కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బంగారానికి ఉన్న శాశ్వతమైన ఆకర్షణ

బంగారానికి ఉన్న శాశ్వతమైన ఆకర్షణ

బంగారానికి ఉన్న శాశ్వతమైన ఆకర్షణ

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! రచయిత

ఆస్ట్రేలియాలోని సుదూర అరణ్యంలో, ఖనిజనిక్షేపాల కోసం తవ్వకం చేసే ఒక వ్యక్తి, ఎండిపోయిన నదీ పరీవాహక మార్గంలో నడుస్తున్నాడు. మధ్యాహ్నపు ఎండ వేడికి అతని వీపు కమిలిపోతోంది. దుమ్ముపట్టిన అతని చొక్కా నుండి చెమట బయటకు వస్తోంది. అయినా అతను పళ్ళెం పరిమాణంలో ఉన్న సాధనానికి జోడించబడివున్న పెద్ద లోహపు కడ్డీని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ ఆధునిక మెటల్‌ డిటెక్టర్‌ను అతను నేల మీద అటూ ఇటూ త్రిప్పుతున్నాడు. దాని అయస్కాంత క్షేత్రం ఆ రాతినేలలో ఒక మీటరు వరకు ప్రభావం చూపిస్తుంది. ఆయన పెట్టుకున్న హెడ్‌ఫోన్లు, మెటల్‌ డిటెక్టర్‌ నుండి సంకేతాలను స్వీకరించి స్థిరంగా, హెచ్చు స్థాయి ధ్వనిని ప్రసరిస్తున్నాయి.

ఆ హెచ్చు స్థాయి ధ్వని మెల్లగా కటుక్కుమనే శబ్దంగా తగ్గినప్పుడు అకస్మాత్తుగా అతని నాడి వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది, అలా శబ్దం తగ్గితే భూగర్భంలో దాగివున్న లోహం మీద తన సాధనం ఉందనే ఖచ్చితమైన సంకేతం అతనికి ఇస్తుంది. అతను మోకాళ్ళూని త్రవ్వడం మొదలుపెట్టాడు. అతను తన చిన్న గడ్డపారను ఉపయోగించి గబగబా త్రవ్వుతున్నాడు, అది గట్టి నేల గుండా చొచ్చుకొనిపోతోంది. భూగర్భంలో దాగివున్న ఆ లోహం కేవలం తుప్పుపట్టిన మేకు అయి ఉండవచ్చు. అది ఒక పాత నాణెం అయి ఉండవచ్చు. అయితే ఆ రంధ్రం పెద్దదవుతున్నకొద్దీ అతను కొంచెం బంగారమైనా ఉండకపోదా అని ఆతురతతో పరిశీలిస్తున్నాడు.

బంగారం కోసం కొనసాగుతున్న వలసలు

బంగారాన్ని కనుగొనడానికి ఉపయోగించే పద్ధతులు మారి ఉండవచ్చు, కానీ చరిత్రంతటిలో మానవజాతి ఈ మెరిసే పసుపుపచ్చ లోహం కోసం ఉత్సాహంగా ప్రయత్నించింది. నిజానికి, వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం, వాస్తవానికి గత 6,000 సంవత్సరాల్లో 1,25,000 టన్నులకన్నా ఎక్కువ బంగారం వెలికితీయబడింది. * ఐగుప్తు, ఓఫీరు, దక్షిణ అమెరికాలకు చెందిన ప్రాచీన నాగరికతలు బంగారు సంపద విషయంలో ప్రఖ్యాతి గాంచినా, ఇప్పటివరకు వెలికితీయబడిన బంగారం అంతటిలో 90 శాతంకన్నా ఎక్కువ బంగారం గత 150 సంవత్సరాల్లో వెలికితీయబడింది.​—1 రాజులు 9:28.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అమెరికా నది మీద ఉన్న సట్టర్స్‌ మిల్‌ ప్రాంతంలో 1848లో బంగారాన్ని కనుగొన్నప్పటి నుండి బంగారాన్ని వెలికితీయడం అనూహ్యంగా పెరిగింది. అలా కనుగొనడం బంగారు నిక్షేపాల కోసం ఆశించేవారు ఒక ప్రాంతానికి వెల్లువలా రావడానికి దారితీసింది. అలా వచ్చినవారందరూ కాలిఫోర్నియా నేలలో దాగివున్న తమ భవితవ్యాన్ని వెలికితీయాలని కలలు కన్నారు. చాలామంది అలా వెలికితీయలేకపోయారు, అయితే కొందరు మాత్రం గమనార్హమైన విధంగా విజయం సాధించారు. రోమా సామ్రాజ్యం పరిపాలించిన కాలమంతటిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది టన్నుల బంగారం వెలికితీయబడిందనే అంచనాను పరిగణలోకి తీసుకోవడం ద్వారా కాలిఫోర్నియా నేలలో ఎంత అసాధారణమైన పరిమాణంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయో నిర్ధారించవచ్చు. కేవలం కాలిఫోర్నియా బంగారు క్షేత్రం నుండి 1851లోనే 77 టన్నుల బంగారం ఉత్పత్తి చేయబడింది.

అదే సమయంలో ప్రపంచంలోని మరోప్రక్క, ఆస్ట్రేలియాకు చెందిన క్రొత్త కాలనీలో బంగారం కనుగొన్నారు. కాలిఫోర్నియా బంగారు క్షేత్రాలలో విలువైన అనుభవాన్ని సంపాదించుకున్న ఎడ్వర్డ్‌ హర్గ్వేజ్‌, ఆస్ట్రేలియాకు వచ్చి న్యూ సౌత్‌ వేల్స్‌లో ఉన్న బాతర్సట్‌ అనే చిన్న ఊరు దగ్గర ఉన్న ఒక వాగులో బంగారాన్ని కనుగొన్నాడు. 1851లో విక్టోరియా రాష్ట్రంలో ఉన్న బాల్లారాట్‌, బెండిగోలలో కూడా పెద్ద మొత్తంలో నిక్షేపాలను కనుగొన్నారు. నిక్షేపాలు కనుగొన్నారనే వార్త వ్యాప్తి చెందినప్పుడు చాలామంది ఆ ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడికి వచ్చినవారిలో కొందరు నైపుణ్యవంతులైన గనికార్మికులు ఉన్నారు. అయితే గనికార్మికులు ఉపయోగించే గడ్డపారను అంతకుముందు ఎప్పుడూ ఉపయోగించని రైతు కూలీలు లేక కార్యాలయాల్లో పనిచేసేవారు కూడా చాలామంది అక్కడకు వలస వచ్చారు. అలా వలస వచ్చిన ఊరులో జరుగుతున్న సన్నివేశాల గురించి వివరిస్తూ ఆ కాలానికి చెందిన ఒక స్థానిక వార్తాపత్రిక ఇలా ప్రకటించింది: “బాతర్సట్‌వాసులకు మళ్ళీ వెర్రిపట్టింది. బంగారంపట్ల వారి పిచ్చి మళ్ళీ పెరిగింది. మగవారు గుమికూడుతున్నారు, విస్మయంతో ఒకరినొకరు మూర్ఖంగా చూసుకుంటున్నారు, ఒకదానితో మరొకటి సంబంధంలేని విధంగా పిచ్చి వాగుడు వాగుతూ, తర్వాత ఏమి సంభవించనుందో అని ఆశ్చర్యపోతున్నారు.”

అయితే తర్వాత ఏమి సంభవించింది? జనాభా హఠాత్తుగా అనూహ్య రీతిలో పెరిగిపోయింది. 1851వ సంవత్సరం తర్వాతి దశాబ్దంలో, ఖనిజనిక్షేపాల కోసం అన్వేషించే ఆశావాదులు ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చేకొద్దీ ఆస్ట్రేలియాలోని జనాభా రెండింతలు అయింది. ఆ ఖండమంతటా బంగారం వేరువేరు పరిమాణాలలో కనుగొనబడింది. ఒక ప్రాంతానికి వలసలు తగ్గేసరికి మరో ప్రాంతానికి వలసలు మొదలయ్యాయి. కేవలం 1856వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఖనిజనిక్షేపాల అన్వేషకులు 95 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత 1893లో, పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్గూర్లీ-బౌల్డర్‌ ప్రాంతం దగ్గర ఉన్న నేల నుండి గనికార్మికులు బంగారాన్ని వెలికితీయడం ప్రారంభించారు. అప్పటినుండి, “ప్రపంచంలో బంగారం ఉన్న 2.5 చదరపు కిలోమీటర్ల సంపన్న స్థలంగా” వర్ణించబడే ప్రాంతం నుండి 1,300 టన్నుల బంగారం వెలికితీయబడింది. ఆ ప్రాంతం ఇంకా బంగారాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంది, ఇప్పుడు అక్కడ ప్రపంచంలోనే లోతైన ఒపెన్‌ కట్‌ బంగారు గని ఉంది, ఆ గని దాదాపు రెండు కిలోమీటర్ల వెడల్పు, మూడు కిలోమీటర్ల పొడవు, 400 మీటర్ల లోతు ఉన్న, మానవుడు చేసిన లోయ!

ఇప్పుడు, బంగారం అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, ప్రపంచంలో మూడవస్థానంలో ఉంది. ఆ పరిశ్రమ 60,000 మందికి ఉపాధి కల్పిస్తూ, ప్రతీ సంవత్సరం దాదాపు 300 టన్నుల బంగారాన్ని లేక 17,000 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని వెలికితీస్తుంది. బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అమెరికా రెండోస్థానంలో ఉంది. అయితే దాదాపు వంద సంవత్సరాలుగా బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేయడంలో దక్షిణాఫ్రికా ప్రథమస్థానంలో ఉంది. ఇప్పటివరకు వెలికితీయబడిన దానిలో దాదాపు 40 శాతం బంగారం ఆ దేశం నుండే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 2,000 టన్నులకన్నా ఎక్కువ బంగారం వెలికితీయబడుతోంది. ఆ అమూల్యమైన లోహమంతటికీ ఏమవుతోంది?

సంపద, అందం మేళవించబడుతోంది

ఇప్పటికీ కొంత బంగారం నాణాలను తయారుచేయడానికి ఉపయోగించబడుతోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పర్త్‌ టంకసాలలో బంగారు నాణాలు ఉత్పత్తి అవుతున్నాయి, అది ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటి కరెన్సీ తయారుచేసే ప్రధాన ఉత్పత్తిదారులలో ఒకటి. ఆ నాణాలు సామాన్యంగా వాడుకలో లేవు, కానీ సేకరించేవారు వాటిని సేకరిస్తున్నారు. అంతేకాక ఇప్పటివరకు వెలికితీయబడిన బంగారంలో పాతికశాతం, అమూల్యమైన బంగారు కడ్డీలుగా మార్చబడి, బ్యాంక్‌ ఖజానాల్లో దాచిపెట్టబడింది. ఈ రూపంలోవున్న, ప్రపంచంలోని అధికశాతం బంగారం అమెరికాలోని బ్యాంక్‌ ఖజానాల్లో ఉంది.

ప్రస్తుతం ప్రతీ సంవత్సరం వెలికితీయబడే బంగారంలో దాదాపు 80 శాతం అంటే, దాదాపు 1,600 టన్నుల బంగారం ఆభరణాలుగా మార్చబడుతోంది. అమెరికాలోని బ్యాంకుల్లో అధికశాతం బంగారం ఉండవచ్చు, కానీ ఆభరణాలను పరిగణలోకి తీసుకుంటే ఇండియా సరిహద్దుల లోపల పెద్దమొత్తంలో బంగారం ఉంది. ఈ మృదువైన లోహం అమూల్యమైనది, అందమైనది మాత్రమే కాకుండా దానికున్న గుణాలవల్ల ఆ లోహాన్ని అనేక విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.

ఆధునిక మార్గాల్లో ఉపయోగించబడుతున్న ప్రాచీన లోహం

బంగారం తుప్పుపట్టదని ప్రాచీన ఐగుప్తుకు చెందిన ఫరోలు బహుశా గుర్తించి ఉంటారు, అందుకే వారు చనిపోయినవారి ముఖంమీద పెట్టే ముసుగులను తయారుచేయడానికి దానిని ఉపయోగించారు. పురావస్తుశాస్త్రజ్ఞులు టుటెన్‌కమెన్‌ ఫరో సమాధిని ఆయన చనిపోయి వేలాది సంవత్సరాలు గడిచిన తర్వాత కనుగొన్నప్పుడు బంగారానికి దీర్ఘకాలం నిలిచే గుణం ఉన్నట్లు రుజువయింది, ఆ ఫరో ముఖం మీదున్న, బంగారంతో చేసిన ముసుగు కాంతిహీనం కాకుండా పసుపురంగులో మెరుస్తున్నట్లు ఆ పురావస్తుశాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

బంగారం తన మెరుపును కోల్పోదు ఎందుకంటే ఇనుము వంటి ఇతర లోహాలను నాశనం చేసే నీరు, గాలి దాని మీద ప్రభావం చూపవు. బంగారానికి తుప్పుపట్టకుండా ఉండే లక్షణంతోపాటు విద్యుత్తును ప్రసరించే మంచి సామర్థ్యం ఉంది కాబట్టి అవి దానిని ఎలక్ట్రానిక్‌ భాగాలకు ఉపయోగించడానికి చాలా అనువైనదిగా చేస్తాయి. టీవీలు, వీసీఆర్‌లు, సెల్‌ఫోన్లు మాత్రమే కాక దాదాపు ఐదు కోట్ల కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి ప్రతీ సంవత్సరం దాదాపు 200 టన్నుల బంగారం ఉపయోగించబడుతోంది. అంతేకాక మంచి నాణ్యతగల సీడీలు దీర్ఘకాలం పనిచేసే విధంగా వాటిలో మన్నికగల ఒక సన్నని బంగారపు పొర ఉంటుంది.

బంగారపు పల్చని పొరలు కొన్ని అసాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఆ లోహానికీ కాంతికీ మధ్య జరిగే పరస్పర చర్యలను పరిశీలించండి. బంగారాన్ని అతి సన్నని రేకులుగా మార్చినప్పుడు అది కాంతిని తన ద్వారా పోనిస్తుంది. అది అతి సన్నని రేకుగా ఉన్నప్పుడు దాని గుండా పచ్చని కాంతికిరణాలను పోనిస్తుంది కానీ పరారుణ కిరణాలను ప్రతిఫలిస్తుంది. బంగారంతో పూతపూసిన కిటికీలు కాంతిని ప్రసరిస్తాయి కానీ వేడిని ప్రతిఫలిస్తాయి. అందుకే ఆధునిక విమానాలలోని కాక్‌పిట్‌ కిటికీలు, అలాగే అనేక క్రొత్త కార్యాలయ భవనాల కిటికీలు బంగారంతో పూతపూయబడుతున్నాయి. అంతేకాక, అంతరిక్ష నౌకల బలహీన భాగాలను తీవ్ర రేడియేషన్‌ నుండి, వేడి నుండి సమర్థవంతంగా కాపాడడానికి వాటి చుట్టూ కాంతికిరణాలను పోనివ్వని బంగారపు రేకులు చుట్టబడతాయి.

బంగారం బ్యాక్టీరియాను కూడా ఎక్కువగా నిరోధిస్తుంది. అందుకే దంతవైద్యులు పాడైన లేక పుచ్చిపోయిన దంతాలను బాగుచేయడానికి లేక వేరేవి అమర్చడానికి బంగారాన్ని ఉపయోగిస్తారు. వాహికలోనికి దూర్చే గొట్టపు అచ్చులు, అంటే పాడైన రక్తనాళాలను బలపర్చడానికి శరీరంలోకి చొప్పించే వైర్లతో చేసిన చిన్న ట్యూబులు వంటి సర్జికల్‌ ఇంప్లాంట్ల్‌లకు ఉపయోగించడానికి బంగారం సరైన పదార్థమని ఇటీవల సంవత్సరాల్లో రుజువయింది.

బంగారపు నిక్షేపాలకోసం త్రవ్వేవారు, దానికున్న అనేక ప్రయోజనాలను, విలువను, అందాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆకర్షణీయమైన లోహం కోసం భూమిలో అన్వేషిస్తూనే ఉంటారనడంలో సందేహంలేదు. (g05 9/22)

[అధస్సూచి]

^ బంగారానికి ఎంత సాంద్రత ఉంటుందంటే అన్ని వైపుల కేవలం 37 సెంటిమీటర్లు ఉండే బంగారపు ఘనం బరువు ఒక టన్ను ఉంటుంది.

[25వ పేజీలోని బాక్సు]

బంగారం ఎక్కడ దొరుకుతుంది?

రాతిబండలు: అగ్ని పర్వతాల నుండి ఉద్భవించిన లావాతో రూపొందిన అన్ని రాతిబండల్లో బంగారం సూక్ష్మ పరిమాణాల్లో ఉంటుంది. కొన్ని రాతిబండల్లో బంగారం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, కంపెనీలు వాటిని వెలికితీసి, పొడిగా చేసి రసాయన ప్రక్రియ ద్వారా ముడిఖనిజం నుండి లోహాన్ని తీయగలిగేంత ఎక్కువగా ఉంటుంది. మంచి నాణ్యతగల ముడిఖనిజంలో ఒక టన్ను రాతిబండకు దాదాపు 30 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది.

శిలానిక్షేపాలు: కొన్ని అరుదైన సందర్భాల్లో బంగారం ఖనిజ స్ఫటికపు పొరల మధ్య ఇరుక్కొని ఉండే షీట్లలో లేక శిలానిక్షేపాల్లో దొరుకుతుంది.

నదులు: బంగారం ఉండే శిలానిక్షేపాలు ఎండ, వాన, గాలి వంటి వాటి ప్రభావాలకు గురై క్రమంగా తమలో నిక్షిప్తమైన బంగారాన్ని విడుదల చేస్తాయి, అవి వాగుల్లో, నదుల్లో చాలా చిన్న ముక్కలుగా లేక పొరలుగా పేరుకుపోతాయి.

భూమి ఉపరితలం: విచిత్రమైన ఆకారంలో ఉండే బంగారపు రాశులు కొన్నిసార్లు భూమి ఉపరితలంపై ఏర్పడతాయి. ఆ రాశులు కొన్నిసార్లు అద్భుతమైన పరిమాణాల్లో ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు దొరికిన బంగారపు రాశుల్లో అతి పెద్ద రాశి, ద వెల్‌కమ్‌ స్ట్రేంజర్‌ అని పిలువబడింది, దాని బరువు 60 కిలోల కన్నా ఎక్కువే! అది ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా రాష్ట్రంలో 1869లో దొరికింది. చాలావరకు బంగారపు రాశులు ఆస్ట్రేలియాలో దొరికాయి, ఇప్పటివరకు దొరికిన 25 పెద్ద బంగారపు రాశుల్లో 23 ఆ దేశంలోనే దొరికాయి. నేడు, అగ్గిపుల్ల చివరి భాగమంత చిన్నగా ఉండే బంగారు రాశులు, రత్నాల గుణం ఉండే వజ్రాల కన్నా ఎంతో అరుదైనవి.

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

మెటల్‌ డిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

మెటల్‌ డిటెక్టర్‌లోని కీలక భాగాల్లో సాధారణంగా వైర్లతో కూడిన రెండు కాయిల్‌లు ఉంటాయి. విద్యుత్తును ఒక కాయిల్‌ గుండా ప్రవహింపజేసినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. మెటల్‌ డిటెక్టర్‌ ఒక బంగారపు రాశి వంటి లోహపు వస్తువు మీదుగా వెళ్తే అది ఆ వస్తువులో బలహీనమైన అయస్కాంత క్షేత్రాన్ని పుట్టిస్తుంది. మెటల్‌ డిటెక్టర్‌లో ఉన్న రెండో కాయిల్‌ ఆ బలహీన క్షేత్రాన్ని కనుక్కొని వెలుగు ద్వారా లేక ధ్వని తరంగాల ద్వారా లేక మెటల్‌ డిటెక్టర్‌ మీద ఉన్న కొలతల ద్వారా దానిని ఉపయోగిస్తున్న వ్యక్తికి సంకేతాలు పంపిస్తుంది.

[25వ పేజీలోని చిత్రాలు]

1800ల మధ్య కాలంలో బంగారాన్ని వెలికితీయడం ప్రారంభమైన ప్రాంతాలు:

1. సట్టర్స్‌ మిల్‌, కాలిఫోర్నియా, అమెరికా;

2. బెండిగో ఉపనది, విక్టోరియా, ఆస్ట్రేలియా

3. గోల్డెన్‌ పాయింట్‌, బాల్లారాట్‌, విక్టోరియా, ఆస్ట్రేలియా

[చిత్రసౌజన్యం]

1: Library of Congress; 2: Gold Museum, Ballarat; 3: La Trobe Picture Collection, State Library of Victoria

[26వ పేజీలోని చిత్రాలు]

బంగారానికున్న ఆధునిక ప్రయోజనాలు

మంచి నాణ్యతగల సీడీలకు సన్నని బంగారపు పొర ఉంటుంది

అంతరిక్ష నౌకలకు బంగారపు రేకు ఉపయోగించబడుతోంది

బంగారంమైక్రోచిప్స్‌లో ఉపయోగించబడుతోంది

బంగారం పూతగల వైర్లకు విద్యుత్తును ప్రసరించే సామర్థ్యం ఉంది

[చిత్రసౌజన్యం]

NASA photo

Carita Stubbe

Courtesy Tanaka Denshi Kogyo

[26వ పేజీలోని చిత్రం]

పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్గూర్లీ-బౌల్డర్‌ ప్రాంతంలోవున్న, ప్రపంచంలోకెల్లా అతి లోతైన ఒపెన్‌ కట్‌ బంగారు గని

[చిత్రసౌజన్యం]

Courtesy Newmont Mining Corporation

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

Brasil Gemas, Ouro Preto, MG