బూజు ఉపయోగకరమైనదే కాదు, హానికరమైనది కూడా!
బూజు ఉపయోగకరమైనదే కాదు, హానికరమైనది కూడా!
స్వీడన్ లోని తేజరిల్లు! రచయిత
కొన్ని రకాల బూజులు ప్రాణాల్ని కాపాడతాయి; మరికొన్ని ప్రాణాల్ని బలిగొంటాయి. కొన్ని చీజ్‌ల, వైన్‌ల రుచిని పెంచుతాయి; మరికొన్ని ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. కొన్ని చెట్లమొద్దులకు సోకుతాయి; మరికొన్ని స్నానాలగదుల్లో, పుస్తకాల్లో విస్తరిస్తాయి. వాస్తవానికి, బూజు ఎక్కడబడితే అక్కడ ఉంటుంది—మీరు ఈ వాక్యం చదివే లోపల వాటి సూక్ష్మరేణువులు మీ నాసికల్లోకి ప్రవేశిస్తాయి కూడా.
బూజు మనచుట్టూ ఉందనే విషయంలో మీకేమైనా అనుమానం ఉంటే, ఒక బ్రెడ్డు ముక్కను ఫ్రిజ్‌లోనైనా, మరెక్కడైనా పెట్టి ఉంచండి. ఎంతోసేపు కాకముందే దానిమీద నూగు పొర ఏర్పడుతుంది—అదే బూజు!
బూజు అంటే ఏమిటి?
బూజులు శిలీంధ్రాల కుటుంబానికి చెందినవి, దానిలో చిత్తలు, కుక్కగొడుగులు, మొక్కలకు వచ్చే కుంకుమ తెగులు, సారాయి పొంగులు వంటివాటితో సహా 1,00,000 కంటే ఎక్కువ జాతులున్నాయి. అందులో 100 రకాలు మాత్రమే మానవులకు, జంతువులకు జబ్బులు కలుగజేస్తాయి. మిగతా అనేకం, మృత సేంద్రియ పదార్థాన్ని కుళ్లబెట్టి, ఆ తర్వాత అవసరమైన మూలపదార్థాలను మొక్కలు ఉపయోగించుకోగల రూపంలోకి మార్చడం ద్వారా ఆహార ప్రక్రియల్లో ఆవశ్యక పాత్ర పోషిస్తాయి. ఇంకా మిగతావి, మొక్కలతో సహజీవనం చేస్తూ మొక్కలు నేలలో నుండి పోషకాలను గ్రహించడానికి సహాయం చేస్తాయి. మరికొన్ని పరాన్నజీవులు.
బూజు గాలి తరంగాల ద్వారా ప్రయాణించే అతిసూక్ష్మ సిద్ధబీజంగా జీవితం ప్రారంభిస్తుంది. ఆ సిద్ధబీజం, ఇతర అంశాలతోపాటు సరైన ఉష్ణోగ్రత, తేమ ఉన్న ఆహారపదార్థం మీద పడినప్పుడు మొలకెత్తుతుంది, దానితో తంతువులు అని పిలువబడే నూలుపోగులాంటి కణాలు ఏర్పడతాయి. ఈ తంతువులు ఒక సముదాయంగా ఏర్పడతాయి, కుచ్చులుకుచ్చులుగా చిక్కుబడినట్లు కనబడే ఆ రాశి శిలీంద్రజాలం అని పిలువబడుతుంది, అదే మనకు కనిపించే బూజు. ఈ బూజు స్నానాలగదిలోని టైల్స్ మధ్యనుండే సందుల్లో ఏర్పడినప్పుడు మురికిలా, మరకలా కూడా కనిపించవచ్చు.
బూజు పునరుత్పత్తిలో దిట్ట. రైజోపస్ స్టొలొనిఫర్ అని పిలువబడే, బ్రెడ్‌పై ఏర్పడే సాధారణ బూజులో ఉండే చిన్న చిన్న నల్ల చుక్కలే సిద్ధబీజాలు లేక సిద్ధబీజాశయాలు. కేవలం ఆ ఒక్క చుక్కలో 50,000 కంటే ఎక్కువ సిద్ధబీజాలు ఉంటాయి, ఒక్కోటి కేవలం కొన్ని రోజుల్లో కోటానుకోట్ల క్రొత్త సిద్ధబీజాలను ఉత్పత్తి చేయగలదు! అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, బూజు అడవిలోని చెట్టు మొద్దుమీద పెరిగినంత సుళువుగా పుస్తకం మీద, పాదరక్షల మీద, వాల్‌పేపర్ మీద పెరుగుతుంది.
బూజులు ఎలా “తింటాయి”? ముందు తిని ఆ తర్వాత అరిగించుకోవడం ద్వారా ఆహారాన్ని తీసుకునే జంతువుల్లా, మనుష్యుల్లా కాకుండా బూజులు తరచూ ఆ ప్రక్రియను తిరగేసి చేస్తాయి. జీవసంబంధ పరమాణువులు బూజులు తినలేనంత పెద్దగా, సంక్లిష్టంగా ఉన్నప్పుడు, అవి మెల్లగా జీర్ణక్రియా ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి, ఇవి ఆ పరమాణువులను చిన్న చిన్న భాగాలుగా విడదీస్తాయి, అప్పుడు బూజులు వాటిని తింటాయి. అంతేగాక, బూజులు ఆహారం
కోసం ఇటు అటు సంచరించలేవు కాబట్టి అవి తమ ఆహారంలోనే నివసించాలి.బూజులు మైకోటాక్సిన్‌లని పిలువబడే విషపదార్థాలను ఉత్పత్తి చేయగలవు, ఇవి మనుష్యుల్లోనూ జంతువుల్లోనూ తీవ్ర ప్రతిచర్యలను కలిగించగలవు. బూజును మనం పీల్చుకునే, మ్రింగే, చర్మానికి అంటించుకునే అవకాశం ఉంది. అయితే బూజు ఎల్లప్పుడూ హానికరమైనదే కాదు, దానికి ఎంతో ఉపయోగకరమైన లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి.
బూజుకున్న ఉపయోగకరమైన అంశాలు
1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే విజ్ఞానశాస్త్రవేత్త ఆకుపచ్చ బూజుకున్న క్రిమినాశక శక్తిని యాదృచ్ఛికంగా గమనించాడు. ఆ తర్వాత పెన్సిల్యమ్ నొటాటమ్ అని గుర్తించబడిన ఈ బూజు బాక్టీరియాకు హానికరమైనది గానీ మానవులకు జంతువులకు నిరపాయకరమైనదని నిరూపించబడింది. ఆ ఆవిష్కరణ, “ఆధునిక వైద్యంలో ఏకైక అతిగొప్ప జీవప్రదాయని” అని పిలువబడుతున్న పెన్సిలిన్ రూపొందడానికి దారితీసింది. తాము చేసిన పనినిబట్టి ఫ్లెమింగ్‌కు, ఆయన తోటి పరిశోధకులైన హోవార్డ్ ఫ్లోరేకు, ఎర్నెస్ట్ ఛైన్‌కు 1945లో వైద్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వబడింది. అప్పటినుండి బూజు, గడ్డకట్టిన రక్తం, శిరోపార్శ్వనొప్పులు, పార్కిన్‌సన్స్ జబ్బు వంటివాటికి మందులతో సహా అనేక ఇతర వైద్యసంబంధ పదార్థాల రూపకల్పనలో తోడ్పడింది.
బూజు రుచికి కూడా ఒక ఆశీర్వాదంగా పరిణమించింది. ఉదాహరణకు చీజ్‌నే తీసుకోండి. బ్రీ, కామమ్‌బెర్ట్, డానిష్ బ్లూ, గోర్‌గోన్‌జోలా, రోక్‌ఫోర్ట్, స్టిల్టన్ వంటి చీజ్‌లకు ఉండే విభిన్న రుచులకు పెన్సిలియమ్ అని పిలువబడే ఒక జాతి బూజే కారణమని మీకు తెలుసా? అలాగే, సలామీ, సోయాసాస్, బీర్ కూడా వివిధ రకాల బూజులను ఉపయోగించి చేస్తారు.
వైన్ కూడా అంతే. కొన్ని ద్రాక్షలను సరైన సమయంలో కోయగలిగితే, ఒక్కో గుత్తిమీద తగినంత పరిమాణంలో శిలీంధ్రాలుంటే, వాటిని రుచికరమైన వైన్‌లు తయారుచేయడానికి ఉపయోగించవచ్చు. బోట్రిటీస్ సినెర్యి లేక “నోబుల్ రాట్” అని పిలువబడే బూజు ద్రాక్షల్లోని చక్కెరను అధికంచేసి వాటి రుచిని పెంచుతుంది. వైన్ తయారుచేసే నేలమాళిగలలో, పక్వమయ్యే ప్రక్రియలో క్లాడోస్పోర్యమ్ సెల్లార్ అనే బూజు మరింత రుచిని చేరుస్తుంది. హంగేరిలోని ద్రాక్షా పండించే రైతుల నినాదాన్ని క్లుప్తంగా చెప్పాలంటే: ‘నోబుల్ బూజు మంచి వైన్‌కు మూలం.’
బూజు హానికరంగా మారినప్పుడు
కొన్ని బూజుల హానికరమైన లక్షణాలు కూడా ఎంతోకాలంగా ఉనికిలో ఉన్నాయి. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో, అష్షూరీయులు తమ శత్రువుల బావులను విషపూరితం చేయడానికి క్లేవిసెప్స్ పర్‌పూర్య అనే బూజును ఉపయోగించారు—జీవశాస్త్రీయ యుద్ధానికి ఇది ప్రాచీన రూపం. కొన్నిసార్లు రై ధాన్యంపై ఏర్పడే ఇదే బూజు మధ్యయుగాల్లో చాలామందికి మూర్ఛరోగం, బాధాకరమైన మంట, కొరుకుడుపుండు, మానసిక భ్రాంతి వంటివి కలిగేలా చేసింది. ఇప్పుడు ఎర్గోటిజమ్ అని పిలువబడుతున్న జబ్బు, పూర్వం సెయింట్ ఆంథొనీస్ ఫైర్ అని పిలువబడేది, ఎందుకంటే దాని బాధితులు చాలామంది అద్భుతరీతిలో స్వస్థత లభిస్తుందనే ఆశతో ఫ్రాన్స్‌లో ఉన్న సెయింట్ ఆంథొనీ పుణ్యక్షేత్రానికి వెళ్ళేవారు.
అఫ్లాటాక్సిన్ అని పిలువబడే శక్తిమంతమైన కాన్సర్ కారక పదార్థం బూజులు ఉత్పత్తిచేసే విషపదార్థమే. ఆసియాలోని ఒక దేశంలో, అఫ్లాటాక్సిన్ మూలంగా సంవత్సరానికి 20,000 మంది మరణిస్తున్నారు. ఈ ప్రాణాంతక సంయుక్త
పదార్థం ఆధునిక జీవశాస్త్రీయ ఆయుధాల్లో ఉపయోగించబడుతోంది.అయితే అనుదిన జీవితంలో, బూజులవల్ల కలిగే రోగలక్షణాలు ఆరోగ్యపరంగా ప్రమాదకరంగా ఉండవు గానీ చికాకు కలిగించేవిగా ఉంటాయి. “చాలా బూజులు, మీరు వాటి వాసన చూసినా సరే, హానికరం కాదు” అని యూసి బార్‌క్లీ వెల్‌నెస్ లెటర్ చెబుతోంది. ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు; ఎలర్జీలున్నవారు, రసాయనాలు పడనివారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు; చాలా పెద్ద మొత్తంలో బూజు ఉండే స్థలాల్లో పనిచేసే రైతులు వంటివారికి సాధారణంగా తీవ్ర ప్రతిచర్య కలుగుతుంది. బూజులవల్ల పసిపిల్లలు, వృద్ధులు కూడా సమస్యలకు గురవుతారు.
అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం, బూజువల్ల ఈ వ్యాధిలక్షణాలు కనిపించవచ్చు: ‘ఊపిరి పీల్చుకున్నప్పుడు పిల్లికూతలు వినబడడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, ఊపిరి అందకపోవడం వంటి శ్వాస సంబంధిత సమస్యలు; ముక్కు దిబ్బడ, సైనస్; కళ్ళ మంట (కళ్ళు మండడం, నీరు కారడం, ఎర్రబడడం); కరుకైన పొడి దగ్గు; ముక్కు లేక గొంతు మంట; చర్మంపై దద్దుర్లు లేక మంట.’
బూజు మరియు భవనాలు
కొన్ని దేశాల్లో, బూజు నివారణా చర్యలు చేపట్టేందుకు పాఠశాలలు మూసివేయడం, ప్రజలు తమ ఇళ్లను లేక కార్యాలయాలను ఖాళీ చేయడం వంటి వాటి గురించి సర్వసాధారణంగా వింటుంటాం. 2002 తొలిభాగంలో, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో క్రొత్తగా ప్రారంభించబడిన మ్యూజియమ్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్‌ను బూజువల్ల మూసివేయవలసి వచ్చింది. బూజు నివారణా చర్యలకు దాదాపు 22.5 కోట్లు ఖర్చయింది! ఇటీవల ఈ సమస్య ఎందుకు మరింత సాధారణం అయ్యింది?
దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి: నిర్మాణ సామాగ్రి, రూపకల్పన. ఇటీవలి దశాబ్దాల్లో త్వరగా బూజు పట్టే ఉత్పత్తులు నిర్మాణం కోసం ఉపయోగించబడుతున్నాయి. దానికొక ఉదాహరణ డ్రైవాల్ లేదా జిప్సమ్ బోర్డు, ఇది సీమసున్నంతో చేసిన గట్టి పలకకు రెండువైపులా అనేక పొరల కాగితాన్ని అంటించి చేయబడుతుంది. మధ్యనున్న పలకలో తేమ ఉంటుంది. కాబట్టి ఈ పదార్థం ఎక్కువకాలంపాటు తేమగా ఉంటే బూజు సిద్ధబీజాలు మొలకెత్తి డ్రైవాల్‌లోని కాగితం తింటూ, అభివృద్ధి చెందుతాయి.
నిర్మాణ రూపకల్పనలు కూడా మారాయి. 1970లకు ముందు, అమెరికాలోని, అనేక ఇతర దేశాల్లోని చాలా భవనాలు గాలి చొరబడకుండా, చలి, వేడి ప్రవేశించకుండా నిర్మించబడేవి కాదు గానీ ఇప్పుడలా నిర్మిస్తున్నారు. అలా నిర్మించడానికయ్యే ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మార్పులు చేయడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు నీరు లోపలికి ప్రవేశిస్తే, అది ఎక్కువసేపు అలాగే నిలిచి ఉండి, బూజు పెరిగేలా చేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారమేమైనా ఉందా?
బూజు సమస్యలను పరిష్కరించే, లేదా కనీసం తగ్గించే శక్తిమంతమైన మార్గం ఏమిటంటే, లోపల అన్నీ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం, తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం. ఎక్కడైనా తేమ ఎక్కువగా ఏర్పడితే, వెంటనే ఆ ప్రాంతం పొడిగా తయారయ్యేలా చూసి, మళ్ళీ అక్కడ నీరు చేరకుండా అవసరమైన మార్పులు చేయండి లేదా మరమ్మతులు చేయండి. ఉదాహరణకు, ఇంటి పైకప్పును, నీటి గొట్టాలను శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచుకోండి. పునాదుల దగ్గర నీరు నిలబడకుండా భవనం చుట్టూ కాస్త ఎత్తుగా ఉండి క్రమేణా ఎత్తు తగ్గుతూ వచ్చేలా చూసుకోండి. మీ ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉంటే, డ్రిప్ పాన్‌లను శుభ్రంగా ఉంచండి, పైపుల గుండా నీరు అడ్డులేకుండా ప్రవహించేలా చూసుకోండి.
“బూజును నివారించాలంటే తేమను అదుపు చేయాలి” అని ఒక పుస్తకం చెబుతోంది. చిన్న చిన్న చర్యల ద్వారా మీరూ మీ కుటుంబమూ బూజు వల్ల కలిగే అవాంఛిత పరిణామాలను తప్పించుకోవచ్చు. కొన్ని విధాలుగా, బూజు అగ్ని వంటిది. అది హాని చేయగలదు, కానీ అది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉండగలదు. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా అదుపు చేస్తాం అనే దానిపైనే ఎంతో ఆధారపడి ఉంటుంది. అయితే, మనం బూజు గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. దేవుని అద్భుతమైన సృష్టిని గురించిన జ్ఞానం మనకు ప్రయోజనమే చేకూరుస్తుంది. (g 1/06)
[12, 13వ పేజీలోని బాక్సు/చిత్రం]
బైబిలు కాలాల్లో బూజు
“యింటిలో కుష్ఠుపొడ” గురించి, అంటే భవనానికే పట్టిన కుష్ఠు గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. (లేవీయకాండము 14:34-48) “కొరుకుడు కుష్ఠము” అని కూడా పిలువబడే ఈ ప్రక్రియ ఒక విధమైన బూజు అయ్యుండవచ్చని సూచించబడుతోంది, అయితే ఈ విషయంలో అనిశ్చయత ఉంది. విషయమేదైనా, ఆ జబ్బు సోకిన రాళ్ళను తీసేసి, ఇంటి లోపలి భాగమంతటినీ గీయించి, జబ్బు సోకిందేమోననే అనుమానమున్న వాటన్నిటిని నగరం వెలుపలవున్న “అపవిత్ర స్థలమున” పడేయాలి. ఆ జబ్బు మళ్ళీ వస్తే, మొత్తం ఇంటిని అపవిత్రమైనదిగా ప్రకటించి, దాన్ని పడగొట్టి, నిర్మూలించాలి. యెహోవా ఇచ్చిన సవివరమైన ఉపదేశాలు, ఆయనకు తన ప్రజలపట్ల, వారి శారీరక సంక్షేమంపట్ల ఉన్న లోతైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయి.
[11వ పేజీలోని చిత్రం]
బూజు నుండి తయారుచేయబడిన మందులు అనేకుల ప్రాణాలను కాపాడాయి
[13వ పేజీలోని చిత్రం]
డ్రైవాల్, వినైల్ తేమను పట్టి ఉంచుతాయి, దానితో బూజు పెరుగుతుంది