నేహితునిగా లేదా స్నేహితురాలిగా ఉండడానికి సరైనవారని కాదు.

సామెతలు 20:11 ఇలా చెబుతోంది: “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.” అందుకే మీరు ఈ విధంగా ఆలోచించడం జ్ఞానయుక్తమైనది: ఆమెకు లేదా అతనికి యెహోవాతో ఉన్న సంబంధం తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉందా? లేక, ఆయన ఆలోచనా విధానం, దృక్పథాలు “లౌకికాత్మ”ను ప్రతిబింబిస్తున్నట్లు రుజువేమైనా ఉందా? (1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:2) ఆమెతో లేదా అతనితో ఉండడం యెహోవాను ఆరాధించాలనే మీ కోరికను పురికొల్పేదిగా ఉందా?

యెహోవాపట్ల, ఆధ్యాత్మిక విషయాలపట్ల ప్రగాఢమైన ప్రేమగల స్నేహితులను ఎంపిక చేసుకుంటే, మీరు సమస్యలను తప్పించుకోవడమే కాక దేవుని సేవ చేయడానికి అధిక శక్తిని కూడా పొందుతారు. పౌలు తిమోతికి ఈ విధంగా చెప్పాడు: ‘పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.’​—2 తిమోతి 2:22.

స్త్రీ పురుషుల మధ్య స్నేహం

మీరు వివాహం చేసుకునే వయస్సువారైయుండి, వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఇవే సూత్రాలు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయాలో ఆలోచించారా? భవిష్యత్తులో మీ జీవిత భాగస్వామి కానున్న వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలు మిమ్మల్ని వారివైపుకు ఆకర్షించవచ్చు కానీ అవేవీ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి అంత ప్రాముఖ్యమైనవి కావు.

అందుకే “ప్రభువునందు” లేని వారిని వివాహం చేసుకోకూడదని బైబిలు పదే పదే హెచ్చరిస్తోంది. (1 కొరింథీయులు 7:39; ద్వితీయోపదేశకాండము 7:3, 4; నెహెమ్యా 13:25) నిజమే, తోటి ఆరాధకులుకాని ప్రజలు బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా, శ్రద్ధ వహించేవారిగా ఉండవచ్చు. అయినప్పటికీ, వారికి అలాంటి లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలనే ప్రేరణగానీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వివాహబంధాన్ని శాశ్వతంగా కాపాడుకోవాలనే ప్రేరణగానీ ఉండవు.

మరోవైపు, యెహోవాకు సమర్పించుకుని ఆయనపట్ల యథార్థంగా ఉండే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ లక్షణాలను అలవర్చుకుంటాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని కాపాడుకుంటాడు. బైబిలు తమ జీవిత భాగస్వామిని ప్రేమించడాన్ని దేవునితో మంచి సంబంధం కలిగివుండడంతో ముడిపెడుతుందని అతడు లేదా ఆమె తెలుసుకుంటారు. (ఎఫెసీయులు 5:28, 33; 1 పేతురు 3:7) ఆ విధంగా, ఇద్దరూ యెహోవాను ప్రేమించినప్పుడు, అది వాళ్ళు ఒకరిపట్ల ఒకరు యథార్థంగా ఉండడానికి బలమైన ప్రేరణగా ఉంటుంది.

అంటే, తోటి విశ్వాసుల మధ్య జరిగే వివాహాలు తప్పక విజయవంతమవుతాయని దాని భావమా? కాదు. ఉదాహరణకు, ఆధ్యాత్మిక విషయాలపట్ల పరిమితమైన ఆసక్తి మాత్రమే ఉన్న వ్యక్తిని మీరు వివాహం చేసుకుంటే, ఏమి జరుగుతుంది? ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండే వ్యక్తి ఈ విధానపు ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడు కాబట్టి, ఆ వ్యక్తి క్రైస్తవ సంఘం నుండి కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (ఫిలిప్పీయులు 3:18; 1 యోహాను 2:19) మీ జీవిత భాగస్వామి “ఈ లోకమాలిన్యముల”లో చిక్కుకుపోతే మీరు ఎదుర్కోవలసివచ్చే మనోవేదనను, వైవాహిక పోరాటాన్ని ఊహించండి.​—2 పేతురు 2:20.

వివాహానికి నడిపించే బంధాన్ని పెంపొందించుకునే ముందు, ఈ విధంగా ఆలోచించండి: ఈ వ్యక్తి తాను ఆధ్యాత్మిక వ్యక్తినని రుజువు చేసుకుంటున్నాడా? క్రైస్తవ జీవితంలో ఆ వ్యక్తి మంచి మాదిరిని ఉంచుతున్నాడా? ఆ వ్యక్తి బైబిలు సత్యంలో స్థిరంగా ఉన్నాడా, లేక ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంకా ఎక్కువ సమయం అవసరమా? ఆ వ్యక్తి జీవితంలో యెహోవాపట్ల ఉన్న ప్రేమే ముఖ్యమైన ప్రేరకమని మీకు నమ్మకం ఉందా? ఆ వ్యక్తికి మంచి పేరు ఉందని తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది. అయితే, చివరకు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తని, మంచి వివాహ భాగస్వామి కాగలడని మీకు నమ్మకం ఉండాలి.

“చెడ్డవారి” వైపు ఆకర్షించబడిన కొంతమంది, మొదట అనుచితమైన వినోదాలు లేదా కార్యక్రమాలు వంటి తప్పుడు విషయాలవైపుకు ఆకర్షించబడ్డారని కూడా గుర్తుంచుకోండి. క్రైస్తవ సంఘంలోని ఆదర్శవంతులైన యౌవనులు అలాంటి వాటిలో మీతోపాటు భాగం వహించరు. కాబట్టి మీ హృదయాన్ని పరీక్షించుకోండి.

మీ హృదయానికి శిక్షణ అవసరమని మీరనుకుంటే, నిరుత్సాహపడకండి. హృదయానికి శిక్షణనివ్వవచ్చు. (సామెతలు 23:12) అత్యంత ప్రాముఖ్యమైన విషయమేమిటంటే: మీరు ఎలాంటి విషయాలు కావాలని కోరుకుంటారు? మీరు మంచి విషయాలకు, వాటిని పాటిస్తున్నవారికి సన్నిహితం కావాలని అనుకుంటున్నారా? యెహోవా సహాయంతో, మీరు అలాంటి కోరికను పెంపొందించుకోవచ్చు. (కీర్తన 97:10) మంచి, చెడులను గుర్తించడానికి మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వడం ద్వారా ఎవరు ప్రయోజనకరమైన, క్షేమాభివృద్ధికరమైన స్నేహితులుగా ఉండగలరనేది మీరు సులభంగా గుర్తించగలుగుతారు.​—హెబ్రీయులు 5:14. (g05 8/22)

[అధస్సూచి]

^ పేర్లు మార్చబడ్డాయి.

[14వ పేజీలోని చిత్రం]

మంచి సహవాసులు అనుకూలమైన ఆధ్యాత్మిక ప్రభావం చూపిస్తారు