వందకోట్ల మందిని పోషించే ప్రయత్నం
వందకోట్ల మందిని పోషించే ప్రయత్నం
ప్రతీరోజు వందకోట్లమంది తమ ఆకలి తీరేంతగా భోజనం చేయరు. అయితే, ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఉండకూడదు.
“కడు బీదరికాన్ని అరికట్టడమే మీ ప్రధాన లక్ష్యమని మీరు చెప్పారు” అని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్, 2000 సెప్టెంబరు 8న ప్రపంచంలోని అతి శక్తిమంతులైన స్త్రీపురుషులతో కూడిన సభను ఉద్దేశించి అన్నాడు. వారు ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది శిఖరాగ్ర సమావేశానికి సమకూడారు, ఆ సమావేశంలో వారిలో చాలామంది నాయకులు ప్రపంచంలో ఉన్న పేదవారి సమస్యల గురించి నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. “కడు బీదరికం మానవత్వానికి అవమానకరం” అని బ్రెజిల్ ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించాడు. బ్రిటన్ ప్రధానమంత్రి ఇంకా తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఇలా అన్నాడు: “ఆఫ్రికా విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఘోరంగా విఫలమైనట్లు రుజువు చేసే చరిత్ర మన నాగరికతకు విభ్రాంతిని, అవమానాన్ని కలిగిస్తుంది.”
ఆకలితో అలమటిస్తున్నవారిని పోషించడానికి తమకు చేతనైనంత చేయడంలో దేశాలు విఫలం కావడం ద్వారా అవి తమను తాము అవమానపరచుకున్నట్లు ఆ ఇద్దరు ప్రసంగీకులు స్పష్టం చేశారు. భూమ్మీద ఉన్నవారందరి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో తమకున్న కోరికను నిరూపించుకోవడానికి ఆ శిఖరాగ్ర సమావేశానికి హాజరైనవారు దాని విషయంలో చర్య తీసుకుంటామని ఎనిమిది భాగాల తీర్మానంలో వాగ్దానం చేశారు, ఆ తీర్మానంలో ఈ అంశం ఉంది: “కడు బీదరికంవల్ల ఎదురయ్యే దుర్భరమైన, అమానవీయ పరిస్థితులను నేడు అనుభవిస్తున్న వందకోట్లకన్నా ఎక్కువగా ఉన్న మా తోటి స్త్రీపురుషులను, పిల్లలను విముక్తి చేయడానికి మేము మాకు చేతనైనంత చేస్తాం. . . . మేము ఇంకా ఇలా తీర్మానించుకుంటున్నాం: రోజుకు ఒక డాలర్‌కన్నా తక్కువ ఆదాయాన్ని సంపాదించే ప్రపంచంలోని ప్రజల సంఖ్యను, ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్యను 2015వ సంవత్సరానికల్లా సగానికి తగ్గించాలి.”
ఆ ఆదర్శవంతమైన లక్ష్యం దిశగా సెప్టెంబరు 2000 నుండి వారు ఎలాంటి ప్రగతి సాధించారు?
మాటలకన్నా చేతలు ప్రాముఖ్యం
ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది శిఖరాగ్ర సమావేశంలో చేసిన తీర్మానంలోని లక్ష్యాలు సాధించడంలో ఎంత ప్రగతి సాధించబడింది అనే అంశాన్ని గ్లోబల్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమిక్ ఫారం 2003లో విశ్లేషించింది. 2004 జనవరి 15న విడుదల చేయబడిన అధికారిక నివేదిక ఇలా పేర్కొంటుంది: “ప్రపంచం తన అతి ప్రాముఖ్యమైన లక్ష్యాలన్నిటినీ సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలను చేయడంలో పూర్తిగా విఫలమైంది.” ఆకలి గురించి ఆ నివేదిక ఇలా పేర్కొంటుంది: “ప్రపంచంలో ఆహార కొరతకు సంబంధించిన సమస్యలేదు, అందరికీ సరిపోయేంత ఆహారం ఉంది. ఉన్న
సమస్యల్లా అందుబాటులో ఉన్న ఆహారం, సరిపోయేంత పోషకాహారం డబ్బులేనివారికి అందుబాటులో లేకపోవడమే.”బీదరికానికి సంబంధించిన సమస్య గురించి ఆ నివేదిక ఇలా చెబుతోంది: “సంపన్న, పేద దేశాల ప్రభుత్వాలు వాగ్దానాలు నెరవేర్చడంలో ఉత్సాహం చూపలేకపోవడానికి ఇప్పుడు ప్రధానంగా బాధ్యత వహించాలి. అయితే సంపన్న దేశాలు రూపొందించిన భూగోళ ఆర్థిక వ్యవస్థ సాధారణంగా నిరుపేద దేశాలకు అధిక నష్టాలను కలిగించే విధంగానే రూపొందించబడ్డాయి. సంపన్న దేశాలు వినసొంపుగా ఉండే వట్టిమాటలు ఎక్కువ పలుకుతున్నా అవి ఆ వ్యవస్థను మార్చడంలో గానీ నిరుపేద దేశాల కోసం ఏర్పాటు చేయబడిన అభివృద్ధి సహాయాన్ని గణనీయంగా పెంచడంలో గానీ అంత ఆసక్తి చూపించడంలేదు.” ఈ మందలింపు లభించినా రాజకీయ నాయకులు చర్య తీసుకునే బదులు చర్చిస్తూనే ఉంటారు, ప్రభుత్వాలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటూనే ఉన్నాయి. ఈ లోపల, ప్రపంచంలోని పేదవారు ఆకలిబాధను అనుభవిస్తూనే ఉన్నారు.
“అంతర్జాతీయ వ్యాపార విధానాలు మారి, జాతీయ విధానాలు ఆకలిని అరికట్టడంపై దృష్టిని నిలిపేంతవరకు, విజయవంతమైన స్థానిక విధానాలు పెరిగేంతవరకు అనేక ప్రాంతాలలో ఉన్న మానవ జనాభా అంతకంతకూ ఎక్కువగా ఆకలిబాధను అనుభవించనున్నదని” “అభిలాషను కార్యాచరణలో పెట్టడం” అనే పేరుతో వరల్డ్ ఎకానమిక్ ఫారం విడుదల చేసిన వాస్తవాలను తెలిపే పత్రం హెచ్చరించింది. మంచి విధానాలను, మరింత “విజయవంతమైన స్థానిక విధానాలను” ఎవరు రూపొందించాలి? యావత్ మానవజాతి పరిస్థితిని మెరుగుపరుస్తామనే దృఢసంకల్పాన్ని 2000వ సంవత్సరంలో బహిరంగంగా వ్యక్తం చేసిన ప్రభుత్వాలే.
నెరవేరని ఒక్క వాగ్దానం నిరాశకు దారితీయవచ్చు; నెరవేరని అనేక వాగ్దానాలు నమ్మకం కోల్పోవడానికి దారితీస్తాయి. బీదవారిపట్ల శ్రద్ధ తీసుకుంటామనే తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం ద్వారా ప్రపంచ ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ఒక బీద కరీబియన్ దేశంలో నివసిస్తున్న ఐదుగురు పిల్లల తల్లి తన కుటుంబానికి రోజుకు ఒకే ఒక పూట భోజనం పెట్టగలుగుతుంది. ఆమె ఇలా చెబుతుంది: “మాకు తినడానికి ఆహారం ఉందాలేదా అనేదే నేను ఆలోచిస్తాను. అధికారంలో ఎవరున్నారు అనేది నాకు అవసరంలేదు. అధికారంలో ఉన్నవారివల్ల మాకు ఎప్పుడూ ఎలాంటి ప్రయోజనం కలగలేదు.”
బైబిలు రచయిత యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) పేదవారి సమస్యలను పరిష్కరించడంలో మానవ ప్రభుత్వాలు విఫలమవడం ఆ బైబిలు సత్యాన్ని ధృవీకరిస్తుంది.
అయితే మానవ సమస్యలను పరిష్కరించే శక్తి, కోరిక రెండూ ఉన్న ఒక పరిపాలకుడు ఉన్నాడు, బైబిలు ఆయనను గుర్తిస్తుంది. ఆ పరిపాలకుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరూ తిరిగి ఆకలిబాధతో అలమటించరు.
నిరీక్షణకు ఆధారం
“సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.” (కీర్తన 145:15) మానవులకు అవసరమైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించే ఈ వ్యక్తి ఎవరు? ఆయన మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు. వేలాది సంవత్సరాల నుండి మానవజాతి కరవు, మరితర సమస్యలను అనుభవించినా యెహోవా ఎల్లప్పుడూ ప్రజల విషయంలో శ్రద్ధ చూపించాడు. ఆయన మానవ ప్రభుత్వాలు విఫలమవడం గమనించాడు, వాటి స్థానంలో త్వరలో ఆయన తన ప్రభుత్వాన్ని నెలకొల్పుతాడని ఎన్నడూ తప్పిపోని ఆయన వాక్యమైన బైబిలు వివరిస్తుంది.
యెహోవా ఇలా చెబుతున్నాడు: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.” (కీర్తన 2:6) విశ్వంలోని అత్యున్నతాధికారి నుండి ఆ ప్రకటన వెలువడడం నిరీక్షణకు ఆధారాన్నిస్తుంది. మానవ పరిపాలకులు తమ ప్రజలకు సహాయం చేయడంలో తరచూ విఫలమయ్యారు, అయితే దేవుని నియమిత రాజుగా యేసుక్రీస్తు భూమ్మీద ఉన్న నిరుపేదలు ఇంతకుముందు ఎన్నడూ చవిచూడని ప్రయోజనాలను వారికి చేకూరుస్తాడు.
యెహోవా ఈ రాజు ద్వారా ఆకలితో అలమటిస్తున్న వారందరినీ పోషిస్తాడు. “సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును” అని యెషయా 25:6 చెబుతోంది. క్రీస్తు నాయకత్వంలోని దేవుని రాజ్యంలో ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా వారికి ఇక ఎన్నడూ మంచి ఆహారం కొదువగా ఉండదు. యెహోవా గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.”—కీర్తన 145:16. (g05 7/22)
[13వ పేజీలోని బ్లర్బ్]
“ఆఫ్రికా విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఘోరంగా విఫలమైనట్లు రుజువు చేసే చరిత్ర మన నాగరికతకు విభ్రాంతిని, అవమానాన్ని కలిగిస్తుంది.”—బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్
[12వ పేజీలోని చిత్రం]
ఇతియోపియా: ఈ దేశంలో దాదాపు 1.3 కోట్లమంది ఆహార సహాయం మీద ఆధారపడుతున్నారు. పై చిత్రంలో ఉన్న ఒక పిల్లవాడు వారిలో ఒకడు.
[12వ పేజీలోని చిత్రం]
ఇండియా: ఈ విద్యార్థులకు పాఠశాలలో ఆహారం ఇవ్వబడుతోంది
[12వ పేజీలోని చిత్రసౌజన్యం]
పైన: © Sven Torfinn/Panos Pictures; క్రింద: © Sean Sprague/Panos Pictures