కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్‌గ్రిమ్‌లు, ప్యూరిటన్‌లు వారు ఎవరు?

పిల్‌గ్రిమ్‌లు, ప్యూరిటన్‌లు వారు ఎవరు?

పిల్‌గ్రిమ్‌లు, ప్యూరిటన్‌లు వారు ఎవరు?

ఉత్తర అమెరికా సముద్రతీరానవున్న, మసాచుసెట్స్‌లోని, ప్లిమత్‌ పట్టణంలో 1620 అనే సంఖ్య చెక్కబడిన ఒక పెద్ద గ్రనైట్‌ రాయి ఉంది. ప్లిమత్‌ రాక్‌ అని పిలువబడే ఈ రాయి, దాదాపు 400 సంవత్సరాల క్రితం యూరోపియన్ల గుంపొకటి తీరానికి చేరిన స్థలానికి చాలా సమీపంలో ఉందని చాలామంది నమ్ముతారు. కొన్నిదేశాల్లో వారిని పిల్‌గ్రిమ్స్‌ లేదా పిల్‌గ్రిమ్‌ ఫాదర్స్‌ అనే పేర్లతో పిలుస్తారు.

ఆతిథ్యమిచ్చే స్వభావమున్న పిల్‌గ్రిమ్‌లు తమ స్థానిక అమెరికన్‌ స్నేహితులను సమృద్ధియైన కోతకాలపు విందులకు ఆహ్వానించడానికి సంబంధించిన కథలు చాలామందికి తెలుసు. కానీ, ఆ పిల్‌గ్రిమ్‌లు ఎవరు, వారు ఉత్తర అమెరికాకు ఎందుకు వచ్చారు? జవాబుల కోసం మనం ఆంగ్లేయ రాజైన హెన్రీ VIII కాలానికి వెళ్దాం.

ఇంగ్లాండ్‌లో మతపరమైన అలజడులు

పిల్‌గ్రిమ్‌లు ఓడలో ప్రయాణమవడానికి 100 కంటే తక్కువ సంవత్సరాల ముందు, ఇంగ్లాండ్‌ ఒక రోమన్‌ క్యాథలిక్‌ దేశంగా ఉండేది. దాన్ని పరిపాలించే రాజు హెన్రీ VIIIకు పోప్‌ సంబంధమైన డిఫెండర్‌ ఆఫ్‌ ఫెయిత్‌ (విశ్వాసాన్ని సమర్థించేవాడు) అనే బిరుదు ఉండేది. కానీ, హెన్రీ రాజుకున్న ఆరుగురు భార్యల్లో మొదటి భార్య అయిన కాథరీన్‌ ఆఫ్‌ అరగాన్‌తో జరిగిన వివాహాన్ని రద్దు చేయడానికి పోప్‌ క్లెమెంట్‌ VII నిరాకరించటంతో వారి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

ఒకవైపు హెన్రీ రాజు తన కుటుంబ సమస్యల గురించి చింతిస్తుండగా, మరోవైపు ఐరోపా ఖండంలో అనేకచోట్ల ప్రొటస్టెంట్‌ మతసంస్కరణోద్యమం రోమన్‌ క్యాథలిక్‌ చర్చీల్లో అలజడి సృష్టించింది. చర్చి తనకు ఇచ్చిన ప్రతిష్ఠను వదులుకోవడం ఇష్టంలేని హెన్రీ రాజు, మొదట్లో ఆ సంస్కర్తలను ఇంగ్లాండ్‌కు దూరంగా ఉంచాడు. ఆ తర్వాత ఆయన తన మనసు మార్చుకున్నాడు. క్యాథలిక్‌ చర్చి తన వివాహాన్ని రద్దు చేయలేదు కాబట్టి తాను చర్చీని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన 1534లో ఆంగ్ల క్యాథలిక్‌లపై పోప్‌కున్న అధికారాన్ని రద్దుచేసి స్వయంగా తననే చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు సర్వాధికారిగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత, కొద్దికాలానికే సన్యాసుల మఠాలను మూయించి వాటి ఆస్తులను అమ్మేయడం ప్రారంభించాడు. 1547లో ఆయన మరణించే సమయానికి ఇంగ్లాండ్‌ ఒక ప్రొటస్టెంట్‌ దేశంగా మారే దశలో ఉంది.

హెన్రీ కుమారుడైన ఎడ్వర్డ్‌ IV కూడా రోమ్‌కు వైరిగానే కొనసాగాడు. 1553లో ఎడ్వర్డ్‌ మరణించిన తరువాత, కాథరీన్‌ ఆఫ్‌ అరగాన్‌ ద్వారా హెన్రీకి పుట్టి, రోమన్‌ క్యాథలిక్‌ మతాన్ని అవలంబించిన మేరీ, రాణి అయింది, అప్పటినుండి దేశం తిరిగి పోప్‌ల అధికారానికి లోబడేలా చేయాలని ప్రయత్నించింది. అనేక ప్రొటస్టెంట్‌లను దేశం నుండి బహిష్కరించి, 300 కన్నా ఎక్కువమంది మ్రానులపై దహించబడడానికి కారకురాలైన మేరీ, బ్లడీ మేరీ అనే పేరు తెచ్చుకుంది. కానీ ఆమె జరుగుతున్న పెనుమార్పులను ఆపలేకపోయింది. 1558లో ఆమె మరణం తర్వాత అధికారానికి వచ్చిన ఆమె సవతి సహోదరి ఎలిజబెత్‌ I, అప్పటినుండి ఆంగ్లేయుల మత సంబంధమైన జీవితాల్లో పోప్‌కు ఎలాంటి అధికారమూ లేకుండా చేసింది.

కానీ, కేవలం చర్చ్‌ ఆఫ్‌ రోమ్‌ నుండి విడిపోవడం మాత్రమే సరిపోదనీ, క్యాథలిక్కులకు సంబంధించినవన్నీ తొలగించబడాలనీ కొందరు ప్రొటస్టెంట్‌లు భావించారు. వారు చర్చిలో జరిగే ఆరాధనను స్వచ్ఛంగా చేయాలనుకున్నారు, అందుకే వారు ప్యూరిటన్‌లు అని పిలువబడ్డారు. కొందరు ప్యూరిటన్‌లు బిషప్‌ల అవసరం లేదనీ, ప్రతీ సంఘం జాతీయ చర్చినుండి వేరుగా ఉండి వారే స్వయంగా సంఘాన్ని నిర్వహించుకోవాలనీ భావించారు. అందుకే వారు సెపెరేటిస్ట్‌లు అని పిలువబడ్డారు.

ఎలిజబెత్‌ పరిపాలనా కాలంలో వివాదాస్పదమైన ప్యూరిటన్‌లు వెలుగులోకి వచ్చారు. మతగురువుల్లో కొందరు సాధారణ దుస్తులు ధరించడం రాణికి కోపం పుట్టించింది, అందుకే మతగురువులు ధరించాల్సిన దుస్తుల విషయంలో నిర్దిష్ట వస్త్ర నియమావళి విధించాల్సిందిగా 1564లో ఆమె క్యాంటర్‌బరీలోని ఆర్చ్‌బిషప్‌ను ఆదేశించింది. క్యాథలిక్‌ మతగురువుల్లా అధికార దుస్తులు ధరించే పద్ధతి తిరిగి వస్తుందని గ్రహించిన ప్యూరిటన్‌లు దానికి సమ్మతించలేదు. బిషప్‌లు, ఆర్చ్‌బిషప్‌ల మతాచార్యుల పరంపర విషయంలో మరింత వివాదం రేగింది. ఎలిజబెత్‌ రాణి బిషప్‌లను యథాతథంగా ఉంచి, చర్చికి అధికారిణిగా తనకు విధేయత చూపిస్తామని వారిని ప్రమాణం చేయమంది.

సెపెరేటిస్ట్‌ల నుండి పిల్‌గ్రిమ్‌లుగా మారడం

1603లో ఎలిజబెత్‌ తర్వాత అధికారాన్ని చేపట్టిన జేమ్స్‌ I, సెపెరేటిస్ట్‌లను తన అధికారానికి లోబడమని వారిపైకి ఎంతో ఒత్తిడి తెచ్చాడు. 1608లో స్క్రూబీ పట్టణంలోని ఒక సెపెరేటిస్ట్‌ల సంఘం హాలెండ్‌లో దొరికే స్వాతంత్య్రం కోసం ఆ దేశానికి పారిపోయారు. కానీ, అనతికాలంలో డచ్‌వారు ఇతర మతాలపట్ల చూపించిన సహనాన్ని, వారి దిగజారిన నైతిక విలువలను చూసిన సెపెరేటిస్ట్‌లకు అక్కడ ఉండడం, ఇంగ్లాండ్‌లో ఉండడం కంటే మరింత ఇబ్బందిగా అనిపించింది. వారు ఐరోపాను విడిచిపెట్టి ఉత్తర అమెరికాలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సెపెరేటిస్ట్‌ల గుంపు తమ మత నమ్మకాల కోసం స్వదేశంనుండి దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉండడాన్నిబట్టి ఆ గుంపుకు అనతికాలంలో పిల్‌గ్రిమ్స్‌ అనే పేరు వచ్చింది.

పిల్‌గ్రిమ్‌లు, వారితోపాటు చాలామంది సెపెరేటిస్ట్‌లు, బ్రిటీష్‌ వలస రాజ్యమైన వర్జీనియాలో స్థిరపడడానికి అనుమతి తీసుకొని, 1620 సెప్టెంబరులో మేఫ్లవర్‌ అనే నౌకలో ఉత్తర అమెరికాకు ఓడలో ప్రయాణమయ్యారు. దాదాపు 100 మంది పెద్దలూ, పిల్లలూ కలిసి ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో రెండు నెలలపాటు తుఫానుల మధ్య ప్రయాణించి, వర్జీనియాకు ఉత్తరాన, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కేప్‌కాడ్‌కు చేరుకున్నారు. అక్కడ వారు మేఫ్లవర్‌ ఒడంబడికను వ్రాశారు, అది వారు అక్కడ తమ సమాజాన్ని స్థాపించుకొని అక్కడి నియమాలకు లోబడి ఉంటామనే కోరికను తెలిపే పత్రం. వారు సమీపాన ఉన్న ప్లిమత్‌లో 1620 డిసెంబరు 21న స్థిరపడ్డారు.

కొత్త ప్రపంచంలో జీవితాన్ని ఆరంభించడం

ఉత్తర అమెరికాకు వచ్చిన ఆ శరణార్థులు శీతాకాలానికి సిద్ధపడి రాలేదు. కొన్ని నెలల్లోనే ఆ గుంపులో సగంమంది చనిపోయారు. వసంతకాలం వచ్చేసరికి వారికి కాస్త ఊరట కలిగింది. బతికి బయటపడ్డవారు చాలినన్ని ఇళ్ళు కట్టుకుని, స్వదేశీ ఆహార పంటలను ఎలా సాగుచేయాలో స్థానిక ఉత్తర అమెరికన్‌ల నుండి నేర్చుకున్నారు. 1621లో శరదృతువు వచ్చేసరికి పిల్‌గ్రిమ్‌లు ఎంతగా వర్ధిల్లారంటే, వారు దేవుడు తమను ఆశీర్వదించినందుకు ఆయనకు కృతజ్ఞతను చూపడానికి సమయాన్ని కేటాయించారు. అప్పటినుండే నేడు అమెరికా, మరితర ప్రదేశాల్లో ఆచరింపబడుతున్న థాంక్స్‌గివింగ్‌ డే ఆరంభమైంది. తర్వాత ఆ ప్రాంతానికి ఇంకా అనేకులు వలసవచ్చారు, దాంతో 15 కంటే తక్కువ సంవత్సరాల్లో ప్లిమత్‌లోని జనాభా 2,000 దాటిపోయింది.

ఇలా ఉండగా, ఇంగ్లాండ్‌లో కొంతమంది ప్యూరిటన్‌లు సెపెరేటిస్ట్‌ల్లాగే తమ “వాగ్దానదేశం” అట్లాంటిక్‌ సముద్రానికి అవతలివైపు ఉందనే నిర్ధారణకు వచ్చారు. 1630లో ఆ గుంపు ప్లిమత్‌కు ఉత్తరాన ఒక ప్రదేశానికి చేరుకుని అక్కడ మసాచుసెట్స్‌ బే కాలనీని స్థాపించారు. 1640 కల్లా దాదాపు 20,000 మంది ఆంగ్ల వలసదారులు న్యూ ఇంగ్లాండ్‌లో నివాసముండేవారు. మసాచుసెట్స్‌ బే కాలనీ 1691లో ప్లిమత్‌పై అధికారాన్ని పొందాక సెపెరేటిస్ట్‌ పిల్‌గ్రిమ్‌లు ఒక ప్రత్యేక శాఖగా లేరు. ప్యూరిటన్‌లు న్యూ ఇంగ్లాండ్‌లోని మత సంబంధమైన జీవితంపై ఆధిపత్యం వహించడంతో బోస్టన్‌ ఆ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రస్థానంగా మారింది. వారెలా ఆరాధించేవారు?

ప్యూరిటన్‌ల ఆరాధన

కొత్త ప్రపంచంలో ప్యూరిటన్‌లు ముందుగా కలపతో ప్రార్థనాస్థలాలను నిర్మించుకుని వాటిలో ఆదివారం ఉదయాలు సమకూడేవారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లోపలి పరిస్థితులను తట్టుకోగలిగేవారు. కానీ, శీతాకాలంలో జరిగే ప్రార్థనలు మాత్రం కఠినులైన కొందరు ప్యూరిటన్‌ల ఓర్పును సహితం పరీక్షించాయి. ఆ ప్రార్థనాస్థలాల్లో వెచ్చదనం కలుగజేసే పరికరాలు ఏమీ లేవు, వాటికి వచ్చే సభ్యులు చలికి వణికేవారు. లోపలున్న చల్లగాలి తగలకుండా బోధకులు తమ చేతులకు తొడుగులు వేసుకునేవారు.

ఫ్రెంచి ప్రొటస్టెంట్‌ సంస్కర్త అయిన జాన్‌ కెల్విన్‌ బోధల ఆధారంగా ప్యూరిటన్‌లు తమ నమ్మకాలను ఏర్పర్చుకున్నారు. వారు విధి సిద్ధాంతాన్ని స్వీకరించి, ఆ సిద్ధాంతం ప్రకారంగా, దేవుడు తాను ఎవరిని రక్షిస్తాడో, ఎవరికి నిత్య నరకాగ్నిలో శిక్ష విధిస్తాడో ముందే నిర్ణయించాడని నమ్మేవారు. మానవులు ఏమి చేసినా వారు దేవుని ముందు తమకున్న పేరు మార్చుకోలేరనీ, ఒక వ్యక్తి మరణించిన తరువాత తాను పరలోకంలో జీవించే సుఖానుభూతిని పొందుతాడో లేక నరకంలో దహించబడతాడో అతనికి తెలియదనీ నమ్మేవారు.

అనతికాలంలో ప్యూరిటన్‌ ప్రచారకులు పశ్చాత్తాపపడడాన్ని బోధించనారంభించారు. దేవుడు కరుణామయుడే అయినా ఆయన ఆజ్ఞలకు అవిధేయులయ్యేవారు సరాసరి నరకానికే వెళ్తారని హెచ్చరించారు. ఆ బోధకులు ప్రజల్ని నియమాలకు విధేయులయ్యేలా చేయడానికి నరకాగ్ని అనే సిద్ధాంతం బోధించారు. 18వ శతాబ్దానికి చెందిన జోనతన్‌ ఎడ్వర్డ్స్‌ అనే బోధకుడు ఒకసారి “ఆగ్రహించిన దేవుని చేతుల్లోని పాపులు” అనే అంశంపై మాట్లాడాడు. ఆయన నరకం గురించి ఇచ్చిన వివరణలు ఎంతగా భయం పుట్టించాయంటే, ఆ ప్రసంగాన్ని విని వ్యాకులపడిన తమ సంఘంలోని వారికి ఇతర మతగురువులు, భావోద్వేగ సహాయాన్ని ఇవ్వవలసి వచ్చింది.

మసాచుసెట్స్‌ వెలుపలి ప్రాంతాల నుండి వచ్చి ప్రకటించే సువార్తికులు అంటే ఇతర శాఖలవారు, తమ ప్రాణాలను సంకటంలో పెట్టుకునేవారు. అక్కడి అధికారులు, క్వేకర్‌ శాఖకు చెందిన మేరీ డయర్‌ అనే ప్రచారకురాలిని మూడుసార్లు బహిష్కరించారు, కానీ ప్రతీసారి ఆమె తిరిగి వచ్చి తన అభిప్రాయాలను వెల్లడిచేసేది. 1660, జూన్‌ 1న బోస్టన్‌లో ఆమెను ఉరితీశారు. ప్యూరిటన్‌ నాయకులు తమ విరోధులతో ఎంతటి అభినివేశంతో వ్యవహరిస్తారో బహుశా ఫిలిప్‌ రాట్‌క్లిఫ్‌ మరిచిపోయినట్టున్నాడు. ఆయన ప్రభుత్వానికి, సేలంలోని చర్చికి విరుద్ధంగా ఉపన్యాసాలు చేశాడు కాబట్టి ఆయనను కొరడాలతో కొట్టించి, జరిమానా కూడా విధించారు. అనంతరం ఆయన అది మరిచిపోకుండా వారు ఆయన చెవులు కోసేసి ఆ తర్వాతే విడిచిపెట్టారు. ప్యూరిటన్‌ల అసహనం ప్రజల్ని మసాచుసెట్స్‌ నుండి తరిమేసింది, దాంతో ఇతర కాలనీల పెరుగుదలకు అది దారితీసింది.

అహంభావం దౌర్జన్యానికి దారితీసింది

తాము దేవునిచే “ఏర్పర్చబడిన” వారమని భావించడంవల్ల అనేకమంది ప్యూరిటన్‌లు స్థానిక ప్రజలను భూమిపై జీవించే హక్కులేని అల్పప్రాణులుగా దృష్టించేవారు. ఈ వైఖరి ఆగ్రహం తెప్పించింది, స్థానికులు వారిపై దాడులు చేయడం ఆరంభించారు. అందువల్ల ప్యూరిటన్‌ నాయకులు, పురుషులు ఆరాధనకు వెళ్తున్నప్పుడు తమతో తుపాకులు తీసుకువెళ్ళేందుకు అనుకూలంగా సబ్బాతుకు సంబంధించిన నియమాలను సడలించారు. కానీ 1675లో పరిస్థితులు మరింత విషమించాయి.

వాంపెనాగ్‌ అమెరికన్‌ ఇండియన్స్‌కు రాజుగావున్న మెటాకోమెట్‌కు ఫిలిప్‌ అని కూడా పేరుండేది. ఆయన, తన ప్రజల ప్రాంతం చేజారిపోతుందన్న విషయాన్ని గ్రహించి, ప్యూరిటన్‌ల నివాసస్థలాలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. వారి ఇళ్ళను దగ్ధంచేసి, వలసదార్లను సామూహికంగా వధించాడు. ప్యూరిటన్‌లు ప్రతిఘటించారు, వారి మధ్య జరిగిన యుద్ధం నెలలపాటు కొనసాగింది. ఆగస్టు 1676లో ప్యూరిటన్‌లు రోడ్‌ ద్వీపంలో ఫిలిప్‌ను బంధించారు. వారు ఆయన తలను నరికి, ఆయన పొట్టను చీల్చి పేగులను బయటకు తీసి, శరీరాన్ని నాలుగు సమభాగాలుగా విభజించారు. అంతటితో ఫిలిప్‌ రాజు యుద్ధం, న్యూ ఇంగ్లాండ్‌లోని స్థానికుల స్వేచ్ఛా జీవితం ముగిసింది.

18వ శతాబ్దంలో ప్యూరిటన్‌లకు తమ ఉత్సాహం ప్రదర్శించే మరొక మార్గం కనిపించింది. మసాచుసెట్స్‌లోని కొందరు పరిచారకులు ఆంగ్ల పరిపాలనపట్ల తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి స్వాతంత్ర్యం కోసం ఆశ రేకెత్తించారు. వారు చేసే విప్లవ చర్చల్లో రాజకీయాన్ని, మతాన్ని కలిపారు.

ప్యూరిటన్‌లు సాధారణంగా కష్టపడి పనిచేసేవారు, ధైర్యస్థులు, మతనిష్ఠ గలవారు. ప్రజలు ఇప్పటికీ “ప్యూరిటన్‌ల వ్యక్తిత్వం” గురించి, “ప్యూరిటన్‌ల నిజాయితీ” గురించి మాట్లాడతారు. కానీ నిజాయితీ మాత్రమే ఒకరిని తప్పుడు బోధలనుండి పవిత్రుణ్ణి చేయదు. యేసుక్రీస్తు రాజకీయాన్ని, మతాన్ని మిళితం చేయలేదు. (యోహాను 6:15; 18:​36) క్రూరత్వం ఈ ముఖ్యమైన సత్యానికి విరుద్ధంగా ఉంది: “దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.”​—1 యోహాను 4:8.

మీ మతం నరకాగ్ని, విధి లేక ఇతర బైబిలు విరుద్ధ సిద్ధాంతాలను బోధిస్తోందా? మీ మత నాయకులు రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటున్నారా? దేవుని వాక్యమైన బైబిలును నిజమైన ఆసక్తితో అధ్యయనం చేస్తే, అది మీకు దేవుడు అంగీకరించే, నిజంగా పరిశుద్ధమైన, “పవిత్రమును నిష్కళంకమునైన భక్తి”ని కనుగొనేందుకు సహాయం చేస్తుంది.​—యాకోబు 1:27. (g 2/06)

[29వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్యూరిటన్‌లు, నరకాగ్ని

నరకాగ్నిని బోధించడం ద్వారా ప్యూరిటన్‌లు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళారు. చనిపోయినవారు స్పృహలో ఉండరనీ, నొప్పిని, సుఖాన్ని అనుభవించలేరనీ బైబిలు బోధిస్తోంది. (ప్రసంగి 9:​5, 10) అంతేగాక, అగ్నిలో యాతనపెట్టడమనే ఆలోచన నిజమైన దేవుని “మనస్సునకు తోచనిది.” (యిర్మీయా 19:5; 1 యోహాను 4:8) ఆయన ప్రజల్ని తమ జీవితాలు మార్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నాడు, పశ్చాత్తాపపడని తప్పిదస్థులతో కూడా ఆయన కనికరంతోనే వ్యవహరిస్తాడు. (యెహెజ్కేలు 33:11) ఈ బైబిలు సత్యాలకు విరుద్ధంగా ప్యూరిటన్‌ బోధకులు దేవుణ్ణి ఓ క్రూరమైనవానిగా, పగతీర్చుకునేవానిగా చిత్రించారు. వారు వ్యతిరేకుల నోరుమూయించడానికి బలప్రయోగం వంటివి ఉపయోగించడం ద్వారా జీవితంపట్ల నిర్దయ దృష్టిని ప్రోత్సహించారు.

[26వ పేజీలోని చిత్రం]

1620లో పిల్‌గ్రిమ్‌లు ఉత్తర అమెరికాలో కాలుమోపడం

[చిత్రసౌజన్యం]

Harper’s Encyclopædia of United States History

[28వ పేజీలోని చిత్రం]

1621లో మొదటి థాంక్స్‌గివింగ్‌ డే జరుపుకోవడం

[28వ పేజీలోని చిత్రం]

మసాచుసెట్స్‌లోని ప్యూరిటన్‌ల ప్రార్థనాస్థలం

[28వ పేజీలోని చిత్రం]

జాన్‌ కాల్విన్‌

[28వ పేజీలోని చిత్రం]

జోనతన్‌ ఎడ్వర్డ్స్‌

[29వ పేజీలోని చిత్రం]

చర్చికి వెళ్తున్న సాయుధ ప్యూరిటన్‌ దంపతులు

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

Library of Congress, Prints & Photographs Division

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన ఎడమవైపు: Snark/Art Resource, NY; పైన కుడివైపు: Harper’s Encyclopædia of United States History; జాన్‌ కాల్విన్‌: Portrait in Paul Henry’s Life of Calvin, from the book The History of Protestantism (Vol. II); జోనతన్‌ ఎడ్వర్డ్స్‌: Dictionary of American Portraits/Dover

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫోటోలు: North Wind Picture Archives