కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాధులు ప్రాచీన నమ్మకాల గురించి తెలుసుకునే మార్గం

సమాధులు ప్రాచీన నమ్మకాల గురించి తెలుసుకునే మార్గం

సమాధులు ప్రాచీన నమ్మకాల గురించి తెలుసుకునే మార్గం

వేలాది సంవత్సరాల క్రితం మీరు జీవించివున్నట్లు ఊహించుకోండి. మీరు బాబిలోనియాలోని సుమేరులోవున్న వర్ధిల్లుతున్న రాజనగరమైన ఊరులో ఉన్నారు. సుమేరియన్ల పెద్ద ఊరేగింపు పట్టణాన్ని విడిచి శ్మశానవాటికకు చేరుకున్నారు, వారు ఇటీవల మరణించిన పరిపాలకుని సమాధిలోకి దారితీసే ఏటవాలు ప్రాంతం గుండా వెళ్తున్నారు. ఆ సమాధి గోడలకు, నేలపై తివాచీలు ఉన్నాయి, ఆ సమాధిగది ప్రశస్తమైన సుమేరియన్‌ కళతో అలంకరించబడింది. సైనికులు, సేవకులు, స్త్రీలు ఉన్న ఆ ఊరేగింపులో సంగీతకారులు కూడా ఉన్నారు. వారందరూ తమతమ అలంకరణలతో వైభవంగా కనిపిస్తున్నారు. అధికారులు తమ హోదాను వెల్లడి చేసే చిహ్నాలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు. రంగురంగులుగా కనిపిస్తున్న ఆ జనసమూహంలో ఎడ్లు లేక గాడిదలు లాగే రథాలు ఉన్నాయి, వాటి సారథులు కూడా ఉన్నారు, ఆ జంతువుల తలల దగ్గర వాటి సంరక్షకులు ఉన్నారు. వారందరూ తమతమ స్థానాల్లో నిల్చున్నప్పుడు సంగీతంతో కూడిన మతకర్మ నిర్వహించబడింది.

ఆ మత సంబంధమైన ఆచారాలు ముగిసిన తర్వాత సంగీతకారుని నుండి సేవకునివరకు ప్రతీ వ్యక్తి, ఆ సందర్భం కోసం తమతోపాటు తెచ్చుకున్న మట్టితో, రాయితో లేక లోహంతో చేయబడిన ఒక చిన్న కప్పును రాగి కుండలో ముంచి ప్రత్యేకంగా తయారుచేయబడిన ద్రావకాన్ని తీసుకుని త్రాగారు. ఆ తర్వాత అందరూ ఒక క్రమ పద్ధతిలో ప్రశాంతంగా నేలమీద పడుకుని, నిద్రలోకి జారుకుని, ఆ తర్వాత అలాగే మరణించారు. ఒక వ్యక్తి జంతువులను త్వరత్వరగా వధించాడు. పనివారు సమాధికి దారితీసే మార్గాన్ని పూడ్చివేసి పూర్తిగా మూసివేశారు. దైవ సమానుడైన తమ రాజు ఇప్పుడు, పాతిపెట్టబడిన తన రథంలో, విశ్వసనీయులైన తన సేవకులు, కావలి సైనికులు ఆయనతోపాటు తేజోవంతంగా ప్రయాణిస్తుండగా, ఉత్తేజకరంగా తర్వాతి లోకానికి అద్భుతంగా స్వారీ చేస్తున్నాడని సుమేరియన్లు నమ్ముతారు.

పురావస్తుశాస్త్రజ్ఞుడైన సర్‌ లియోనార్డ్‌ ఊలీ దక్షిణ ఇరాక్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రాచీన ఊరు పట్టణంలోని శ్మశానవాటికలో, ఇక్కడ వర్ణించబడిన లాంటి 16 రాజవంశస్థుల సమాధులను వెలికితీశాడు. ఆ సమాధులు భయంకరంగా ఉన్నా వాటిలో పెద్ద మొత్తంలో సంపద దొరికింది. “ఆ సమాధుల్లో ఉన్న సంపదకు సాటియైనవి మెసొపొతమియ పురావస్తుశాస్త్రంలో లేవు, ఆ సంపదల్లో సుమేరియన్‌ కళకు చెందిన చాలా ప్రఖ్యాతిగాంచిన కళాఖండాలు కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు బ్రిటీష్‌ మ్యూజియమ్‌ను, యూనివర్సిటి ఆఫ్‌ పెన్సిల్వేనియా మ్యూజియమ్‌ను అలంకరించాయి” అని టూంబ్స్‌, గ్రేవ్స్‌ అండ్‌ మమ్మీస్‌ అనే తన పుస్తకంలో పాల్‌ బాన్‌ పేర్కొన్నాడు.

అయితే, మానవ బలులు, జంతు బలులు వంటి దారుణమైన కృత్యాల విషయంలో కూడా ప్రాచీన ఊరులోని సమాధులు ప్రత్యేకమైనవేమీ కాదు. అనేక ప్రాచీన నాగరికతల్లో శ్రీమంతులు, రాజవంశస్థులు తమ మరణానికి, మరణాంతర జీవితానికి సంబంధించి ఎంతో శ్రమకోర్చి పెద్ద మొత్తంలో ఖర్చుచేశారు, కొన్నిసార్లు ఆ పనులను క్రూరమైన రీతిలో చేశారు. కళా వైభోగంతో, సంపదతో నిండిన వారి సమాధులు తరచూ సజీవంగా ఉన్నవారి రాజభవనాలకు సరిసమానంగా ఉండేవి లేదా వాటిని మించిపోయేవి. అయితే ఈ రోజుల్లో ఆ సమాధులే కాక మరితర ఎన్నో నిరాడంబరమైన సమాధులు కూడా గతం గురించి తెలుసుకోవడానికి మనకు సహాయం చేసి, ప్రాచీన ప్రజల, అంతరించిన నాగరికతల నమ్మకాలను, సంస్కృతిని, కళాత్మక, సాంకేతిక నైపుణ్యాలను పరిశీలించే అవకాశాలను మనకు కల్పిస్తున్నాయి.

సేవకగణంతో, రాజవైభవంతో మట్టిలో కలిసిపోవడం

1974లో చైనాలోని సియాన్‌ నగరానికి దగ్గర్లో ఉన్న రైతులు ఒక బావిని మరింత లోతుగా తవ్వారు. వారు నీళ్ళను కనుగొనే బదులు మట్టితో చేయబడిన మనుషుల రూపాలను, విల్లును ఎక్కుపెట్టే కంచు తుపాకీ యంత్ర భాగాలను, బాణపు ములుకులను కనుగొన్నారు. వారు యాదృచ్ఛికంగా, జిగటమన్నుతో తయారుచేయబడిన 2,100 సంవత్సరాల పురాతనమైన చిన్‌ సైన్యపు బొమ్మలను కనుగొన్నారు, మట్టితో చేయబడిన ఆ సైన్యంలో అసాధారణ పరిమాణంలో ఉన్న దాదాపు 7,000కన్నా ఎక్కువమంది సైనికులను, గుర్రాలను కనుగొన్నారు, అవన్నీ సైనిక పంక్తుల్లో ఉన్నాయి! చైనా సామ్రాజ్యపు అతి పెద్ద సమాధుల్లో భాగంగా ఉన్న జిగటమన్నుతో తయారుచేయబడిన చిన్‌ సైన్యానికి, సా.శ.పూ. 221లో పోరాడుతున్న రాష్ట్రాలను ఐక్యపరచిన చిన్‌-షిర్‌-హవాన్డీ రాజు పేరు పెట్టబడింది.

చిన్‌ సమాధిగృహాన్ని భూగర్భ రాజభవనంగా వర్ణించవచ్చు. అయితే జిగటమన్నుతో తయారుచేయబడిన సైన్యం ఎందుకు అవసరం? జాన్‌ వెన్లె ద ఖిన్‌ టెర్రాకాటా ఆర్మీ అనే తన పుస్తకంలో, చిన్‌ “సమాధిగృహం ఖిన్‌ సామ్రాజ్యానికి ప్రతీకగా ఉంది, ఖిన్‌ షీ హువాన్‌గ్డి [చిన్‌-షిర్‌-హవాన్డీ] మరణించిన తర్వాత ఆయన బ్రతికి ఉన్నప్పుడు అనుభవించిన వైభవాలన్నిటినీ మరణించిన తర్వాత కూడా ఆయనకు అందించాలనే ఉద్దేశంతో అది [నిర్మించబడింది]” అని వివరిస్తున్నాడు. ఆ సమాధి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజియంలో భాగంగా ఉంది, ఆ మ్యూజియం సమీపంలోని 400 సమాధులు, గోతులు కూడా ఒక భాగంగా ఉన్నాయి.

ఆ సమాధి నిర్మాణం కోసం “సామ్రాజ్యంలోని అన్ని భాగాలనుండి 7,00,000కన్నా ఎక్కువమంది పనిలోకి చేర్చుకోబడ్డారు” అని జాన్‌ చెబుతున్నాడు. సా.శ.పూ. 210లో చిన్‌ మరణించిన తర్వాత ఆ పని కొనసాగింది, మొత్తం కలిసి ఆ పని 38 సంవత్సరాలవరకు కొనసాగింది. అయితే చిన్‌తో పాతిపెట్టబడినవన్నీ జిగటమన్నుతో చేసినవి కావు. చిన్‌ పిల్లలు లేని ఉపపత్నులందరినీ ఆ రాజుతోపాటు పాతిపెట్టాలనే ఆజ్ఞను అతని వారసుడు జారీ చేశాడని, “పెద్ద సంఖ్యలో” ప్రజలు మరణించడానికి అది దారితీసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి ఆచారాలు వేరే దేశాల్లో కూడా విస్తృతంగా ఆచరించబడేవి.

మెక్సికో నగరానికి ఈశాన్యంలో టావోటీవెకన్‌ అనే ప్రాచీన నగర శిథిలాలున్నాయి. ఈ నగరంలో మృతుల వీధి (స్ట్రీట్‌ ఆఫ్‌ ద డెడ్‌) అనే పేరుతో ఒక వీధి ఉండేది. “ప్రపంచంలోని అతి గొప్ప భవననిర్మాణానికి సంబంధించిన స్మారకచిహ్నాల్లో కొన్ని ఈ వీధిలో ఉన్నాయి” అని ఇంతకుముందు పేర్కొనబడిన బాన్‌ వ్రాశాడు. వాటిలో సా.శ. మొదటి శతాబ్దంలో నిర్మించబడిన సూర్యుని పిరమిడ్‌, చంద్రుని పిరమిడ్‌ ఉన్నాయి, అంతేకాక క్వెట్సల్కావాటల్‌ ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి.

సూర్యుని పిరమిడ్‌లోని లోపలి భాగంలో ఉన్నత శ్రేణికి చెందిన వ్యక్తుల సమాధి గది ఉన్నట్లు అనిపిస్తుంది, పూజారుల సమాధులు కూడా అక్కడ ఉండవచ్చు. దగ్గర్లోని సామూహిక సమాధుల్లో దొరికిన మానవ కళేబరాలు, లోపలి భాగంలో పాతిపెట్టబడినవారిని రక్షించడానికి యోధులు బలి అర్పించబడివుండవచ్చని సూచిస్తుంది. వివిధ నమూనాల్లో సమాధులు ఉండడం, ఆ స్థలంలో దాదాపు 200 మందికి చెందిన కళేబరాలున్నాయని, వాటిలో పిల్లల కళేబరాలు కూడా ఉన్నాయని, ఆ పిల్లలు స్మారక చిహ్నాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా బలి అర్పించబడి ఉండవచ్చని పురావస్తుశాస్త్రజ్ఞులు నమ్మేలా చేసింది.

మరణాంతర జీవితానికి పడవ ప్రయాణం లేక గుర్రపు స్వారీ

దాదాపు 1,000 సంవత్సరాల క్రితం యూరప్‌ను భయాందోళనలకు గురిచేసిన స్కాండినావియాకు చెందిన సముద్రయానం చేసే యోధులైన వైకింగ్‌లు కూడా మరణాంతరం విలాసవంతమైన భూజీవితాన్ని అనుభవించాలని ఆశించారు. మరణించిన తమ సంబంధీకులు తమ గుర్రాలపై లేక పొడవాటి పడవల్లో తర్వాతి లోకంలోకి ప్రయాణిస్తారని వారు నమ్మేవారు. కాబట్టి, వైకింగ్‌ల స్మశాన వాటికల్లో చంపబడిన గుర్రాల అస్థిపంజరాలు, పొడవాటి పడవల కుళ్ళిపోయిన చెక్కలు వంటివి ఉండవచ్చు. ఎ హిస్టరీ ఆఫ్‌ ద వైకింగ్స్‌ అనే పుస్తకంలో గ్విన్‌ జోన్స్‌ ఇలా వ్రాశాడు: “మరణాంతర జీవితాన్ని సౌకర్యవంతంగా, గౌరవపూర్వకంగా చేయగల ప్రతీ వస్తువూ మరణించిన స్త్రీపురుషులకు ఇవ్వబడేది . . . డెన్మార్క్‌లోని లాడ్బిలో [పాతిపెట్టబడిన] పడవ లోపల . . . దాని లంగరు ఉంది, దాని ప్రభువు ప్రయాణం ముగిసిన తర్వాత ఓడకు లంగరు వేయడానికి అది సిద్ధంగా ఉంది.”

యుద్ధప్రియులైన వైకింగ్‌ జాతి, తాము పోరాడుతూ మరణించినట్లయితే దేవుళ్ళ గృహమైన అజ్గార్డ్‌ అనే పేరుగల ప్రాంతానికి వెళ్తామని నమ్మేవారు. “అక్కడ, వారు పగలంతా పోరాడవచ్చు, రాత్రంతా భోజనం చేయవచ్చు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. వైకింగ్‌లు కూడా అంత్యక్రియలప్పుడు నరమేధం చేసేవారు. “ఒక నాయకుడు మరణించినప్పుడు, అతనితోపాటు మరణించడానికి ఎవరు ఇష్టపడుతున్నారని దాసులను, సేవకులను వారు అడిగేవారు” అని ద వైకింగ్స్‌ అనే పుస్తకం చెబుతోంది.

ఉత్తర యూరప్‌కు చెందిన ప్రాచీన సెల్ట్‌లు రుణాన్ని తర్వాతి లోకానికి తీసుకువెళ్ళవచ్చని కూడా నమ్మేవారు, అప్పుతీర్చడాన్ని వాయిదావేయడానికి అది ఒక తెలివైన సాకు కావచ్చు! మెసొపొతమియలో పిల్లలను ఆటవస్తువులతోపాటు పాతిపెట్టేవారు. ప్రాచీన బ్రిటన్‌లోని కొన్ని భాగాల్లో, సైనికులు తమ మరణాంతర జీవితాన్ని ఆకలితో ప్రారంభించకుండా ఉండే విధంగా, గొర్రెపిల్ల కాళ్ళు వంటి ఆహారపదార్థాలతో వారిని పాతిపెట్టేవారు. మధ్య అమెరికాలో, మాయా రాజవంశస్థులు, ఘనీభవించిన తేమకు, శ్వాసకు ప్రతీకగా ఉన్న జేడ్‌ అనే ఆకుపచ్చని రాయితో చేసిన వస్తువులతో పాతిపెట్టబడేవారు. మరణం తర్వాత జీవితం కొనసాగేలా చూడాలనే ఉద్దేశంతో అలా చేసివుండవుచ్చు.

సా.శ.పూ. 1000వ సంవత్సరం గడిచిన కొంతకాలం తర్వాత, అందరినీ భయపెట్టిన త్రాసియన్‌ తెగవారు నేడు బల్గేరియా, ఉత్తర గ్రీస్‌, టర్కీ ఉన్న ప్రాంతంలో నివసించేవారు, అయితే వారు నైపుణ్యంగల కంసాలులుగా కూడా పేరుపొందారు. వారి నాయకులు రథాలు, గుర్రాలు, చక్కని యుద్ధ సామగ్రితోపాటు వైభవంగా పాతిపెట్టబడేవారని, ఆ నాయకుల భార్యలు కూడా వారితోపాటు పాతిపెట్టబడేవారని త్రాసియన్‌లకు చెందిన సమాధులు వెల్లడిచేస్తున్నాయి. వాస్తవానికి త్రాసియన్‌ తెగకు చెందిన భార్య, బలి అర్పించబడి తన భర్తతోపాటు పాతిపెట్టబడడం ఒక గౌరవంగా భావించేది!

కొంతకాలం తర్వాత, ఆ ప్రాంతానికి సమీపంలోనే, నల్లసముద్రానికి ఉత్తరాన సిథియన్లు నివసించారు. ఈ యుద్ధపిపాసులు తాము చంపినవారి కపాలాలను, త్రాగడానికి కప్పులుగా ఉపయోగించేవారు, తలలోని వెంట్రుకలతో కూడిన భాగంతో తయారుచేసిన అంగీలను ధరించేవారు. ఒకానొక సిథియన్‌ సమాధిలో ఒక స్త్రీ అస్థిపంజరం దొరికింది, ఆమె ప్రక్కన గంజాయి ఉంది. ఆమె కపాలానికి మూడు చిన్న రంధ్రాలు చేయబడివున్నాయి, బహుశా వాపునుండి, దానివల్ల వచ్చే బాధ నుండి ఉపశమనం కలిగించేందుకు అలా చేయబడివుండవచ్చు. తర్వాతి లోకంలో ఆమెకు తలనొప్పి నుండి ఉశమనం కలిగించేందుకు ఆమె దగ్గర ఏదో ఒక ఔషధం ఉంటుందనే ఉద్దేశంతో గంజాయి ఆమె ప్రక్కన పెట్టివుండవచ్చు.

ఐగుప్తీయుల మరణాంతర జీవితం

కైరో దగ్గర ఉన్న ఐగుప్తు పిరమిడ్లు, లక్సర్‌ దగ్గర్లోని వ్యాలీ ఆఫ్‌ ద కింగ్స్‌లో ఉన్న సమాధి గదులు ప్రాచీన సమాధులన్నిటిలోకి అత్యంత ప్రసిద్ధిగాంచినవి. ప్రాచీన ఐగుప్తీయులు “సమాధి,” “ఇల్లు” అనే పదాలకు పార్‌ అనే ఒకే పదాన్ని ఉపయోగించేవారు. “కాబట్టి బ్రతికివున్నప్పుడు నివసించడానికి ఒక ఇల్లు, మరణించాక నివసించడానికి ఒక ఇల్లు ఉండేది” అని మమ్మీస్‌, మిత్‌ అండ్‌ మ్యాజిక్‌ ఇన్‌ ఏన్సియంట్‌ ఈజిప్ట్‌ అనే తన పుస్తకంలో క్రిస్టీన్‌ ఎల్‌ మాహడీ చెబుతోంది. “[ఐగుప్తీయుల] నమ్మకాల ప్రకారం, శరీరం బ్రతికివుంటేనే తమలోని ఇతర మూడు అంశాలైన కా, బా, ఆక్‌ బ్రతికివుంటాయి” అని కూడా ఆమె చెబుతోంది.

“కా” భౌతిక శరీరానికి చెందిన ఆధ్యాత్మిక ప్రతిరూపం, దానికి ఆశలు, కోరికలు, అవసరాలు ఉంటాయి. మరణించిన తర్వాత “కా” శరీరాన్ని వదిలివెళ్ళి సమాధిలో నివసిస్తుంది. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు కావల్సినవన్నీ “కా” అనేదానికి అవసరం కాబట్టి, “సమాధిలో ఏర్పాటు చేసే వస్తువులన్నీ ప్రాథమికంగా దాని అవసరాలు తీర్చడానికే” అని ఎల్‌ మాహడీ వ్రాసింది. “బా” అనేదాన్ని వ్యక్తి స్వభావంతో లేక వ్యక్తిత్వంతో పోల్చవచ్చు, అది మానవ శిరస్సు ఉన్న పక్షితో చిత్రీకరించబడింది. “బా,” పుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించి మరణించినప్పుడు శరీరాన్ని విడిచివెళ్తుంది. మూడవ అంశమైన “ఆక్‌,” మమ్మీ మీద మంత్రాలు చదివినప్పుడు దానిలో నుండి “మొలకెత్తుతుంది.” * “ఆక్‌” దేవుళ్ళ లోకంలో నివసిస్తుంది.

ఐగుప్తీయులు, ఒక వ్యక్తి మూడు అంశాలతో సృష్టించబడ్డాడని చెప్పడం ద్వారా, మానవులను శరీరం, ఆత్మ అనే రెండు అంశాలుగా విభజించిన ప్రాచీన గ్రీకు తత్త్వవేత్తలకన్నా ఒక అడుగు ముందుకువేశారు. ఆ బోధ ప్రజల్లో ఇంకా వ్యాప్తిలో ఉన్నా, ఆ సిద్ధాంతాన్ని బైబిలు సమర్థించడంలేదు, అదిలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.”​—ప్రసంగి 9:5.

మరణం విషయంలో ఎందుకు అంత శ్రద్ధ చూపించబడింది?

ప్రిహిస్టారిక్‌ రెలీజియన్‌ అనే తన పుస్తకంలో ఇ. ఒ. జేమ్స్‌ ఇలా వ్రాశాడు: “మానవుడు ఎదుర్కొన్న . . . పరిస్థితులన్నిటిలో మరణం ఎంతో కలవరపరిచే, విభ్రాంతికరమైన పరిస్థితి . . . కాబట్టి మృతుల ఆరాధన మానవ సమాజం మొదట ఉనికిలోకి వచ్చినప్పటి నుండి అంతటి ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించడంలో, ప్రాముఖ్యమైన పాత్రను పోషించడంలో ఆశ్చర్యంలేదు.”

అసలైన జ్ఞానమున్న అతి పురాతన పుస్తకమైన బైబిలు, మరణాన్ని మానవుల శత్రువుగా పేర్కొంటోంది. (1 కొరింథీయులు 15:​26) అది ఎంత సరైన వర్ణననో కదా! అన్ని జాతులు, నాగరికతలు మరణం పూర్తి చివరి దశ అనే సిద్ధాంతాన్ని గట్టిగా విరోధించాయి. మరోవైపు బైబిలు ఆదికాండము 3:19 లో, సమాధికి చేరినవారికి వాస్తవానికి ఏమవుతుందో ఖచ్చితంగా చెబుతోంది: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” అయితే బైబిలు చాలామంది మృతుల విషయంలో ‘జ్ఞాపకార్థ సమాధి’ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఎందుకు? ఎందుకంటే సమాధుల్లో ఉన్న చాలామంది, పూర్తిగా కుళ్ళిపోయినవారు కూడా దేవుని జ్ఞాపకంలో ఉన్నారు, దేవుడు తమను పునరుత్థానం చేసి పరదైసు భూమ్మీద నిత్యజీవం అనుభవించే అవకాశాన్ని అనుగ్రహించే సంతోషకరమైన సమయం కోసం వారు వేచివున్నారు.​—⁠లూకా 23:43; యోహాను 5:​28, 29, NW.

అంతవరకు మృతులు స్పృహలో ఉండరు. యేసు వారి పరిస్థితిని నిద్రతో పోల్చాడు. (యోహాను 11:​11-14) అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి సమాధిలో పెట్టే వస్తువులు లేక పరిచారకులు అవసరంలేదు. వాస్తవానికి పాతిపెట్టబడిన సంపదల నుండి తరచూ ప్రయోజనం పొందేది మృతులు కాదుగానీ సమాధులను దోచుకొనే సజీవంగా ఉన్న దొంగలే! బైబిలు మృతుల పరిస్థితి గురించి దానిలోని బోధలకు అనుగుణంగా ఇలా చెబుతోంది: “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.” (1 తిమోతి 6:7) మరణం విషయంలో ప్రాచీన మతతెగలు, కొన్నిసార్లు ఆధునిక మతతెగలు అనుసరించే క్రూరమైన, అనాగరికమైన ఆచారాల నుండి ఆ సత్యం ‘తమను స్వతంత్రులను’ చేసినందుకు క్రైస్తవులు ఎంత కృతజ్ఞతతో ఉంటారో కదా!​—⁠యోహాను 8:​32.

మరణం విషయంలో మతతెగలు అనుసరించిన ఆచారాలు అర్థవిహీనమైనవే అయినా, ఆర్భాటంగా ఉన్న ఆ ప్రాచీన సమాధులు పూర్తిగా వ్యర్థమైనవేమీ కావు. సమాధుల్లో అనేక కళాఖండాలు, మృతుల కళేబరాలు లేనట్లయితే ప్రాచీన చరిత్ర గురించిన, అంతరించిన నాగరికతల గురించిన మన జ్ఞానం అసంపూర్ణమై ఉండేది. (g05 12/8)

[అధస్సూచి]

^ “మమ్మీ” అనే పదం అరబిక్‌ పదమైన మమ్మియా నుండి వచ్చింది, దానర్థం “జిగటమన్ను” లేక “కీలు.” జిగురులో నానబెట్టబడిన మృతకళేబరాలు నల్లగా కనిపిస్తాయి కాబట్టి ఆ పదం మొదట వాటికి ఉపయోగించబడింది. ఇప్పుడు అది యాదృచ్ఛికంగానైనా లేక ఉద్దేశపూర్వకంగానైనా భద్రపరచబడిన ఎలాంటి మానవ కళేబరానికైనా జంతు కళేబరానికైనా వర్తిస్తుంది.

[24వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ప్రాచీనులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు?

శాస్త్రజ్ఞులు కళేబరాలను పరిశోధించడం ద్వారా, ప్రత్యేకంగా సమాధుల్లో దొరికిన భద్రపరచబడిన కళేబరాలను, కుళ్ళిన చెట్లతో చేయబడిన చిత్తడి నేలల్లో, వేడి ఎడారిలోని ఇసుకలో, మంచుగడ్డల్లో, మంచులో సహజంగా భద్రపరచబడిన కళేబరాలను పరిశోధించడం ద్వారా మన అతి ప్రాచీన పూర్వీకుల ఆరోగ్యం గురించి ఎంతో తెలుసుకున్నారు. ప్రత్యేకంగా జన్యుశాస్త్రంలో పురోభివృద్ధి సాధించబడడంవల్ల, ఫరోలకు వారి రాణులకు మధ్య సంబంధాలు, ఇన్కా కన్యకల బ్లడ్‌ గ్రూప్‌ వంటి ఎలాంటి అంశాన్నైనా నిర్ధారించడానికి ఇప్పుడు శాస్త్రజ్ఞుల దగ్గర శక్తిమంతమైన క్రొత్త పరికరాలు ఉన్నాయి. మనం నేడు ఎదుర్కొంటున్న కీళ్ళవాతము, పులిపిర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలు పూర్వీకులు కూడా అనుభవించారని ఆ అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి.

ప్రత్యేకంగా ప్రాచీన ఐగుప్తీయులు అధికంగా రోగాలకు గురైనట్లు కనిపిస్తుంది, నైలు నది నుండి, పంట కాల్వల నుండి సంక్రమించిన రక్తనాళములలో ఉండే పురుగులు, నారికురుపు కలుగజేసే పురుగులు, ఆంత్ర పరాన్నజీవి పురుగులు వంటి అనేక పరాన్నజీవుల కారణంగానే వారు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ పరిస్థితి, సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన వెంటనే దేవుడు వారికి చెప్పిన మాటలను మనకు గుర్తుచేస్తుంది: ‘నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని [యెహోవా] నీకు దూరపరచును.’​—ద్వితీయోపదేశకాండము 7:​15.

[చిత్రసౌజన్యం]

© R Sheridan/ANCIENT ART & ARCHITECTURE COLLECTION LTD

[20వ పేజీలోని చిత్రం]

ఊరులోని రాజవంశస్థుల సమాధిలో పాతిపెట్టబడిన సుమేరియన్‌ సేవకురాలి తలపాగ, ఆభరణాలు

[చిత్రసౌజన్యం]

© The British Museum

[21వ పేజీలోని చిత్రాలు]

జిగటమన్నుతో తయారుచేయబడిన చిన్‌ సైన్యం బొమ్మలు, ప్రతీ సైనికుడు ప్రత్యేకమైన రూపురేఖలతో మలచబడ్డాడు

[చిత్రసౌజన్యం]

ఇన్‌సెట్‌: Erich Lessing/Art Resource, NY; © Joe Carini / Index Stock Imagery

[23వ పేజీలోని చిత్రం]

మెక్సికోలోని టావెటీవెకన్‌ నగరంలో ఉన్న సూర్యుని పిరమిడ్‌, మృతుల వీధి

[చిత్రసౌజన్యం]

పైన: © Philip Baird www.anthroarcheart.org;చిత్రం: Pictorial Archive (Near Eastern History) Est.

[23వ పేజీలోని చిత్రాలు]

ఎడమవైపు: ఐగుప్తు రాజైన టుటన్‌ఖమెన్‌ను పాతిపెట్టడానికి ఉపయోగించిన మేలిమి బంగారంతో చేయబడిన ముసుగు; క్రింద: “బా” మానవ శిరస్సు ఉన్న పక్షి అని చూపించే సమాధిలోని చిత్రం