కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జంతర్‌ మంతర్‌—టెలిస్కోపులు లేని నక్షత్రశాల

జంతర్‌ మంతర్‌—టెలిస్కోపులు లేని నక్షత్రశాల

జంతర్‌ మంతర్‌—టెలిస్కోపులు లేని నక్షత్రశాల

ఇండియాలోని తేజరిల్లు! రచయిత

ఇండియాలోని న్యూఢిల్లీలో ఉన్న జంతర్‌ మంతర్‌ను చూడడానికి వచ్చే సందర్శకులు అక్కడ ఉన్న నిర్మాణాలను రెప్పవాల్చకుండా ఆశ్చర్యంతో చూస్తూ ‘ఇది నిజంగా ఒక నక్షత్రశాలేనా?’ అని అనుకోవచ్చు. ఖగోళశాస్త్ర సంబంధ హైటెక్‌ సాధనాలతో నిండి ఉండే అధునిక కట్టడాలను చూసేవారికి, పెద్ద పార్కులో నెలకొని, వింతగా కనిపించే ఈ రాతి కట్టడాలను చూస్తే అక్కడొక నక్షత్రశాల ఉన్నట్లు అనిపించదు. అయినా, 18వ శతాబ్దపు తొలిభాగంలో నిర్మించబడినప్పుడు, జంతర్‌ మంతర్‌ ఒక నక్షత్రశాలగానే పనిచేసింది. ఆ కాలంలో యూరప్‌లో అభివృద్ధి చెందుతున్న టెలిస్కోపుల, ఇతర సాధనాల సహాయం లేకున్నా ఈ నక్షత్రశాల అంతరిక్ష గ్రహాల గురించిన వివరణాత్మకమైన, సాధ్యమైనంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం గమనార్హం.

రాజపుత్ర పరిపాలకుడు మహారాజా సవాయ్‌ జైసింగ్‌ II నిర్మించిన ఐదు నక్షత్రశాలల్లో మూడింటిని జంతర్‌ మంతర్‌ అని పిలుస్తారు. “జంతర్‌” అనే మాట “యంత్ర” అనే సంస్కృత పదం నుండి వచ్చింది, దానికి “సాధనం” అనే అర్థం ఉంది, అలాగే “మంతర్‌” అనే పదం “మంత్ర” అనే పదం నుండి వచ్చింది, దానికి “సూత్రం” అనే అర్థం ఉంది. అప్పటి వ్యావహారిక భాషలో ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి అంత్యప్రాసలుగల పదాలను ఉపయోగించే అలవాటు ఉండడంవల్ల జంతర్‌ మంతర్‌ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.

న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ఉన్న ఒక సాధనం మీద 1910లో స్థాపించబడిన ఒక శిలాఫలకం, ఆ నక్షత్రశాల 1710లో నిర్మించబడిందని వెల్లడిచేస్తుంది. అయితే, దాని నిర్మాణం 1724లో పూర్తయి ఉండవచ్చని తర్వాతి పరిశోధన సూచిస్తోంది. మనం పరిశీలించనున్నట్లుగా, జైసింగ్‌ జీవిత వృత్తాంతం గురించిన సమాచారం, ఆ అభిప్రాయాన్ని సమర్థిస్తోంది. అయితే మనం మొదటగా, ప్రపంచంలో ఉన్న ఈ విధమైన నక్షత్రశాలల్లోకెల్లా పురాతనమైనదిగా పరిగణించబడుతున్న ఈ నక్షత్రశాలలో ఉన్న సాధనాలను సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

సాధనాలుగా రాతికట్టడాలు

నక్షత్రశాలలో ఇటుకలతో, రాళ్ళతో నిర్మించిన నాలుగు సాధనాలు ఉన్నాయి. వాటిలో సామ్రాట్‌ యంత్ర లేక అత్యుత్తమ సాధనం చాలా గమనార్హమైనది, అది “ఒకరోజులోని గంటలను 24 సమాన భాగాలుగా విభాగించి ఉన్న సన్‌డయల్‌.” అది జైసింగ్‌ చేసిన అతి ప్రాముఖ్యమైన సృష్టి. అది పెద్ద త్రిభుజాకార ఇటుక కట్టడం, 21.3 మీటర్ల ఎత్తు, 3.2 మీటర్ల వెడల్పు ఉంటుంది, దాని పీఠము 34.6 మీటర్లు. ఆ త్రిభుజపు కర్ణము 39 మీటర్ల పొడవు ఉంటుంది, అది భూ అక్షానికి సమాంతరంగా ఉండి ఉత్తర ధ్రువం వైపు తిరిగి ఉంటుంది. త్రిభుజానికి లేక నీడగడియారపు ముల్లుకు రెండు ప్రక్కల ఉన్న పాదభాగాల మీద ఉన్న గుర్తులు గంటలను, నిమిషాలను, సెకండ్లను సూచిస్తాయి. శతాబ్దాలపాటు సామాన్యమైన సన్‌డయల్‌లు ఉనికిలో ఉన్నా, జైసింగ్‌ సమయాన్ని కొలిచే ఆ ప్రాథమిక సాధనాన్ని ఆకాశ గ్రహాలకు సంబంధించిన ఖగోళ అక్షాంశాన్ని, మరితర సంబంధిత నిరూపకాలను కొలవడానికి ఉపయోగించే ఖచ్చితమైన సాధనంగా మార్చాడు.

నక్షత్రశాలలో ఉన్న ఇతర మూడు నిర్మాణాలు రామా, జయప్రకాశ్‌, మిశ్రా అనే యంత్రాలు. సూర్యుడి అక్షాంశాన్ని, నక్షత్రాల అక్షాంశాన్ని, అవి ఎంత ఎత్తున ఉన్నాయనేదాన్ని, వాటి సమాంశాన్ని కొలవడానికి అవి సంక్లిష్టమైన విధంగా రూపొందించబడ్డాయి. మిశ్రా సాధనం, ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందో కూడా సూచించింది.

మిశ్రా యంత్రను తప్ప పైన పేర్కొనబడిన సాధనాలన్నిటినీ జైసింగ్‌ కనిపెట్టాడు. ఇండియాలో ఆ కాలంలో ఉన్న మరే ఇతర సాధనాల కన్నా అవి ఎంతో సంక్లిష్టమైనవిగా, ప్రయోజనకరమైనవిగా ఉండి ఖచ్చితమైన పంచాంగాల, ఖగోళశాస్త్ర సంబంధమైన పట్టికల వికాసానికి దోహదపడ్డాయి. వాటి నమూనాలు సొగసుగా, అందంగా ఉండి, టెలిస్కోప్‌, మరితర ఆవిష్కరణలు వచ్చి వాటిని వాడుకలో లేకుండా చేసేంతవరకు అవి అమూల్యమైన సమాచారాన్ని అందించాయి. అయితే ఈ తెలివైన విద్యావంతుడైన వ్యక్తి, ఆ కాలంలో యూరప్‌లో అందుబాటులో ఉన్న ఆప్టికల్‌ టెలిస్కోప్‌ వంటి కొన్ని సాధనాలను తన ఖగోళశాస్త్ర పరిశోధనలో ఎందుకు ఉపయోగించుకోలేదు? దానికి జవాబును మనం మహారాజు నేపథ్యాన్ని, ఆ కాలానికి చెందిన చరిత్రను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.

“ఖగోళశాస్త్ర అధ్యయనానికి అంకితమయ్యాడు”

జైసింగ్‌ 1688లో ఇండియాలోని రాజస్థాన్‌ అనే రాష్ట్రంలో జన్మించాడు. ఆయన తండ్రి ఢిల్లీలోని మొగలుల ఆధీనంలో ఉన్న క్షత్రియుల కచావాహ వర్గానికి రాజధానియైన అంబర్‌కు మహారాజుగా ఉన్నాడు. ఆ యువరాజు హిందీ, సంస్కృతం, పర్షియా, అరబిక్‌ వంటి భాషల్లో విద్యనభ్యసించాడు. ఆయన గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, యుద్ధ కళలలో కూడా శిక్షణ పొందాడు. అయితే యువరాజుకు ఒక విషయమంటే ఎంతో ఇష్టం. దాని గురించి ఆయన కాలానికి చెందిన ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “సవాయ్‌ జైసింగ్‌ తన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి, ఆ తర్వాత అది పరిణతి చెందుతున్న కొద్దీ ఖగోళశాస్త్రం గురించిన అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు, ఖగోళశాస్త్రానికి సంబంధించిన అతి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడేవాడు.”

జైసింగ్‌ తన తండ్రి మరణానంతరం, 1700లో తన 11వ ఏట అంబర్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొద్దికాలానికే మొగల్‌ చక్రవర్తి యౌవనస్థుడైన ఈ రాజును దక్షిణ భారతదేశంలోని తన దర్బారుకు పిలిపించాడు, అక్కడ జైసింగ్‌ గణితశాస్త్రంలో, ఖగోళశాస్త్రంలో ప్రవీణుడైన జగన్నాథ్‌ను కలిశాడు. ఆ వ్యక్తి తర్వాత రాజు ప్రధాన సహాయకునిగా మారాడు. మహమ్మద్‌ షా పరిపాలన ప్రారంభమయ్యేంత వరకు అంటే 1719 వరకు యువ మహారాజు రాజకీయ భవితవ్యం ఊగిసలాడింది. అప్పుడు జైసింగ్‌, క్రొత్త మొగల్‌ పరిపాలకునితో సమావేశం కావడానికి రాజధాని ఢిల్లీకి పిలువబడ్డాడు. 1720 నవంబరులో జరిగిన ఆ సమావేశంలోనే జైసింగ్‌ ఒక నక్షత్రశాలను నిర్మించే ప్రతిపాదనను చేశాడని అనిపిస్తోంది, అది బహుశా 1724లో నిజస్వరూపం దాల్చి ఉంటుంది.

నక్షత్రశాలను నిర్మించడానికి మహారాజును పురికొల్పినదేమిటి? ఇండియాలోని పంచాంగాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పట్టీలు అసలు సరిగాలేవని, ఖగోళశాస్త్ర క్షేత్రంలో పెద్దగా ప్రగతి సాధించబడడంలేదని జైసింగ్‌ గుర్తించాడు. కాబట్టి ఆయన వాస్తవంగా కనిపించే ఆకాశ గ్రహాలకు అనుగుణంగా క్రొత్త పట్టీలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఖగోళశాస్త్ర అధ్యయనానికి అంకితమైన ప్రతీవ్యక్తికి ఖగోళశాస్త్ర పరిశీలనలకు వీలుగా అందుబాటులో ఉండే సాధనాలను తయారు చేయాలనే కోరిక కూడా ఆయనకు ఉండేది. కాబట్టి జైసింగ్‌ ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, పోర్చుగల్‌, జర్మనీ నుండి ఎన్నో పుస్తక సంచయాలను సంపాదించాడు. ఆయన తన ఆస్థానానికి ఖగోళశాస్త్ర సంబంధంగా హిందూ, ఇస్లాం మతాలకు చెందిన విద్యాంసులను, యూరప్‌కు చెందిన విద్వాంసులను ఆహ్వానించాడు. ఆయన ఖగోళశాస్త్రం మీద సమాచారాన్ని పోగుచేయడానికి ప్రాచ్య దేశాల నుండి యూరప్‌కు నిజ నిర్ధారణ సంఘాన్ని కూడా పంపించి పుస్తకాలను, పరికరాలను తీసుకురమ్మని వారిని ఆదేశించాడు.

తూర్పు పడమరలకు చెందిన ఖగోళశాస్త్రజ్ఞులు సంప్రదించుకోలేకపోయారు

యూరప్‌లో టెలిస్కోప్‌, మైక్రోమీటర్‌, వెర్నియర్‌ వంటి సాధనాలు వాడుకలో ఉన్నా, జైసింగ్‌ రాతి కట్టడాలను ఎందుకు నిర్మించాడు? సౌరమండలంలో సూర్యగ్రహమే కేంద్రంగా ఉందని తెలిపే కాపర్నికస్‌, గెలీలియో ఆవిష్కరణలతో ఆయనకు పరిచయంలేనట్లు ఎందుకు అనిపిస్తోంది?

తూర్పు పడమరలకు చెందిన ఖగోళశాస్త్రజ్ఞుల మధ్య సరైన సంప్రదింపులు లేకపోవడం కూడా కొంతవరకు దానికి కారణం. అదే కాకుండా వేరే అడ్డంకులు కూడా ఉన్నాయి. ఆ కాలంలోని మతసంబంధమైన వాతావరణం కూడా దానికి కారణం. బ్రాహ్మణ విద్వాంసులు, మహాసముద్రాన్ని దాటితే వారు తమ కులాన్ని కోల్పోవచ్చు కాబట్టి యూరప్‌కు ప్రయాణించేవారు కాదు. జైసింగ్‌ సమాచారాన్ని సేకరించడానికి సహాయం చేసిన యూరప్‌కు చెందిన సహాయకులు ప్రధానంగా జెసూట్‌ విద్వాంసులు. జైసింగ్‌ జీవితచరిత్ర రాసిన వి. ఎన్‌. శర్మ ప్రకారం, జెసూట్‌లతో పాటు సాధారణ క్యాథలిక్‌లు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని బలంగా విశ్వసించిన గెలీలియో, మరితర శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను ఆమోదించకుండా నిషేధించబడ్డారు, వారు దానిని ఆమోదిస్తే ఇన్‌క్విసిషన్‌ (క్యాథలిక్‌ విచారణ సభలో విచారణ) జరుపబడుతుందని హెచ్చరించబడ్డారు. చర్చి ఆ అభిప్రాయాలను చర్చికి విరుద్ధమైనదిగా, నాస్తికత్వంగా పరిగణించింది. కాబట్టి యూరప్‌కు జైసింగ్‌ పంపించిన ప్రతినిధులు తాము కొనాల్సిన వస్తువులలో కాపర్నికస్‌, గెలీలియో రాసిన గ్రంథాలను గానీ సూర్యకేంద్రక సిద్ధాంతాలను సమర్థించడానికి ఉపయోగించబడుతున్న క్రొత్త సాధనాలను గానీ చేర్చలేదు.

కొనసాగుతున్న అన్వేషణ

జైసింగ్‌, మత సంబంధమైన అసహనం, దురభిమానం నిండివున్న యుగంలో జీవించాడు. ఆయన ఆకాశముల గురించిన ఆధునిక జ్ఞానాన్ని సంపాదించడానికి విశిష్టమైన, దృఢసంకల్పంతో కూడిన కృషి చేసినా, ఇండియాలో దశాబ్దాల వరకు ఆ క్షేత్రంలో ఎక్కువగా ప్రగతి సాధించబడలేదు. అయినా, జంతర్‌ మంతర్‌ నక్షత్రశాల, జ్ఞానం సంపాదించాలనే తీవ్రమైన కోరిక ఉన్న ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాలకు నిదర్శనం.

జైసింగ్‌, అంతరిక్ష గ్రహల కదలిక గురించి ఆసక్తి పెంచుకున్న ఎన్నో శతాబ్దాలకు ముందే ఇతర తెలివైన వ్యక్తులు ఆకాశం వైపు చూస్తూ విశ్వానికి సంబంధించిన అద్భుతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మానవజాతి, దేవుని చేతిపనుల గురించిన జ్ఞానాన్ని పెంచుకోవాలనే తమ అన్వేషణలో ఎల్లప్పుడూ ఆకాశం వైపు ‘కన్నులు పైకెత్తి చూస్తారు’ అని అనడంలో సందేహం లేదు.​—యెషయా 40:26; కీర్తన 19:1. (g05 7/8)

[18వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సామ్రాట్‌ యంత్ర ఖచ్చితమైన ఒక సన్‌డయల్‌. ఆ పెద్ద త్రిభుజపు నీడ, వక్రాకృతిలో ఉన్న పాద భాగం మీద (విశేషంగా ఉన్న తెల్లటి వలయాన్ని చూడండి) పడుతుంది, ఆ భాగాల మీద గుర్తులు వేయబడివున్నాయి

[18వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

జయప్రకాశ్‌ యంత్రలో పుటాకార భాగం మీద గుర్తులతో, బోలుగా ఉన్న అర్థగోళాలు ఉన్నాయి. వాటి చట్రం మీదున్న బిందువుల మధ్య అడ్డతీగలు బిగించబడివున్నాయి

రామ యంత్ర లోపలి నుండి ఒక పరిశీలకుడు, వివిధ గుర్తుల సహాయంతో లేదా కిటికీ అంచుల సహాయంతో ఒక నక్షత్రం ఉన్న స్థానాన్ని గమనించగలడు

[18వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మిశ్రా యంత్ర వివిధ నగరాల్లో మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందో సూచించింది

[19వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

లైన్‌-ఆఫ్‌-సైట్‌ పరిశీలన అనే ఖగోళశాస్త్రపు పురాతన పద్ధతిని చాలా ఖచ్చితమైనదిగా జైసింగ్‌ చేశాడు

మీరు ఒక నక్షత్రం ఎక్కడుంది అనేది కనిపెట్టాలంటే దాని ఎత్తు (ఆకాశంలో అది ఎంత ఎత్తులో ఉంది), దాని సమాంశము (ఉత్తర దిక్కు నుండి అది తూర్పులో ఎంత దూరాన ఉంది) అనేవి మీరు తెలుసుకోవాలి

సామ్రాట్‌ యంత్ర దగ్గర ఒక నక్షత్రాన్ని కనిపెట్టడానికి, దాని స్థానాన్ని గుర్తించడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమయింది

[చిత్రసౌజన్యం]

క్రింద: Reproduced from the book SAWAI JAI SINGH AND HIS ASTRONOMY, published by Motilal Banarsidass Publishers (P) Ltd., Jawahar Nagar Delhi, India

[19వ పేజీలోని మ్యాపు]

ఇండియా

న్యూఢిల్లీ

మధుర

జైపూర్‌

వారణాసి

ఉజ్జైన్‌

జైసింగ్‌ ఇండియాలో ఐదు ఖగోళ పరిశీలన కేంద్రాలను నిర్మించాడు, వాటిలో ఒకటి న్యూఢిల్లీలో ఉంది

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

చిత్రం: Courtesy Roop Kishore Goyal