ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?
ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?
రాబోయే 10, 20 లేక 30 సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఉగ్రవాదం విస్తృతంగా ఉన్న ఈ కాలంలో భవిష్యత్తు గురించి ఆలోచించాలంటేనే భయమేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన అభివృద్ధి చెందుతోంది. ప్రపంచీకరణ అనేక దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడేలా చేసింది. ప్రపంచ నాయకులు ఐక్యమై ఉజ్జ్వల భవిష్యత్తుకు బాట వేస్తారా? వేస్తారనే కొందరంటున్నారు, 2015 కల్లా నాయకులు పేదరికాన్నీ ఆకలిమంటల్నీ అరికట్టగలుగుతారని, ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించగలుగుతారని, సురక్షితమైన త్రాగే నీరు, పారిశుధ్య సౌకర్యాలు లేని వారి సంఖ్యను సగానికి తగ్గించగలరని వారు ఆశిస్తున్నారు.—“ఆశావాదం-వాస్తవరూపం” అనే బాక్సు చూడండి.
అయితే, భవిష్యత్తు గురించిన మానవుని తలంపు తరచూ కేవలం ఊహగానే నిరూపించబడింది. ఉదాహరణకు, దశాబ్దాల క్రితం ఒక నిపుణుడు, 1984కల్లా రైతులు నీటి అడుగున వాడే ట్రాక్టర్లతో సముద్ర గర్భాన్ని దున్నుతారని చెప్పాడు; 1995కల్లా కార్లు ఒకదాన్నొకటి ఢీకొనకుండా అవి కంప్యూటరైజ్డ్ హార్డ్‌వేర్‌తో రూపొందించబడతాయని మరొక వ్యక్తి చెప్పాడు; 2000కల్లా దాదాపు 50,000 మంది అంతరిక్షంలో నివసిస్తూ, పనిచేస్తూ ఉంటారని మరొకరు జోస్యం పలికారు. అయితే, అలాంటి జోస్యాలు పలికినవారు తాము మౌనంగా ఉండాల్సిందని బహుశా ఇప్పుడు అనుకుంటుండవచ్చు. ఒక విలేఖరి ఇలా వ్రాశాడు: “లోకంలోని తెలివైన ప్రజల్ని ఒట్టి మూర్ఖుల్లా కనిపించేలా చేయడంలో, గడిచే కాలాన్ని మించినది మరొకటి లేదు.”
మనకు నిర్దేశాన్నిచ్చే “రేఖాపటం”
ప్రజలు భవిష్యత్తు గురించి అనంతంగా ఊహాగానాలు చేస్తారు, కానీ కొన్నిసార్లు వాళ్ళ దృక్కోణం వాస్తవానికి దూరంగా కల్పనకు దగ్గరగా ఉంటుంది. భవిష్యత్తు గురించిన విశ్వసనీయమైన దృక్కోణం కోసం మనమెటువైపు చూడవచ్చు?
ఒక దృష్టాంతాన్ని పరిశీలించండి. మీరు పరాయి దేశంలో, బస్సులో ప్రయాణిస్తున్నారనుకుందాం. అది మీకు తెలిసిన ప్రాంతం కాదు కాబట్టి, మీరిలా కంగారుపడతారు: ‘నేనిప్పుడు ఎక్కడున్నాను? ఈ బస్సు సరైన దిశలోనే వెళ్తోందా? నేను గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాను?’ ఖచ్చితమైన రేఖాపటాన్ని సంప్రదించడం ద్వారా, కిటికీలో నుండి కనిపిస్తున్న గుర్తులను చూడడం ద్వారా మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు.
నేడు భవిష్యత్తు గురించి తలచుకుని కలవరపడే అనేకుల పరిస్థితి అలాగే ఉంది. ‘మనమెటు వెళ్తున్నాం? మనం నిజంగానే ప్రపంచశాంతి దిశగా వెళ్తున్నామా? అలాగైతే, మనమా గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం?’ అని వాళ్ళు ఆలోచిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం పొందడానికి మనకు సహాయం చేయడంలో బైబిలు ఒక రేఖాపటంలా పనిచేస్తుంది. దాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా, మన “కిటికీ” వెలుపల, ప్రపంచంలో
ఏమి జరుగుతోందో జాగ్రత్తగా గమనించడం ద్వారా మనం ఎక్కడున్నాం, ఎటు వెళ్తున్నాం అనే విషయాల గురించి ఎంతో తెలుసుకోవచ్చు. అయితే మొదట మనం మన సమస్యలు ఎలా ప్రారంభమయ్యాయో పరిశీలించాలి.ఒక విషాదకరమైన ప్రారంభం
దేవుడు మొదటి స్త్రీపురుషులను సృష్టించినప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారనీ, ఆయన వాళ్ళను పరదైసు పరిసరాల్లో ఉంచాడనీ బైబిలు చెబుతోంది. ఆదాముహవ్వలు కేవలం 70 లేక 80 సంవత్సరాలపాటు కాదు గానీ నిరంతరం జీవించేలా సృష్టించబడ్డారు. దేవుడు వారికిలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” ఆదాముహవ్వలు, వారి సంతానం పరదైసును భూవ్యాప్తంగా విస్తరింపజేయాలన్నది దేవుని సంకల్పం.—ఆదికాండము 1:28; 2:8, 15, 22.
ఆదాముహవ్వలు దేవునిపై తిరుగుబాటు చేశారు. ఫలితంగా వాళ్ళు తమ పరదైసు గృహాన్ని కోల్పోయారు. అంతకంటే ముఖ్యంగా, వాళ్ళు నెమ్మదిగా, క్రమేణా, శారీరకంగా మానసికంగా క్షీణించిపోవడం ప్రారంభించారు. ఆదాముహవ్వలు రోజులు గడిచేకొద్దీ మరణానికి ఒక్కొక్క అడుగు దగ్గరయ్యారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు తమ సృష్టికర్తకు ఎదురుతిరగడం ద్వారా పాపం చేశారు, “పాపమువలన వచ్చు జీతము మరణము.”—రోమీయులు 6:23.
ఆదాముహవ్వలు చివరకు మరణించారు, అయితే అంతకంటే ముందు వారు చాలామంది కుమారులను, కుమార్తెలను కన్నారు. ఆ పిల్లలు దేవుని ఆది సంకల్పాన్ని నెరవేర్చగలరా? నెరవేర్చలేరు, ఎందుకంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల అపరిపూర్ణతను వారసత్వంగా పొందారు. వాస్తవానికి, ఒక తరం నుండి మరో తరానికి, అలా ఆదాము సంతానంలోని వారందరూ పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా పొందారు. మనం కూడా పాపమరణాలను అలాగే పొందాము. బైబిలు ఇలా చెబుతోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు రోమీయులు 3:23; 5:12.
ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—ప్రస్తుతం మనమున్న స్థానాన్ని కనుక్కోవడం
ఆదాముహవ్వల తిరుగుబాటుతో ప్రారంభమైన దుర్భరమైన, సుదీర్ఘమైన మానవ ప్రయాణం మన కాలం వరకు కొనసాగింది. ఒక బైబిలు రచయిత చెప్పినట్లుగా, మానవజాతి ‘నాశనమునకు లోనయింది.’ (రోమీయులు 8:20) మానవ పోరాటాన్ని అదెంత చక్కగా వర్ణిస్తుందో కదా! ఆదాము సంతానంలో జ్ఞానవంతులైన శాస్త్రవేత్తలు, వైద్యరంగ మేధావులు, సాంకేతికరంగంలో ప్రవీణులు పుట్టుకొచ్చారు. అయినా, వారిలో ఏ ఒక్కరూ మానవుని కోసం దేవుడు సంకల్పించిన భూవ్యాప్త శాంతిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకురాలేకపోయారు.
ఆదాముహవ్వల తిరుగుబాటు మనందరిపై వ్యక్తిగతంగా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు, అన్యాయానికి గురైతే కలిగే ఆవేదనను, నేరానికి గురవుతామనే భయాన్ని, దీర్ఘకాలిక అనారోగ్యపు బాధను, ప్రియమైనవారు చనిపోతే కలిగే దుఃఖాన్ని మనలో ఎవరం మాత్రం అనుభవించలేదు? జీవితంలో కాస్త ప్రశాంతత ఉందనుకుంటే, ఎంతోకాలం గడవకముందే ఏదో ఒక విషాదంతో అది పటాపంచలైపోతుంది. ఆహ్లాదకరమైన సందర్భాలు ఉన్నా మన ఉనికి, ప్రాచీన పితరుడైన యోబు వర్ణించినట్లే ఉంటుంది, ఆయనిలా అన్నాడు: “నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.”—యోబు 14:1.
మనం ఎక్కడినుండి వచ్చామనే విషయాన్ని, మనమిప్పుడున్న దుఃఖకరమైన పరిస్థితిని పరిశీలిస్తే భవిష్యత్తు నిస్తేజంగా యెషయా 55:10, 11) ఇది త్వరలోనే జరుగుతుందని మనమెందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?
కనిపించవచ్చు. కానీ అలాంటి పరిస్థితులు నిరంతరం కొనసాగడానికి దేవుడు అనుమతించడని బైబిలు మనకు హామీ ఇస్తోంది. నరుల విషయంలో ఆయన మొదట్లో సంకల్పించినది నెరవేరుతుంది. (బైబిలు ప్రకారం, మనమిప్పుడు “అంత్యదినములు” అని పిలువబడే సంక్లిష్టమైన కాలంలో ఉన్నాం. (2 తిమోతి 3:1) ఈ పదం భూగ్రహ అంతాన్ని లేదా దానిపైనున్న జీవరాశి అంతాన్ని సూచించడం లేదు. బదులుగా, “యుగసమాప్తి” అనే దాని భావం, అంటే మనకు దుఃఖం కలిగిస్తున్న పరిస్థితుల అంతమని భావం. (మత్తయి 24:3) అంత్యదినములలో అధికంగా జరిగే సంఘటనల గురించి, ప్రజల్లో ఎక్కువగా కనిపించే లక్షణాల గురించి బైబిలు వర్ణిస్తోంది. వీటిలో కొన్నింటిని 8వ పేజీలోని బాక్సులో గమనించండి, తర్వాత “కిటికీ” వెలుపల ప్రపంచంలో ఏమి జరుగుతోందో చూడండి. మన రేఖాపటమైన బైబిలు, మన ప్రస్తుతస్థానం ఈ విధానాంతానికి దగ్గరగా ఉందని గుర్తించడానికి సహాయం చేస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది?
భవిష్యత్తెలా ఉంటుంది?
ఆదాముహవ్వలు దేవునిపై తిరుగుబాటు చేసిన వెంటనే, ఆయన ‘ఎన్నటికీ నాశనము కాని’ రాజ్యాన్ని స్థాపించాలన్న తన సంకల్పం గురించి వెల్లడిచేయడం ప్రారంభించాడు. (దానియేలు 2:44) సాధారణంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడే ప్రార్థనలో ఆ రాజ్యం కోసమే ప్రార్థించమని అనేకులకు నేర్పించబడింది, ఆ రాజ్యం మానవజాతికి చెప్పలేనన్ని ఆశీర్వాదాలను తెస్తుంది.—మత్తయి 6:9, 10.
దేవుని రాజ్యమంటే హృదయంలో ఉండే ఏదో అస్పష్టమైన తలంపు కాదు. అది భూమిపై అసాధారణ ప్రభావం చూపించే నిజమైన పరలోక ప్రభుత్వం. దేవుడు తన రాజ్యం ద్వారా మానవుల కోసం ఏమి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడో పరిశీలించండి. మొట్టమొదటగా, దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజే[స్తాడు]” అని బైబిలు చెబుతోంది. (ప్రకటన 11:18) ఆయనకు విధేయత చూపించే వారికోసం ఆయనేమి చేస్తాడు? “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని ఆయన లిఖిత వాక్యం చెబుతోంది. (ప్రకటన 21:4) ఆ మార్పులను ఏ మానవుడు తీసుకురాగలడు? దేవుడు మాత్రమే తాను మొదట్లో మానవజాతి కోసం సంకల్పించిన పరిస్థితికి మనల్ని తీసుకురాగలడు.
దేవుని రాజ్యం తీసుకువచ్చే ఆశీర్వాదాల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు? యోహాను 17:3 ఇలా చెబుతోంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” సరిగ్గా అది చేయడానికే ప్రజలకు సహాయం చేస్తున్న ప్రపంచవ్యాప్త విద్యా కార్యక్రమంలో యెహోవాసాక్షులు పాల్గొంటున్నారు. వారి పరిచర్య దాదాపు 230 దేశాల్లో కొనసాగుతోంది, వారి సాహిత్యాలు 400 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురించబడుతున్నాయి. మీరింకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, స్థానిక యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలో ఇవ్వబడిన తగిన చిరునామాకు వ్రాయండి. (g 1/06)
[6వ పేజీలోని బ్లర్బ్]
“నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు.”—యాకోబు 4:13, 14
[6వ పేజీలోని బ్లర్బ్]
బైబిలు మన చరిత్రను మొదటి స్త్రీపురుషుల వరకు తెలియజేస్తోంది. అలా అది మనమెక్కడినుండి వచ్చామో చెబుతుంది. మనమెటు వెళ్తున్నామో కూడా అది సూచిస్తుంది. కానీ బైబిలు మనకేమి చెబుతోందో అర్థం చేసుకోవడానికి, మనం దాన్ని ఒక రేఖాపటాన్ని అధ్యయనం చేసినట్లుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
[7వ పేజీలోని బ్లర్బ్]
“పాపం” అనేది ఒక చెడు కార్యాన్ని లేదా చెడు చేయడానికి మొగ్గుచూపే ఒక స్థితిని సూచిస్తుంది. మనం పాపంలో జన్మించాము, అది మన చర్యలను ప్రభావితం చేస్తుంది. “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.”—ప్రసంగి 7:20
[8వ పేజీలోని బ్లర్బ్]
నల్లచుక్క ఉన్న ఒక కాగితాన్ని మనం జిరాక్సు తీయవలసివస్తే, అన్ని కాపీల మీదా ఆ నల్లచుక్క వస్తుంది. సూచనార్థకంగా చెప్పాలంటే ఆ కాపీల్లాంటి, ఆదాము సంతానమైన మనపై పాపమనే మరక ఉంది. “అసలు ప్రతి” అయిన ఆదాముమీద కూడా అదే మరక పడింది
[8వ పేజీలోని బ్లర్బ్]
“తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 10:23) ప్రపంచ శాంతి సాధించాలన్న మానవుని ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయో ఇది వివరిస్తుంది. మానవుడు దేవుని నడిపింపు లేకుండా ‘తన మార్గమును ఏర్పరచుకునేలా’ సృష్టించబడలేదు.
[9వ పేజీలోని బ్లర్బ్]
కీర్తనకర్త దేవునితో ఇలా అన్నాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:105) మనం నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా అడుగులు వేయడానికి బైబిలు ఒక దీపములా మనకు సహాయం చేస్తుంది. మానవజాతి భవిష్యత్తు ఎలా ఉంటుందో గ్రహించడానికి, అది ‘మన త్రోవకు వెలుగులా,’ మార్గాన్ని కాంతిమయం చేస్తుంది
[7వ పేజీలోని బాక్సు]
ఆశావాదం-వాస్తవరూపం
2000 సెప్టెంబరులో, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా, 2015 కల్లా సాధించవలసిన కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాయి. వాటిలో కొన్ని:
◼ రోజుకు ఒక డాలరుకన్నా తక్కువ రాబడిపై జీవిస్తూ, ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్యను సగానికి తగ్గించడం.
◼ పిల్లలందరూ ప్రాథమిక విద్య ముగించేలా చూడడం.
◼ అన్ని విద్యా స్థాయిల్లోనూ లింగ అసమానతను రూపుమాపడం.
◼ ఐదేళ్ళలోపు పిల్లల మరణ రేటును 66 శాతం వరకు తగ్గించడం.
◼ తల్లుల మరణ రేటును 75 శాతం వరకు తగ్గించడం.
◼ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తిని, అలాగే మలేరియా వంటి ఇతర ప్రధాన రోగాలు సోకడాన్ని నిరోధించడం, అవి వ్యాపించడాన్ని తగ్గించడం.
◼ సురక్షితమైన త్రాగునీటి సదుపాయంలేని ప్రజల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించడం.
ఈ లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ప్రపంచమంతటి నుండి వచ్చిన ఆరోగ్య అధికారుల బృందం, 2004లో పరిస్థితిని పునఃసమీక్షించిన తర్వాత, సాధించబడాలని ఆశించబడుతున్నవి నిజంగా జరుగుతున్నవాటిని ప్రతిబింబించడం లేదనే గ్రహింపుతో, ఆశావాద తీవ్రతను తగ్గించుకోవాలనే నిర్ధారణకు వచ్చింది. స్టేట్ ఆఫ్ ద వరల్డ్ 2005 అనే పుస్తకంలోని ముందుమాట ఇలా నివేదిస్తోంది: “అనేక ప్రాంతాల్లోని అభివృద్ధిని పేదరికం కుంటుపరుస్తోంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వంటి వ్యాధులు అంతకంతకూ అధికమవుతూ అనేక దేశాల్లో ప్రజారోగ్యానికి టైమ్ బాంబుల్లా తయారవుతున్నాయి. గత ఐదేళ్లలో, దాదాపు రెండు కోట్లమంది పిల్లలు నివారించదగిన, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల మూలంగా మరణించారు, కోట్లాదిమంది శుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు లేక అనుదినం దుర్భరమైన, అపరిశుభ్రమైన జీవన విధానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.”
[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
“అంత్యదినముల” గురించిన కొన్ని అంశాలు
ముందెన్నడూ లేనంతగా యుద్ధాలు.—మత్తయి 24:7; ప్రకటన 6:4
కరవు.—మత్తయి 24:7; ప్రకటన 6:5, 6, 8
తెగుళ్ళు.—లూకా 21:11; ప్రకటన 6:8
విస్తరిస్తున్న అక్రమము.—మత్తయి 24:12
భూమిని నాశనం చేయడం.—ప్రకటన 11:18
గొప్ప భూకంపాలు.—లూకా 21:11
అపాయకరమైన కాలములు.—2 తిమోతి 3:1
మితిమీరిన ధనాపేక్ష.—2 తిమోతి 3:2
తల్లిదండ్రులకు అవిధేయత.—2 తిమోతి 3:2
అనురాగరాహిత్యం.—2 తిమోతి 3:3
దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడం.—2 తిమోతి 3:4
అజితేంద్రియత.—2 తిమోతి 3:3
సజ్జనద్వేషం.—2 తిమోతి 3:3
రానున్న ప్రమాదాన్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకపోవడం.—మత్తయి 24:39
అపహాసకులు అంత్యదినాల గురించిన రుజువులను నిరాకరించడం.—2 పేతురు 3:3, 4
భూవ్యాప్తంగా జరిగే దేవుని రాజ్యప్రకటన.—మత్తయి 24:14
[చిత్రసౌజన్యం]
© G.M.B. Akash/Panos Pictures
© Paul Lowe/Panos Pictures
[9వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారిగా పేరుగాంచారు