కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు స్త్రీలపట్ల వివక్ష చూపిస్తోందా?

బైబిలు స్త్రీలపట్ల వివక్ష చూపిస్తోందా?

బైబిలు ఉద్దేశం

బైబిలు స్త్రీలపట్ల వివక్ష చూపిస్తోందా?

మూడవ శతాబ్దపు వేదాంతియైన టెర్టూలియన్‌ స్త్రీలను “దయ్యాల సింహద్వారాలు” అని ఒకసారి తన రచనలో వర్ణించాడు. మరికొందరు, స్త్రీలు పురుషులకన్నా తక్కువ ప్రాముఖ్యతగలవారని చిత్రీకరించేందుకు బైబిలును ఉపయోగించారు. ఆ కారణంగా చాలామంది, బైబిలు స్త్రీలపట్ల వివక్ష చూపిస్తుందని భావిస్తారు.

అమెరికాలో స్త్రీల హక్కుల్ని ప్రచారం చేసిన 19వ శతాబ్దానికి చెందిన ఎలిజబెత్‌ క్యాడి స్టాన్టెన్‌ “బైబిలు, చర్చి స్త్రీల స్వేచ్ఛ విషయంలో పెద్ద అవరోధాలుగా నిలిచాయని” భావించింది. బైబిలులోని మొదటి ఐదు పుస్తకాల గురించి స్టాన్టెన్‌ ఒకసారి ఇలా వ్యాఖ్యానించింది: “స్త్రీలు అణిగిమణిగి ఉండడం గురించి, వారి విలువను తక్కువచేయడం గురించి సమగ్రంగా బోధించే వేరే ఏ పుస్తకాలూ నాకు తెలియవు.”

నేడు కొంతమంది అలాంటి విపరీతమైన అభిప్రాయాలతో ఉంటే, మరికొందరు బైబిలులోని కొన్ని భాగాలు స్త్రీలపట్ల వివక్ష చూపించడాన్ని సమర్థిస్తున్నాయని ఇప్పటికీ భావిస్తారు. అలాంటి నిర్ధారణకు రావడం సబబేనా?

హీబ్రూ లేఖనాల్లో స్త్రీలు ఎలా దృష్టించబడ్డారు?

“నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.” (ఆదికాండము 3:​16) విమర్శకులు ఈ వాక్యాన్ని చూపించి, అది దేవుడు హవ్వ మీద విధించిన తీర్పని, స్త్రీ పురుషుని చెప్పుచేతల్లో ఉండడాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడని అది రుజువు చేస్తుందని చెబుతారు. అయితే అది స్త్రీల విషయంలో దేవుని సంకల్పాన్ని వెల్లడిచేసే వాక్యం కాదు, బదులుగా పాపం చేయడంవల్ల, దేవుని సర్వాధిపత్యాన్ని తిరస్కరించడంవల్ల ఎదురయ్యే చెడు పర్యవసానాలను గురించి వెల్లడిచేసే ఖచ్చితమైన వాక్యం. మానవజాతి అపరిపూర్ణత కారణంగానే స్త్రీలు బాధకు గురయ్యారు గానీ అది దేవుని చిత్తంకాదు. అనేక సంస్కృతుల్లో భర్తలు తమ భార్యలమీద అధికారం చెలాయించారు, తరచూ క్రూరమైన పద్ధతుల్లో అధికారం చెలాయించారు. అయితే అది దేవుని సంకల్పంకాదు.

ఆదాము హవ్వలు ఇద్దరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. అంతేకాక, ఫలించి భూమిని నిండించి లోబరచుకోమనే ఒకే ఆజ్ఞను దేవుడు వారిద్దరికీ ఇచ్చాడు. వారు ఒక జట్టుగా కలిసి పనిచేయాల్సి ఉంది. (ఆదికాండము 1:​27, 28) ఆ సమయంలో, వారిలో ఎవరూ కూడా మరొకరి మీద క్రూరంగా అధికారం చెలాయించలేదనేది స్పష్టం. ఆదికాండము 1:​31 ఇలా చెబుతోంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”

కొన్ని సందర్భాల్లో బైబిలు వృత్తాంతాలు ఒక విషయం మీద దేవుని దృక్పథం గురించి చెప్పడంలేదు. అవి కేవలం చారిత్రాత్మక కథనమే కావచ్చు. లోతు తన కుమార్తెలను సొదొమ పట్టణస్థులకు ఇవ్వజూపడాన్ని గురించిన వృత్తాంతంలో, ఆయన చర్యలు నైతికంగా ఆమోదకరమైనవా కాదా లేక ఆ చర్యలను దేవుడు ఖండించాడా లేదా అనే విషయాలు పేర్కొనబడలేదు. *​—ఆదికాండము 19:​6-8.

వాస్తవమేమిటంటే, దేవుడు అన్ని రకాల దోపిడీనీ, బాధపెట్టడాన్నీ అసహ్యించుకుంటాడు. (నిర్గమకాండము 22:22; ద్వితీయోపదేశకాండము 27:19; యెషయా 10:​1, 2) మోషే ధర్మశాస్త్రం బలాత్కారాన్ని, వ్యభిచారాన్ని ఖండించింది. (లేవీయకాండము 19:29; ద్వితీయోపదేశకాండము 22:​23-29) వ్యభిచారం నిషేధించబడింది, దానికి పాల్పడిన స్త్రీపురుషులిద్దరికీ మరణశిక్ష విధించబడేది. (లేవీయకాండము 20:​10) ధర్మశాస్త్రం స్త్రీలపట్ల వివక్ష చూపించే బదులు వారికి ప్రాముఖ్యతనిచ్చి, చుట్టుప్రక్కల ఉన్న జనాంగాలలో సామాన్యంగా వ్యాప్తి చెందిన దోపిడీ నుండి వారిని కాపాడింది. యూదుల్లో సమర్థురాలైన భార్య ఎంతో గౌరవించబడేది, విలువైనదిగా ఎంచబడేది. (సామెతలు 31:​10, 28-30) స్త్రీలను గౌరవించే విషయంలో దేవుని నియమాలను అనుసరించడంలో ఇశ్రాయేలీయులు విఫలమవడం వారి తప్పిదమే గానీ అది దేవుని చిత్తంకాదు. (ద్వితీయోపదేశకాండము 32:5) వారు ఘోరమైన అవిధేయత చూపించినందుకు దేవుడు చివరకు ఆ జనాంగమంతటి మీద తీర్పు విధించి శిక్షించాడు.

లోబడివుండాలనే ఆజ్ఞ స్త్రీలపట్ల వివక్ష చూపిస్తోందా?

ఏ సమాజమైనా ఒక క్రమం ఉంటేనే సరిగ్గా పనిచేయగలదు. ఆ క్రమం ఉండాలంటే అధికార నిర్వహణ ఉండాలి. అది లేనట్లయితే పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది. “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.”​—1 కొరింథీయులు 14:​33.

అపొస్తలుడైన పౌలు కుటుంబ శిరసత్వ ఏర్పాటును ఇలా వివరిస్తున్నాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెను.” (1 కొరింథీయులు 11:3) దేవుడు తప్ప ప్రతీ వ్యక్తి ఉన్నతాధికారానికి లోబడివుంటాడు. యేసు ఒక వ్యక్తికి లోబడివున్నాడంటే, ఆయనపట్ల వివక్ష చూపించబడుతుందని దానర్థమా? కాదు! లేఖనాధారంగా సంఘంలో, కుటుంబంలో నాయకత్వం వహించే అధికారం పురుషులకు ఇవ్వబడిందంటే, స్త్రీలపట్ల వివక్ష చూపించబడుతుందని దానర్థంకాదు. ఇటు కుటుంబం, అటు సంఘం వర్ధిల్లాలంటే వాటికి ప్రేమ, గౌరవంతో తమ తమ పాత్రలు పోషించే స్త్రీపురుషులు అవసరం.​—ఎఫెసీయులు 5:21-25, 28, 29, 33.

యేసు ఎల్లప్పుడూ స్త్రీలతో గౌరవంగా వ్యవహరించాడు. ఆయన పరిసయ్యులు బోధించిన వివక్షతో కూడిన ఆచారాలను, నియమాలను అనుసరించడానికి తిరస్కరించాడు. ఆయన యూదులుకాని స్త్రీలతో మాట్లాడాడు. (మత్తయి 15:21-28; యోహాను 4:​7-9) ఆయన స్త్రీలకు బోధించాడు. (లూకా 10:​38-42) ఆయన విడనాడబడడం నుండి స్త్రీలకు రక్షణకల్పించాడు. (మార్కు 10:​11, 12) యేసు స్త్రీలను సన్నిహిత స్నేహితులుగా అంగీకరించడం ఆయన కాలంలో అత్యంత విప్లవాత్మక చర్య అయ్యుండవచ్చు. (లూకా 8:​1-3) దేవుని లక్షణాలన్నిటి సంపూర్ణ ప్రతిరూపంగా ఉన్న యేసు, దేవుని దృష్టిలో స్త్రీపురుషులిద్దరికీ సమాన విలువ ఉందని చూపించాడు. వాస్తవానికి, తొలిక్రైస్తవులలో ఇటు స్త్రీలకూ అటు పురుషులకూ పరిశుద్ధాత్మ వరం లభించింది. (అపొస్తలుల కార్యములు 2:​1-4, 17, 18) క్రీస్తుతోపాటు రాజులుగా, యాజకులుగా సేవ చేసే నిరీక్షణ ఉన్న అభిషిక్తులు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడిన సత్వరమే వారిలో లింగ భేదం ఇక ఉండదు. (గలతీయులు 3:​28) బైబిలు గ్రంథకర్తయైన యెహోవాకు స్త్రీలపట్ల వివక్షలేదు. (g05 11/8)

[అధస్సూచి]

[18వ పేజీలోని చిత్రం]

యేసు తన సమకాలీనులైన అనేకులకు భిన్నంగా స్త్రీలతో గౌరవపూర్వకంగా వ్యవహరించాడు