తేజరిల్లు! చదవడంతో అప్రమత్తమయ్యారు
తేజరిల్లు! చదవడంతో అప్రమత్తమయ్యారు
తేజరిల్లు!ను క్రమంగా చదివే పాఠకులు ఆ పత్రికలో వచ్చే ఆర్టికల్స్ విలువను అర్థం చేసుకుంటారు. అయితే గత డిసెంబరులో, థాయ్‌లాండ్‌లోని కావు లాక్‌కి విహారయాత్రకు వెళ్ళిన జర్మన్ దంపతులకు ఫిబ్రవరి 8, 2001, సంచిక (ఆంగ్లం)లో వచ్చిన “ప్రాణాంతక అలలు—కల్పితాలు, వాస్తవాలు” అనే శీర్షికగల ఆర్టికల్‌వల్ల ఎంతో మేలు జరిగింది.
ఫ్రాంకన్‌పోస్ట్ (జెల్బా టాగ్‌బ్లాట్) అనే జర్మన్ వార్తాపత్రిక ఆ దంపతుల అనుభవాన్ని ఈ విధంగా తెలియజేసింది: “‘మేము అప్పుడు సముద్రంలో ఈతకొడుతున్నాం’ అని రొస్విత గాజెల్ ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పింది. అలా సముద్రంలో ఈతకొట్టిన తర్వాత, గాజెల్ దంపతులు బట్టలు మార్చుకోవడానికి హోటల్‌లోకి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి కనబడ్డ వింత దృశ్యాన్ని రెయినర్ గాజెల్ ఈ విధంగా వివరించారు: ‘మేము పది నిమిషాల తర్వాత, సముద్ర తీరానికి తిరిగి వచ్చేసరికి సముద్రం కనిపించకుండా పోయింది.’ తీరం నుండి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోవున్న ఒడ్డు వరకు కనిపించిందల్లా కేవలం సముద్రపు నేల మాత్రమే. ‘అప్పటివరకు నీళ్ళలో ఈదుతున్నవారంతా సముద్ర గర్భంలో కలిసిపోయారు.’
“గాజెల్ దంపతులు తాము సురక్షితంగా తప్పించుకోవడానికి జరిల్లు! పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ కారణమని చెబుతున్నారు.” వారు ఆ ఆర్టికల్‌లో సునామీలు సంభవించే ముందు అసాధారణమైన అలలు విరుచుకుపడతాయని చదివారు. “కొంత దూరంలో అసాధారణమైన అలను చూసినప్పుడు, వారు వెనక్కి తిరిగి పరుగెత్తడం ప్రారంభించారు.
“ఆ నీటి గోడ దాదాపు 12 నుండి 15 మీటర్ల ఎత్తు ఉన్నట్లు రెయినర్ గాజెల్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేదు జ్ఞాపకాల్లో ఒకటి ఏమిటంటే, అక్కడకు వచ్చిన ఇతర పర్యాటకులు ఆ సముద్రం దగ్గర చూస్తూ నిలబడిపోయారు. ‘వారు అక్కడనుండి కదల్లేదు. నేను సురక్షిత ప్రాంతానికి పారిపొమ్మని అరిచాను, అయినా వారెవరూ స్పందించలేదు.’ వాళ్ళలో ఎవరూ తప్పించుకోలేకపోయారు.”
గాజెల్ దంపతుల గురించి మాట్లాడుతూ, వార్తాపత్రికలోని ఆర్టికల్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: “ఆ దంపతులు యెహోవాసాక్షులు కావడంవల్ల, వాళ్ళు విహారయాత్రకు వచ్చిన సమయంలో కూడా అక్కడికి సమీపంలోనే ఉన్న సంఘంతో సహవసించారు, అది కావు లాక్‌కి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. జరిగిన విపత్తు గురించి వారి తోటి విశ్వాసులు విన్నప్పుడు, సంఘమంతా వాళ్ళను చూడడానికి కావు లాక్‌కి బయలుదేరింది.”
ఇప్పుడు జర్మనీలో సురక్షితంగా ఉన్న ఆ దంపతులు తేజరిల్లు!లోని విలువైన సమాచారానికి ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు. అంతేగాక తమకు సహాయం చేసిన థాయ్ ప్రజలపట్ల, ముఖ్యంగా నిజమైన క్రైస్తవ ప్రేమను చూపిన తమ ఆధ్యాత్మిక సహోదరులపట్ల ఎంత కృతజ్ఞతతో ఉన్నారో కదా! (g05 7/22)