కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేము సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలా?

మేము సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలా?

యువత ఇలా అడుగుతోంది . . .

మేము సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలా?

“మా స్నేహితులు బంధువులందరికీ చెప్పకుండా వెళ్ళి, రహస్యంగా పెళ్ళిచేసుకోవడం గురించి నాకు కాబోయే భార్యయైన సిండీ మొదటగా ప్రస్తావించింది. దాని గురించి చర్చించిన తర్వాత, అలా చేస్తే తక్కువ సమయం, శక్తి ఖర్చవుతాయనీ, ఒత్తిడి తక్కువగా ఉంటుందనీ మేమిద్దరం అనుకున్నాం.”​—అలెన్‌. *

మీకు వివాహం చేసుకునే వయస్సుండి ఎవరిపట్లైనా రొమాంటిక్‌ భావాలు ఉన్నట్లయితే, గుట్టుగా వెళ్ళి పెళ్ళి చేసుకోవడం మంచిదని మీకు అనిపించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా, పారిపోయి పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఒక జంటకు కలగవచ్చు. * ఏమి చేయాలో నిర్ణయించుకోవడానికి మీకు ఏ సూత్రాలు సహాయం చేయవచ్చు?

ఆచారాలు అంత ప్రాముఖ్యమా?

అనేక సంస్కృతుల్లో వివాహం సాధారణ విషయమే అయినా, వివాహ వేడుకకు సంబంధించిన ఆచారాలు చాలా రకాలుగా ఉంటాయి. తమ వివాహం స్థానిక ఆచారాలు కోరే అంశాలన్నిటికీ అనుగుణంగా ఉండాలా వద్దా అనేది ఒక క్రైస్తవ జంటకు ముఖ్యం కాదు. (రోమీయులు 12:2) బదులుగా వారి ప్రధాన కోరిక తమ కోర్ట్‌షిప్‌, వివాహం యెహోవా దేవుణ్ణి ఘనపర్చే విధంగా ఉండాలన్నదే.​—1 కొరింథీయులు 10:​31.

వివాహం ఒక గౌరవప్రదమైన ఏర్పాటు కాబట్టి, చాలా జంటలు దానిని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడరు. అనేక పాశ్చాత్య దేశాల్లో, సాధారణంగా యెహోవాసాక్షులైన జంటలు తమ స్థానిక రాజ్య మందిరంలో వివాహ వేడుకను ఏర్పాటు చేసుకుంటారు. * ఆ వేడుక తర్వాత వారు ఒక విందు ఏర్పాటు చేయడానికి ఇష్టపడవచ్చు, ఆ విందులో భోజన ఏర్పాట్లు చేస్తారు, కుటుంబంతో, స్నేహితులతో కలిసి కొంత వినోదాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఆర్భాటంగా ఉండనవసరంలేదు. అయితే వివాహాన్ని, విందును వ్యవస్థీకరించడం ఒత్తిడితో కూడుకున్నదని, చాలా డబ్బు ఖర్చు కావచ్చని ఒప్పుకోవాల్సిందే. ఉదాహరణకు, అమెరికాలో వివాహ విందులకు సాధారణంగా వేల డాలర్లు ఖర్చవుతాయి.

కొన్ని జంటలు ఒత్తిడిని, ఖర్చును తగ్గించే ప్రయత్నంలో నిరాడంబరమైన వివాహ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. “మేము వివాహ సందర్భం నిరాడంబరంగా, తక్కువ ఖర్చుతో కూడుకొన్నదిగా ఉండాలనుకున్నాం. కాబట్టి మేము సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడంలేదని మా తల్లిదండ్రులకు చెప్పాం. వారు మా పరిస్థితిని అర్థం చేసుకున్నారని మా తల్లిదండ్రులు అభయాన్నిచ్చారు. వారు ఎంతో సహకరించారు” అని సిండీ చెబుతోంది. మరోవైపు, ప్రారంభంలో పేర్కొనబడిన సిండీకి కాబోయే భర్తయైన అలెన్‌, తన తల్లిదండ్రులకు తన వివాహ ఆలోచనల గురించి చెప్పినప్పుడు ఆ జంట తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవడం వారికి కష్టమైంది. “అది తమ తప్పిదమని, తాము ఏదో చేశాం కాబట్టే మేము అలాంటి నిర్ణయం తీసుకున్నామని వారు అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు” అని అలెన్‌ చెబుతున్నాడు.

మీరు నిరాడంబరమైన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీ తల్లిదండ్రులు కూడా నిరాశకు గురికావచ్చు, ఎందుకంటే వారు ఆ ప్రత్యేక దిన ఆనందాన్ని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోవాలని అనుకుంటుండవచ్చు. మీ కుటుంబానికి మీరు వివాహం చేసుకోవడం ఇష్టంలేదని మీకు తెలుసు కాబట్టి, మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వివాహం చేసుకోవాలనుకుంటే అప్పుడేమిటి?

మీ కుటుంబసభ్యుల భావాలను పరిగణలోకి తీసుకోండి

వివాహానికి సంబంధించిన ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేంతగా మీరు ఎదగలేదని భావించి మీ తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతుండవచ్చు. మీరు పరిణతి చెందేకొద్దీ మీ అభిరుచులు మారి వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో తీసుకున్న నిర్ణయం విషయంలో మీరు బాధపడతారని వారు భయపడుతుండవచ్చు. లేదా, వివాహం చేసుకొనే వయసు మీకుందనీ, అయితే మీరు ప్రేమించిన వ్యక్తి వ్యక్తిత్వంలో కొన్ని లోపాలున్నాయని వారు అనుకోవచ్చు. లేక మీరు భాగస్వామిగా ఎంపిక చేసుకున్న వ్యక్తికి మీకున్న మత నమ్మకాలు లేవు అనే కారణాన్నిబట్టి కూడా వారు మీ వివాహాన్ని అనుమతించకపోవచ్చు.

మీ తల్లిదండ్రులు నిజ క్రైస్తవులైతే వారలా చింతిస్తున్నందుకు బహుశా బైబిలు ఆధారిత కారణాలు వారికి ఉండవచ్చు. వారు తమ భయాందోళనలు వ్యక్తం చేయడంలో తప్పేమీలేదు. నిజానికి, వారలా వ్యక్తం చేయకపోతే యెహోవా వారిని అజాగ్రత్తపరులుగా, ప్రేమలేనివారిగా దృష్టిస్తాడు. మీరు వారి అభిప్రాయాన్ని వినడం మీకు ప్రయోజనకరం.​—సామెతలు 13:​1, 24.

ఉదాహరణకు, మీరు బట్టలను కొన్నప్పుడు, మీకు ఆ బట్టలు నప్పుతాయో లేవో తెలుసుకోవడానికి మీరు బహుశా వేరే వ్యక్తి అభిప్రాయాన్ని అడుగుతుండవచ్చు. మీరు ఎల్లప్పుడూ వారి అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, అయినా ఆ బట్టలు మీకు సరిగ్గా సరిపోకపోయినా లేక అవి మీకు నప్పకపోయినా ఆ విషయం మీ సన్నిహిత స్నేహితులు మీకు చెప్పాలని ఆశిస్తారు. మీ డబ్బు వృథా కాకుండా ఉండేందుకు వారు సహాయం చేయవచ్చు, అందువల్ల మీరు వారి వ్యాఖ్యానాలకు విలువనిస్తారు. కాబట్టి వివాహ జతను ఎంపికచేసుకునే విషయంలో మీ కుటుంబ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మీరు ఇంకెంత విలువ ఇవ్వాలో కదా! మీరు కొన్న బట్టలను వెనక్కిచ్చి వేరొకటి తీసుకోవచ్చు లేక ఆ దుస్తులను పడేయవచ్చు. అయితే మీరు మీ జతతో జీవితాంతం గడపాలని యెహోవా కోరుతున్నాడు. (మత్తయి 19:​5, 6) మీ వ్యక్తిత్వానికి, ఆధ్యాత్మికతకు నిజంగా పొందికలేని భాగస్వామిని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఆ బంధం, మీకు సరిగ్గా సరిపోని బట్టలు ధరించడంవల్ల కలిగే అసౌకర్యంకన్నా అధిక అసౌకర్యాన్ని కలిగిస్తుంది. (ఆదికాండము 2:18; సామెతలు 21:9) ఆ కారణంగా మీరు నిజమైన ఆనందాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారు.​—సామెతలు 5:18; 18:​22.

కొంతమంది తల్లిదండ్రులు వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేయడానికి స్వార్థపూరిత కారణాలు ఉండవచ్చనేది నిజమే. ఉదాహరణకు, వారు తమ పిల్లల మీద నియంత్రణ కోల్పోకూడదు అని అనుకుంటుండవచ్చు. అయితే మీరు మీ తల్లిదండ్రుల చింతలను స్వార్థపూరితమైనవిగా కొట్టివేసి, వివాహం చేసుకోవడానికి గుట్టుగా వెళ్లిపోయే ముందు, వారి అభ్యంతరాలను ఎందుకు విశ్లేషించకూడదు?

జాగ్రత్తతో ఉండడానికిగల కారణాలు

మీరు పరిణతి చెందేకొద్దీ మీ అభిరుచులు మారతాయనేది వాస్తవం. “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 13:​11) అలాగే మీరు కౌమారప్రాయంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో మీకు ఆకర్షణీయంగా కనిపించే లక్షణాలు మీరు పెద్దవారైన తర్వాత, మీకు ఆకర్షణీయంగా కనిపించే లక్షణాలు పూర్తిగా వేరుగా ఉండవచ్చు. కాబట్టి, మీరు వివాహ జతను ఎంపిక చేసుకోవడమనే గంభీరమైన చర్యను తీసుకునే ముందు ‘ఈడు దాటేంతవరకు’ వేచివుండాలని, అంటే మీ లైంగిక కోరిక అధిక స్థాయిలో ఉండే సంవత్సరాలు గడిచేంతవరకు వేచివుండాలని బైబిలు సిఫారసు చేస్తుంది.​—1 కొరింథీయులు 7:​36.

మీ తల్లిదండ్రులకు మీరు ప్రేమించిన వ్యక్తిలో తప్పిదాలు కనిపిస్తే అప్పుడేమిటి? వారి జీవితంలో సంపాదించిన అనుభవాన్నిబట్టి, మీ తల్లిదండ్రుల జ్ఞానేంద్రియాలు మంచి చెడులను వివేచించేందుకు శ్రేష్ఠంగా శిక్షణపొందివుండవచ్చు. (హెబ్రీయులు 5:​14) కాబట్టి మీరు వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తిలోవున్న గంభీరమైన తప్పిదాలను వారు గమనించవచ్చు, మీరు వాటిని గమనించకపోవచ్చు. జ్ఞానియైన సొలొమోను వ్రాసిన మాటల్లోని సూత్రాన్ని పరిశీలించండి: “వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.” (సామెతలు 18:​17) అలాగే, మీరు ప్రేమించే వ్యక్తి, అతడు లేక ఆమె మీకు సరైన వ్యక్తి అనే నమ్మకం మీకు ఉండవచ్చు. అయితే, మీ తల్లిదండ్రులు వారి విషయం ‘తేటపరచిన’ తర్వాత, మీరు పరిశీలించడం జ్ఞానయుక్తంగా ఉండే కొన్ని వాస్తవాలను వారు మీ దృష్టికి తీసుకురావచ్చు.

ఉదాహరణకు, నిజ క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని బైబిలు నిర్దేశిస్తుందని వారు మీకు గట్టిగా గుర్తుచేయవచ్చు. (1 కొరింథీయులు 7:​39) తమ క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోని ఒక వ్యక్తిని పెళ్ళిచేసుకున్నా, ఇప్పుడు ఇద్దరూ యెహోవాను సంతోషంగా సేవిస్తున్నవారు మీకు తెలుసని మీరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. నిజానికి, అలా జరగదు. అయితే ఒకవేళ అలా జరిగినా అలాంటి ఉదాహరణలు చెడు ఫలితాలు వచ్చినవాటితో పోలిస్తే చాలా తక్కువే. మీ విశ్వాసాన్ని పంచుకోని వ్యక్తిని మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు యెహోవా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడమే కాక, మిమ్మల్ని మీరు తీవ్రమైన ఆధ్యాత్మిక అపాయంలో కూడా పడవేసుకుంటారు.​—2 కొరింథీయులు 6:​14. *

వివాహం చేసుకోవడానికి అజ్ఞానపు కారణం

కొంతమంది యౌవనులు తాము అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు కాబట్టి, తమ భాగస్వామిని వివాహం చేసుకోవడం తమ మనస్సాక్షికి ఉపశమనం కలగజేస్తుందని భావించి ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకున్నారు. లేక వివాహం చేసుకోవడంవల్ల అసంకల్పిత గర్భధారణ వంటి పాపపు పర్యవసానాలను కప్పిపుచ్చాలని వారు ఆశిస్తుండవచ్చు.

మీరు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వివాహం చేసుకుంటున్నట్లయితే మీరు మరో పాపం చేయడం ద్వారా మరింత గంభీరమైన పాపం చేస్తుండవచ్చు. “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును” అని సొలొమోను హెచ్చరించాడు. (సామెతలు 28:​13) సొలొమోను తల్లిదండ్రులైన, దావీదు, బత్షెబలు తమ అనైతిక ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం ఎంత మూర్ఖత్వమో తెలుసుకున్నారు. (2 సమూయేలు 11:2-12:​25) మన పాపాన్ని కప్పిపుచ్చుకునే బదులు, మీ తల్లిదండ్రులతో, సంఘ పెద్దలతో మాట్లాడండి. అలా మాట్లాడాలంటే మీకు ధైర్యం అవసరం, మీరు పశ్చాత్తాపపడితే యెహోవా క్షమిస్తాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. (యెషయా 1:​18) మీరు ఒకసారి నిష్కళంకమైన మనస్సాక్షి తిరిగి సంపాదించుకుంటే, వివాహం విషయంలో సమతుల్యతతో కూడిన నిర్ణయం తీసుకునే చక్కని స్థితిలో ఉంటారు.

విచారించే పరిస్థితులను నివారించడం

అలెన్‌ తన వివాహం గురించి గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు: “నిరాడంబరమైన వివాహం చేసుకోవాలనే మా నిర్ణయంవల్ల ఆ సందర్భంలో మేము ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోలేదు. మేము తీసుకున్న నిర్ణయానికిగల కారణాలను నా కుటుంబం సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయలేకపోయాననే ఒకే ఒక బాధ నాకు మిగిలింది.”

నిజానికి, పరిణతి చెందిన ఒక జంట సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలా లేదా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. అయితే మీరు వివాహం విషయంలో ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకుంటున్నప్పుడు తొందరపడకండి, మీ కుటుంబంతో సంప్రదించండి, మీ ‘నడతలను బాగుగా కనిపెట్టుకోండి.’ అప్పుడు, మీరు ఆ తర్వాత విచారించే కారణాలు తగ్గుతాయి.​—సామెతలు 14:​15. (g05 11/22)

[అధస్సూచీలు]

^ పేర్లు మార్చబడ్డాయి.

^ ఈ పద్ధతిని లేచిపోవడం అని కొన్నిసార్లు పిలుస్తారు.

^ ఈ ఆరాధనా స్థలాలు యెహోవాసాక్షుల వివాహాలకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఆ వేడుక నిరాడంబరంగా ఉంటుంది, మంచి వివాహానికి పునాదిగా ఉండే బైబిలు సూత్రాల గురించిన క్లుప్తమైన చర్చ ఉంటుంది. రాజ్య మందిరాన్ని ఉపయోగించినందుకు వారు డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదు.

^ ఈ అంశం మీద మరింత వివరణలతో కూడిన చర్చకు, కావలికోట, జూలై 1, 2004, 30-1 పేజీలు, జూన్‌ 1, 1990, 12-16 పేజీలు చూడండి.

[27వ పేజీలోని చిత్రం]

వివాహం చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటున్నప్పుడు, మీ కుటుంబంతో సంప్రదించండి