కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ట్రాఫిక్‌ విషయంలో మీరు ఏమి చేయవచ్చు?

ట్రాఫిక్‌ విషయంలో మీరు ఏమి చేయవచ్చు?

ట్రాఫిక్‌ విషయంలో మీరు ఏమి చేయవచ్చు?

ఫిలిప్పీన్స్‌లోని తేజరిల్లు! రచయిత

హెచ్చరిక: అనేక పెద్ద పట్టణాలను ఒక తెగులు పట్టిపీడిస్తోంది. అది అంటువ్యాధి కాదు అలాగని విపరీతమైన ఆకలితో ఉన్న వినాశకరమైన కీటకాల దండు కూడా కాదు. అయినా అది కోట్లాదిమంది సంక్షేమానికి ముప్పువాటిల్లజేస్తోంది. అదేమిటి? అదే మోటారు వాహనాలవల్ల కలిగే ట్రాఫిక్‌ రద్దీ!

పరిశోధకులు చెప్తున్నదాని ప్రకారం, ట్రాఫిక్‌ రద్దీని తరచూ ఎదుర్కోవడం మీ ఆరోగ్యానికి హానికరంకావచ్చు. ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో చిక్కుకున్న తర్వాత కనీసం ఒక గంటవరకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం సూచిస్తుంది. “ఆ అపాయం అకస్మాత్తుగా పెరిగిపోవడానికి కార్లు విడుదల చేసే పొగ, శబ్దం, ఒత్తిడి ప్రధాన కారణాలు కావచ్చు” అని ద న్యూజీలాండ్‌ హెరాల్డ్‌ నివేదిస్తోంది.

గాలిలో విషపదార్థాలు

చాలా మోటారు వాహనాలు నైట్రోజన్‌ ఆక్సైడ్‌లను, క్యాన్సర్‌ కారకాలైన కొన్ని పదార్థాలను విడుదల చేస్తాయి. అనేక వాహనాలు, ప్రత్యేకించి డీజిల్‌ వాహనాలు అధిక పరిమాణంలో సూక్ష్మ పదార్థాలను విడుదలచేస్తాయి. ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాలు కలిగిస్తాయి. వాతావరణ కాలుష్యం కారణంగా ప్రతీ సంవత్సరం దాదాపు 30 లక్షలమంది ప్రజలు మరణిస్తున్నారని అంచనా, ఆ కాలుష్యం చాలావరకు మోటారు వాహనాలవల్లే కలుగుతోంది. యూరప్‌లోని పిల్లల్లో కలిగే ఊపిరితిత్తులకు సంబంధించిన అంటువ్యాధుల్లో 10 శాతంవరకు అతిసూక్ష్మ పదార్థాల కాలుష్యంవల్లే కలుగుతున్నాయి, ట్రాఫిక్‌ రద్దీతో పీడించబడుతున్న పట్టణాల్లో దాని శాతం ఇంకా ఎక్కువ ఉంది.

భూ వాతావరణానికి ఎదురవుతున్న ప్రమాదాలను కూడా పరిశీలించండి. వాహనాలు విడుదల చేసే నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, సల్ఫర్‌డయాక్సైడ్‌ జలాశయాలను కలుషితం చేసే, జలచరాలకు హాని కలిగించే, వివిధ రకాల మొక్కలను నాశనం చేసే ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నాయి. వాహనాలు పెద్ద పరిమాణాల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేయడం పరిస్థితి ఇంకా విషమించేలా చేస్తుంది. భూగోళ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ఈ విషవాయువు ప్రధాన కారణమని, అది భూగ్రహానికి వేరే ప్రమాదాలు కూడా వాటిల్లజేసే అవకాశం ఉందని చెప్పబడుతోంది.

అనేక దుర్ఘటనలు

ట్రాఫిక్‌ ఎంత పెరుగుతుందో మానవజీవితానికి అపాయం కూడా అంతే పెరుగుతుంది. ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో పది లక్షలకన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా, కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఉదాహరణకు, యురోపియన్‌ కమీషన్‌కు చెందిన పరిశోధకులు, “ప్రతీ పది లక్షలమంది పౌరులలో గ్రీసులో 690 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే, అదే స్వీడన్‌లో 120 మంది మరణిస్తున్నారు” అని కనుగొన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో చాలామంది దృష్టిని ఆకర్షించిన మరో అసహ్యమైన కారకం, రోడ్డు రౌద్రం. డ్రైవర్లు ఇతర డ్రైవర్ల మీద తమ కోపాన్ని వెళ్ళగ్రక్కడం సర్వసాధారణమైపోతోంది. అమెరికాలోని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ నిర్వహించిన సర్వే ప్రకారం, డ్రైవర్లలో హింసాత్మక ధోరణి పెరిగిపోవడానికిగల కారణాల్లో ఒక కారణం “పెరిగిన ట్రాఫిక్‌ లేక రద్దీగా ఉన్న ట్రాఫిక్‌.”

ఆర్థిక నష్టం

ట్రాఫిక్‌ రద్దీగా ఉండడంవల్ల డబ్బు కూడా ఖర్చవుతుంది. ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా కేవలం కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలోనే, ప్రతీ సంవత్సరం 400 కోట్ల లీటర్లకన్నా ఎక్కువ ఇంధనం వ్యర్థమవుతోందని ఒక అధ్యయనం వెల్లడిచేసింది. వ్యాపార అవకాశాలు కోల్పోవడం, కాలుష్యం కారణంగా ఆరోగ్య సంరక్షణకు అదనంగా ఖర్చులవడం, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంవల్ల కలిగే హాని వంటి పరోక్ష నష్టాలు కూడా ట్రాఫిక్‌ రద్దీగా ఉండడంవల్లే కలుగుతాయి.

ఈ నష్టాలన్నీ దేశ అర్థిక పరిస్థితిని బలహీనపరుస్తాయి. ట్రాఫిక్‌ జామ్‌లవల్ల అమెరికన్లు ప్రతీ సంవత్సరం వృథా అయిన సమయం, ఇంధనం రూపంలోనే దాదాపు 4.6 లక్షల కోట్ల రూపాయిలను నష్టపోతున్నారని ఒక అధ్యయనం వెల్లడిచేసింది. సుదూర ప్రాచ్య దేశంలో, ఫిలిప్పీన్‌ స్టార్‌ అనే పత్రికలోని నివేదిక ఇలా చెబుతోంది: “టాక్సీ మీటరు ఆగకుండా గిర్రున తిరిగే విధంగానే, ప్రతీ సంవత్సరం ట్రాఫిక్‌ జామ్‌లవల్ల ఈ దేశం వందల కోట్ల రూపాయిలు నష్టపోతుంది.” యూరప్‌లో ఆ నష్టం దాదాపు పది లక్షల కోట్ల రూపాయిల వరకూ ఉంటుందని అంచనా.

ట్రాఫిక్‌ భవిష్యత్తులో ఎలా ఉంటుంది?

ట్రాఫిక్‌ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా పరిస్థితులు విషమిస్తూనే ఉన్నాయి. టెక్సాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 75 నగర ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం, ట్రాఫిక్‌ జామ్‌వల్ల వృథా అయిన సమయం, 1982లో సగటున సంవత్సరానికి 16 గంటలైతే, అదే 2000లో అది 62 గంటలకు పెరిగిపోయింది. ప్రయాణికులు ప్రతీరోజు రోడ్డు రద్దీని ఎదుర్కొనే అవకాశం ఉన్న సమయం 4.5 గంటల నుండి 7 గంటలకు పెరిగిపోయింది. “అధ్యయనం చేస్తున్న సంవత్సరాల్లో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే స్థాయులు అన్ని ప్రాంతాల్లో పెరిగాయి, రోడ్డు రద్దీగా ఉండే సమయం పెరిగిపోతోంది, ఇప్పుడు అనేక హైవేలు దానివల్ల ప్రభావితం చెందుతున్నాయి, గతంలో కన్నా అధిక ప్రయాణాలు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోయింది” అని ఆ నివేదిక చెబుతోంది.

అలాంటి నివేదికలే వేరే దేశాల నుండి కూడా వచ్చాయి. యురోపియన్‌ కమీషన్‌ నిర్దేశంలో పనిచేస్తున్న పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు: “మన ప్రయాణ సౌకర్యాలలో తీవ్రమైన మార్పులు తీసుకురానట్లయితే తర్వాతి దశాబ్దంలో ట్రాఫిక్‌ జామ్‌లవల్ల పట్టణాలన్నిటిలో కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది.”

ఆసియా దేశాలు కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ విషయంలో టోక్యో చెడ్డపేరు సంపాదించుకుంది, జపాన్‌ దేశమంతటిలో ఉన్న ఇతర నగరాల్లో కూడా ట్రాఫిక్‌ రద్దీగా తయారవుతోంది. ఫిలిప్పీన్స్‌లో ఇలాంటి నివేదికలు సర్వసాధారణమైపోయాయి, మనీలా బులెటిన్‌ పత్రిక ఇలా నివేదించింది: “ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువసేపు ఉండే సమయాల్లో వేలాదిమంది ప్రయాణికులు వాహనాలు నడపడం కోసం వేచివుంటుండడంతో వాహనాల మధ్య చోటులేనంతగా ట్రాఫిక్‌ జామ్‌ అయిపోతోంది.”

వాస్తవంగా, ట్రాఫిక్‌ సంబంధిత సమస్యకు ఇప్పట్లో ఎలాంటి పూర్తి పరిష్కారాలు లభించేటట్లు కనిపించడంలేదని చెప్పవచ్చు. స్టక్‌ ఇన్‌ ట్రాఫిక్‌​—⁠కోపింగ్‌ విత్‌ పీక్‌ అవర్‌ ట్రాఫిక్‌ కంజెషన్‌ అనే పుస్తకాన్ని రచించిన ఆన్టనీ డవున్స్‌ ఈ నిర్ధారణకు వచ్చాడు: “భవిష్యత్తులో ఎదురవబోయే ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోవడానికి ఎలాంటి ప్రభుత్వ విధానాలను అమలులోకి తీసుకువచ్చినా కూడా ఆ సమస్య ప్రపంచంలోని అన్ని భాగాల్లో విషమించే అవకాశం ఉంది. కాబట్టి నా చివరి సలహా ఏమిటంటే, ఆ పరిస్థితికి అలవాటుపడిపోండి.”

మీరు ఏమి చేయవచ్చు?

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, విసిగించే ఈ సమస్యను ఎదుర్కోవడానికి మీరు ఏమి చేయవచ్చు? ట్రాఫిక్‌లో చిక్కుకొనే కోట్లాదిమందిలో మీరూ ఒకరైతే, మీ భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

◼ సిద్ధంగా ఉండండి. చాలామంది ట్రాఫిక్‌లో చిక్కుకొనే ముందే ఒత్తిడికి గురైవుంటారు. వారు చాలా ఆలస్యంగా నిద్ర లేస్తారు. త్వరత్వరగా స్నానం ముగించుకుని, హడావుడిగా బట్టలేసుకుని, గబ గబా భోజనం చేసేస్తారు. పనికి ఆలస్యమవుతామనే ఆలోచన వారిని కలవరపెడుతుంది. ట్రాఫిక్‌ రద్దీ కేవలం వారి ఒత్తిడిని పెంచుతుంది. మీరు ట్రాఫిక్‌లో చిక్కుకొనే అవకాశం ఉందని మీరు ఊహించినట్లయితే మీ ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీరు త్వరగా బయలుదేరడం ద్వారా ట్రాఫిక్‌ రద్దీ మీకు ఎదురవకపోవచ్చు. కమ్యూటింగ్‌ స్ట్రెస్‌​—⁠కాసస్‌, ఎఫెక్ట్స్‌, అండ్‌ మెథడ్స్‌ ఆఫ్‌ కోపింగ్‌ అనే పుస్తకం ప్రకారం, “ఒత్తిడి తక్కువగా ఉన్న ప్రయాణం ఆ ముందు రోజు పగలు లేక రాత్రి నుండే ప్రారంభమవుతుంది.” ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “ఉదయం రద్దీ ఎక్కువగా లేకుండా చూసుకోవడానికి, ప్రతిరోజూ వెళ్ళి వచ్చే కుటుంబ సభ్యుల కోసం లేక పిల్లల కోసం బట్టలు, బ్రీఫ్‌కేసులు, ఆహారం ఆ ముందు రోజు రాత్రే సిద్ధంచేయడం జరుగుతుంది.” రాత్రి బాగా నిద్రపోవడం కూడా ప్రాముఖ్యమే. మీరు ఉదయాన్నే త్వరగా బయలుదేరాలంటే వీలైనంత త్వరగా నిద్రకు ఉపక్రమించాలి.

ఉదయాన్నే త్వరగా నిద్రలేవడంవల్ల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ట్రాఫిక్‌లో చాలాసేపు కూర్చోవడం మీ కండరాలను ఒత్తిడికి గురిచేసి వాటి మెత్తదనాన్ని తగ్గించవచ్చు. మీ పరిస్థితులు అనుకూలిస్తే మీరు ఉదయాన్నే వ్యాయామం ఎందుకు చేయకూడదు? క్రమమైన వ్యాయామ కార్యక్రమం మీ శరీర దారుఢ్యాన్ని మెరుగుపరచి, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంవల్ల ఎదురయ్యే శారీరక ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. మీరు ఉదయాన్నే లేవడంవల్ల పుష్టికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి వీలవుతుంది. ఏవో చిరుతిళ్ళు తిని, లేక ఖాళీ కడుపుతో ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మీ ఒత్తిడి మరింత అధికం కావచ్చు.

మీ వాహనం మంచి కండిషన్‌లో ఉండేటట్లు చూసుకోవడం ద్వారా మీరు అదనపు ఒత్తిడిని నివారించవచ్చు. మీ వాహనం ట్రాఫిక్‌ జామ్‌లో పనిచేయడం మానేస్తే దానంత విసుగుపుట్టించే విషయం మరొకటి ఉండదు. ప్రత్యేకంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు విసుగుపుట్టవచ్చు. కాబట్టి మీ వాహన బ్రేకులు, టైర్లు, ఎయిర్‌ కండీషనర్‌, హీటర్‌, విండ్‌షీల్డ్‌ వైపర్ల, డీఫ్రాస్టర్లు ప్రాముఖ్యమైన ఇతర భాగాలు మంచి స్థితిలో ఉండేలా చూసుకోండి. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో ఒక చిన్న దుర్ఘటన కూడా చాలా ఒత్తిడికి గురిచేయగలదు. అంతేకాక, మీరు ఎల్లప్పుడూ మీ వాహన ట్యాంకులో సరిపోయేంత ఇంధనం ఉండేలా చూసుకోండి.

◼ తాజా సమాచారం తెలుసుకోండి. మీరు ప్రయాణం ప్రారంభించక ముందు చెడు వాతావరణం, రోడ్డు నిర్మాణం, తాత్కాలికంగా రోడ్డు మూసివేతలు, దుర్ఘటనలు, ఆ రోజుకు సంబంధించిన ఇతర ట్రాఫిక్‌ పరిస్థితులు వంటి ప్రత్యేక ఘటనల గురించిన సమాచారం తెలుసుకోండి. మీరు ఈ సమాచారాన్ని వార్తలు వినడం ద్వారా లేక వార్తాపత్రికలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాక, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌ సంపాదించండి. మీరు ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోవడం ద్వారా సమస్యాత్మకమైన ప్రాంతాల గుండా ప్రయాణించకుండా క్షేమంగా గమ్యాన్ని చేరుకోగలుగుతారు.

◼ సౌకర్యవంతంగా ఉండండి. మీరు సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండడానికి మీ వాహనంలోకి గాలి ప్రసరించే మార్గాలనే కాక, మీరు కూర్చొనే తీరును సరిచేసుకోండి. మీ వాహనంలో రేడియో, క్యాసెట్‌ ప్లేయర్‌, లేదా సీడీ ప్లేయర్‌ ఉంటే మీకిష్టమైన సంగీతాన్ని వినవచ్చు. కొన్ని రకాల సంగీతాలు ప్రశాంతతను కలిగించి ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ చర్యలు ట్రాఫిక్‌ రద్దీలో కలిగే విసుగుపుట్టించే కొన్ని శబ్దాల నుండి కూడా మిమ్మల్ని కాపాడవచ్చు. *

◼ సమయాన్ని ప్రయోజనకరమైన విధంగా ఉపయోగించండి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు మీరు చేయగల అతి ప్రయోజనకరమైన పనుల్లో ఆశావహ దృక్పథంతో ఆలోచించడం ఒకటి. చెడుగా ఉన్న ట్రాఫిక్‌ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండే బదులు, ఆ రోజు చెయ్యాల్సిన కార్యకలాపాల గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. మీరు ఒంటరిగా ఉంటే ట్రాఫిక్‌ జామ్‌లో మీరు వెచ్చించే సమయం ప్రాముఖ్యమైన తలంపులను కార్యాచరణ క్రమంలో పెట్టుకోవడానికే కాక, ఎలాంటి ఆటంకాలూ లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మీకు ప్రత్యేక అవకాశం ఇవ్వవచ్చు.

మీరు ప్రయాణికులైతే, మీ ముందు పెద్దవరసలో ఉన్న వాహనాలను చూడడం మీ ఒత్తిడిని పెంచవచ్చు. కాబట్టి ట్రాఫిక్‌లో మీకు దొరికే సమయాన్ని ప్రయోజనకరమైన విధంగా ఉపయోగించుకోవడానికి పథకం వేసుకోండి. మీకు ఇష్టమైన పుస్తకాన్ని లేక వార్తాపత్రికను మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు. అంతకుముందు రోజు మీకు అందిన ఉత్తరాలను చదవవచ్చు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఉత్తరాలు వ్రాయడం లేక పోర్టబుల్‌ కంప్యూటర్‌ మీద కొంత పనిచేసుకోవడం కొంతమందికి సులభమనిపించవచ్చు.

◼ వాస్తవిక దృక్పథంతో ఉండండి. మీరు నివసించే ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండడం ఒక సమస్యగా ఉన్నట్లయితే, మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటారని ముందుగా ఊహించి దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి. అనేక పట్టణాల్లో ట్రాఫిక్‌ రద్దీ సమస్యగానే ఉండిపోతుంది. స్టక్‌ ఇన్‌ ట్రాఫిక్‌​—⁠కోపింగ్‌ విత్‌ పీక్‌ అవర్‌ ట్రాఫిక్‌ కంజెషన్‌ ఇలా చెబుతోంది: “ఇప్పటికే ట్రాఫిక్‌ రద్దీని ఎదుర్కొంటున్న ముఖ్య నగరాలన్నిటిలో మనం ఊహించగల భవిష్యత్తులో, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే సమయంలో ట్రాఫిక్‌ రద్దీ చాలామేరకు దాదాపు ఇలాగే ఉంటుంది.” కాబట్టి ట్రాఫిక్‌ను మీ జీవితంలోని సామాన్య విషయంగా అంగీకరించడం నేర్చుకొని ఆ పరిస్థితిని సాధ్యమైనంత ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకోవడానికి మీరు చేయగలిగినది చేయండి! (g05 11/22)

[అధస్సూచి]

^ చాలామంది తేజరిల్లు! పాఠకులు ఈ పత్రికకు, దాని జత పత్రిక అయిన కావలికోటకు సంబంధించిన ఆడియో రికార్డింగులను వింటారు. కొన్ని భాషల్లో ఇవి ఆడియోక్యాసెట్లు, కాంపాక్ట్‌ డిస్క్‌లు, ఎమ్‌పి 3 ఫార్మాట్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి.

[16వ పేజీలోని చిత్రం]

ముందుగా పథకం వేసుకోవడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను నివారించండి

[16వ పేజీలోని చిత్రం]

డ్రైవింగ్‌ ప్రారంభించేముందు సరైన క్యాసెట్‌ను లేక సీడీని ఎంపిక చేసుకోండి

[16వ పేజీలోని చిత్రం]

ప్రయాణికులుగా మీ సమయాన్ని ప్రయోజనకరమైన విధంగా ఉపయోగించుకునే మార్గాన్ని అన్వేషించండి

[16వ పేజీలోని చిత్రం]

మీరు మార్చలేని విషయాలతో విసుగుచెందకండి