మా పాఠకులకు
మా పాఠకులకు
ఈ సంచిక మొదలుకొని అవేక్! పత్రికలో కొన్ని మార్పులుంటాయి. కొన్ని విషయాలు వేరుగా ఉన్నా, చాలామట్టుకు ఎప్పటిలాగే ఉంటుంది.
అవేక్! పత్రిక అనేక దశాబ్దాలుగా తాను అంటిపెట్టుకుని ఉన్న ఉద్దేశానికే ఇప్పటికీ కట్టుబడి ఉంది. నాలుగవ పేజీలో వివరించబడినట్లుగా, “దీన్ని ప్రచురిస్తున్నది కుటుంబమంతటికీ జ్ఞానోదయం కలిగించడం కోసమే.” ప్రపంచ ఘటనలను పరిశీలిస్తూ, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజల గురించి చెబుతూ, సృష్టిలోని అద్భుతాలను వర్ణిస్తూ, ఆరోగ్య విషయాలను చర్చిస్తూ, సామాన్యులకు విజ్ఞానశాస్త్రాన్ని వివరిస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి మనల్ని అప్రమత్తంగా ఉంచుతూ అవేక్! పత్రిక మా పాఠకులకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది.
అవేక్! పత్రిక 1946, ఆగస్టు 22 నాటి సంచికలో ఇలా వాగ్దానం చేసింది: “సత్యానికి నమ్మకంగా అంటిపెట్టుకుని ఉండడం ఈ పత్రిక అత్యున్నత లక్ష్యం.” ఆ వాగ్దానానికి అనుగుణంగానే, అవేక్! పత్రిక ఎల్లప్పుడూ వాస్తవ సమాచారాన్నే ప్రచురించడానికి కృషి చేసింది. దానికి, ఆర్టికల్స్ క్షుణ్ణంగా పరిశోధించబడి, ఖచ్చితత్వం కోసం జాగ్రత్తగా సరిచూడబడతాయి. అయితే ఈ పత్రిక మరింత ప్రాముఖ్యమైన విధంగా కూడా “సత్యానికి నమ్మకంగా అంటిపెట్టుకుని” ఉంది.
అవేక్! పత్రిక పాఠకులను ఎల్లప్పుడూ బైబిలువైపు నడిపించింది. అయితే, ఈ సంచిక మొదలుకొని, అవేక్! పత్రికలో గతంలోకంటే ఎక్కువ బైబిలు ఆధారిత ఆర్టికల్స్ ఉంటాయి. (యోహాను 17:17) అవేక్! పత్రిక నేడు అర్థవంతమైన, విజయవంతమైన జీవితాలు గడపడానికి బైబిల్లోని ఆచరణయోగ్యమైన ఉపదేశం ఎలా సహాయం చేయగలదో చూపించే ఆర్టికల్స్‌ను ప్రచురించడం కొనసాగిస్తుంది. ఉదాహరణకు, “యువత ఇలా అడుగుతోంది . . . ” మరియు “బైబిలు ఉద్దేశము” వంటి ధారావాహిక శీర్షికల్లో బైబిలు ఆధారిత నిర్దేశం ఇవ్వబడుతోంది, ఇవి ఈ పత్రికలో క్రమంగా ప్రచురించబడుతూనే ఉంటాయి. అంతేగాక, అవేక్! పత్రిక ప్రస్తుత దుష్టవిధానం స్థానంలో వచ్చే సమాధానకరమైన నూతనలోకం గురించిన బైబిలు వాగ్దానం వైపుకు పాఠకుల దృష్టిని మళ్ళించడంలో కొనసాగుతుంది.—ప్రకటన 21:3, 4.
ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయి? ఈ సంచిక మొదలుకొని అవేక్! పత్రిక ప్రస్తుతం ప్రచురించబడుతున్న 82 భాషల్లోని అనేక భాషల్లో నెలసరి పత్రికగా ప్రచురించబడుతుంది (మునుపు ఇది అనేక భాషల్లో పక్షపత్రికగా ప్రచురించబడేది). * 1946 నుండి క్రమ శీర్షికగా ఉన్న “ప్రపంచ పరిశీలన” ఇప్పటికీ ప్రతి సంచికలోనూ ఉంటుంది గానీ అది రెండు పేజీల నుండి ఒక పేజీకి తగ్గించబడుతుంది. 31వ పేజీలో “మీరెలా జవాబిస్తారు?” అనే ఉత్తేజకరమైన ఒక క్రొత్త శీర్షికను మేము ప్రవేశపెడుతున్నాం. దానిలో ఏ విషయాలుంటాయి, వాటిని మీరెలా ఉపయోగించవచ్చు?
కొన్ని త్రైమాసిక సంచికల్లో కూడా “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షిక ఉంటుంది. దానిలోని కొన్ని భాగాలు యువ పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయి; వేరేవి అభివృద్ధి సాధించిన బైబిలు విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. “చరిత్రలో ఎప్పుడు జరిగింది?” అనే భాగం, బైబిలులో ప్రస్తావించబడిన వ్యక్తులు ఎప్పుడు జీవించారు, ప్రధాన సంఘటనలు ఎప్పుడు జరిగాయి వంటివి చూపించే కాలరేఖను మీరు తయారుచేసుకోవడానికి సహాయం చేస్తాయి. “ఈ సంచికలో నుండి” అనే భాగానికి సంబంధించిన జవాబులు పత్రిక అంతటిలో ఉన్నా, అనేక ఇతర ప్రశ్నలకు జవాబులు అదే పేజీలో ఉంటాయి, అయితే అవి తలక్రిందులుగా ముద్రించబడి ఉంటాయి. ఆ జవాబులను చదవడానికి ముందు కొంత పరిశోధన ఎందుకు చేయకూడదు? అలా చేశాక మీరు తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవచ్చు. “మీరెలా జవాబిస్తారు?” అనే ఈ క్రొత్త శీర్షికను కుటుంబంగా చేసే లేక గుంపుగా చేసే బైబిలు చర్చలకు ఆధారంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
దాదాపు 60 సంవత్సరాల క్రితం, అవేక్! పత్రిక ఈ వాగ్దానం చేసింది: “ఈ పత్రిక స్థానిక దృక్కోణం నుండి కాక, ప్రపంచవ్యాప్త దృక్కోణం నుండి సమాచారాన్ని అందజేయడానికి కృషి చేస్తుంది. అది అన్ని దేశాల నిజాయితీపరులైన ప్రజలందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. . . . ఈ పత్రికలోని సమాచారం, విషయాలు . . . అనేకమందికి అంటే పెద్దలకూ పిన్నలకూ ఒకేలా ఉపదేశాత్మకంగా, విద్యనొసిగేవిగా, ఆసక్తికరమైనవిగా ఉంటాయి.” అవేక్! పత్రిక ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లు ప్రపంచమంతటా ఉన్న పాఠకులు అంగీకరిస్తారు. అలాగే చేయడం కొనసాగిస్తుందని మేము హామీ ఇస్తున్నాం. (g 1/06)
ప్రకాశకులు
[అధస్సూచి]
^ అవేక్! పత్రిక కొన్ని భాషల్లో త్రైమాసికగా (తెలుగులో, తేజరిల్లు!) ప్రచురించబడుతోంది, ఈ ఆర్టికల్‌లో చర్చించబడిన అంశాలు అలాంటి సంచికలన్నిటిలో ఉండకపోవచ్చు.
[3వ పేజీలోని చిత్రాలు]
1919లో “ద గోల్డెన్ ఏజ్” అని పిలువబడిన ఈ పత్రిక పేరు, 1937లో “కన్సోలేషన్” అని, ఆ తర్వాత 1946లో “అవేక్!” అని మార్చబడింది
[4వ పేజీలోని చిత్రాలు]
“అవేక్!” ఎంతోకాలంగా తన పాఠకులను బైబిలువైపు నడిపిస్తోంది
[చిత్రసౌజన్యం]
తుపాకులు: U.S. National Archives photo; ఆకలితో అలమటిస్తున్న పిల్లవాడు: WHO photo by W. Cutting