కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

“సమస్యాత్మకమైన ప్రవర్తన” ఉన్న పిల్లలు బాగుపడవచ్చు

“సమస్యాత్మకమైన ప్రవర్తన ఉన్న, ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే చాలామంది పిల్లలు వయసు పెరిగేకొద్దీ బాగుపడతారు, వాళ్ళు చక్కగా సరిదిద్దబడిన టీనేజర్లుగా మారే అవకాశముంది” అని ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ చెబుతోంది. ఆస్ట్రేలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ చేసిన పరిశోధన, 11 లేక 12 ఏండ్ల వయస్సులో, “ఎప్పుడూ గొడవలు పెట్టుకోవడం, సరిగా సహకరించకపోవడం, ఆశానిగ్రహం తక్కువగా ఉండడం, పనుల మీద దృష్టి నిలిపే సామర్థ్యం తక్కువగా ఉండడం, ఎక్కువగా అతిచురుకుగా ఉండడం (హైపర్‌యాక్టివిటి), మనోభావాలు త్వరత్వరగా మారుతుండడం లేక విచారంతో ఉండడం” వంటి లక్షణాల్లో మూడు లేక అంతకన్నా ఎక్కువ లక్షణాలు కనబరుస్తున్న 178 మంది పిల్లలను గుర్తించి, వారి అభివృద్ధిని గమనించింది. ఆరు సంవత్సరాల తర్వాత, ఆ యువకుల్లో 100 మంది ప్రవర్తన, “మంచిగా ప్రవర్తించే యువకుల ప్రవర్తనలాగే దాదాపు తయారైంది. వారు మెరుగవడానికి ఏమి సహాయం చేసింది? “సంతోషంగా ఉండే టీనేజర్లుగా మారిన పిల్లలు, సంఘ వ్యతిరేక సహవాసులతో సహవసించి ఉండకపోవచ్చు, [అంతేకాక] తల్లిదండ్రులు వారిని దగ్గర నుండి పర్యవేక్షించి ఉండవచ్చు” అని ఆ నివేదిక చెబుతోంది. (g05 8/8)

పొగాకు దేహమంతటికీ హానికరం

“పొగత్రాగేవారు తమ ఊపిరితిత్తులకు, ధమనులకు మాత్రమే హాని కలిగించుకోవడంలేదు, వారి ధాతువులన్నిటికీ హాని కలుగుతుంది” అని న్యూ సైంటిస్ట్‌ నివేదిస్తోంది. అమెరికాకు చెందిన ముఖ్య శస్త్రవైద్యుడు రిచర్డ్‌ హెచ్‌. కర్మోనా, పొగాకు ద్వారా కలిగే ఎన్నో రోగాల గురించి పేర్కొంటున్నాడు, ఆ రోగాల్లో నిమోనియా, లుకేమియా, కంట్లో శుక్లాలు, చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, గర్భాశయం, కడుపు, క్లోమం వంటి భాగాల క్యాన్సర్లు కూడా ఉన్నాయి. “పొగత్రాగడం హానికరమని దశాబ్దాలుగా మనకు తెలుసు, కానీ అది మనకు ఇప్పటివరకు తెలిసినదానికన్నా ఎంతో హానికరమైనదని ఈ నివేదిక చూపిస్తోంది” అని కర్మోనా చెబుతున్నాడు. “సిగరెట్‌ పొగ నుండి వచ్చే విషపదార్థం రక్తం ప్రవహించే ప్రతీచోటకు చేరుకుంటుంది.” టార్‌, నికోటిన్‌ వంటి విషపదార్థాలు తక్కువగా ఉన్న సిగరెట్లను ఉపయోగించడం ప్రారంభిస్తే తమకు హాని కలగదని భావించేవారికి కర్మోనా ఇంకా ఇలా చెబుతున్నాడు: “సురక్షితమైన సిగరెట్టు అంటూ ఏదీ లేదు.” పొగత్రాగేవారు సాధారణంగా పొగత్రాగనివారికన్నా 13 నుండి 14 సంవత్సరాలు ముందు మరణిస్తారని ఆయన నొక్కిచెప్పాడు. “పొగత్రాగడం జీవితంలోని అన్ని దశల్లో, శరీరంలోని దాదాపు ప్రతీ అవయవంలో రోగాన్ని కలిగిస్తుంది” అని కర్మోనా చెప్పాడని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తోంది. (g05 9/22)

వివాహ కుంభకోణం

దక్షిణాఫ్రికాకు చెందిన దాదాపు 3,000కన్నా ఎక్కువమంది స్త్రీలు “వివాహం” చేసుకునేలా మోసగించబడ్డారు అని జొహన్నస్‌బర్గ్‌కు చెందిన సొవెటన్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. ఒకానొక కుంభకోణంలో, స్త్రీలు తాము ఉద్యోగ ఒప్పందంగా భావించే పత్రంపై సంతకం చేస్తారు, అయితే వారు వాస్తవానికి ఒక వివాహ పత్రం మీద సంతకం చేస్తున్నారు. విదేశీ “పెండ్లి కుమారుడు” ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించుకోవడానికి ఆ సర్టిఫికేట్‌ అతనికి అర్హతనిస్తుంది. “పెండ్లి కుమార్తె” తాను కోల్పోయిన గుర్తింపు దస్తావేజుల స్థానంలో క్రొత్తవి మంజూరు చేయమని దరఖాస్తు చేసుకుని తన ఇంటి పేరు మారిపోయిందని తెలుసుకున్నప్పుడో, ఆమె తన అసలైన పెండ్లి రోజున రిజిస్టర్‌ చేయించుకోవడానికి వెళితే తనకు అప్పటికే వివాహమైనట్లు రిజిస్టర్‌లో ఉందని తెలుసుకున్నప్పుడో మాత్రమే ఆ మోసం వెల్లడవుతుంది! “వివాహాన్ని” రద్దుచేసుకోవడం కష్టం కావచ్చు. అయినా, దాదాపు 2,000 మంది స్త్రీలు తమకు తెలియకుండా జరిగిన వివాహాలను విజయవంతంగా రద్దు చేసుకున్నారు. అలాంటి కుంభకోణాలను నిరోధించేందుకు ఒక క్రొత్త చట్టం అమలులోకి వచ్చింది, ఆ చట్టం ప్రకారం విదేశీ భార్యలు లేదా భర్తలు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు వేచివుండాలి. (g05 5/22)

కాలక్షేపానికి చదవడం ఉన్నత గ్రేడ్లు సంపాదించుకోవడానికి దోహదపడుతుంది

“చదవడం కోసం వెచ్చించే గంటలు, తల్లిదండ్రుల విద్య, తరగతిలో వ్రాసుకున్న నోట్స్‌ లేక కంప్యూటర్లను ఉపయోగించడం” వంటి విషయాలకన్నా కాలక్షేపం కోసం చదివే చదువు మంచి గ్రేడ్లు సంపాదించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది” అని మెక్సికో పట్టణానికి చెందిన మిలిన్యో అనే వార్తాపత్రిక నివేదిస్తోంది. పాఠశాల చదువులకూ, కాలక్షేపం కోసం చదవడానికీ సమయాన్ని వెచ్చించే విద్యార్థులు పాఠశాలలో విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉందని లక్షలాది హై స్కూల్‌ ప్రవేశ పరీక్షల మీద జరిగిన అధ్యయనం సూచిస్తోంది. విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నుకొనే పుస్తకాలు పాఠశాల సబ్జెక్ట్స్‌ మాత్రమే కానవసరం లేదు, కేవలం కాలక్షేపం కోసం చదివే జీవితచరిత్రలు, కవితల పుస్తకాలు, విజ్ఞానశాస్త్ర అంశాల మీద పుస్తకాలు వంటివి కూడా వారు ఎన్నుకోవచ్చు. మరోవైపు, చదవడానికి బదులు టీవీ చూడడంలో ప్రతీరోజు ఎంతో సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు సాధారణంగా తక్కువ గ్రేడ్లు వస్తాయని ఆ నివేదిక చెబుతోంది. (g05 8/8)

భూటాన్‌ పొగాకు అమ్మకాలను నిషేధించింది

ఇండియా, చైనా దేశాల మధ్య హిమాలయాల్లో నెలకొని ఉన్న భూటాన్‌ రాజ్యం, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలన్నిటినీ నిషేధించింది. అయితే ఆ నిషేధం, విదేశీ దౌత్యవేత్తలకు గానీ పర్యాటకులకు గానీ ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసేవారికి గానీ వర్తించదు. భూటాన్‌, ప్రపంచంలో అలాంటి చర్య తీసుకున్న మొట్టమొదటి దేశంగా పరిగణించబడుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగడం కూడా నిషేధించబడింది. “దేశ పౌరులెవ్వరూ పొగత్రాగని దేశంగా భూటాన్‌ను తయారు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా ఆ నిషేధం విధించబడింది” అని బిబిసి న్యూస్‌ చెబుతోంది. (g05 8/22)

సమస్యలను పరిష్కరించుకోవడానికి నిద్ర మనకు సహాయం చేస్తుంది

“నిద్రకుపక్రమించే ముందు పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యను పరిష్కరించడానికి రాత్రంతా మెదడు నెమ్మదిగా ప్రయత్నించినట్లు, ఉదయమయ్యేసరికి ఆ సమస్యను పరిష్కరించడం ఎంతో సులభమవుతుందని చాలామంది గ్రహించారు” అని లండన్‌కు చెందిన ద టైమ్స్‌ నివేదిస్తోంది. జర్మనీలోని శాస్త్రజ్ఞులు, అది నిజమేనని నిరూపించే రుజువులను తాము కనుగొన్నామని అంటున్నారు, వారు తమ పరిశోధనలను నేచర్‌ అనే పత్రికలో ప్రచురించారు. వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 66 మందికి ఒక గణితశాస్త్ర సమస్యను పరిష్కరించడానికి రెండు నియమాలు నేర్పించారు, అయితే సరైన జవాబు త్వరగా కనుగొనడానికి సహాయం చేసే మూడవ నియమాన్ని వారికి వెల్లడి చేయలేదు. వారిలో కొంతమందిని నిద్రపోనిచ్చి, ఇతరులను రాత్రంతా లేక పగలంతా మెలకువగా ఉంచారు. “నిద్ర అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది” అని ఆ అధ్యయనం మీద వ్యాఖ్యానిస్తూ లండన్‌కు చెందిన ద డైలీ టెలిగ్రాఫ్‌ నివేదించింది. “మూడవ నియమాన్ని కనుగొనే అవకాశం మెలకువగా ఉన్నవారికన్నా” నిద్రపోయినవారికి “రెండింతలు ఎక్కువగా ఉంది.” నిద్రపోయినవారు విశ్రాంతి, పునరుత్తేజం పొందిన కారణంగా ఆ ఫలితాలు రాలేదని నిశ్చయపరచుకోవడానికి, ఆ శాస్త్రజ్ఞులు రెండవ ప్రయోగం నిర్వహించారు. రెండు గుంపులు రాత్రి నిద్రించిన తర్వాత ఉదయాన్నే వారి ముందు మరో సమస్య ఉంచబడింది లేక దినమంతా మెలకువగా ఉన్న తర్వాత రాత్రి వారి ముందు మరో సమస్య ఉంచబడింది. ఈసారి ఆ రెండు గుంపులు చూపించిన ప్రదర్శనలో ఎలాంటి తేడా కనిపించలేదు, “విశ్రాంతి పొందిన మెదడు ఉండడంవల్ల ప్రయోజనం లేదు కానీ నిద్రలో తనను తాను వ్యవస్థీకరించుకొనే మెదడు ఉండడంవల్ల ప్రయోజనం ఉంది” అని ద టైమ్స్‌ చెబుతోంది. “అందుకే నిద్ర సృజనాత్మకంగా నేర్చుకొనే ప్రక్రియగా పనిచేస్తుంది” అని డా. ఉల్రిక్‌ వాగ్నర్‌ చెబుతున్నాడు. (g05 9/8)

ఆయుధాలను ఆటస్థలంలో ఉపయోగించే సాధనాలుగా సాగగొట్టడం

బ్రెజిల్‌లో ప్రారంభించిన ఒక ఉద్యమం, ఆ దేశంలోని పౌరుల దగ్గర ఉన్న ఆయుధాలను తగ్గించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. స్వచ్ఛందంగా అప్పజెప్పిన ప్రతీ ఆయుధానికి నష్టపరిహారంగా రూ. 1,350 నుండి రూ. 4,500 వరకు డబ్బు చెల్లించబడింది. ఫోల్యా ఆన్‌లైన్‌ నివేదించిన ప్రకారం, 2004వ సంవత్సరంలో జూలై నుండి డిసెంబరు నెలల్లో ఆ దేశంలో 2,00,000 కన్నా ఎక్కువ ఆయుధాలు సేకరించబడ్డాయి. సావో పౌలో రాష్ట్రంలో సేకరించిన ఆయుధాలను అణగ్గొట్టి, సంకోచింపజేసి, కరిగించి క్రీడల మైదానంలో ఉపయోగించే ఉపకరణాలుగా మార్చి, ఆ తర్వాత ఆ ఉపకరణాలను ఒక నగర పార్కులో పెట్టారు. ఆ పార్కులో ఇప్పుడు, వ్యర్థ పదార్థాల నుండి తయారు చేయబడిన సీ-సా (పిల్లలు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు కూర్చుని ఆడుకునే బాలెన్సు చెక్క), ఉయ్యాలలు, జారుడుబండ వంటివి ఉన్నాయి. న్యాయశాఖ మంత్రి మార్స్యూ టుమస్‌ బస్టోస్‌ ఇలా అన్నాడు: “నిరాయుధీకరణ ఉద్యమానికి ఉన్న ప్రధాన ఉద్దేశాలలో, శాంతియుత సంస్కృతిని పెంపొందించడం ఒకటి.” (g05 9/22)