కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకృతి విపత్తులు మానవ ప్రమేయం

ప్రకృతి విపత్తులు మానవ ప్రమేయం

ప్రకృతి విపత్తులు మానవ ప్రమేయం

ఒక కారు నిర్వహణ సరిగ్గావుంటే అది క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. అదే వాహనాన్ని సరిగ్గా ఉపయోగించకుండా, దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరం కాగలదు. కొన్ని విషయాల్లో, భూగ్రహం గురించి కూడా ఆ మాటే చెప్పవచ్చు.

చాలామంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, మానవ చర్యలవల్ల భూవాతావరణంలో, మహాసముద్రాల్లో మార్పులు సంభవిస్తున్నాయి, ఆ మార్పుల కారణంగా చాలా తరచుగా, చాలా తీవ్రంగా ప్రకృతి విపత్తులు సంభవించి మన గ్రహాన్ని ఒక అపాయకరమైన స్థలంగా మార్చాయి. అంతేకాక, భవిష్యత్తు అనిశ్చయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. “మన చర్యల పర్యవసానాలు ఎలావుంటాయో తెలియని అనిశ్చితస్థితిలో మనం ఉన్నాం. ఆ చర్యలు, మానవులకు నివాసయోగ్యమైన ఏకైక గ్రహమైన భూమిని నాశనం చేయవచ్చు” అని వాతావరణ మార్పుల విషయంలో సైన్స్‌ పత్రికలో వెలువడిన ఒక సంపాదకీయం పేర్కొంది.

ప్రకృతి విపత్తులు చాలా తరచుగా, చాలా తీవ్రంగా సంభవించడాన్ని మానవ చర్యలు ఎలా ప్రభావితం చేస్తుండవచ్చో అనేది మనం చక్కగా అవగాహన చేసుకోవడానికి వాటికి ఆధారమైన సహజ ప్రక్రియల గురించి కొంత అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, హరికేన్‌ల వంటి పెనుతుఫానులు సంభవించడానికి కారణాలు ఏమిటి?

గ్రహసంబంధమైన ఉష్ణవినిమయకాలు

భూవాతావరణ వ్యవస్థ, సూర్యుని నుండి వచ్చే శక్తిని మార్చి, దానిని వ్యాపింపజేసే ఒక యంత్రంతో పోల్చబడింది. ఉష్ణమండల ప్రాంతాలకు సూర్యుని వేడిమి ఎక్కువ లభిస్తుంది కాబట్టి, ఆ కారణంగా ఏర్పడే శీతోష్ణస్థితిలో కలిగే వ్యత్యాసాలవల్ల గాలులు వీస్తాయి. * అనుదిన భూభ్రమణం కారణంగా, వీచే తేమతో కూడిన గాలి సుడులుగా ఏర్పడుతుంది, వాటిలో కొన్ని వాయుగుండాలుగా లేక అల్పపీడన ప్రాంతాలుగా మారతాయి. ఈ వాయుగుండాలు ఆ తర్వాత తుఫానుగా వృద్ధిచెందవచ్చు.

మీరు ఉష్ణమండల తుఫానులు పయనించే సాధారణ మార్గాన్ని పరిశీలించినట్లయితే అవి సాధారణంగా భూమధ్యరేఖ నుండి దూరంగా అటు ఉత్తరంగానో ఇటు దక్షిణంగానో శీతల ప్రాంతాల దిశగా పయనిస్తాయని మీరు గమనిస్తారు. అలా పయనించడంలో, తుఫానులు ఉష్ణవినిమయకాలుగా కూడా పనిచేస్తూ వాతావరణ తీవ్రతను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అయితే మహాసముద్రంలోని ఉపరితల భాగంలో ఉష్ణోగ్రత దాదాపు 27 డిగ్రీల సెల్సియస్‌లకన్నా ఎక్కువైతే ఉష్ణమండల తుఫానులు సైక్లోన్‌లుగా, హరికేన్‌లుగా, టైఫూన్‌లుగా మారేందుకు కావాల్సిన శక్తిని సంపాదించుకోవచ్చు, ఇవన్నీ వాస్తవానికి ఒకే ప్రక్రియకు వివిధ ప్రాంతాల్లో ఉన్న పేర్లు.

1900 సెప్టెంబరు 8న, అమెరికా చరిత్రలో అపార ప్రాణనష్టాన్ని కలిగించిన అతి ఘోరమైన ప్రకృతి విపత్తు, టెక్సాస్‌ రాష్ట్రంలోని గాల్వెస్టన్‌ ద్వీప పట్టణం మీద హరికేన్‌ విరుచుకుపడినప్పుడు సంభవించింది. ఆ తుఫాను ఆ పట్టణంలో 6,000 నుండి 8,000 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకోవడమే కాక, దాని పరిసర ప్రాంతాల్లోని దాదాపు 4,000 మందినీ హరించింది, ఇంకా దాదాపు 3,600 ఇళ్ళను నాశనం చేసింది. వాస్తవానికి ఆ పట్టణంలో మానవుడు నిర్మించిన ఏ ఒక్క నిర్మాణం కూడా నాశనమవకుండా మిగల్లేదు.

ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడినట్లుగా ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నో శక్తిమంతమైన తుఫానులు సంభవించాయి. వాటికి భూగోళ ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఏమన్నా సంబంధముందా అని తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు, భూగోళపు ఉష్ణోగ్రత పెరిగిపోవడంవల్ల తుఫాను వ్యవస్థలకు అధిక శక్తి లభిస్తుండవచ్చు. అయితే వాతావరణంలో మార్పులు, భూగోళపు ఉష్ణోగ్రత పెరిగిపోయిందని చూపించే కేవలం ఒక సూచనే అయివుండవచ్చు. పొంచి ఉన్న మరో హానికరమైన పర్యవసానం ఇప్పటికే స్పష్టమవుతుండవచ్చు.

పెరుగుతున్న సముద్రమట్టాలు, అడవుల నరికివేత

సైన్స్‌ పత్రిక సంపాదకీయం ప్రకారం, “గత శతాబ్దంలో సముద్రమట్టాలు 10 నుండి 20 సెంటీమీటర్లు పెరిగాయి, అవి ఇంకా పెరుగుతాయని మనం ఊహించవచ్చు.” దీనికి భూగోళపు ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఎలాంటి సంబంధం ఉండవచ్చు? దానికి రెండు ప్రక్రియలు కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ధృవ ప్రాంతాలలోని నేలమీద శాశ్వతంగా కప్పబడివుండే మంచు, హిమనదులు కరిగిపోవడంవల్ల మహాసముద్రాల పరిమాణం పెరిగిపోయే అవకాశం ఉంది. మరో కారణం, ఉష్ణ వ్యాకోచం కావచ్చు, మహాసముద్రాల ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ వాటి పరిమాణం పెరుగుతుంది.

టువాలు అనే చిన్న పసిఫిక్‌ ద్వీపాలు ఇప్పటికే సముద్రమట్టాలు పెరిగిపోవడంవల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొంటుండవచ్చు. ఫునఫుటి పగడపు ద్వీపంలో సేకరించబడిన సమాచారం ప్రకారం అక్కడి సముద్ర మట్టం “గత దశాబ్దంలో ప్రతీ సంవత్సరం సగటున 5.6 మిల్లీమీటర్ల చొప్పున” పెరిగిందని స్మిత్సోనియన్‌ పత్రిక నివేదిస్తోంది.

ప్రపంచంలోని చాలాభాగాల్లో జనాభా పెరుగుదలవల్ల, పట్టణాలు చుట్టూ ఉన్న పల్లెల్లోకి విస్తరిస్తున్నాయి, మురికివాడలు పెరిగిపోతున్నాయి, పర్యావరణం మరింత క్షీణిస్తోంది. సాధారణంగా ఈ పరిణామాలు ప్రకృతి విపత్తుల తీవ్రతను పెంచే అవకాశం ఉంది. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

హయిటీలో అధిక జనాభా ఉంది, ఆ దేశానికి అడవుల నరికివేత చరిత్ర ఉంది. ఇటీవల వార్తానివేదిక ప్రకారం హయిటీలో తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలున్నా అడవుల నరికివేతవల్ల పొంచివున్న అపాయంకన్నా ప్రమాదకరంగా వేరే ఏ సమస్యా లేదు. 2004వ సంవత్సరంలో కుండపోతగా వర్షాలు కురవడంవల్ల మట్టిపెళ్ళలు కూలి వేలాదిమంది చనిపోయినప్పుడు ఆ ప్రమాదం బాధాకరమైన రీతిలో స్పష్టమైంది.

దక్షిణాసియాను పట్టిపీడించిన ప్రకృతి విపత్తులను “భౌగోళిక ఉష్ణోగ్రత పెరగడం, ఆనకట్టలు, అడవుల నరికివేత, వ్యవసాయం కోసం అడవులను నరికి కాల్చివేయడం” వంటి కారణాలు తీవ్రతరం చేశాయని టైమ్‌ ఏసియా చెబుతోంది. మరోవైపు, అడవుల నరికివేతవల్ల నేల చాలా త్వరగా ఎండిపోయి కరవు తీవ్రతరం కావచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో ఇండోనేషియాలో, బ్రెజిల్‌లో కరవు సంభవించడంవల్ల, సాధారణంగా కాలడానికి వీలుకాని విధంగా తేమ ఎక్కవగా ఉండే అరణ్యాల్లో మునుపటివాటికన్నా వినాశకరమైన స్థాయిలో మంటలు రాజుకున్నాయి. అయితే ప్రమాదకర వాతావరణం మాత్రమే ప్రకృతి విపత్తులకు కారణం కాదు. చాలా దేశాలు భూగర్భంలో ప్రారంభమైన విపత్తులను ఎదుర్కొంటున్నాయి.

భూమి తీవ్రంగా కంపించినప్పుడు

భూమి ఉపరితలం, ఒకదానితో ఒకటి పొందికగా కదిలే వివిధ పరిమాణాల్లో ఉన్న ఫలకాలతో చేయబడింది. నిజానికి, భూమి ఉపరితలంలో కదలికలు ఎంతగా ఉంటాయంటే ప్రతీ ఏటా ఎన్నో భూకంపాలు సంభవించవచ్చు. అయితే వీటిలో చాలామట్టుకు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి.

భూకంపాలన్నిటిలో దాదాపు 90 శాతంవరకు భూఫలకాల చుట్టూ ఏర్పడే పగుళ్ళ వెంబడి సంభవిస్తాయని అంటారు, అయితే అరుదుగానే అయినా, కొన్నిసార్లు చాలా భయంకరమైన భూకంపాలు ఫలకాల్లో కూడా సంభవిస్తాయి. అంచనాల ప్రకారం, చరిత్రలో అతి ప్రాణాంతకమైన భూకంపం 1556వ సంవత్సరంలో చైనాలోని మూడు ప్రాంతాల్లో వచ్చింది. ఆ భూకంపంవల్ల దాదాపు 8,30,000 మంది మృత్యువాతకు గురైవుండవచ్చు!

భూకంపాలవల్ల వినాశకరమైన పర్యవసానాలు కూడా సంభవించవచ్చు. ఉదాహరణకు, 1755 నవంబరు 1న ఒక భూకంపం, పోర్చుగల్‌లోని 2,75,000 మంది జనాభాగల లిస్బన్‌ పట్టణాన్ని నాశనం చేసింది. అయితే భయభ్రాంతులను కలుగజేసిన ఆ పరిస్థితి అంతటితో ఆగిపోలేదు. ఆ భూకంపం మంటలనూ, దగ్గర్లో ఉన్న అట్లాంటిక్‌ మహాసముద్రం నుండి వేగంగా దూసుకొచ్చిన సునామీలను కూడా సృష్టించింది, ఆ సునామీ కెరటాలు 15 మీటర్ల ఎత్తుకు ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు అంచనావేయబడింది. మొత్తం కలిపి ఆ పట్టణంలో మృతుల సంఖ్య 60,000ను దాటింది.

ఈ సందర్భంలో కూడా, అలాంటి విపత్తుల పరిమాణం మానవ చర్యలవల్ల కొంతమేరకు ప్రభావితం చెందుతుంది. ఆ మానవచర్యల్లో ఒక కారకం, ప్రమాదభరిత ప్రాంతాల్లో జనసాంద్రత ఉండడం. “ప్రపంచంలోని దాదాపు సగంవరకు పెద్ద నగరాలు భూకంపంవచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి” అని రచయిత ఆండ్రూ రాబిన్‌సన్‌ అంటున్నాడు. రెండవ కారకం భవనాలు, భవన నిర్మాణాలకు ఉపయోగించబడిన వస్తువులు, నిర్మాణ నాణ్యత. విచారకరంగా, “భూకంపం ప్రజలను చంపదు కానీ భవనాలు చంపుతాయి” అనే నానుడి నిజమని తరచూ రుజువు చేయబడింది. ప్రజలు భూకంపాన్ని తట్టుకొని నిలువగల ఇళ్ళను నిర్మించలేనంత కడుబీదలైనప్పుడు వారైనా ఏమి చేయగలరు?

అగ్నిపర్వతాలు​—నిర్మాణాత్మక, వినాశక పాత్రలు పోషిస్తున్నాయు

“మీరు ఈ పదాలు చదువుతున్న సమయంలోనే దాదాపు 20 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది ఉండవచ్చు” అని అమెరికాలోని స్మిత్‌సోనియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చిన నివేదిక వెల్లడిచేస్తుంది. సాధారణ మాట్లలో చెప్పాలంటే, ప్లేట్‌ టెక్టానిక్స్‌ సిద్ధాంతం ప్రకారం, భూకంపాలు, అగ్నిపర్వతాలు ఒకే ప్రాంతంలో సంభవిస్తాయి అంటే, పగుళ్ళలో సంభవిస్తాయి, ప్రత్యేకంగా మహాసముద్రాల అడుగునవున్న పగుళ్ళలో, భూగర్భంలోని రెండవ పొర (మాంటిల్‌) నుండి మాగ్మా బయటకు నెట్టుకొని వచ్చే పగుళ్ళలో, ఒక ఫలకం మరో ఫలకాన్ని ఢీకొని అవి ఒకదాని క్రిందికి మరొకటి వెళ్ళే స్థలాల్లో సంభవిస్తాయి.

రెండు ఫలకాలు దగ్గరగా కలిసే చోట సంభవించే అగ్నిపర్వతానికి సంబంధించిన చర్యలు ప్రజలకు ఎంతో పెద్ద అపాయంగా పరిణమించాయి. ఎందుకంటే, వాటివల్ల అగ్నిపర్వతాలు ఎన్నోసార్లు విస్ఫోటనం చెందుతాయి, అంతేకాక ఆ విస్ఫోటనాలు జనావాసాలకు దగ్గర్లో సంభవిస్తాయి. పసిఫిక్‌ రిమ్‌ లేదా అగ్నివలయం అని పిలవబడే పసిఫిక్‌ మహా సముద్ర పరీవాహక దేశాల్లో అలాంటి వందలాది అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ఫలకాల సరిహద్దులకు దూరంగా ఉండే హాట్‌ స్పాట్‌లలో కూడా కొన్ని అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. హవాయన్‌ దీవులు, అజోరస్‌, గాలాపాగోస్‌ దీవులు, సొసైటీ దీవులు వంటి దీవులన్నీ హాట్‌ స్పాట్‌ అగ్నిపర్వతానికి సంబంధించిన చర్యలవల్ల ఉనికిలోకి వచ్చినట్లు కనిపిస్తుంది.

అగ్నిపర్వతాలు వాస్తవానికి భూమికి సంబంధించిన చరిత్రలో సుదీర్ఘ, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాయి. ఒక విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ప్రకారం, దాదాపు “ఖండాలన్నిటిలో, మహాసముద్ర అడుగుభాగంలోని పల్లాలన్నిటిలో 90 శాతంవరకు అగ్నిపర్వతాల చర్యల మూలంగానే కలిగాయి.” అయితే అగ్నిపర్వతాల్లో జరిగే కొన్ని విస్ఫోటనాలు అతి వినాశకరమైన స్థాయిలో ఉండడానికిగల కారణాలు ఏమిటి?

భూమిలో వేడిగా ఉండే లోపలి భాగం నుండి మాగ్మా బయటికి ఎగజిమ్మడంతో విస్ఫోటనాలు మొదలవుతాయి. కొన్ని అగ్నిపర్వతాలు కేవలం లావాను విడుదల చేస్తాయి, అది చాలా అరుదుగా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేంత వేగంగా కదులుతుంది. అయితే ఇతర అగ్నిపర్వతాలు ఒక అణుబాంబుకన్నా అధికశక్తితో విస్ఫోటనం చెందుతాయి! అగ్నిపర్వతాలు ఎంత శక్తిమంతంగా విస్ఫోటనం చెందుతాయి అనేది వాటిలో ఉండే మాగ్మాలో ఉన్న పదార్థాలు, దాని స్నిగ్ధత, వాయువుల పరిమాణం, దానిలో కలిసిపోయిన విపరీతమైన వేడినీళ్ళు వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆ మాగ్మా ఉపరితలాన్ని సమీపిస్తున్నప్పుడు దానిలో చిక్కుబడిన నీరు, వాయువు వేగంగా వ్యాకోచిస్తాయి. మాగ్మాలోని పదార్థాల సంయోజనం సరైన విధంగా ఉంటే, అది తెరచిన సోడా సీసా నుండి ఎగజిమ్మే సోడాలా బయటికి వస్తుంది.

అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, సాధారణంగా అగ్నిపర్వతాలు విస్ఫోటనం గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. 1902లో కరీబియన్‌ దీవియైన మార్టినిక్‌లో ఉన్న పీలే పర్వతం విషయంలో అదే జరిగింది. ఆ పర్వతానికి దగ్గర్లో ఉన్న సెయింట్‌ పియర్‌లో ఎన్నికలు సమీపించాయి, బూడిద, అనారోగ్యం, భయం ఆ పట్టణాన్ని ఆవరించినా రాజకీయవేత్తలు ప్రజలను అక్కడే ఉండిపొమ్మని ప్రోత్సహించారు. వాస్తవానికి ఎన్నో రోజులుగా చాలా దుకాణాలు మూసివేయబడ్డాయి!

మే 8న ఆరోహణ దిన పండుగ, అగ్నిపర్వతం నుండి తమను కాపాడమని ప్రార్థించడానికి చాలామంది క్యాథలిక్‌ చర్చికి వెళ్ళారు. ఆ ఉదయం 8:⁠00 గంటలకు కొంచెం ముందు, పీలే పర్వతం పేలి బూడిద, బొగ్గు, లావా, పూమైస్‌, తీవ్రమైన వేడి వాయువులను పెద్ద మొత్తంలో బయటకు కక్కింది, వాటి ఉష్ణోగ్రత 200 నుండి 500 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంది. దానివల్ల ఏర్పడిన వినాశకరమైన నల్లని మేఘం నేలను తాకుతూ ఆ పర్వతం నుండి క్రిందికి వేగంగా పయనించి పట్టణాన్ని ముంచెత్తి దాదాపు 30,000 మందిని పొట్టనబెట్టుకుంది, చర్చీ గంటను కరిగించింది, ఓడరేవులో ఉన్న నౌకలను కాల్చివేసింది. అది 20వ శతాబ్దంలో సంభవించిన అతి ప్రాణాంతకమైన విస్ఫోటనం. అయితే, ప్రజలు హెచ్చరికా సూచనలను లక్ష్యపెట్టివుంటే అది అంత ప్రాణాంతకంగా తయారయ్యేది కాదు.

ప్రకృతి విపత్తులు పెరుగుతాయా?

గత దశాబ్దంలో భూభౌతిక, వాతావరణ సంబంధిత విపత్తులు 60 శాతం వరకు పెరిగాయని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రిసెన్ట్‌ సంస్థలు తమ వరల్డ్‌ డిసాస్టర్స్‌ రిపోర్ట్‌ 2004లో పేర్కొన్నాయి. “ఇది దీర్ఘకాల మార్పులను సూచిస్తోంది” అని ఆ నివేదిక చెబుతోంది, డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో వినాశనకరమైన సునామీ సంభవించక ముందు ఆ నివేదిక ప్రచురించబడింది. ప్రమాదభరిత ప్రాంతాల్లో జనాభా పెరగడం, అడవులు తరగడం ఇదే విధంగా కొనసాగినట్లయితే, ఆశావాద దృక్పథంతో ఉండడానికి ఎలాంటి కారణంలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అంతేకాక, అనేక పారిశ్రామిక దేశాలు ఇప్పటికీ వాతావరణంలోకి హరితగృహ వాయువులను విడుదల చేస్తూనే ఉన్నాయి. సైన్స్‌ పత్రికలో వెలువడిన ఒక సంపాదకీయం ప్రకారం, వాతావరణంలోకి విషవాయువులను విడుదల చేయడాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యను జాప్యం చేయడం “పెరుగుతున్న అంటువ్యాధి కోసం చికిత్సను తిరస్కరించడం వంటిది: దానివల్ల తర్వాత భారీ మూల్యాన్నే చెల్లించక తప్పదు.” ఆ మూల్యాలను నొక్కి చెబుతూ, విపత్తు తీవ్రతను తగ్గించే విషయం గురించి ఒక కెనడా నివేదిక ఇలా పేర్కొంది: “అంతర్జాతీయ సమాజం ఇంతవరకు వ్యవహరించిన సమస్యల్లో, వాతావరణ మార్పుకు సంబంధించిన సమస్య అతి విస్తృతంగా ఉన్న, ఎంతో ప్రభావం చూపిస్తున్న సమస్యని చెప్పవచ్చు.”

అయితే ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం, భౌగోళిక ఉష్ణోగ్రత పెరిగిపోవడాన్ని ఎలా అదుపులోకి తీసుకురావాలి అనే విషయాన్ని అటుంచితే, అలా పెరిగిపోవడానికి మానవ చర్యలు కూడా కారణమా అనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. ఆ పరిస్థితి బైబిలులోని ఈ సత్యాన్ని గుర్తుచేస్తుంది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:​23) అయినా, మనం తర్వాతి ఆర్టికల్‌లో చూడనున్నట్లుగా, పరిస్థితి నిరాశజనకంగా లేదు. వాస్తవానికి మానవజాతి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అల్లకల్లోల పరిస్థితుల వంటి బాధలకు ఉపశమనం త్వరలో లభించనున్నదని రుజువుచేస్తుంది. (g05 7/22)

[అధస్సూచి]

^ సూర్యుని వేడిమి అసమమైన రీతిలో వ్యాపించడం, మహాసముద్ర జలప్రవాహాలు ఏర్పడేలా, సూర్యుని శక్తి శీతల ప్రాంతాలకు తరలించబడేలా కూడా చేస్తుంది.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

మొక్కజొన్న పొలంలో అగ్నిపర్వతం పెరిగినప్పుడు

మెక్సికోలో మొక్కజొన్నను పండించే ఒక రైతు 1943లో, తన పొలంలో మొక్కజొన్నతోపాటు మరొకటి పొడుచుకురావడం గమనించాడు. ఆయన తన పొలంలో ఉన్నప్పుడు నేలలో బీటలు, పగుళ్ళు ఏర్పడడం గమనించాడు. తర్వాతి రోజుకల్లా ఆ పగుళ్లలో నుండి ఒక చిన్న అగ్నిపర్వతం మెల్లిగా పైకివచ్చింది. ఆ తర్వాతి వారంలో ఆ పర్వత శిఖరం 150 మీటర్ల ఎత్తుకు పెరిగి, ఒక సంవత్సరం తర్వాత అది 360 మీటర్ల ఎత్తుకు ఎదిగింది. సముద్రమట్టానికి 2,775 మీటర్ల ఎత్తులో ఉండే ఆ పర్వతశిఖరం చివరకు 430 మీటర్ల ఎత్తయింది. పరిక్యుటెన్‌గా పిలవబడే ఆ అగ్నిపర్వతపు విస్ఫోటనాలు 1952లో అకస్మాత్తుగా ఆగిపోయి, అప్పటినుండి అది చడీచప్పుడు లేకుండా ఉంది.

[చిత్రసౌజన్యం]

U. S. Geological Survey/Photo by R. E. Wilcox

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుడు దేశాలను విపత్తు నుండి రక్షించినప్పుడు

కరవు ఒక రకమైన ప్రకృతి విపత్తు. నమోదు చేయబడిన అతి ప్రాచీన కరవుల్లో ఒకటి ప్రాచీన ఐగుప్తులో యాకోబు లేక ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కాలంలో సంభవించింది. ఆ కరవు ఏడు సంవత్సరాలు ఐగుప్తు, కనాను మరితర దేశాల ప్రజలను పీడించింది. అయితే యెహోవా ఆ కరవు గురించి ఏడు సంవత్సరాల ముందే ప్రవచించాడు కాబట్టి, పెద్ద సంఖ్యలో ప్రజల మరణాలకు అది దారితీయలేదు. కరవుకు ముందు ఏడు సంవత్సరాలు ఐగుప్తులో విస్తారంగా ధాన్యం పండుతుందని కూడా ఆయన వెల్లడి చేశాడు. దేవుని జోక్యంతో ప్రధానమంత్రిగా, ఆహార నిర్వాహణాధికారిగా నియమించబడిన దైవభక్తిగల యోసేపు పర్యవేక్షణలో ఐగుప్తీయులు ఎంత ధాన్యాన్ని పోగుచేశారంటే ఇక ‘వారు దానిని కొలవడం మానివేశారు.’ అలా ఐగుప్తు కేవలం తనను తాను పోషించుకోవడమే కాక, యోసేపు కుటుంబంతో సహా “సమస్త దేశస్థుల”ను కూడా పోషించింది.​—⁠ఆదికాండము 41:49, 57; 47:​11, 12.

[7వ పేజీలోని చిత్రాలు]

హయిటీ 2004 వరదమయమైన వీధుల్లో త్రాగే నీటిని మోసుకెళ్తున్న బాలలు. పెద్ద మొత్తంలో అడవుల నరికివేత మట్టిపెళ్ళలు కూలడానికి కారణమయ్యింది

[చిత్రసౌజన్యం]

నేపథ్యం: Sophia Pris/EPA/Sipa Press; inset: Carl Juste/Miami Herald/Sipa Press

[9వ పేజీలోని చిత్రం]

అనేక దేశాలు ఇప్పటికీ వాతావరణంలోకి హరితగృహ వాయువులను విడుదల చేస్తూనే ఉన్నాయి

[చిత్రసౌజన్యం]

© Mark Henley/Panos Pictures