“యెహోవా సంస్థకు స్వాగతం”
“యెహోవా సంస్థకు స్వాగతం”
యెహోవా సంస్థతో కొంతకాలం సహవసించిన ఫిన్‌లాండ్‌లోని ఒక కుటుంబానికి అనేక వర్గాల ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైంది. “వారు మీ డబ్బు దోచుకుంటారు” అని ప్రజలు హెచ్చరించారు. మరికొందరు “మీరు మీ ఇల్లు పోగొట్టుకుంటారు” అన్నారు. యాదృచ్ఛికంగా, ఒకరోజు రాత్రి ఆ కుటుంబానికి చెందిన భవనంలోని హీటింగ్ సిస్టమ్ ఉన్న భాగాన్ని మంటలు తీవ్రంగా నాశనంచేశాయి, వాతావరణం చల్లగా ఉండే ఉత్తరదేశాల్లో అది తీవ్రమైన నష్టమే.
భీమా కంపెనీలు పునర్నిర్మాణ వస్తువులను కొనేందుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరించలేదు. ఆ మంటలు ప్రజల అశుభసూచక అంచనాలను ధృవీకరించినట్లే అనిపించాయి. ఆ కుటుంబంలోని తండ్రి నిట్టూర్పుతో ఇలా గుర్తు చేసుకున్నాడు, “మేము నిజంగా నిరాశకు గురయ్యాం.” అయినా, ఆ భార్యాభర్తలు కేవలం మూడు వారాల తర్వాత బాప్తిస్మం తీసుకోవాలనే తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.
స్థానిక సంఘం ఆ పరిస్థితిని ఈ క్రింది బైబిలు సలహాను అన్వయించుకునేందుకు దొరికిన అవకాశంగా పరిగణించింది: “చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహాను 3:18) తోటి విశ్వాసులు ఆ భవనాన్ని మరమ్మతు చేసేందుకు ఒక ప్రణాళికను రూపొందించడం ప్రారంభించారు. ఫిన్‌లాండ్‌లోని యెహోవాసాక్షుల కార్యాలయం ఆ ప్రణాళికను కార్యాచరణలో ఎలా పెట్టాలో తెలియజేసే ఆచరణాత్మక సలహా ఇచ్చింది. నిర్మాణ నమూనాలు గీయబడ్డాయి, భవన అనుమతులు సంపాదించడం జరిగింది, ఆ భవనాన్ని నిర్మించడానికి కావల్సిన వస్తువులను సమకూర్చి, స్వచ్ఛంద సేవకుల కోసం పిలుపు ఇవ్వబడింది.
మంటలు రేగిన దాదాపు నెల తర్వాత పని ముమ్మరంగా కొనసాగింది. ఒకానొక బుధవారం స్థానిక సాక్షులు, మంటల్లో కాలి బుగ్గి అయిన భవన అవశేషాలను తీసివేశారు. వేరే సంఘాలకు చెందిన సాక్షుల సహాయంతో శుక్రవారంకల్లా క్రొత్త భవన నిర్మాణ రూపం కనిపించడం మొదలుపెట్టింది. ఆ కుటుంబంలోని తండ్రి పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయనను ఒక స్థానిక అధికారి కలిశాడు, పాడైన భవన పైకప్పు మీద తారుగుడ్డ కప్పి దానిని వర్షం నుండి కాపాడుతున్నారా అని ఆయనను అడిగాడు. “లేదు, తారుగుడ్డలేమీ కప్పలేదు కానీ పైకప్పు మీద 30 మంది ఉన్నారు!” అని ఆయన గర్వంగా జవాబిచ్చాడు.
శనివారం దాదాపు 50 మంది ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు ఆ స్థలంలో ఉన్నారు, ఆ కుటుంబానికి సహాయం చేసే ప్రత్యేక అవకాశం దొరికినందుకు వారు ఎంతో సంతోషించారు. భవన పునర్నిర్మాణ పనిలో చేయూతనిచ్చిన ప్రక్కింటి వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు: “మీరు ఎంతో ప్రత్యేకమైన ప్రజలు అనే విషయాన్ని గురించి నేను నిన్న రాత్రి కొంతసేపు ఆలోచించాను! మీరు నిజంగా ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.”
ఆ రోజు సాయంత్రానికి పని పూర్తైంది. వివక్షతో ఆ కుటుంబానికి ఇవ్వబడిన హెచ్చరికలకు ఆ క్రొత్త భవనం ఒక స్పష్టమైన జవాబు. సంఘంలోని ఒక పెద్ద ఆ తండ్రితోపాటు నిల్చొని తమ శ్రమల ఫలితం చూసిన ఆ క్షణాన్ని ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “క్రొత్తగా బాప్తిస్మం పొందిన మన సహోదరుని భుజం చుట్టూ చెయ్యి వేసి, ‘యెహోవా సంస్థకు స్వాగతం’ అని చెప్పడం ఒక అద్భుతమైన అనుభూతి.” (g05 12/8)
[31వ పేజీలోని చిత్రం]
మంటలు కలుగజేసిన నష్టం
[31వ పేజీలోని చిత్రం]
భవనాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు