కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘చనిపోకముందు నాకుదేవుని సేవచేయాలనుంది’

‘చనిపోకముందు నాకుదేవుని సేవచేయాలనుంది’

‘చనిపోకముందు నాకుదేవుని సేవచేయాలనుంది’

మామీ ఫ్రీ కథ

లైబీరియాలో 1990లో పౌర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం తీవ్రతరమయ్యేసరికి, క్రాన్‌ తెగకు చెందిన 12 సంవత్సరాల మామీ, ఆమె కుటుంబం రాజధాని నగరమైన మన్రోవియాలోని తమ ఇంట్లో చిక్కుకుపోయారు. మామీ ఇలా చెబుతోంది: “మాకు పక్కింట్లోనుండి విస్ఫోటనం వినిపించింది. ఆ ఇంట్లోకి ఒక క్షిపణి దూసుకురావడంతో ఆ ఇంటికి నిప్పంటుకుంది. జ్వాలలు మా ఇంటివైపు వ్యాపించడంతో మా ఇంటికి కూడా నిప్పంటుకుంది.” యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా మామీ, వాళ్ళమ్మ, వాళ్ళమ్మ తమ్ముడు తప్పించుకుని పారిపోవడం మొదలుపెట్టారు.

“హఠాత్తుగా నాకేదో తగిలింది” అని మామీ గుర్తుచేసుకుంటోంది.

అప్పుడు మా అమ్మ “ఏమైంది?” అని అడిగింది.

“నాకేదో తగిలింది! తూటా అనుకుంటా,” అని నేను సమాధానమిచ్చాను.

మామీ విపరీతమైన బాధతో క్రిందపడిపోయి ఇలా ప్రార్థించింది: “దేవా, నా మొర ఆలకించు. నేను చనిపోతానేమో, కానీ చనిపోకముందు నాకు నీ సేవ చేయాలనుంది.” ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది.

మామీ చనిపోయిందనుకుని పొరుగువారు ఆమెను దగ్గర్లోని సముద్ర తీరంలో పాతిపెట్టాలనుకున్నారు. అయితే, మామీ వాళ్లమ్మ మాత్రం ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్దామని పట్టుబట్టింది. విచారకరంగా, అధికసంఖ్యలో తీసుకురాబడుతున్న క్షతగాత్రులైన స్త్రీపురుషులకు, పిల్లలకు చికిత్స చేయడానికి తగిన సదుపాయాలు ఆ ఆసుపత్రిలో లేవు. గాయపడిన మామీ మామయ్య ఆ రాత్రి మరణించాడు గానీ మామీ బ్రతికింది, ఆమె శరీరం నడుం నుండి క్రిందికి చచ్చుబడిపోయింది.

ఆమెకు లోపల రక్తస్రావమై విపరీతమైన నొప్పి వచ్చింది. నాలుగు నెలల తర్వాత వైద్యులు ఎక్స్‌రేలు తీసి చివరికి తూటా ఎక్కడుందో కనిపెట్టారు. అది ఆమె గుండెకు, ఊపిరితిత్తులకు మధ్య ఉంది. శస్త్రచికిత్స చేయడం ప్రమాదకరం, కాబట్టి మామీ వాళ్ళమ్మ ఆమెను మూలికా వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళింది. మామీ ఇలా గుర్తుచేసుకుంటోంది: “అతడు ఒక బ్లేడుతో కోసి, ఆ గాయం దగ్గర నోరు పెట్టి తూటాను తన నోట్లోకి పీల్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన నోట్లో నుండి ఒక తూటా బయటికి తీసి ‘ఇదిగో వచ్చేసింది’ అన్నాడు. మేము అతడికి డబ్బు చెల్లించి వచ్చేశాం.”

కానీ ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు. తూటా ఇంకా అక్కడే ఉందని తర్వాత తీసిన ఎక్స్‌రేలు చూపించాయి. దానితో మామీ, వాళ్ళమ్మ మళ్లీ మూలికా వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, తూటా తీసేసినట్లు ఎక్స్‌రేలో తెలియాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలని అతడు వాళ్ళను నమ్మించాడు. వాళ్ళు ఇంటికి తిరిగివచ్చి, ఓర్పుగా ఎదురుచూశారు. ఈలోగా, నొప్పి భరించడానికి మామీ వివిధరకాల మందులు తీసుకుంది. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ చాలా ఎక్స్‌రేలు తీశారు. తూటా ఇంకా అలాగే ఉంది. మూలికా వైద్యుడు పరారయ్యాడు.

తూటా అప్పటికి 18 నెలలుగా మామీ శరీరంలో ఉంది. ఒక బంధువు ఆమెను భూతవైద్యురాలి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె సహాయం చేసే బదులు, ఫలానా రోజున మామీగానీ వాళ్ళమ్మగానీ చనిపోతారని చెప్పింది. మామీకి అప్పటికి 13 సంవత్సరాలు. “నేను బాగా ఏడ్చాను. కానీ, భూతవైద్యురాలు చెప్పిన తేదీ వచ్చినా మా ఇద్దరిలో ఎవరమూ చనిపోలేదు” అని మామీ చెబుతోంది.

ఆ తర్వాత మామీ వాళ్ల చిన్నాన్న ఆమెను ఒక చర్చి నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు, అతడు తనకు వచ్చిన ఒక కల, మామీ పక్షవాతానికి కారణం తూటా కాదుగానీ ఒక మంత్రమని తనకు తెలియజేసిందని చెప్పాడు. మామీ తాను చెప్పిన ఆచారాలను పాటిస్తే, ఒక వారంలోనే ఆమె తిరిగి నడవగలుగుతుందని అతడు హామీ ఇచ్చాడు. మామీ ఇలా వివరిస్తోంది: “నేను సముద్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశాను, ఉపవాసాలున్నాను, అర్థరాత్రుల్లో నేలమీద అంగప్రదక్షిణాలు చేశాను, మొత్తం ఎన్నో గంటలపాటు అలా చేసివుంటాను. కానీ ఆ ప్రయాసలన్నీ వ్యర్థమయ్యాయి, నా పరిస్థితిలో మార్పులేదు.”

అయితే చివరికి మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, ఎట్టకేలకు మామీ తూటా తీయించేసుకోగలిగింది. ఆమె రెండు సంవత్సరాల కంటే ఎక్కువకాలంపాటు తీవ్రమైన నొప్పి భరించింది. ఆమె ఇలా గుర్తు చేసుకుంటోంది: “శస్త్రచికిత్స తర్వాత, నొప్పి తగ్గిపోయింది, శ్వాస తీసుకోవడం సులభమైంది. నాకు పాక్షికంగా పక్షవాతం అలాగే ఉన్నా, వాకర్‌ సహాయంతో నిలబడగలుగుతున్నాను.”

మామీ యెహోవాసాక్షులను కలవడం

శస్త్రచికిత్స జరిగిన కొన్ని వారాల తర్వాత, మామీ వాళ్లమ్మ ఇద్దరు యెహోవాసాక్షులను కలిసింది. తన కూతురికి బైబిలు చదవడమంటే ఇష్టమని తెలిసిన ఆమె, సాక్షులను ఇంటికి ఆహ్వానించింది. మామీ వెంటనే బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. అయితే, కొన్ని నెలల తర్వాత, ఆమె తిరిగి హాస్పిటల్‌కు వెళ్ళడంతో, సాక్షులతో సంప్రదింపులు లేకుండా పోయాయి.

అయినా, బైబిలు జ్ఞానం సంపాదించుకోవాలన్న మామీ కోరిక అలాగే ఉంది. కాబట్టి, ఒక చర్చికి చెందిన మతనాయకుడు సహాయం చేయడానికి ముందుకు రావడంతో ఆమె అంగీకరించింది. సండే స్కూల్‌లో, ఒక తోటి విద్యార్థి టీచర్‌ను ఇలా అడిగాడు, “యేసు దేవునితో సమానుడా?”

“అవును, వాళ్ళిద్దరూ సమానులే. కానీ యేసు దేవునితో పూర్తిగా సమానుడు కాదు” అని టీచర్‌ చెప్పాడు.

మామీ ఇలా ఆలోచించింది, ‘పూర్తిగా సమానుడు కాదా? అది సమంజసంగా లేదే. ఇక్కడేదో పొరపాటు ఉంది.’ మామీ తాను బైబిలు సత్యం తెలుసుకుంటున్నానన్న సంతృప్తి కలుగక, ఆ చర్చితో సహవసించడం మానేసింది.

1996లో మన్రోవియాలో మళ్ళీ దౌర్జన్యం తలెత్తింది. మామీ కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరు మరణించారు, వాళ్ల ఇంటికి రెండోసారి నిప్పంటుకుంది. కొన్ని నెలల తర్వాత, ఇద్దరు సాక్షులు ఇంటింటి పరిచర్య చేస్తూ మామీని కలిశారు. మామీ తన బైబిలు అధ్యయనం పునఃప్రారంభించింది. ఆమె మొదటిసారి కూటాలకు హాజరైనప్పుడు, సంఘ పెద్దలతో సహా ప్రతీ ఒక్కరూ రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో భాగం వహించడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అదే సంవత్సరంలో జరిగిన “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో ఒకదానికి ఆమె హాజరై ఎంతో సంతోషించింది, అదే ఆమె హాజరైన మొట్టమొదటి యెహోవాసాక్షుల అతిపెద్ద సమావేశం.

మామీ ఇలా చెబుతోంది: “నేను చాలా ప్రభావితురాలినయ్యాను. సాక్షులు వివిధ తెగలకు చెందినవారైనా వారికి ఒకరిపై ఒకరికి నిజమైన ప్రేమ ఉంది. అంతా చక్కగా సంస్థీకరించబడింది.”

దేవుని సేవ చేయాలన్న ఆమె కోరిక నెరవేరడం

1998లో మళ్ళీ ప్రారంభమైన పోరాటం మూలంగా మామీ, వాళ్ళమ్మ పొరుగునున్న కోటె డి ఐవరీకి పారిపోయి, అక్కడ వారు మరో 6,000 మంది ఇతర లైబీరియన్‌లతోపాటు పీస్‌ టౌన్‌ శరణార్థి శిబిరంలో నివాసం ఏర్పరచుకున్నారు. మామీ సాక్షులతో బైబిలు అధ్యయనం కొనసాగించి, త్వరితగతిన ప్రగతి సాధించింది. త్వరలోనే ఆమె తన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుకుంది. ఆమె బహిరంగ పరిచర్యలో భాగం వహించగలిగేలా ఆమె ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు చక్రాల కుర్చీలో ఆమెను తీసుకువెళ్ళడం ద్వారా ఆమెకు సహాయం చేశారు. ఈ విధంగా మామీ చాలామంది ఇతర శరణార్థులకు చక్కని సాక్ష్యమివ్వగలిగింది.

మామీ తన శారీరక ఇబ్బందుల మూలంగా, తన ఇంటినుండి ఆరు కిలోమీటర్ల దూరంలోవున్న రాజ్యమందిరానికి చేరుకోవడం కష్టమైనా, అన్ని కూటాలకు హాజరయ్యేది. ప్రత్యేక సమావేశదినానికి హాజరై దేవునికి తాను చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించడానికి 2000, మే 14న ఆమె 190 కిలోమీటర్లకంటే ఎక్కువదూరం ప్రయాణించింది. (మత్తయి 28:​19, 20) ఎంతోమంది ఆనందబాష్పాలతో చూస్తుండగా, సహోదరులు మామీని చిన్న వాగులోకి మోసుకువెళ్ళి, బాప్తిస్మం ఇచ్చారు. నీటిలో నుండి పైకి వస్తుండగా ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

ఇప్పుడు ఘానాలోని శరణార్థి శిబిరంలోవున్న మామీకి, పూర్తికాల సువార్తికురాలిగా క్రమ పయినీరు సేవ చేయాలన్నది లక్ష్యం. మామీ వాళ్ళమ్మ కూడా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించి, తాను తెలుసుకుంటున్న విషయాలను ఇప్పుడు ఇతరులతో పంచుకుంటోంది. దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన, ‘కుంటివారు దుప్పివలె గంతులువేసే, మూగవారి నాలుక పాడే’ సమయం కోసం వాళ్ళిద్దరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.​—యెషయా 35:​5-7. (g 3/06)

[20వ పేజీలోని చిత్రం]

మామీ శరీరంలో నుండి తీయబడిన తూటా

[21వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం ఇవ్వడానికి మామీని వాగులోకి మోసుకువెళ్ళడం

[21వ పేజీలోని చిత్రం]

తన తల్లి ఇమ్మాతో బైబిలు అధ్యయనం చేయడం