కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్యోతిష్యం మీ భవిష్యత్తును వెల్లడిచేస్తుందా?

జ్యోతిష్యం మీ భవిష్యత్తును వెల్లడిచేస్తుందా?

బైబిలు ఉద్దేశం

జ్యోతిష్యం మీ భవిష్యత్తును వెల్లడిచేస్తుందా?

మీరు మీ జీవితాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు, ప్రేమను పొందడంలో, డబ్బును సంపాదించుకోవడంలో ఎలా విజయం సాధించవచ్చు? చాలామంది సమాధానం కోసం జ్యోతిష్యం మీద ఆధారపడతారు. ప్రతీరోజు లక్షలాదిమంది తమ భవిష్యత్తును సుసంపన్నం చేసుకోవాలనే ఆశతో వార్తాపత్రికల్లోని రాశిఫలాలను చూసుకుంటారు. ప్రపంచనాయకులు కూడా నక్షత్రాలు తమ నిర్ణయాలను నిర్దేశించేందుకు అనుమతిస్తారన్నది తెలిసినదే.

జ్యోతిష్యం నమ్మదగినదేనా? జ్యోతిష్కులు భవిష్యత్తు గురించి ఎలా చెబుతారు? క్రైస్తవులు తమ జీవనవిధానాన్ని ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు నిర్దేశించడానికి అనుమతించాలా?

జ్యోతిష్యం అంటే ఏమిటి?

ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం, జ్యోతిష్యం అనేది “ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా భవిష్యత్తును తెలియజేయగల రూపాలుగా ఏర్పడతాయనే నమ్మకంపై ఆధారపడి ఉంది.” ఒక వ్యక్తి జన్మించినప్పుడు గ్రహాలు, రాశిచక్రంలోని రాశులు ఉన్న ఖచ్చితమైన స్థానాలు అతని జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు వాదిస్తారు. * ఒక నిర్దిష్ట సమయంలో ఆకాశంలోని ఈ గ్రహాల, నక్షత్రాల స్థానాన్ని జాతకచక్రం అంటారు.

జ్యోతిష్యాన్ని నమ్మడం అనేది పురాతనమైనది. దాదాపు 4,000 సంవత్సరాల క్రితం, బబులోనీయులు సూర్యుని, చంద్రుని, బాగా కనిపించే ఐదు గ్రహాల స్థానాలనుబట్టి భవిష్యత్తును ముందుగానే తెలియజేయడం ప్రారంభించారు. ఆకాశంలోని ఈ నక్షత్రాలకు, గ్రహాలకు కొన్ని శక్తులు ఉంటాయనీ అవి మానవుల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయనీ వారు వాదించేవారు. తర్వాత వాళ్ళు భవిష్యత్తును తెలియజేసేందుకు రాశిచక్రంలోని రాశులను ఉపయోగించడం ప్రారంభించారు.

వైఫల్యాల దీర్ఘచరిత్ర

బైబిలు బబులోనుకూ జ్యోతిష్యానికీ మధ్యనున్న సంబంధం వైపు మన అవధానాన్ని మళ్ళిస్తోంది, అది పలుమార్లు బబులోను జ్యోతిష్కుల గురించి పేర్కొంటోంది. (దానియేలు 4:7; 5:7, 11) దానియేలు ప్రవక్త కాలంలో, కల్దీయలో (బబులోనులో) జ్యోతిష్యం ఎంత విస్తృతంగా ఉండేదంటే జ్యోతిష్కులను సూచించడానికి ప్రత్యామ్నాయంగా “కల్దీయులు” అనే పదాన్ని ఉపయోగించేవారు.

దానియేలు బబులోనుపై జ్యోతిశ్శాస్త్ర ప్రభావాన్ని మాత్రమే కాదుకానీ ఆ పట్టణం కూలిపోతుందని చెప్పడంలో జ్యోతిష్కుల వైఫల్యాన్ని కూడా కళ్ళారా చూశాడు. (దానియేలు 2:27) యెషయా ప్రవక్త రెండు శతాబ్దాల ముందే ఖచ్చితంగా ఏమి తెలియజేశాడో గమనించండి. ఆయన తృణీకారభావంతో ఇలా వ్రాశాడు: “జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు . . . తమ్ముతాము తప్పించుకొనలేక యున్నారు.”​—యెషయా 47:13, 14.

స్పష్టంగా, బబులోను జ్యోతిష్కులు కొన్ని గంటల ముందు కూడా తమ పట్టణపు పతనం గురించి చెప్పలేకపోయారు. రాజైన బెల్షస్సరు రాజనగరిలో దేవుని ప్రతికూల తీర్పు గోడ మీద కనబడినప్పుడు, జ్యోతిష్కులు ఆ మార్మిక చేవ్రాత భావాన్ని వివరించలేకపోయారు.​—దానియేలు 5:7, 8.

నేడు జ్యోతిష్కులు భవిష్యత్తును గురించిన ప్రాముఖ్యమైన సంఘటనలను ముందుగానే తెలియజేయడంలో తాము అంతకంటే గొప్పవారిమని ఏమీ నిరూపించుకోలేకపోయారు. 3,000 కన్నా ఎక్కువ నిర్దిష్టమైన జ్యోతిష్య నివేదికలను పరిశోధించిన తర్వాత, శాస్త్ర పరిశోధకులైన ఆర్‌. కల్వర్‌, ఫిలిప్‌ అయానా వాటిలో కేవలం పదిశాతం మాత్రమే ఖచ్చితమైనవనే నిర్ధారణకు వచ్చారు. అన్ని విషయాలు తెలిసిన ఏ విశ్లేషకుడైనా జరగబోయే సంఘటనలను అంతకంటే ఖచ్చితంగా చెప్పగలడు.

బైబిలు బోధలకు విరుద్ధమైనది

అయితే హెబ్రీ ప్రవక్తలు, జ్యోతిష్యం భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తెలియజేయడంలో విఫలమైనందుకే దానిని నిరాకరించలేదు. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం, శకునాలు చూడవద్దని ఇశ్రాయేలీయులను నిర్దిష్టంగా హెచ్చరించింది. ‘శకునముచెప్పువానినైనను లేదా సోదెగానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు’ అని ధర్మశాస్త్రం తెలియజేసింది.​—ద్వితీయోపదేశకాండము 18:10, 12.

ఆ లేఖనంలో జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పబడకపోయినప్పటికీ, దాన్ని అభ్యసించడం స్పష్టంగా నిషేధించబడింది. జ్యోతిష్యం ఒక “రకమైన సోదె చెప్పడం వంటిది, అందులో భూసంబంధమైన, మానవ ఘటనల గురించిన భవిష్యత్తును చెప్పడానికి స్థిరంగా ఉన్న నక్షత్రాలను, సూర్యచంద్రులను, గ్రహాలను పరిశీలించి వాటి భావం చెబుతారు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తోంది. నక్షత్రాల మీద లేదా ఇతర వస్తువుల మీద ఆధారపడి చెప్పే అన్ని రకాల సోదెలు దేవుని మార్గనిర్దేశకాలను అతిక్రమిస్తాయి. ఎందుకు? దానికి మంచి కారణమే ఉంది.

బైబిలు మన విజయాలను లేదా వైఫల్యాలను నక్షత్రాలకు ఆపాదించకుండా, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని స్పష్టంగా చెబుతోంది. (గలతీయులు 6:7) మనం నైతిక స్వేచ్ఛగల జీవులం కాబట్టి, దేవుడు మన క్రియలకు మనలో ప్రతీ ఒక్కరిని బాధ్యులుగా ఎంచుతాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20; రోమీయులు 14:12) నిజమే, మన అదుపులో లేని సంఘటనల మూలంగా ఏదైనా ప్రమాదం జరగవచ్చు లేదా జబ్బు చేయవచ్చు. కానీ అలాంటి విపత్తులు, జాతకచక్రం మూలంగా కాదుగానీ ‘కాలవశముచేతను, అనూహ్యంగాను’ జరుగుతాయని లేఖనాలు వివరిస్తున్నాయి.​—ప్రసంగి 9:11, NW.

మానవసంబంధాలకు సంబంధించినంతవరకూ, బైబిలు మనల్ని జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ వంటి లక్షణాలను అలవర్చుకోమని ప్రేరేపిస్తోంది. (కొలొస్సయులు 3:12-14) ఈ లక్షణాలు శాశ్వతమైన స్నేహబంధాలకు, బలమైన వివాహాలకు దోహదపడే కీలకంగా పనిచేస్తాయి. “జాతకాలు కలవడం” అనేది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి ఆధారపడదగిన మార్గదర్శకం కాదు. మానసిక శాస్త్రవేత్త బెర్నార్డ్‌ సిల్వర్‌మాన్‌ దాదాపు 3,500 మంది దంపతుల జాతకచక్రాలను పరిశీలించాడు, వారిలో 17 శాతం మంది ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ‘జాతకాలు కలవడం’ మూలంగా పెళ్ళి చేసుకున్న వారి మధ్య విడాకుల రేటు తక్కువగా ఉన్నట్లేమీ ఆయన కనుగొనలేదు.

స్పష్టంగా, జ్యోతిష్యం విశ్వసనీయమైనది కాదు, ఇది తప్పుదారి పట్టిస్తుంది. ఇది, మనం తప్పులు చేసినప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా నక్షత్రాలను నిందించేలా చేయగలదు. అన్నిటికంటే ముఖ్యంగా, ఇది దేవుని వాక్యంలో స్పష్టంగా ఖండించబడింది. (g05 8/8)

[అధస్సూచి]

^ రాశిచక్రంలోని రాశులు, జ్యోతిష్యంలో ఉపయోగించబడే 12 నక్షత్ర సముదాయాలు.