అద్భుతమైన మీ ఎర్ర రక్తకణాలు
అద్భుతమైన మీ ఎర్ర రక్తకణాలు
దక్షిణ ఆఫ్రికాలోని తేజరిల్లు! రచయిత
మీ రక్తప్రవాహంలో అధిక సంఖ్యలో ఉండే కణాలు రక్తానికి ఎరుపు రంగునిస్తాయి, ఆ కణాలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి, అవి ఎర్ర రక్తకణాలని పిలువబడతాయి. మీ రక్తంలోని కేవలం ఒక్క చుక్కలోనే కొన్ని కోట్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. సూక్ష్మదర్శిని ఉపయోగించి చూస్తే అవి చక్రికల్లా గుండ్రంగా ఉండి, మధ్యన రంధ్రానికి బదులు అణచినట్టుగా ఉన్నట్టు కనిపిస్తాయి. ప్రతీ కణం కొన్ని కోట్ల హిమోగ్లోబిన్ అణువులతో నిండివుంటుంది. అందంగా గోళాకారంలో ఉండే ప్రతీ హిమోగ్లోబిన్ అణువు, శరీరంలోని అవయవాలకు ప్రాణవాయువును అందించే సామర్థ్యతను రక్తానికి ఇచ్చే దాదాపు 10,000 హైడ్రోజన్, కర్బనం, నైట్రోజన్, ఆమ్లజని, గంధకము వంటి పరమాణువులతోనేకాక, నాలుగు భారీ ఇనుము పరమాణువులతో చేయబడింది. హిమోగ్లోబిన్, కార్బన్ డైయాక్సైడ్‌ను ధాతువులనుండి మీ ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళడంలో సహాయం చేస్తుంది, అక్కడినుండి ఆ వాయువు శ్వాస వదిలినప్పుడు బయటికి వచ్చేస్తుంది.
ఎర్ర రక్తకణాల్లోని మరో ముఖ్యమైన భాగం దాన్ని కప్పి ఉంచే కణజాలము అనబడే పైపొర. మీ ఎర్ర రక్తకణాలు సన్నని రక్తనాళాల్లో ప్రవహిస్తూ శరీరంలోని ప్రతీ అవయవాన్ని పోషించడానికి అనువుగా అద్భుతమైన ఈ పొర కణాలు వ్యాకోచించి సన్నని ఆకృతుల్లోకి మారేందుకు సహాయపడుతుంది.
ఎర్ర రక్తకణాలు, మీ ఎముకల్లోని మూలుగలో తయారుచేయబడతాయి. ఒక్కసారి ఒక కొత్త కణం మీ రక్త ప్రవాహంలోకి ప్రవేశించిందంటే, అది మీ గుండె, శరీరం గుండా దాదాపు 1,00,000 సార్లు ప్రసరించవచ్చు. వేరే కణాలకు భిన్నంగా, ఎర్ర రక్తకణాలకు కేంద్రకం ఉండదు. అందువల్ల, వాటిలో ప్రాణవాయువు తీసుకెళ్ళడానికి మరింత చోటు ఉండడమేకాక అవి తేలికగా కూడా ఉంటాయి, దానివల్ల, మన గుండె శరీరమంతటా కొన్ని లక్షల కోట్ల ఎర్ర రక్తకణాలను ప్రసరింపజేయగలుగుతుంది. అయితే, కేంద్రకం లోపించడంవల్ల అవి తమ అంతర్గత భాగాలను పునరుజ్జీవింపజేసుకోలేవు. ఆ కారణంగా, దాదాపు 120 రోజుల తర్వాత మీ ఎర్ర రక్తకణాలు క్షీణించనారంభించి, తమ స్థితిస్థాపకతను కోల్పోతాయి. భక్షక కణాలనబడే పెద్ద తెల్ల రక్తకణాలు, పాడైపోయిన కణాలను హరించి, ఇనుము పరమాణువులను విడుదల చేస్తాయి. కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండే ఇనుము పరమాణువులు మీ ఎముక మూలుగ దగ్గరికి చేరే అణువులను అంటుకొని ఎముకల్లోని మూలుగల్లోకి చేరతాయి, అక్కడ ఎర్ర రక్తకణాలను తయారుచేయడంలో ఆ పరమాణువులు ఉపయోగపడతాయి. ప్రతీ సెకనుకు మీ ఎముకలలోని మూలుగ 20 నుండి 30 లక్షల ఎర్ర రక్తకణాలను మీ రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది.
మీ శరీరంలో ఉన్న లక్షల కోట్ల ఎర్ర రక్తకణాలు ఉన్నట్టుండి పనిచేయడం మానేస్తే, కొద్ది నిమిషాల్లోనే మీరు మరణిస్తారు. మనం జీవించి ఉండడానికి, జీవితాన్ని ఆనందించడానికి తోడ్పడే ఈ అద్భుత సృష్టి కోసం మనం యెహోవాకు ఎంత కృతజ్ఞత చూపించాలో కదా! కీర్తనకర్త అన్న ఈ మాటలతో మీరు తప్పక అంగీకరిస్తారు: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.”—కీర్తన 139:1, 14. (g 1/06)
[30వ పేజీలోని డయాగ్రామ్]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఎర్ర రక్తకణం
కణజాలము
హిమోగ్లోబిన్ (పెద్దదిగా చేయబడినది)
ప్రాణవాయువు