కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచంలో చాలామంది ఇష్టపడే జంతువు

“కుక్క మానవునికి ప్రియనేస్తమే అయివుండవచ్చు, అయితే ప్రపంచంలో చాలామంది ఇష్టపడే జంతువు మాత్రం పులే” అని లండన్‌కు చెందిన ది ఇండిపెండెంట్‌ నివేదిస్తోంది. పది జంతువుల్లో ఒక్కొక్క దానిని వర్ణించే చలనచిత్రాల పరంపరను ప్రదర్శించిన తర్వాత, 73 దేశాలకు చెందిన 52,000కన్నా ఎక్కువమందితో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో, పులికి కుక్కకన్నా కేవలం 17 ఓట్లు మాత్రమే ఎక్కువగా లభించాయి. మూడవ స్థానం డాల్ఫిన్‌కు, ఆ తర్వాతి స్థానాలు గుర్రానికి, సింహానికి, పాముకు, ఏనుగుకు, చింపాజీకి, ఒరాంగుటాన్‌కు, తిమింగలానికి లభించాయి. మానవులు “పులి లక్షణాలను మనం అర్థం చేసుకోవచ్చు, అది బయటికి ఉగ్రంగా, గంభీరంగా కనిపిస్తుంది, అయితే దాని అంతరంగంలో నిజాయితీ, వివేచనా ఉన్నాయి. దానికి భిన్నంగా కుక్క విశ్వసనీయమైన, గౌరవప్రదమైన ప్రాణి, అది ప్రజలు మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించేలా, మరింత సంభాషించేలా చేస్తుంది” అని జంతు ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రజ్ఞురాలు డాక్టర్‌ క్యాన్డి డిసా వివరిస్తోంది. సంరక్షణవాదులు పులి విజయానికి ఎంతో సంతోషించారు. వరల్డ్‌వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌కు చెందిన కలమ్‌ రాన్కేన్‌ ఇలా చెప్పాడు: “ప్రజలు తమకు ఇష్టమైన జంతువుగా పులికి ఓటువేశారంటే దానర్థం వారు దాని ప్రాముఖ్యతను గుర్తించడమే కాక, అవి ఉనికిలో ఉండేలా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారని ఆశిద్దాం.” అడవుల్లో కేవలం 5,000 పులులే మిగిలివున్నాయని అంచనావేయబడింది. (g05 12/22)

నోటిలో ఉండే సూక్ష్మజీవులు, ఆరోగ్యం

“నోరు ఒక సంక్లిష్టమైన ఆవరణ వ్యవస్థ” అని సైన్స్‌ పత్రిక పేర్కొంటోంది. “గత 40 సంవత్సరాలుగా నోటి జీవశాస్త్రజ్ఞులు పళ్ళు, చిగుళ్ళు, నాలుక చుట్టూ వేగంగా పెరుగుతున్న విస్తారమైన సూక్ష్మజీవుల సముదాయాలను విశ్లేషిస్తున్నారు.” నోటిలో సాధారణంగా ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోని వేరే భాగాలకు చేరి సమస్యలు సృష్టించవచ్చని జీవశాస్త్రజ్ఞులకు కొంతకాలంగా తెలుసు. గుండె సమస్యలకు నోటిలోని సూక్ష్మక్రిములతో సంబంధం ఉన్నట్లు ఇప్పటికే కనుగొన్నారు, నోటిలో ఉండే ఇతర సూక్ష్మక్రిములు నెలలు నిండకముందు కాన్పు కావడానికి కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హానికరమైన సూక్ష్మక్రిములు చాలావరకు ప్రత్యక్షంగా హానిచేస్తాయి. అవి నోటిలో ఉండే మంచి సూక్ష్మక్రిములకన్నా ఎక్కువైతే అది పుప్పి పళ్ళకు, చిగుళ్ళ నుండి రక్తం కారడానికి, శ్వాస దుర్వాసనకు దారితీస్తాయి. “65 సంవత్సరాలు పైబడిన వారిలో 10 మంది వ్యక్తుల్లో ముగ్గురు తమ పళ్ళన్నిటినీ కోల్పోయారు, అమెరికాలోని వయోజనులందరిలో సగంమందికి చిగుళ్ళ వ్యాధి ఉంది లేక వారి పళ్ళు పుచ్చిపోయాయి” అని ఆ నివేదిక చెబుతోంది. ఈ సూక్ష్మక్రిములను అధ్యయనం చేయడం ద్వారా పరిశోధకులు “నోటిలో ఉండే హానికరమైన, అలాగే ఉపయోగకరమైన సూక్ష్మక్రిములన్నిటినీ నిరోధించే మౌత్‌వాష్‌లకు బదులు కేవలం హానికరమైన వాటినే నిరోధించే మౌత్‌వాష్‌లను” ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చని ఆశిస్తున్నారు. (g05 12/22)

నిద్ర అలవాట్లు

“ఆసియా ప్రజలు చాలామంది అమెరికన్లకన్నా, యురోపియన్లకన్నా ఆలస్యంగా నిద్రకుపక్రమించి త్వరగా మేల్కొంటారని, నిద్ర అలవాట్ల మీద ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడి చేసింది” అని అల్‌జజీరా వార్తా ఛానెల్‌ నివేదిస్తోంది. తాము సాధారణంగా నిద్రకుపక్రమించే సమయం గురించి, నిద్ర నుండి మేల్కొనే సమయం గురించి 28 దేశాల్లోని 14,000కన్నా ఎక్కువమందిని ఆ సర్వేలో అడగడం జరిగింది. పోర్చుగల్‌లో, ప్రతీ నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు మధ్యరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమిస్తారు. ఆసియావాసులు నిద్ర నుండి త్వరగా మేల్కొంటారు, అలా త్వరగా మేల్కొనే ఆసియావాసుల్లో ఇండోనేషియావాసులు అగ్రగాములు. “ఆ దేశ పౌరుల్లో 91 శాతం మంది తాము ఉదయం 7 గంటలకల్లా మేల్కొంటామని చెప్పారు.” జపానీయులు చాలా తక్కువసేపు నిద్రిస్తారు. అక్కడ 40 శాతంకన్నా ఎక్కువమంది ప్రతీరోజు రాత్రి ఆరు గంటలు లేక అంతకన్నా తక్కువసేపు నిద్రిస్తారు. అధికంగా నిద్రించేవారి జాబితాలో ఆస్ట్రేలియన్లు ఉన్నారు. రాత్రి పది గంటలకన్నా ముందు నిద్రకుపక్రమించేవారు ఆ దేశంలో అధికశాతంమంది ఉన్నారు, అంతేకాక, ఆ సర్వేలో ప్రతిస్పందించిన వారిలో దాదాపు మూడొంతుల మంది తాము సగటున ప్రతీరాత్రి తొమ్మిది గంటలకన్నా ఎక్కువసేపు నిద్రిస్తామని చెప్పారు. (g05 12/22)

పసిబిడ్డలకు “కంగారూ సంరక్షణ”

“కంగారు సంరక్షణ దొరికే పసిబిడ్డలు ఎక్కువసేపు నిద్రిస్తారు, వారి శ్వాస మెరుగుపడుతుంది, వారి బరువు త్వరగా పెరుగుతుంది” అని జపాన్‌కు చెందిన డైలీ యౌమ్యూరి చెబుతోంది. “కంగారూ సంరక్షణ” అంటే ఏమిటి? తల్లులు లేక తండ్రులు వెల్లకిలా పడుకొని ఆచ్ఛాదనలేని తమ ఎదమీద తమ పసిబిడ్డను ప్రతీరోజు గంట రెండు గంటలు పడుకోబెట్టుకోవడం. టోక్యో మెట్రోపొలిటన్‌ బొకుటో హాస్పిటల్‌లోని నవజాత శిశువుల విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న టోయోకో వటనబే ఇలా చెప్పింది: “ఇన్‌క్యుబేటర్‌ల కొరతవల్ల కొలంబియాలో అత్యవసర చర్యగా కంగారూ సంరక్షణ ప్రారంభమయింది. దానివల్ల, నెలలు నిండక ముందే పుట్టిన పసిపాపల మరణ రేటు తగ్గడం, ఆసుపత్రిలో ఉండవలసిన సమయం తగ్గడం వంటి విషయాలను యూనిసెఫ్‌ గమనించింది.” ఇప్పుడు “అభివృద్ధి చెందిన దేశాల్లో నెలలు నిండకముందే పుట్టిన పసిబిడ్డల కోసం, సాధారణంగా పుట్టిన పసిపాపల కోసం కంగారూ సంరక్షణ అనే ఆలోచన ప్రసిద్ధి చెందుతోంది” అని ఆ పత్రిక చెబుతోంది. అలాంటి శరీర స్పర్శవల్ల పసిబిడ్డలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, అది తల్లిదండ్రులు తమ శిశువులతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాక, దానికి ఎలాంటి ఖర్చు కాదు, ఎలాంటి ప్రత్యేక సాధనం అవసరం లేదు. (g05 12/22)

యువతీయువకులు, మొబైల్‌ ఫోన్‌లు

“మొబైల్‌ ఫోన్‌లు లేనట్లయితే తమ జీవితాలను వ్యవస్థీకరించుకోవడం సాధ్యంకాదని బ్రిటన్‌లోని యువతీయువకులు భావిస్తున్నారు” అని లండన్‌కు చెందిన డైలీ టెలీగ్రాఫ్‌ పత్రిక నివేదిస్తోంది. పరిశోధకులు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీయువకుల ఒక గుంపుకు రెండు వారాలు సెల్‌ లేకుండా చేశారు. “అది అసాధారణ అనుభవం” అని ఆ నివేదిక చెబుతోంది. “తమ తల్లిదండ్రులతో మాట్లాడడం, తమ స్నేహితుల ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడడం వంటి అసాధారణ అనుభవాలను వారు ఎదుర్కోవాల్సివచ్చింది.” ఇంగ్లండ్‌లోని లాంకెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ మైఖల్‌ హ్యూమ్‌, సెల్‌ ఫోన్‌లు ఉపయోగించే యువతీయువకుల సాధారణ సంభాషణలు “తమను తాము ఓదార్చుకునే, వ్యక్తిగత గుర్తింపును ఏర్పరచుకునే ఒక మార్గమని” వివరిస్తున్నాడు. ఒక కౌమారప్రాయ యువతి ఫోన్‌ లేని కారణంగా “ఆందోళన చెందినట్లు, ఒత్తిడికి గురైనట్లు” భావించింది, అదే మరో యువకుడైతే ఒంటరితనాన్ని అనుభవించాడు, “[తనకు] ఇష్టమొచ్చినప్పుడు [తన] స్నేహితులతో మాట్లాడగలిగే” బదులు “ఖచ్చితమైన సమయాల్లో ప్రజలను కలుసుకోవడానికి ముందుగా ప్రణాళిక వేసుకోవాల్సివచ్చింది” అని ఆ వార్తాపత్రిక నివేదిస్తోంది. (g05 11/8)

“గృహ అలంకరణలో అతి శ్రేష్ఠమైన ఫ్యాషన్‌?”

“చైనాలో చట్టవిరుద్ధంగా పులి చర్మాలను కొనుగోలు చేస్తున్న పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులు, వ్యాపారస్థులు, ప్రపంచంలో అంతరించే ప్రమాదం అధికంగా ఉన్న ఒకానొక జాతి వధకు కారకులు” అని లండన్‌కు చెందిన ద సండే టెలిగ్రాఫ్‌ నివేదిస్తోంది. అడవిపులి జనాభా గత శతాబ్దంలో దాదాపు 1,00,000 ఉండేది, ఆ సంఖ్య ఇప్పుడు 5,000కన్నా తక్కువ అయింది. అధిక శాతం పులులు ఇండియాలోనే ఉన్నాయి, కొన్ని పులులు దక్షిణాసియాలోని ఇతర దేశాల్లో, సుదూర ప్రాచ్య దేశాల్లో కూడా ఉన్నాయి. లండన్‌కు చెందిన ది ఎన్విరాన్మెంటల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ అనే ధర్మదాన సంస్థ నివేదిక ప్రకారం, కొనుగోలుదారులు చర్మాలను “గృహ అలంకరణలో అతి శ్రేష్ఠమైన ఫ్యాషన్‌గా” దృష్టిస్తున్నారు, “కానీ వారు పులి జాతులు అంతరించే ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు . . . ఈ జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే దాని జాతులు సజీవంగా ఉండడానికి ప్రతీ పులి మిగిలివుండడం చాలా అవసరం.” 1994 నుండి 2003 మధ్య 684 పులి చర్మాలు జప్తుచేయబడ్డాయి, అయితే ఆ సంఖ్య దొంగరవాణా అయిన పులి చర్మాలలో కేవలం ఒక చిన్న భాగమేనని భావించబడుతోంది. (g05 11/8)

నవ్వుకు ఉన్న శక్తి

“కేవలం అరనిమిషం ఆనందంగా నవ్వడం 45 నిమిషాల పూర్తి నిద్రతో సమానం, సహజంగా పగలబడి నవ్వడం మూడు నిమిషాల ఎరోబిక్‌ వ్యాయామంతో పోల్చవచ్చు, అదే పదిసార్లు ఆప్యాయంగా చిరునవ్వు చిందించడం వ్యాయామానికి ఉపయోగించే రోయింగ్‌ యంత్రంలో పది నిమిషాలు వ్యాయామం చేయడంతో సమానం” అని పోలిష్‌ వారపత్రిక ప్శీయచుక నివేదిస్తోంది. నవ్వడంవల్ల ఊపిరితిత్తుల్లో చేరే గాలి పరిమాణం మూడు రెట్లు పెరగడమే కాక, రక్తప్రసరణ, జీర్ణశక్తి, జీవక్రియ, మెదడు సామర్థ్యం, హానికరమైన పదార్థాలను తీసివేసే సామర్థ్యం వంటి ప్రక్రియలు కూడా మెరుగుపడడం లాంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు చక్కని మూడ్‌లో ఉండాలంటే మీరు మొదటగా ఉదయాన్నే మిమ్మల్ని మీరు చూసుకుని, మీ జతను, మీ పిల్లలను చూసి చిరునవ్వు చిందించాలి. “మీలోని హాస్యాస్పదమైన విషయాలను చూసి నవ్వుకోండి. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అనుకూల విషయాలను కనుగొనడానికి ప్రయత్నించండి” అని కూడా ఆ పత్రిక చెబుతోంది. (g05 10/22)