కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

2000లో క్షయకు సంబంధించిన 83 లక్షల కొత్త కేసులు వృద్ధిచెందాయని అంచనా వేయబడింది, దాదాపు 20 లక్షల క్షయ బాధితులు మరణించారు. వారిలో అనేకమంది తక్కువ రాబడిగల దేశాలకు చెందినవారే.​​—⁠మెడికల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా. (g 1/06)

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్చుయరీస్‌ అందించిన మరణాల పట్టికల ప్రకారం “30 సంవత్సరాల వయసులో పొగ తాగే అలవాటుంటే, అది మగవారి సగటు జీవితకాలంలో 5 12 సంవత్సరాలను, ఆడవారి సగటు జీవితకాలంలో 6 12 సంవత్సరాలకన్నా ఎక్కువకాలాన్ని తగ్గించివేస్తుంది. అయితే, 30 ఏళ్ళ వయసులో దానిని వదిలేస్తే, పొగాకుకు సంబంధించిన వ్యాధితో మరణించే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి.​​—⁠ద టైమ్స్‌, ఇంగ్లాండ్‌.

2004లో ప్రపంచంలోని చమురు వినియోగం 3.4 శాతం పెరిగింది అంటే రోజుకు 8 కోట్ల 24 లక్షల పీపాల చమురు ఉపయోగించడం జరుగుతుంది. సగం పెరుగుదలకు బాధ్యులు అమెరికా, చైనా దేశస్థులే, అమెరికావారు ప్రస్తుతం రోజుకు 2 కోట్ల 5 లక్షల పీపాల చమురును ఉపయోగిస్తే చైనావారు 66 లక్షల పీపాల చమురును ఉపయోగిస్తున్నారు.​​—⁠వైటల్‌ సైయిన్స్‌ 2005, వరల్డ్‌ వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌. (g 2/06)

“మీ తల్లికి విలువ ఇవ్వండి”

కార్మిక నిపుణుల ప్రకారం కెనడా దేశంలో, స్కూలుకు వెళ్ళే వయసుగల ఇద్దరు పిల్లలుండి ఇంటిపట్టున ఉండే తల్లికి ఆమె చేసే పనంతటితోపాటు ఓవర్‌టైమ్‌ కూడా కలుపుకుని జీతం చెల్లించాల్సివస్తే, ఆమె వార్షిక వేతనం దాదాపు 58 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ జీతం, “వారంలో 100 గంటలు అంటే రోజుకు 15 గంటల చొప్పున ఆరు రోజులు, ఒకరోజు 10 గంటలు పనిచేసే” ఒక వ్యక్తికి నేడు సగటున దొరికే వేతనం మీద ఆధారితమైనదని వాన్‌కోవెర్‌ సన్‌ వార్తాపత్రిక చెబుతోంది. ఇంట్లోనే ఉండే ఒక తల్లి నిర్వహించాల్సిన బాధ్యతల్లో పిల్లల్ని లేదా వృద్ధుల్ని చూసుకోవడం, టీచర్‌గా, డ్రైవర్‌గా, హౌస్‌కీపర్‌గా, వంటమనిషిగా, నర్స్‌గా, అలాగే ఇంటిలో చిన్న చిన్న రిపేర్‌ పనులు చేసేవారిగా ఉండడం కూడా ఇమిడి ఉన్నాయి. ఆ వార్తాపత్రిక ఈ సలహా ఇస్తోంది: “మీ తల్లికి విలువ ఇవ్వండి: ఆమెకు తగినంత విలువ ఇవ్వబడడంలేదు.” (g 2/06)

మూఢనమ్మకాలపై విశ్వాసం పెరుగుతోంది

“సాంకేతిక విజ్ఞానం, విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి గుర్తింపు పొందిన కాలంలో కూడా మూఢనమ్మకాలు తమ ప్రభావాన్ని ఇంకా కోల్పోలేదు” అని ప్రజాభిప్రాయ సేకరణ చేసే జర్మనీలోని ఆలెన్స్‌బాక్‌ సంస్థ నివేదిస్తోంది. “శుభ లేదా అశుభ శకునాలపై తర్కరహితమైన నమ్మకం ప్రజల్లో ఇప్పటికీ ఉంది, నిజానికి అది 25 సంవత్సరాల క్రితం కంటే నేడు మరింత ఎక్కువగా వ్యాప్తిలో ఉంది” అని ఒక దీర్ఘకాల అధ్యయనం చూపిస్తోంది. 1970లలో ప్రజల్లో 22 శాతంమంది భూమిపై పడే ఉల్కలు తమ జీవితాలను ప్రభావితం చేస్తాయని నమ్మేవారు. నేడు 40 శాతంమంది దాన్ని నమ్ముతున్నారు. నేడు మూడింట ఒక వంతు పౌరులు మాత్రమే అన్నిరకాల మూఢనమ్మకాలను నిరాకరిస్తున్నారు. 1000 మంది జర్మనీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో జరిపిన అధ్యయనం ప్రకారం, వారిలో మూడోవంతు కార్లలో లేదా తాళంచెవుల గుత్తిలో పెట్టుకునే తాయెత్తులను విశ్వసిస్తున్నారు. (g 1/06)

ఆధునిక బానిసత్వం

“ప్రపంచంలో కనీసం కోటి 23 లక్షలమంది బలవంతపు చాకిరీకి బలవుతున్నారు” అని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) జరిపిన అధ్యయనం నివేదిస్తోంది. వారిలో 24 లక్షల కంటే ఎక్కువమంది చట్టవిరుద్ధంగా బానిసలుగా అమ్మబడుతున్నారు లేక కొనబడుతున్నారు అని అంచనా వేయబడింది. వేశ్యావృత్తి, మిలటరీ సేవ, వెట్టి చాకిరీ వంటి పనులు నిర్భంద శ్రామికతకు అంటే బెదిరించి బలవంతం మీద చేయించే పనులకు లేక సేవలకు ఉదాహరణలు, అలా పనిచేసే పనివారికి దొరికే జీతం అంతంత మాత్రమే, లేక అసలు జీతమే దొరకదు ఎందుకంటే వారి జీతం అప్పుతీర్చడానికే సరిపోతుంది. ILO డైరెక్టర్‌ జనరల్‌ అయిన హువాన్‌ సొమావియా అభిప్రాయం ప్రకారం అటువంటి చాకిరీ, “ప్రజల ప్రాథమిక హక్కులను, గౌరవాన్ని వారి నుండి దోచుకుంటుంది.”

పార్కు చేసిన కార్లలో ఉష్ణోగ్రత

పీడియాట్రిక్స్‌ పత్రిక తెలియజేస్తున్నట్లుగా 2004వ సంవత్సరంలో అమెరికాలో 35 మంది పిల్లలు పార్కు చేసిన వాహనాల్లో వదిలిపెట్టబడిన తర్వాత ఎండదెబ్బ తగిలి చనిపోయారు. బయటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌ దాటితే, వాహనంలోని ఉష్ణోగ్రత త్వరగా 57 నుండి 68 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగలదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. బయటి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌ ఉన్నప్పటికీ, కారులో ఉష్ణోగ్రత దాదాపు మరో 22 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలోని అధికశాతం పెరుగుదల వాహనం పార్కు చేసిన 15 నుండి 30 నిమిషాల్లో సంభవిస్తుంది. కిటికీలు ఒకటిన్నర అంగుళాలు తెరిచివుంచినా లేక కారు ఆపేముందు ఎయిర్‌ కండిషనింగ్‌ వాడినా వ్యత్యాసమేమీ కనిపించలేదు. ఎండలో వాహనాలు నిలపడంవల్ల జరిగే హానిపట్ల ప్రజల్లో అవగాహన కలిగితే, అది ప్రాణాలను రక్షించగలదు అని ఆ ఆర్టికల్‌ వ్రాసినవారు నమ్ముతున్నారు. (g 3/06)