కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

థేమ్స్‌ నది ఇంగ్లాండ్‌వారి ప్రత్యేక స్వాస్థ్యం

థేమ్స్‌ నది ఇంగ్లాండ్‌వారి ప్రత్యేక స్వాస్థ్యం

థేమ్స్‌ నది ఇంగ్లాండ్‌వారి ప్రత్యేక స్వాస్థ్యం

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

ఓల్డ్‌ ఫాదర్‌ థేమ్స్‌ అని అప్యాయంగా పిలువబడే థేమ్స్‌ నది దక్షిణ మధ్య ఇంగ్లాండ్‌లోని ఆకర్షణీయమైన కాట్స్‌వాల్డ్‌ కొండల నుండి ప్రవహించే నాలుగు ప్రధానవాగుల్లో నుండి పుట్టింది. అది 350 కిలోమీటర్ల దూరం వరకు వంపులు తిరుగుతూ తూర్పువైపు ప్రవహిస్తున్నప్పుడు వేరే నదులు వచ్చి దానిలో చేరతాయి, అది దాదాపు 29 కిలోమీటర్ల వెడల్పైన నదీముఖంగుండా చివరికి ఉత్తర సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఈ చిన్న నది ఇంగ్లాండ్‌వారి చరిత్రను ఎలా మలచిందనేది ఆసక్తికరమైన కథ.

దాదాపు సా.శ.పూ. 55లో మొదటిసారిగా రోమా సైన్యం జూలియస్‌ సీజర్‌ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌పై ముట్టడి వేసింది. మరుసటి సంవత్సరం ఆయన తిరిగి వచ్చినప్పుడు థేమ్స్‌ నదికి టమీసీస్‌ అని పేరుపెట్టాడు, ఆ నది ఆయనను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకట్టగా నిలిచింది. 90 సంవత్సరాల తర్వాతే రోమా చక్రవర్తియైన క్లాడియస్‌ ఆ దేశాన్ని వశపరచుకున్నాడు.

ఆ కాలంలో థేమ్స్‌ నదికి ఇరువైపులా చిత్తడినేల ఉండేది, కానీ నదీముఖం నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో నదిలోకి పోటు నీళ్ళు ప్రవేశించే స్థలంలోనే కొంతకాలం తర్వాత, రోమా సైన్యం చెక్క వంతెన నిర్మించింది. అక్కడ, ఆ నది ఉత్తర తీరాన లొన్‌డినియమ్‌ * అనే రేవును నిర్మించింది.

తర్వాతి నాలుగు శతాబ్దాల వరకు రోమన్‌లు ఐరోపాలోని ఇతర ప్రదేశాలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు. మధ్యధరా ప్రాంతంనుండి విలాస వస్తువులు, లెబానోను నుండి కలప కూడా దిగుమతి చేసుకున్నారు. తీరానికి దూరంలో ఉన్న ప్రాంతాలనుండి సరుకును లండన్‌కు చేరవేయడానికి కూడా థేమ్స్‌ నదిని ఉపయోగించారు. అందువల్ల మంచి రోడ్డు వ్యవస్థీకరణ ఉన్న లండన్‌ నగరం ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారింది.

విలియమ్‌ ద కాంకరర్‌ పరిపాలనా ప్రభావం

రోమన్‌ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత, సా.శ. 410లో రోమా సైన్యాలు బ్రిటన్‌ను, లండన్‌ను వదిలివెళ్ళిపోయాయి. దాంతో థేమ్స్‌ నదిపై జరిగే వర్తకం కూడా క్షీణించింది. అప్పుడు, లండన్‌కు 19 కిలోమీటర్ల దూరంలో, థేమ్స్‌ నదిని కాలినడకన దాటగలిగే కింగ్‌స్టన్‌ అనే స్థలంలో ఆంగ్లో సాక్సోన్‌ రాజులకు కిరీటధారణ జరిగింది. 11వ శతాబ్దంలో విలియమ్‌ ద కాంకరర్‌ రాజు నోర్మాండీపై దండెత్తేవరకు వారే పరిపాలించారు. 1066లో వెస్ట్‌మిన్స్‌టర్‌లో విలియమ్‌ ద కాంకరర్‌ రాజు పట్టాభిషేకం జరిగాక, వర్తకుల సమాజంపై అధికారం చెలాయిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి అలాగే రేవులోనికి ప్రవేశాన్ని నియంత్రించడానికి, ఆయన రోమన్‌లు నిర్మించిన ఆ నగరపు గోడల లోపలే టవర్‌ ఆఫ్‌ లండన్‌ను నిర్మించాడు. వర్తకం మళ్ళీ వర్ధిల్లి, లండన్‌లో జనాభా 30,000లకు పెరిగింది.

విలియమ్‌ ద కాంకరర్‌, లండన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో పశ్చిమదిక్కునున్న సున్నపురాతి గుట్టపై, నేడు విండ్సర్‌గా పిలువబడుతున్న సైనిక దుర్గాన్ని కూడా కట్టాడు. అది పూర్వం సాక్సన్‌వారి రాజభవనం ఉన్న స్థలంలో నిర్మించబడింది. ఆ కోటలోనుండి చూస్తే థేమ్స్‌ నది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దానిలో అనేక అదనపు కట్టడాలు నిర్మించబడి, ఎన్నోసార్లు మార్పులు చేయబడిన తర్వాత ఉద్భవించిన విండ్సర్‌ కాసిల్‌, నేడు బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలాల్లో ఒకటిగా ఉంది.

ఐరోపాలోని మొట్టమొదటి రాతి వంతెన నిర్మాణానికి సంబంధించిన 30 సంవత్సరాల ప్రాజెక్ట్‌ 1209లో పూర్తైంది. అది లండన్‌లోని థేమ్స్‌ నదిపై నిర్మించబడింది. ఆ వంతెనపై దుకాణాలు, గృహాలు, ఒక ప్రార్థనాలయం కూడా నిర్మించబడ్డాయి, అసాధారణమైన ఆ నిర్మాణానికి రెండు డ్రాబ్రిడ్జిలు (నదులలో ఓడలు పోవడానికి వీలుగా పైకి ఎత్తబడగల వంతెనలు), రక్షణ కొరకు దక్షిణాన సౌత్‌వార్క్‌లో ఒక కోట కూడా ఉన్నాయి.

1215లో థేమ్స్‌ నదీతీరానున్న విండ్సర్‌ దగ్గర్లో ఉన్న రన్నీమీడ్‌ జిల్లాలో, ఇంగ్లాండ్‌ రాజైన జాన్‌ (1167-​1216) తన ప్రసిద్ధమైన మాగ్నా కార్టా అనే హక్కుల పత్రంపై ఆమోదముద్ర వేశాడు. ఈ చట్టం ద్వారా ఆయన ఆంగ్లేయులకు పౌర హక్కులకు సంబంధించిన హామీ ఇవ్వాల్సివచ్చింది, అంతేకాక, ప్రత్యేకంగా లండన్‌ నగరానికి స్వేచ్ఛలు, ఆ నగరంలోని రేవుకు, వర్తకులకు వాణిజ్య స్వేచ్ఛ వంటి హామీలు కూడా ఇవ్వాల్సివచ్చింది.

సమృద్ధిని తెచ్చిన థేమ్స్‌

ఆ తర్వాతి శతాబ్దాల్లో థేమ్స్‌ నదిపై వ్యాపారం బాగా వృద్ధిచెందింది. అందువల్ల కొంతకాలానికి, నది తీరంలో ఉన్న సౌకర్యాలు సరిపోలేదు. రెండు వందల సంవత్సరాల క్రితం, థేమ్స్‌ నదిపై కేవలం 600 నౌకలను మాత్రమే నిలబెట్టడానికి స్థలముండగా, కొన్నిసార్లు దాదాపు 1,775 నౌకలు తమ వర్తక సామగ్రిని దించడానికి రేవులో నిలిచి ఉండేవి. ఈ స్థలాభావంవల్ల దొంగతనం ఒక గంభీరమైన సమస్యగా మారింది. దొంగలు నౌకలను దోచుకోవడానికి రాత్రివేళ్లలో వాటి లంగర్లను తీసేసేవారు, చిన్న పడవలు ఉన్నవారు థేమ్స్‌ నదిపై దొంగిలించిన సరుకును రవాణా చేయడం ద్వారా జీవనోపాధి సంపాదించుకునేవారు. ఈ సమస్యను అరికట్టడానికి, లండన్‌వారు ప్రపంచంలోని మొట్టమొదటి నదీ పోలీసు దళాన్ని స్థాపించారు. అది ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది.

కానీ, రేవు సౌకర్యాలపై కలుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి, 19వ శతాబ్దంలో, నదికి ఇరువైపులా ఉన్న పల్లపు ప్రాంతాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఎన్‌క్లోజ్డ్‌ డాక్‌ వ్యవస్థను (కృత్రిమ జలాశయ వ్యవస్థ) నిర్మించడానికి ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌ అంగీకరించింది. 1800 తొలిభాగంలో, ద సర్రే కమర్షియల్‌ డాక్స్‌, ద లండన్‌ డాక్‌, ద వెస్ట్‌ ఇండియా డాక్‌, ద ఈస్ట్‌ ఇండియా డాక్‌ల నిర్మాణం పూర్తి కాగా, 1855లో ద రాయల్‌ విక్టోరియా డాక్‌, 1880 లో ద రాయల్‌ ఆల్బర్ట్‌ డాక్‌ల నిర్మాణం పూర్తయ్యింది.

ఇంజనీర్లైన మార్క్‌ ఐ. ఇసాంబార్డ్‌, కె. బ్రూనెల్‌ అనే తండ్రీ కొడుకులు, 1840లో ప్రపంచంలోని మొట్టమొదటి నీటిక్రింద సొరంగాన్ని నిర్మించి, థేమ్స్‌ నది రెండు తీరాలను కలిపారు. అది 459 మీటర్ల పొడవు ఉంటుంది. అది ఇప్పటికీ గ్రేటర్‌ లండన్‌లోని భూగర్భ రైల్వే వ్యవస్థలో భాగంగా ఉపయోగించబడుతోంది. 1894లో నేడు ఆధునిక పర్యాటక ఆకర్షణగా ఉన్న టవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయబడింది. మధ్యకు ఎత్తబడగల సౌకర్యం ఉన్న ఈ బ్రిడ్జి పెద్ద నౌకలు వెళ్ళడానికి అనుకూలంగా 76 మీటర్ల మార్గాన్ని వదలగలదు. మీరు దాదాపు 300ల మెట్లు ఎక్కితే పాదచారుల కోసం మరింత ఎత్తైన స్థలంలో నిర్మించబడిన మార్గానికి వస్తారు, అక్కడినుండి నదిపొడవునా ఉన్న అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.

20వ శతాబ్దం వచ్చేసరికి, నగరంలో జరిగే వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమయ్యే పెద్ద స్టీమర్లు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు, వాటిని నిలపడానికి వీలుగా లండన్‌ డాక్‌ కాంప్లెక్స్‌ సిద్ధం చేయబడింది. 1921 లో జార్జ్‌ V రాజు పేరు పెట్టబడిన చివరి డాక్‌ నిర్మాణం పూర్తయ్యేసరికి, లండన్‌ “ప్రపంచంలోని అత్యంత విశాలమైన, సంపన్నమైన నౌకాశ్రయ వ్యవస్థ”గా మారింది.

రాజభవనాలకు, రాచరికానికి, మహత్తర ప్రదర్శనలకు స్థలాన్ని అందిస్తున్న నది

లండన్‌ అభివృద్ధి చెందుతున్న సమయంలో దాని రోడ్లు మాత్రం సరిగ్గా ఉండేవికావు, శీతాకాలంలో అవి ఉపయోగించలేని స్థితిలో ఉండేవి. కాబట్టి అనేక సంవత్సరాలుగా రద్దీగా ఉండే నీటి మార్గంగా తయారైన థేమ్స్‌ నదే త్వరగా, అతి సులభంగా ప్రయాణించే మార్గంగా మారింది. నది ఒడ్డునుండే మెట్లు పడవలు నడిపేవాళ్లతో కిక్కిరిసి ఉండేవి, వారు “ఓర్స్‌” అనే సుపరిచిత పిలుపునిస్తూ ప్రయాణికుల కోసం కేకలువేసేవారు. వారిని ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు, నదికి ఎగువకిగాని, దిగువకిగాని తీసుకువెళ్ళేవారు లేక ఇప్పుడు అంతరించిపోయి కేవలం వీధులుగానే మిగిలిన వంపులు తిరుగుతూ పారే ఫ్లీట్‌, వాల్‌బ్రూక్‌ అనే ఉపనదుల గుండా వారిని తీసుకువెళ్ళేవారు.

అనతికాలంలో, నదికి ప్రక్కగా, ఎత్తుగా ఉన్న దాని వైభవోపేతమైన రాజభవనాలతో, లండన్‌ కూడా వెనీస్‌ నగరంలాగే కనబడేది. గ్రీన్‌విచ్‌, వైట్‌హాల్‌, వెస్ట్‌మిన్స్‌టర్‌ రాజభవనాలు నది ఒడ్డునే నిర్మించబడడం, థేమ్స్‌ నది తీరాన జీవించడం రాచరికానికి ఒక సూచనగా భావించబడేదని చూపిస్తుంది. అదేవిధంగా, హాంప్టన్‌ కోర్ట్‌ ఇంగ్లాండ్‌లోని రాజులకు, రాణులకు నివాసంగా ఉండేది, నది ఎగువన ఉన్న విండ్సర్‌ కాసిల్‌ ఇప్పటికీ రాజభవనంగానే ఉంది.

1717లో రాజైన జార్జ్‌ I నీటిపై విహారయాత్ర జరిపిన సందర్భంగా అతణ్ణి మెప్పించటానికి జార్జ్‌ ఫ్రెడ్‌రిక్‌ హాండల్‌ “వాటర్‌ మ్యూజిక్‌”ను స్వరకల్పన చేశాడు. రాజుగారి విలాసనావతోపాటు “ఎంత గొప్ప సంఖ్యలో పడవలు వచ్చాయంటే, నదంతా వాటితోనే నిండిపోయినట్లు కనిపించింది” అని ఆనాటి వార్తాపత్రిక నివేదించింది. రాజు ఉన్న నావ పక్కనే మరొక విలాసనావలో 50 మంది సంగీత విద్వాంసులు ప్రయాణించారు. ఆ నావ వెస్ట్‌మిన్స్‌టర్‌కు ఎనిమిది కిలోమీటర్ల ఎగువన ఉన్న చెల్సికు ప్రయాణిస్తుండగా అందులోని సంగీత విద్వాంసులు, హాండల్‌ కూర్చిన స్వరకల్పనను మూడుసార్లు వినిపించారు.

ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించే నది

1740లలో వెస్ట్‌మిన్స్‌టర్‌ బ్రిడ్జి నిర్మించబడేంతవరకు నదిని కాలినడకన దాటేందుకు ఉన్న ఒకే ఒక మార్గం, లండన్‌ బ్రిడ్జి మాత్రమే, దానిని కొంతకాలానికి పునర్నవీకరించి చివరికి 1820లో దాని స్థానంలో వేరేదాన్ని నిర్మించారు. రాళ్ళతో నిర్మించబడిన ప్రాథమిక వంతెనకున్న 19 కమానులకు ఆధారమైన వారధి స్తంభాలు నదీ ప్రవాహానికి గొప్ప అడ్డంకుగా నిలిచాయి. తత్ఫలితంగా, వంతెన ఉనికిలో ఉన్న దాదాపు 600 సంవత్సరాల్లో థేమ్స్‌ నది సుమారు ఎనిమిది సార్లైనా గడ్డకట్టి ఉంటుంది. అలా జరిగినప్పుడు, గడ్డకట్టిన నీటిపై గొప్ప “ఫ్రాస్ట్‌ ఫేర్స్‌” లేక ప్రదర్శనలు ఏర్పాటుచేసేవారు. వాటిలో ఎన్నో ఆటల పోటీలు జరిగేవి. అక్కడ ఎద్దు మాంసాన్ని నిప్పుపై కాల్చేవారు, రాజవంశస్థులు కూడా వచ్చి దానిని తినేవారు. “థేమ్స్‌పై కొన్నవి” అనే ముద్రవున్న పుస్తకాలు, ఆటవస్తువుల అమ్మకాలు బాగా జరిగేవి. ఆ గడ్డకట్టిన నదిపై ఉంచిన ముద్రణా యంత్రాలపై వార్తాసంచికలు, చివరికి ప్రభువు ప్రార్థనా ప్రతులు కూడా అచ్చువేసేవారు!

ఆధునిక కాలాల్లో ఆక్స్‌ఫోర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాల మధ్య జరిగే విశ్వవిద్యాలయ పడవల పోటీ, వసంతకాలంలో జరిగే వార్షికోత్సవ పోటీగా తయారైంది. ఆ పోటీలో పాల్గొనేవారిని ప్రోత్సహించడానికి ప్రజలు, పట్ని నుండి మార్ట్‌లేక్‌ మధ్యనున్న థేమ్స్‌ నదీ తీరాల్లో బారులు తీరి నిలబడతారు. పడవలను నడిపే ఎనిమిదిమంది నావికుల బృందం కేవలం ఇరవై నిమిషాలకంటే తక్కువ సమయంలోనే దాదాపు ఏడు కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటారు. ఇలాంటి మొదటి పోటీ నదికి ఎగువనున్న హెన్లీ పట్టణంలో 1829లో నిర్వహించబడింది. పోటీ నిర్వహించబడే స్థలం నది దిగువ ప్రాంతానికి మార్చబడినప్పుడు, హెన్లీ నగరం రాయల్‌ రిగెటా అనే తమ స్వంత పడవ పోటీని నిర్వహించింది, అది ఇప్పటికీ ఐరోపాలోని అతి పురాతనమైన, సుప్రసిద్ధమైన పడవల పోటీ. దాదాపు 1600 మీటర్ల పందెపు మార్గమున్న ఈ పోటీ, ప్రపంచంలోని అతిశ్రేష్ఠులైన నావికులను ఆకర్షిస్తుంది. వేసవికాలంలో నిర్వహించబడే ఈ పడవల పోటీ ఇప్పుడు ఒక సుప్రసిద్ధ సామాజిక పోటీగా మారింది.

బ్రిటన్‌ గురించి వివరించే ఒక పుస్తకంలో థేమ్స్‌ నది గురించి ఇలా ఉంది, “అది ఇంగ్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే గుట్టలు, అడవులు, పచ్చిక మైదానాలు, చిన్న ఇళ్ళు, అందమైన పల్లెలు, చిన్న పట్టణాల గుండా ప్రవహిస్తున్నప్పుడు ఎన్నో రకాలైన అనుభూతులను కలిగిస్తుంది. . . . కొన్ని ప్రాంతాల్లో నదీ తీరం వెంబడి చాలా భాగంవరకు రోడ్డు ఉండదు. సాధారణంగా, పడవలు ప్రయాణించే మార్గం మాత్రమే ఉంటుంది. అందువల్ల, పట్టణంలో వాహనంపై వెళ్తున్న వ్యక్తి నదీ తీరం గుండా ప్రయాణిస్తూ దాని అందాన్నిబట్టి ఆశ్చర్యచకితుడైనా, పడవలోనో లేక కాలినడకన వెళ్తేనే దాని నిశ్చలమైన అందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాడు.”

మీరు ఇంగ్లాండ్‌ను సందర్శించాలనుకుంటున్నారా? అలాగైతే, థేమ్స్‌ నదిలో ప్రయాణం చేసి దాని చరిత్రను ఆస్వాదించడానికి కొంత సమయం తీసుకోండి. అది ప్రారంభమయ్యే స్థలంలో ఉండే గ్రామీణ సౌందర్యం మొదలుకొని రద్దీగా ఉండే దాని నదీముఖంవరకు అక్కడ చూడతగ్గవి ఎన్నో ఉన్నాయి. దానిని చూసి, చెయ్యవలసినవి, నేర్చుకోవలసినవి కూడా చాలా ఉన్నాయి. “ఓల్డ్‌ ఫాదర్‌ థేమ్స్‌” మిమ్మల్ని నిరాశపర్చదు. (g 2/06)

[అధస్సూచి]

^ లండన్‌ అనే పేరు లాటిన్‌ భాషలోని లొన్‌డినియమ్‌ నుంచి వచ్చిందే అయినా, ఆ రెండు పదాలూ ల్లిన్‌, డిన్‌ అనే సెల్టిక్‌ భాషా పదాలనుండి వచ్చి ఉండవచ్చు, ఆ రెండు సెల్టిక్‌ పదాలను కలిపితే, “నదీతీరానవున్న పట్టణము [లేక, దుర్గము]” అని అర్థమొస్తుంది.

[25వ పేజీలోని బాక్సు]

థేమ్స్‌, సాహిత్యం

జెరోమ్‌ కె. జెరోమ్‌ త్రీ మెన్‌ ఇన్‌ ఎ బోట్‌ అనే తన పుస్తకంలో థేమ్స్‌ నది దగ్గర ఉండే ఉపశమనాన్నిచ్చే వాతావరణాన్ని వర్ణించాడు. దానిలో ముగ్గురు స్నేహితులు తమ పెంపుడు కుక్కతో కలిసి సెలవుల్లో హాంప్టన్‌ కోర్ట్‌ నుండి ఆక్స్‌ఫోర్డ్‌ వరకు చేసిన యాత్ర గురించి వ్రాయబడింది. 1889లో వ్రాయబడిన ఈ పుస్తకం ఎంతో విస్తృతంగా అనువదించబడింది, అది ఇప్పటికీ “అసాధారణ హాస్యం ఉన్న ఉన్నతశ్రేణి రచనగా” ప్రసిద్ధిలో ఉంది.

పెద్దలు, పిల్లలు సమానంగా ఇష్టపడే మరొక ప్రసిద్ధి చెందిన కథ ద విండ్‌ ఇన్‌ ద విల్లోస్‌. థేమ్స్‌ నదీతీరానున్న పాన్బొర్న్‌ అనే పట్టణంలో నివసించే కెన్నెత్‌ గ్రాయమ్‌ 1908లో పూర్తిచేసిన ఈ కథ, థేమ్స్‌ నదీతీర పరిసర ప్రాంతాల్లో జీవించే జంతువుల గురించి వ్రాసిన కల్పితకథ.

[25వ పేజీలోని బాక్సు/చిత్రం]

థేమ్స్‌తో తలపడిన రాజు

17వ శతాబ్దం ప్రారంభంలో పరిపాలించిన జేమ్స్‌ I రాజు ఒకసారి కార్పోరేషన్‌ ఆఫ్‌ లండన్‌ నుండి 20,000 పౌండ్లను ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పటి మేయర్‌ ఆయన అడిగినదాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో, రాజు ఇలా బెదిరించాడు: “నేను నిన్నూ, నీ నగరాన్నీ శాశ్వతంగా నాశనం చేస్తాను. నేను నా న్యాయస్థానాలను, నా రాజసభను, నా పార్లమెంట్‌ను ఇక్కడినుండి వించెస్టర్‌కో, ఆక్స్‌ఫోర్డ్‌కో మార్చేసి వెస్ట్‌మిన్స్‌టర్‌ను నిర్మానుష్యంగా మారుస్తాను. అప్పుడిక నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో!” దానికి మేయర్‌ ఇలా జవాబిచ్చాడు: “లండన్‌లోని వర్తకులకు ఊరటనిచ్చే విషయం ఒకటి ఎప్పటికీ ఉంటుంది. అదేమిటంటే తమరు థేమ్స్‌ నదిని మీ వెంట తీసుకువెళ్ళలేరు.”

[చిత్రసౌజన్యం]

Ridpath’s History of the World (Vol. VI)అనే పుస్తకం నుండి

[22వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఇంగ్లాండ్‌

లండన్‌

థేమ్స్‌ నది

[చిత్రసౌజన్యం]

పటం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[22, 23వ పేజీలోని చిత్రం]

బిగ్‌ బెన్‌, పార్లమెంటు భవనాలు, వెస్ట్‌మిన్స్‌టర్‌, లండన్‌

[23వ పేజీలోని చిత్రం]

1756లో రాతితో నిర్మించబడిన లండన్‌ బ్రిడ్జి

[చిత్రసౌజన్యం]

ఓల్డ్‌ అండ్‌ న్యూ లండన్‌ అనే పుస్తకం నుండి: A Narrative of Its History, Its People, and Its Places (Vol. II)

[24వ పేజీలోని చిత్రం]

ఈ 1803నాటి చిత్రం థేమ్స్‌ నదినీ, రేవులో లంగరు వేయబడిన వందలాది నౌకలను చూపిస్తోంది

[చిత్రసౌజన్యం]

Corporation of London, London Metropolitan Archive

[24, 25వ పేజీలోని చిత్రం]

1683లో జరిగిన ఫ్రాస్ట్‌ ఫేర్‌ను చూపిస్తున్న చిత్రం

[చిత్రసౌజన్యం]

ఓల్డ్‌ అండ్‌ న్యూ లండన్‌ అనే పుస్తకం నుండి: A Narrative of Its History, Its People, and Its Places (Vol. III)