ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయా?
ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయా?
“వాతావరణ మార్పుల కారణంగా సంభవించే భీకర ఘటనలవల్ల భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవల్సివస్తుందని మనం ఊహించవచ్చు. దానర్థం మనం భవిష్యత్తులో క్రొత్త రకాలైన వాతావరణ ప్రమాదాలకు, అపారమైన ఆస్తినష్టానికి, ప్రాణనష్టానికి సంసిద్ధంగా ఉండాలి. . . . ముందుజాగ్రత్త చర్య అనే సూత్రానికి అనుగుణంగా మనం ఆ విపరీతమైన మార్పులకు సిద్ధంగా ఉండడం జ్ఞానయుక్తం.” —“టాపిక్స్ జియో—యాన్యువల్ రివ్యూ: నాచురల్ కెటాస్ట్రోఫీస్ 2003.”
యూరప్‌లోని ప్రాంతాలు 2003వ సంవత్సరపు వేసవిలో అట్టుడిగిపోయాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బెల్జియమ్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్‌లలో దాదాపు 30,000 మంది మరణించారు. రుతుపవనాల ముందు వచ్చే వడగాల్పుల కారణంగా బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్‌లలో 1,500 మంది మరణించారు. కరవు, రికార్డు స్థాయిలో ఉన్న వేడి కారణంగా ఆస్ట్రేలియాలో అడవి తగులబడడంవల్ల దాదాపు 70 లక్షల ఎకరాలకన్నా ఎక్కువ భూప్రాంతం అగ్నికి ఆహుతి అయింది.
ప్రపంచ వాతావరణ శాస్త్ర సంస్థ చెప్తున్న ప్రకారం, “2003వ సంవత్సరంలో అట్లాంటిక్ హరికేన్ వచ్చే కాలంలో 16 తుఫానులు వచ్చాయి, 1944-1996 మధ్య కాలంలో సంవత్సరానికి సగటున 9.8 చొప్పున వచ్చిన తుఫానులకన్నా అది చాలా ఎక్కువ, అయితే, 1990ల మధ్యకాలం నుండి ప్రతీ సంవత్సరం ఉష్ణమండల వాతావరణంలో గమనార్హమైన రీతిలో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగానే అవి ఉన్నాయి.” 2004వ సంవత్సరం వరకు ఆ మార్పులు కొనసాగాయి, ఆ సంవత్సరంలో వినాశకరమైన హరికేన్‌లు కరీబియన్ దీవులను, మెక్సికో సింధుశాఖను కుదిపేశాయి, అవి 2,000 మందిని పొట్టనబెట్టుకొని, వినాశనాన్నే మిగిల్చాయి.
2003లో శ్రీలంకలో వచ్చిన సైక్లోన్ కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి, దానివల్ల దాదాపు 250 మంది మరణించారు. 2004లో పశ్చిమ పసిఫిక్‌లో రికార్డు స్థాయిలో దాదాపు 23 టైఫూన్‌లు సంభవించాయి. వాటిలో పది జపాన్‌ను తాకాయి, అక్కడవి అపార నష్టాన్ని కలిగించి 170కన్నా ఎక్కువమందిని
పొట్టనబెట్టుకున్నాయి. భారీ వర్షాలు కురిసిన కారణంగా వచ్చిన వరదలు దక్షిణాసియాలో దాదాపు మూడు కోట్లమందిని ప్రభావితం చేశాయి, ప్రత్యేకంగా బంగ్లాదేశ్‌ను కుదిపేశాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు, దాదాపు 30 లక్షలమంది తమ గృహాలను ఖాళీ చేయాల్సివచ్చింది, 1,300కన్నా ఎక్కువమంది చనిపోయారు.2003లో శక్తిమంతమైన భూకంపాలు ఎన్నో సంభవించాయి. మే 21న, అల్జీరియాలోని అల్జీర్స్‌లో ఒక భూకంపం 10,000 మందిని క్షతగాత్రులను చేసింది, 2,00,000 మందిని నిరాశ్రయులను చేసింది. డిసెంబరు 26, ఉదయం 5:26 గంటలకు ఇరాన్‌లోని బామ్ పట్టణానికి దక్షిణాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైన ఆ భూకంపం 70 శాతం పట్టణాన్ని నాశనం చేయడమే కాక, 40,000 మందిని పొట్టనబెట్టుకుని, 1,00,000కన్నా ఎక్కువమందిని నిరాశ్రయులను చేసింది. అది ఆ సంవత్సరంలో సంభవించిన అత్యంత వినాశకరమైన ప్రకృతి విపత్తు. అది బామ్ పట్టణంలో ఉన్న 2,000 సంవత్సరాల పురాతనమైన అర్గాబామ్ కోటలోని అధిక భాగాన్ని కూడా శిథిలంగా మార్చి, ఆ ప్రాంతంలో ఆర్థికంగా చాలా ప్రాముఖ్యమైన ఆ పర్యాటక ఆకర్షణను లేకుండా చేసింది.
ఖచ్చితంగా ఒక ఏడాది తర్వాత, రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన భూకంపం ఇండోనేషియాలో ఉన్న ఉత్తర సుమత్రా పశ్చిమ తీరానికి సమీపంలో సంభవించింది, అది చరిత్రలోనే అతి ప్రాణాంతకమైన సునామీని సృష్టించింది. ఆ మృత్యు కెరటాలు 2,00,000కన్నా ఎక్కువమందిని పొట్టనబెట్టుకున్నాయి, దానివల్ల మరెంతోమంది క్షతగాత్రులయ్యారు, నిరాశ్రయులయ్యారు లేక రెండింటికీ గురయ్యారు. భూకంప కేంద్రానికి పశ్చిమాన 4,500 కిలోమీటర్లు లేక అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న ఆఫ్రికా తూర్పు తీరం కూడా ప్రాణాంతకమైన సునామీ తాకిడికి గురైంది.
చీకటి రోజులు ముందున్నాయా?
అలాంటి ఘటనలు భవిష్యత్తులో సంభవించనున్న పరిణామాలకు పూర్వఛాయగా ఉన్నాయా? మానవుల చర్యల మూలంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, ప్రపంచ వాతావరణ పరిస్థితులను మార్చివేసి తత్సంబంధ విపత్తుల వంటి ప్రమాదకరమైన వాతావరణానికి కారణమవుతున్నాయని చాలామంది శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. వారి అంచనాయే నిజమైతే, అది భవిష్యత్తుకు మంచి సూచన కాదు. ఆ ప్రమాదాన్ని అధికం చేస్తూ, ఇప్పుడు చాలామంది ప్రజలు విపత్తులు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఇష్టపూర్వకంగానో వేరే ప్రత్యామ్నాయం లేకనో నివసిస్తున్నారు.
విపత్తు సంబంధ మరణాల్లో 95 శాతంవరకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సంభవిస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో మరణ రేటు తక్కువగా ఉన్నా, అవి 75 శాతంవరకు ఆర్థిక నష్టాలను అనుభవిస్తున్నాయి. ఇలా నష్టాలు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా, ఆ నష్టాలను పూరించేందుకు సరిపోయేంత ధనం తమ దగ్గర మిగిలివుంటుందా అని కొన్ని భీమా కంపెనీలు ఆశ్చర్యపోతున్నాయి.
తదుపరి ఆర్టికల్‌లో విపత్తులకు దారితీసే కొన్ని సహజ ప్రక్రియల గురించి, విపత్తుల తీవ్రతను మానవులు ఏయే విధాలుగా పెంచే అవకాశముందనే అంశం గురించి మనం పరిశీలిస్తాం. భవిష్యత్తు తరాలవారికి భూమిని ఒక సురక్షితమైన గృహంగా తీర్చిదిద్దడానికి తీసుకురావాల్సిన మార్పులు చేపట్టేందుకు కావల్సిన శక్తి, కోరిక మానవజాతికి ఉన్నాయా అనే విషయాన్ని కూడా మనం పరిశీలిస్తాం. (g05 7/22)
[3వ పేజీలోని చిత్రం]
ఫ్రాన్స్ 2003 వేసవి వడగాల్పుల కారణంగా యూరప్‌లో 30,000 మంది మరణించారు; స్పెయిన్‌లో ఉష్ణోగ్రత 65 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
[చిత్రసౌజన్యం]
Alfred/EPA/Sipa Press
[4, 5వ పేజీలోని చిత్రాలు]
ఇరాన్ 2003 బామ్‌లో సంభవించిన భూకంపం 40,000 మందిని పొట్టనబెట్టుకుంది; సామూహిక సమాధి దగ్గర తమ బంధువుల కోసం విలపిస్తున్న మహిళలు
[చిత్రసౌజన్యం]
నేపథ్యం మరియు స్త్రీలు: © Tim Dirven/Panos Pictures