కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యదేవుడు ఒక్కడే ఉన్నాడా?

సత్యదేవుడు ఒక్కడే ఉన్నాడా?

బైబిలు ఉద్దేశము

సత్యదేవుడు ఒక్కడే ఉన్నాడా?

మోలెకు, అష్తారోతు, బయలు, దాగోను, మెరోదకు, ద్యుపతి, హెర్మే, అర్తెమిదేవి, ఇవి బైబిల్లో పేర్కొనబడిన కొన్ని దేవుళ్ల, దేవతల పేర్లు. (లేవీయకాండము 18:21; న్యాయాధిపతులు 2:13; 16:23; యిర్మీయా 50:2; అపొస్తలుల కార్యములు 14:11; 19:​24) అయితే, లేఖనాల్లో యెహోవా మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవుడని పిలువబడ్డాడు. మోషే ఒక విజయగీతంలో తన ప్రజలతో కలిసి ఇలా పాడాడు: “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు?”​—నిర్గమకాండము 15:​11.

స్పష్టంగా, బైబిలు యెహోవాను ఇతర దేవుళ్ళందరికంటే ఉన్నతస్థానంలో ఉంచుతుంది. అయితే ఈ తక్కువస్థాయి దేవుళ్ళు ఏ పాత్ర నిర్వహిస్తారు? వాళ్ళు, అనాదిగా పూజించబడుతున్న లెక్కలేనంతమంది ఇతర దేవుళ్ళు, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని క్రింద పనిచేసే నిజమైన దైవాలా?

ఊహాజనిత దైవాలు

బైబిలు యెహోవాను అద్వితీయ సత్యదేవునిగా గుర్తిస్తోంది. (కీర్తన 83:18; యోహాను 17:3) యెషయా ప్రవక్త ఇలా చెప్పినప్పుడు దేవుని స్వంత మాటలనే వ్రాశాడు: “నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.”​—యెషయా 43:​10, 11.

మిగతా దేవుళ్ళందరూ యెహోవాకంటే తక్కువవారు మాత్రమే కాదు. అసలు ఆ దేవుళ్లు ఉనికిలోనే లేరు, అంటే వాళ్లు కేవలం మానవుల ఊహాజనిత దైవాలు మాత్రమే. బైబిలు ఈ దైవాలను “మనుష్యుల చేతిపని” అనీ, ‘అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు’ అనీ వర్ణిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 4:​28) యెహోవాయే అద్వితీయ సత్యదేవుడని బైబిలు స్పష్టంగా బోధిస్తోంది.

యెహోవాను తప్ప మరే దేవుడినైనా ఆరాధించడం గురించి లేఖనాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు, మోషేకు ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో మొదటిదానిలో, మరే దేవుణ్ణి ఆరాధించకూడదని ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞాపించబడింది. (నిర్గమకాండము 20:3) ఎందుకు?

మొదటిగా, అసలు ఉనికిలోనే లేని ఒక దేవుణ్ణి ఆరాధించడం సృష్టికర్తకు ఎంతో అవమానకరం. బైబిల్లో, ఈ అబద్ధ దేవుళ్ళ ఆరాధకులు ఇలా వర్ణించబడ్డారు, “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.” (రోమీయులు 1:​25) ప్రకృతిలో లభించే లోహం, కర్ర వంటి పదార్థాలతో చేయబడిన విగ్రహాలు తరచూ ఈ కల్పిత దేవుళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చాలా దేవుళ్ళు ప్రకృతిలోని ఉరుములు, మహాసముద్రాలు, గాలి వంటి వాటికి ముడిపెట్టబడ్డారు. కాబట్టి అలాంటి మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం, ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవునిపట్ల అగౌరవం చూపించడమే అవుతుంది.

అబద్ధ దేవుళ్ళు, వారి విగ్రహాలు సృష్టికర్తకు హేయం. అయితే, ఈ అబద్ధ దేవుళ్ళను సృష్టించిన ప్రజలను ఉద్దేశించే దేవుడు ఎక్కువ కోపంగా మాట్లాడాడు. ఆయన మనోభావాలు ఈ మాటల్లో శక్తిమంతంగా వ్యక్తం చేయబడ్డాయి: “అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండియు పలుకవు; కన్నులుండియు చూడవు; చెవులుండియు వినవు; వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయువారును, వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.”​—కీర్తన 135:​15-18.

యెహోవా దేవుణ్ణి తప్ప మరి ఎవరినీ, దేన్నీ ఆరాధించకూడదని బైబిలు తీవ్రంగా హెచ్చరించడానికి మరో కారణం ఉంది. అలాంటి ఆరాధన కోసం వెచ్చించే సమయం, చేసే కృషి పూర్తిగా వ్యర్థమే. యెషయా ప్రవక్త సముచితంగానే ఇలా అన్నాడు: “ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు?” (యెషయా 44:​10) “జనముల దేవతలందరు వట్టి విగ్రహములే” అని కూడా బైబిలు చెబుతోంది. (కీర్తన 96:5) అబద్ధ దేవుళ్ళు కల్పితమైనవారు, వారిని ఆరాధించడంవల్ల లాభమేమీ ఉండదు.

యేసు, దేవదూతలు, అపవాది

లేఖనాలు కొన్నిసార్లు నిజమైన వ్యక్తులను దేవుళ్ళుగా పేర్కొన్నాయి. అయితే, జాగ్రత్తగా పరిశీలించడం, ఈ సందర్భాల్లో “దేవుడు” అని ఉపయోగించబడిన పదం, ఈ వ్యక్తులను దైవాలుగా చూపించడానికి ఉద్దేశించబడింది కాదని స్పష్టంగా వెల్లడిచేస్తుంది. బదులుగా, బైబిలు వ్రాయబడిన ఆదిమ భాషల్లో “దేవుడు” అనే పదం బలంగల వ్యక్తిని లేక ఆధ్యాత్మిక వ్యక్తిని, సర్వశక్తిమంతుడైన దేవునితో సన్నిహిత సంబంధంగల వ్యక్తిని వర్ణించడానికి కూడా ఉపయోగించబడింది.

ఉదాహరణకు, కొన్ని బైబిలు వచనాలు యేసుక్రీస్తును దేవునిగా సూచిస్తున్నాయి. (యెషయా 9:6, 7; యోహాను 1:​1, 18) అంటే దీని భావం, యేసును ఆరాధించాలనా? యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “నీ దేవుడైన ప్రభువునకు [‘యెహోవాకు,’ NW] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (లూకా 4:8) స్పష్టంగా, యేసు ఎంతో బలవంతుడైనా, దేవునివంటి నైజంగలవాడైనా, బైబిలు ఆయనను ఆరాధనకు అర్హుడని చూపించడం లేదు.

దేవదూతలు కూడా ‘దేవుని అంతటి వారు’ అని పేర్కొనబడ్డారు. (కీర్తన 8:​5, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; హెబ్రీయులు 2:7) అయినా, లేఖనాల్లో ఎక్కడా దేవదూతలను ఆరాధించమని మానవులు ప్రోత్సహించబడలేదు. వాస్తవానికి, ఒక సందర్భంలో, వృద్ధ అపొస్తలుడైన యోహాను ఒక దేవదూతను చూసి ఎంతగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడంటే, ఆ దేవదూతను ఆరాధించడానికి ఆయన పాదాల ఎదుట సాగిలపడ్డాడు. అయితే, దేవదూత ఇలా చెప్పాడు: “వద్దు సుమీ. . . . దేవునికే నమస్కారము చేయుము.”​—ప్రకటన 19:​10.

అపొస్తలుడైన పౌలు అపవాదిని “ఈ యుగ సంబంధమైన దేవత” అని వర్ణించాడు. (2 కొరింథీయులు 4:4) “ఈ లోకాధికారి”గా అపవాది అసంఖ్యాకమైన అబద్ధ దేవుళ్ళ ఆరాధనను పురికొల్పాడు. (యోహాను 12:​31) కాబట్టి, మానవులు సృష్టించుకున్న దేవుళ్ళకు చేసే ఆరాధనంతా సాతానుకే చెందుతుంది. కానీ సాతాను మన ఆరాధన పొందడానికి అర్హుడైన దేవుడు కాదు. అతడు స్వయం నియమిత పాలకుడు, దురాక్రమణదారుడు. చివరకు, అతనితోపాటు, అన్నిరకాలైన అబద్ధ ఆరాధనలూ నిర్మూలించబడతాయి. అలా జరిగినప్పుడు, మానవజాతి అంతా, అవును సృష్టి అంతా, యెహోవా మాత్రమే సజీవుడైన, అద్వితీయ సత్యదేవుడని నిరంతరం అంగీకరిస్తుంది.​—యిర్మీయా 10:10. (g 2/06)

మీరు ఆలోచించారా?

◼ విగ్రహారాధన గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?​కీర్తన 135:15-18.

◼ యేసును, దేవదూతలను దేవుళ్ళుగా ఆరాధించాలా?​లూకా 4:8.

◼ అద్వితీయ సత్యదేవుడు ఎవరు?​యోహాను 17:3.

[14, 15వ పేజీలోని చిత్రాలు]

ఎడమ నుండి కుడికి విగ్రహాలు: మరియ, ఇటలీ; మాయా మొక్కజొన్న దేవుడు, మెక్సికో మరియు మధ్య అమెరికా; అష్తారోతు, కనాను; మంత్రశక్తులున్నాయని నమ్మబడే ఒక విగ్రహం, సియర్రా లియోన్‌; బుద్ధుడు, జపాన్‌; చీకోమకోట్‌, అజ్టెక్‌, మెక్సికో; హోరస్‌ ఫాల్కన్‌, ఐగుప్తు; ద్యుపతి, గ్రీస్‌

[చిత్రసౌజన్యం]

మొక్కజొన్న దేవుడు, హోరస్‌ ఫాల్కన్‌, ద్యుపతి: Photograph taken by courtesy of the British Museum